Movie Review - మధుర వైన్స్

Friday,October 22,2021 - 02:07 by Z_CLU

నటీనటులు : సన్నీ నవీన్, సీమా చౌదరి, సమ్మోహిత్ తూములూరి తదితరులు

సంగీతం : కార్తిక్ rodriguez, జయ్ క్రిష్

సినిమాటోగ్రఫీ : మోహన్ చారి.CH

ఎడిటింగ్ : వర ప్రసాద్.ఎ

బ్యానర్: ఎస్ ఒరిజినల్స్ , ఆర్.కె.సినీ టాకీస్

నిర్మాతలు: రాజేష్ కొండెపు, సృజన్ యారబోలు

కథ-స్క్రీన్ ప్లే- మాటలు-దర్శకత్వం : జయకిషోర్.బి

విడుదల తేది : 22 అక్టోబర్ 2021

నిడివి  : 127 నిమిషాలు

ప్రస్తుతం ఇండస్ట్రీలో చాలా మంది కొత్త వాళ్ళు కొత్త కంటెంట్ తో సినిమాలు చేస్తూ ప్రేక్షకుల మెప్పు కోసం థియేటర్స్ లోకి వస్తున్నారు. ఈ వారం అలా కొత్త వాళ్ళు కలిసి చేసిన ‘మధుర వైన్స్’ అనే సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చింది. మరి ఈ సినిమా ప్రేక్షకులను అలరించిందా? కొత్త వాళ్ళు  సక్సెస్ అయ్యారా ? జీ సినిమాలు సమీక్ష.

madhura wines movie telugu review zeecinemalu 1
కథ :

కాలేజీ డేస్ లో ఎంతో గాఢంగా ప్రేమించిన మధుర తనకి దూరమవ్వడంతో తాగుడుకి బానిసగా మరతాడు అజయ్(సన్నీ నవీన్). ఈ క్రమంలో అజయ్ కి అంజలి అనే అమ్మాయి పరిచయం అవుతుంది. అజయ్ గతం తెలుసుకునే క్రమంలో అతనితో ప్రేమలో పడుతుంది అంజలి. పరిచయమైన కొన్ని రోజులకే మధుర ని  మర్చిపోయి అంజలితో ప్రేమలో పడతాడు అజయ్.

రియల్ ఇస్టేట్ వ్యాపారంలో నష్టపోయిన ఆనందరావు (సమ్మోహిత్ తూములూరి) ఫైనల్ గా మధుర వైన్స్ పెట్టి మధ్యం అమ్ముతుంటాడు. రోజు తన వైన్స్ లో మందు తాగుతూ కెరీర్ నాశనం చేసుకుంటున్న అజయ్ ని చూస్తూ తట్టుకోలేకపోతాడు ఆనంద రావు. ఇంతకీ అంజలి ఆనంద్ రావు కి ఏమైవుతుంది? ఫైనల్ గా అజయ్, అంజలి ప్రేమకు ఆనందరావు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడా ? లేదా అనేది మిగతా కథ.

నటీనటుల పనితీరు:

మొదటి సినిమా అయినప్పటికీ షార్ట్ ఫిలింస్ చేసిన అనుభవంతో హీరో సన్నీ నవీన్ బాగానే నటించాడు. కాకపోతే కొన్ని సన్నివేశాల్లో నటుడిగా పాస్ మార్కులు కూడా అందుకోలేకపోయాడు. సీమా చౌదరి గ్లామర్ తో ఎట్రాక్ట్ చేసింది. కొన్ని సన్నివేశాల్లో తన యాక్టింగ్ స్కిల్స్ తో ఆకట్టుకుంది. సమ్మోహిత్ తూములూరి తన పాత్రకు న్యాయం చేశాడు. కాకపోతే సన్నివేశాల్లో బలం లేకపోవడంతో కొన్ని సార్లు తేలిపోయాడు. మిగతా నటీనటులు పర్వాలేదనిపించుకున్నారు.

సాంకేతిక వర్గం పనితీరు :

సినిమాకు కార్తిక్ rodriguez, జయ్ క్రిష్ అందించిన మ్యూజిక్ బాగుంది. ముఖ్యంగా సాంగ్స్ ఆకట్టుకున్నాయి. అలాగే కొన్ని సందర్భాల్లో వచ్చే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా బాగుంది. మోహన్ చారి.CH విజువల్స్ ఎట్రాక్ట్ చేశాయి. తన కెమెరా వర్క్ తో నేచురల్ లోకేషన్స్ ని మరింత నేచురల్ గా చూపించి సినిమాకు ప్లస్ అయ్యాడు మోహన్ చారి. వరప్రసాద్ ఎడిటింగ్ పర్వాలేదు. కాకపోతే అక్కడక్కడా డ్రాగ్ అనిపించే సన్నివేశాలు ట్రిమ్ చేసి ఉంటే కాస్త బెటర్ గా ఉండేది. దర్శకుడు జయకిషోర్.బి ఎంచుకున్న కథ ఆసక్తిగా అలేదు. దానికి తోడు కథనం కూడా వీక్ అనిపించింది. ప్రొడక్షన్ వాల్యూస్ షార్ట్ ఫిలింని తలపించేలా ఉన్నాయి.

madhura wines movie telugu review zeecinemalu 1
జీ సినిమాలు సమీక్ష :

షార్ట్ ఫిలిం వేరు, సినిమా వేరు. రెండిటికి చాలా తేడా ఉంటుంది. జస్ట్ ఒక చిన్న పాయింట్ తో నాలుగు రొమాంటిక్ సీన్స్ రాసుకుంటే ఒక రొమాంటిక్ షార్ట్ ఫిలిం తీసి మెప్పించొచ్చు. కానీ సినిమాకి వచ్చే సరికి అవి మాత్రమే సరిపోవు. కథతో పాటు కథనం ఆసక్తిగా సాగాలి లేదా ఎంటర్టైన్ చేయాలి. బలమైన సన్నివేశాలు రాసుకొని సినిమా ఫీల్ తీసుకురావాలి. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా సినిమా స్టాండర్డ్ లోనే ఉండాలి. అలా కాకుండా షార్ట్ ఫిలిం తీసునట్టు ఖర్చు పెడితే స్క్రీన్ పై కూడా షార్ట్ ఫిలిం చూసినట్టే ఉంటుంది. ఈ తేడా గమనించకుండా అలాంటి కంటెంట్ తో షార్ట్ ఫిలింను కాస్త నిడివితో ‘మధుర వైన్స్’ అంటూ ఫ్యీచర్ ఫిలిం గా చేశారు.

కొన్నేళ్ళ క్రితం వచ్చిన బెస్ట్ షార్ట్ ఫిలిమ్స్ లో 15 డేస్ ఆఫ్ లవ్ అనే షార్ట్ ఫిలిం కూడా ఉంటుంది. దానికి అప్పట్లో మంచి వ్యూస్ వచ్చాయి. ఆ లఘు చిత్రాన్ని తీసిన దర్శకుడు అదే హీరోతో చేసిన ప్రయత్నమే ఈ సినిమా. షార్ట్ ఫిలిం కి వచ్చిన క్రేజ్ తో అదే ఐడియాలజీతో ఈ సినిమాను తీశాడు దర్శకుడు. పైగా అందులో కొన్ని సన్నివేశాలను ఇందులో కూడా వాడుకున్నాడు. హీరో -హీరోయిన్ మధ్య వచ్చే రొమాంటిక్ సీన్స్ అన్నీ అందులో కూడా కనిపిస్తాయి. ముఖ్యంగా రెండు గోడల మధ్య చిన్న సందులో ఇద్దరూ రోమాన్స్ చేసుకోవడం సేమ్ టు సేమ్ దింపేశాడు దర్శకుడు. ఇన్నేళ్ళు గడిచిన ఇంకా అక్కడే ఉండి అలాంటి సన్నివేశాలే రిపీట్ చేస్తే ఎలా ? అవి రొమాంటిక్ సీన్స్ ని ఇష్టపడే వారికి బాగానే ఉన్నా మిగతా వారికీ మాత్రం ఈ రొమాంటిక్ సీన్స్ మాత్రమే ప్లాన్ చేసుకొని మిగతా సినిమా అంతా సాగదీసి తీశాడే అనిపిస్తుంది. నిజానికి సినిమా మొతానికి ఆ రొమాంటిక్ సీన్స్ మాత్రమే హైలైట్ గా నిలిచాయి. సినిమా స్టార్టింగ్ నుండే సాయి కుమార్ వాయిస్ ఓవర్ తో మధుర పాత్ర నుఅలాగే అజయ్ -మధుర ప్రేమకథని హైలైట్ చేస్తూ వచ్చిన దర్శకుడు చివరికి వారిద్దరి మధ్య ఏం జరిగింది ? అనే ఫ్లాష్ బ్యాక్ కూడా ప్లాన్ చేసుకోకుండా హీరోయిన్ అన్నయ్య క్యారెక్టర్ కి సంబంధించి ఓ ఫ్లాష్ బ్యాక్ పెట్టుకున్నాడు. హీరోయిన్ అన్నయ్య ఎందుకు తాగడు ? అతని ఫ్లాష్ బ్యాక్ ఏంటి ? అనే విషయం కన్నా కథలో అజయ్, మధుర ఎందుకు విడిపోయారు ? వారి మధ్య ఏం జరిగింది ? అనేదె ఆడియన్స్ కి ఇంటరెస్టింగ్ అనిపిస్తుంది. అది కూడా సినిమాకు ప్రధాన మైనస్. అలాగే క్లైమాక్స్ కి ముందు ఉన్నపళంగా హీరో తండ్రి క్యారెక్టర్ తో సెంటిమెంట్ పండించే ప్రయత్నం చేశాడు దర్శకుడు. అది కూడా వర్కౌట్ అవ్వలేదు.

ఒక్కమాటలో చెప్పాలంటే షార్ట్ ఫిలిమ్స్ చూసే ఆడియన్స్ వేరు , టికెట్టు కొని థియేటర్స్ కి వచ్చే ఆడియన్స్ వేరు. ఉచితంగా వీక్షించే మాధ్యమాల్లో సినిమా ఎలా ఉన్నా క్లిక్స్ వచ్చేస్తాయి. కానీ థియేటర్స్ లో సినిమా అంటే అలా కాదు. చాలా ఉండాలి. మంచి కంటెంట్ ప్లాన్ చేసుకోవాలి. ముఖ్యంగా దర్శకుడు చెప్పాలనుకున్న పాయింట్ కూడా రొటీన్ గానే ఉంది. అది కూడా డెప్త్ లో చెప్పలేకపోయాడు. ఒక అమ్మాయిని ఘాడంగా ప్రేమించిన కుర్రాడు .. ఆమె జాడ తెలియక మద్యానికి బానిసగా మారడం … అదే సమయంలో మరో అమ్మాయి అతనికి దగ్గరవ్వడం తర్వాత ఇద్దరూ ప్రేమలో పడటం క్లైమాక్స్ లో హీరోయిన్ ఇంట్లో ఒప్పించి పెళ్లి చేసుకోవడం ఇదే సినిమా కథ. ఈ కథతో డెబ్యూ సినిమా అంటే సన్నివేశాలయినా బలంగా ఉండాలి. కథ రొటీన్ అయినా కథనంతో మేజిక్ చేయాలి. ఒకవైపు డ్రామా నడిపిస్తూనే మరో వైపు ఎంటర్టైన్ చేయాలి. కొత్త దర్శకుడు తనకున్న షార్ట్ ఫిలిమ్స్ ఎక్స్ పీరియన్స్ తో మంచి కంటెంట్ తో కొత్త కథతో ఇండస్ట్రీలో అడుగుపెట్టి స్ట్రాంగ్ డెబ్యూ ఇస్తే బాగుండేది.

ఫైనల్ గా మధుర వైన్స్ లో కిస్సులు హగ్గులతో వచ్చే రొమాంటిక్ సీన్స్, మ్యూజిక్ , సినిమాటోగ్రఫీ ప్లస్ పాయింట్స్. అవి మినహాయిస్తే సినిమా అంతా బోర్ కొడుతూ విసుగు తెప్పిస్తుంది.

రేటింగ్ 2/5