Movie Review - ప్రేమదేశం

Friday,February 03,2023 - 01:13 by Z_CLU

Trigun, Megha Akasha’s ‘Prema Desam’ Movie Review

నటీనటులు: త్రిగుణ్ (అరుణ్ అదిత్), మేఘా ఆకాష్, మధుబాల, మాయ, తనికెళ్ల భరణి, అజయ్ కతుర్వార్, శివ రామచంద్ర, వైవా హర్ష, వైష్ణవి చైతన్య, కమల్ నార్ల తేజ తదితరులు..
ప్రొడక్షన్ హౌస్: సిరి క్రియేటివ్ వర్క్స్
నిర్మాత: శిరీష సిద్ధమ్
దర్శకుడు: శ్రీకాంత్ సిద్ధమ్
సంగీతం: మణిశర్మ
డిఓపి. : సజాద్ కాక్కు
ఎడిటర్ : కిరణ్ తుంపెర
రన్ టైమ్: 2గంటల 30 నిమిషాలు
సెన్సార్: క్లీన్-U
రిలీజ్ డేట్: ఫిబ్రవరి 3, 2023

ప్రేమకు అంతం లేదు, ప్రేమ కథలకు కూడా అంతు లేదు. ఈ జానర్ లో ఎన్ని సినిమాలొచ్చినా ప్రతి మూవీలో ఏదో ఒక కొత్త పాయింట్ కనిపిస్తుంది. అలాంటి ఓ కాన్సెప్ట్ తోనే ఈరోజు థియేటర్లలోకి వచ్చింది ప్రేమదేశం. మరి ఈ సినిమా కాన్సెప్ట్ బాగుందా? జీ సినిమాలు ఎక్స్ క్లూజివ్ రివ్యూ

premadesam movie review

కథ
అర్జున్ (త్రిగుణ్) ఆడుతూపాడుతూ సరదాగా గడిపేసే కాలేజీ కుర్రాడు. అమ్మ మధుమతి (మధుబాల) అంటే ప్రాణం. ఉన్నట్టుండి సడెన్ గా ఓ రోజు ఆద్య (మేఘ ఆకాష్)ను చూస్తాడు. కాలేజీలో కనిపించిన ఆద్య, తన ఎదురింట్లో దిగిందని తెలిసి మరింత సంబర పడతాడు. ఆద్యకు కూడా అర్జున్ అంటే ప్రేమ కలుగుతుంది. సరిగ్గా తమ ప్రేమను వ్యక్తం చేసే టైమ్ లో అర్జున్ కు పెద్ద యాక్సిడెంట్ అవుతుంది.

యాక్సిడెంట్ చేసిన కారులో మాయ (మాయ ప్రీతి) డ్రైవింగ్ సీట్లో ఉంటుంది. ఆమె పక్కన శివ (శివకుమార్ రామచంద్రవరపు) ఉంటాడు. వీళ్లిద్దరిదీ మరో ప్రేమకథ. నిజానికి ఇద్దరూ భార్యభర్తలుగా మారతారు. కానీ ఇద్దరి మధ్య గ్యాప్ మాత్రం ఉంటుంది. ఆ గ్యాప్ ఏంటి? తన మంచితనం, ప్రేమతో శివ, మాయను ఎలా తనదారిలోకి తెచ్చుకున్నాడు..? యాక్సిడెంట్ కు గురైన అర్జున్ పరిస్థితేంటి? అర్జున్-ఆద్య ఒక్కటయ్యారా లేదా అనేది బ్యాలెన్స్ కథ.

 

నటీనటుల పనితీరు
అర్జున్ పాత్రలో త్రిగుణ్ ఎప్పట్లానే ఎనర్జిటిక్ గా చేశాడు. కాలేజీ సీన్స్ లో రఫ్ఫాడించాడు. ఓ సాంగ్ లో డాన్స్ కూడా బాగా చేశాడు. ఆద్యగా మేఘా ఆకాష్ బాగా చేసింది. కానీ కాలేజీ స్టూడెంట్ పాత్రకు ఉండాల్సిన చలాకీతనం ఆమెలో కనిపించలేదు. ఇక సాఫ్ట్ క్యారెక్టర్ లో మాయ, ఆమె ప్రేమను పొందడం కోసం పరితపించే పాత్రలో శివ తమ పాత్రలకు న్యాయం చేశారు. తల్లిగా నటించిన మధుబాల, కీలక పాత్ర పోషించిన అజయ్ కతుర్వార్ బాగా చేశారు. వైవా హర్ష, తనికెళ్ల భరణి తమ పాత్రలకు న్యాయం చేశారు.

 

టెక్నీషియన్స్ పనితీరు
టెక్నీషియన్స్ లో ముందుగా చెప్పుకోవాల్సింది మణిశర్మ గురించే. ఈ సినిమాకు క్రేజ్ వచ్చిందంటే అది మణిశర్మ పాటల వల్లనే, ఫస్టాఫ్ లో ఓసాంగ్, సెకెండాఫ్ లో వచ్చిన మరో సాంగ్ తో వింటేజ్ మణిశర్మ గుర్తొస్తారు. ఇక బ్యాక్ గ్రౌండ్ స్కోర్ పరంగా చూసుకుంటే ఇప్పటికీ యంగ్ మ్యూజిక్ డైరక్టర్స్ కు పోటీనిచ్చే స్థాయిలో ఉన్నారు మణి. దర్శకుడు శ్రీకాంత్ సిద్ధం మంచి పాయింట్ ఎత్తుకున్నాడు. కానీ అసలైన కాన్ ఫ్లిక్ట్ కోసం ఫస్టాఫ్ లో చాలా టైమ్ తీసుకున్నాడు. సెకండాఫ్ ను ఇతడు హ్యాండిల్ చేసిన విధానం చాలా బాగుంది. సినిమాటోగ్రాఫర్, ఆర్ట్ డైరక్టర్ నుంచి దర్శకుడికి పూర్తి సహకారం అందింది. ఎడిటింగ్ మాత్రం ఇంకాస్త గట్టిగా ఉండాల్సింది. ప్రొడక్షన్ వాల్యూస్ చాలా రిచ్ గా ఉన్నాయి. ఓ చిన్న సినిమాలో ఈ స్థాయి ఔట్ పుట్ కనిపించడం పెద్ద విషయం.

premadesam movie review

జీ సినిమాలు సమీక్ష

ఒకప్పటి కల్ట్ మూవీ ‘ప్రేమదేశం’. అదే టైటిల్ తో వచ్చిన ఈ ప్రేమదేశానికి, అప్పటి కల్ట్ మూవీకి ఎలాంటి సంబంధం లేదు. కేవలం టైటిల్ మాత్రమే తీసుకున్నారు. బేసిగ్గా ఇది రెండు జంటల ప్రేమకథ ఇది. ఆ రెండు జంటలకు ఎలాంటి సంబంధం ఉండదు. కానీ విధి వాళ్లను ఓ యాక్సిడెంట్ రూపంలో ఒకటి చేస్తుంది. ఆ ఒక్క ఘటనతో ఆ జంటల ప్రేమకథలు ఎలా సుఖాంతమయ్యాయనేది ఈ సరికొత్త ప్రేమదేశం కథ.

సినిమా ప్రారంభం అవ్వడమే కలర్ ఫుల్ గా స్టార్ట్ అవుతుంది. త్రిగుణ్ కాలేజ్ లైఫ్. హీరో తల్లిగా మధుబాల, హీరోయిన్ మేఘా ఆకాష్ ఎంట్రీ.. అన్నీ లవ్లీగా మొదలవుతాయి. అయితే హీరోహీరోయిన్ల మధ్య లవ్ ను బిల్డప్ చేయడం కోసం దర్శకుడు రాసుకున్న సన్నివేశాలు అంతగా మెప్పించవు. కాలేజీ అల్లర్లు, గొడవల్ని బాగానే చూపించిన దర్శకుడు.. హీరోహీరోయిన్ల మధ్య ప్రేమను చిగురింపజేయడం కోసం డెప్త్ ఉన్న సీన్లు రాసుకోలేకపోయాడు.

ఇక తల్లీకొడుకుల అనుబంధాన్ని కూడా కృత్రిమం చేసి పడేశాడు దర్శకుడు. కొడుకుగా త్రిగుణ్, తల్లిగా మధుబాల జోవియల్ గా, సరదాగా ఉండడం వరకు బాగానే ఉంది కానీ.. కొడుకు ప్రేమించిన అమ్మాయి కోసం తల్లి చేసే పనులు అంతగా మెప్పించవు. “నాకు ఒక కొడుకుంటే నిన్ను కోడలుగా చేసుకునేదాన్ని” అంటూ మధుబాల చీటికీమాటికీ చెబుతుంటే, ఏదో పెద్ద ఫ్లాష్ బ్యాక్ ఉందనుకుంటాం. కానీ అదంతా ఉత్తిదే అనే విషయం ఆఖర్లో తేలిపోతుంది.

మొత్తమ్మీద త్రిగుణ్-మేఘా ఆకాష్ ప్రేమలో ట్విస్ట్ ను ఇంటర్వెల్ వరకు తీసుకురావడానికి దర్శకుడు బాగానే కష్టపడ్డాడు. ఇంటర్వెల్ ట్విస్ట్ బాగుంది. ఆ ట్విస్ట్ నుంచి మరో ప్రేమకథను మొదలుపెట్టిన తీరు కూడా బాగుంది. ఫస్టాఫ్ లో రొటీన్ కాలేజ్ లవ్ స్టోరీనే చూపించిన దర్శకుడు.. సెకెండాఫ్ లో మాత్రం కాస్త డెప్త్ ఉన్న డిఫరెంట్ ప్రేమకథను ఎంచుకున్నాడు. ఒక విధంగా ఈ సినిమాను నిలబెట్టింది సెకండాఫ్ ప్రేమకథ మాత్రమే.

ఇంటర్వెల్ తర్వాత శివ కుమార్-మాయ డ్రైవింగ్ సీట్ లోకి వస్తారు. వాళ్ల కథ నడుస్తుంది. మధ్యలో కీలకపాత్రలో అజయ్ కతుర్వార్ కనిపించి ఆకట్టుకుంటాడు. దీంతో ఫస్టాఫ్ లో జరిగిన మేఘా ఆకాష్ ప్రేమకథ నుంచి పూర్తిగా కట్ అవుతాం. మళ్లీ ప్రీ క్లయిమాక్స్ కు వచ్చేవరకు మొదటి ప్రేమకథ గుర్తుకురాదు. సినిమాకు ఇదొక పెద్ద మైనస్ పాయింట్. క్లయిమాక్స్ లో ఈ రెండు జంటలు ఎలా ఒక్కటయ్యాలనే విషయాన్ని ఎమోషనల్ గా చూపించారు.

ఇంతకుముందే చెప్పుకున్నట్టు ప్రేమదేశం సినిమాకు సెకండాఫ్ ఆక్సిజన్ అందిస్తుంది. రెండో కథ ఈ సినిమాను నిలబెడుతుంది. అయితే ఈ పాత్రల్లో శివకుమార్, మాయను కాకుండా కాస్త పేరు-క్రేజ్ ఉన్న నటీనటుల్ని తీసుకుంటే బాగుండేది. ఎఁదుకంటే, ఆ పాత్రల కోసం దర్శకుడు రాసుకున్న సన్నివేశాలు అలా ఉన్నాయి మరి. ఓ స్టార్ హీరో చేయాల్సిన సీన్స్ ను శివకుమార్ లాంటి నటుడు చేస్తుంటే కనెక్ట్ అవ్వలేం.

నటీనటులంతా చక్కగా చేశారు. సీనియర్ నటి మధుబాల ఈ సినిమాతో చెంపదెబ్బల మధుబాల అనిపించుకుంది. ఆమె యాక్టింగ్ లో కాస్త అతి కనిపిస్తుంది. దర్శకుడు చెప్పినట్టు చేయడం తప్ప ఆమె చేసేదేం లేదు కదా. టెక్నికల్ గా మూవీ రిచ్ గా ఉంది. మణిశర్మ 2 పాటలతో, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో ఆకట్టుకున్నాడు. ‘తెలవారదేమీ సామి’ పాట టోటల్ సినిమాకే హైలెట్ గా నిలవగా.. పదములే లేవు పిల్ల సాంగ్ యూత్ ను కట్టిపడేస్తుంది. సజాద్ సినిమాటోగ్రఫీ బాగుంది. ప్రొడక్షన్ వాల్యూస్ చాలా రిచ్ గా ఉన్నాయి. బడ్జెట్ విషయంలో కాంప్రమైజ్ అవ్వకుండా సినిమా తీశారు.

ఓవరాల్ గా ప్రేమదేశం సినిమా ఓ మిక్స్ డ్ ఫీలింగ్ అందిస్తుంది. ఇంటర్వెల్ ట్విస్ట్, సెకండాఫ్ కోసం ఈ సినిమాను ఓసారి చూడొచ్చు. మూవీని ట్రిమ్ చేస్తే ఇంకోసారి చూడొచ్చు.

రేటింగ్ – 2.5/5