Movie Review - లవ్ స్టోరీ

Friday,September 24,2021 - 03:24 by Z_CLU

నటీనటులు: నాగచైతన్య , సాయి పల్లవి , రాజీవ్ కనకాల , ఈశ్వరి రావు, ఉత్తేజ్ , ఆనంద చక్రపాణి తదితరులు

సినిమాటోగ్రఫీ : విజయ్ సి.కుమార్

ఎడిటర్ : మార్తాండ్ కె.వెంకటేష్

మ్యూజిక్ : పవన్ సి.హెచ్

నిర్మాతలు : నారాయణ్ దాస్ కె నారంగ్,పి.రామ్మోహన్ రావు

రచన,దర్శకత్వం: శేఖర్ కమ్ముల.

నిడివి : 2 గంటల 35 నిమిషాలు

విడుదల తేది : 24 సెప్టెంబర్ 2021

‘ఫిదా’ తర్వాత శేఖర్ కమ్ముల నుండి వస్తున్న సినిమా, నాగ చైతన్య, సాయిపల్లవి తొలిసారి కలిసి నటించిన సినిమా, రిలీజ్ చేసిన ప్రతీ సాంగ్ సూపర్ హిట్. ఇక మెగాస్టార్ చిరు, బాలీవుడ్ స్టార్ ఆమీర్ ఖాన్ ఇద్దరు ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వచ్చేసరికి సినిమాపై అంచనాలు ఇంకా పెరిగిపోయాయి. మరి ఆ అంచనాలను ‘లవ్ స్టోరి’ అందుకుందా ?  సెకండ్ వేవ్ తర్వాత సినిమాలన్నీ 2-3 రోజులు మాత్రమే కలెక్షన్స్ రాబడుతున్న నెగెటివ్ ట్రెండ్ ను దాటి ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్స్ కొల్లగొడుతుందా ? జీ సినిమాలు ఎక్స్ క్లూజివ్ రివ్యూ.

love story
కథ :

ఆర్మూరు నుండి హైదరాబాద్ వచ్చి ఫిట్నెస్ కోసం జుంబా డాన్స్ క్లాసెస్ కండక్ట్ చేస్తూ ఎప్పకయినా దాన్ని ఒక పెద్ద డాన్స్ స్టూడియోగా డెవలప్ చేయాలనుకుంటాడు రేవంత్(నాగ చైతన్య). అందుకోసం చాలా పాట్లు పడుతూ జీవనం సాగిస్తుంటాడు. సరిగ్గా ఆ టైంలో అదే ఊరు నుండి ఉద్యోగం కోసం వచ్చిన మౌనిక(సాయి పల్లవి) రేవంత్ కి పరిచయమవుతుంది. ఒక టైంలో మౌనిక డాన్స్ చూసి ఫిదా అవుతాడు రేవంత్. తనని పార్ట్నర్ గా తీసుకొని తన కల నేరవేర్చుకోవాలనుకుంటాడు. తనకి ఉద్యోగం సెట్ కాకపోవడంతో మళ్ళీ ఊరు తిరిగి ఎల్లలేక రేవంత్ ఇచ్చిన ఆఫర్ కి ఒకే చెప్పేసి తనతో పార్ట్నర్ గా జాయిన్ అవుతుంది మౌనిక.

కొన్ని రోజులకే రేవంత్ , మౌనిక మధ్య ప్రేమ చిగురిస్తుంది. ఒకరిని ఒకరు విడిచి ఉండలేని డీప్ లవ్ లో ఉంటారు. అయితే ఆర్మూరులో ఉన్న మౌనిక బాబాయ్ (రాజీవ్ కనకాల) వారి ప్రేమని ఒప్పుకోరని భావించి ఇద్దరూ లేచిపోవడానికి రెడీ అవుతారు. అనుకోకుండా రేవంత్ , మౌనిక ల ప్లాన్ డిస్టర్బ్ అవుతుంది. పెళ్లి చేసుకొని ఎక్కడికయినా పారిపోవాలని అనుకున్న రేవంత్ , మౌనిక ఎందుకు ఆగిపోయారు. ఆ తర్వాత ఏం జరిగింది? చివరికి రేవంత్ మౌనిక లు ఒకటయ్యారా ? లేదా అనేది మిగతా కథ.

నటీ నటుల పనితీరు :

రేవంత్ పాత్రలో నాగ చైతన్య మంచి నటన కనబరిచాడు. కొన్ని ఎమోషనల్ సీన్స్ లో నటుడిగా మంచి మార్కులు అందుకున్నాడు. సాయి పల్లవి పెర్ఫార్మెన్స్ తర్వాత చైతు పెర్ఫార్మెన్స్ గురించి చెప్పుకునేలా నటించాడు. ముఖ్యంగా సెకండ్ హాఫ్ లో వచ్చే బ్రేకప్ సీన్ లో అలాగే శ్మశానంలో వచ్చే సన్నివేశంలో తన నటనతో మెప్పించి ఎమోషనల్ అయ్యేలా చేశాడు. ఈసారి తెలంగాణ యాస , అలాగే డాన్స్ కోసం బాగా కష్టపడ్డాడు. కథానాయికగా ఇప్పటికే తన టాలెంట్ ఏంటో చూపించి వరుస ఆఫర్స్ తో దూసుకెళ్తున్న సాయి పల్లవి మౌనిక పాత్రకు పర్ఫెక్ట్ అనిపించుకుంది. ఫిదాలో చేసిన క్యారెక్టర్ కి కాస్త దగ్గర ఉండే తెలంగాణ అమ్మాయి కావడంతో ఎప్పటిలానే ఆ క్యారెక్టర్ బెస్ట్ ఇచ్చింది. డాన్స్ , ఎమోషనల్ సీన్స్ లో నటిగా క్లాప్ కొట్టించుకుంది.

గతంలో చేసిన పాత్రే కావడంతో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో రాజీవ్ కనకాల బాగా నటించాడు. తన క్యారెక్టర్ గురించి ఎక్కువగా చెప్పలేం. ఎందుకంటే అతని క్యారెక్టర్ ద్వారానే ఇప్పటి వరకూ ఎవరూ చూపించని ఓ పాయింట్ టచ్ చేశాడు శేఖర్ కమ్ముల. చైతు అమ్మ పాత్రలో ఈశ్వరి రావు పాత్రకు పూర్తి న్యాయం చేసింది. అలాగే దేవయాని కూడా హీరోయిన్ మదర్ పాత్రలో బాగా నటించింది. ప్రీ క్లైమాక్స్ లో ఎక్స్ ప్లోజ్ అయ్యే సీన్ లో క్లాప్స్ అందుకుంది. రేవంత్ కి హెల్ప్ చేసే పోలిస్ పాత్రలో ఉత్తేజ్ , రేవంత్ స్నేహితుడి పాత్రలో నటించిన కుర్రాడు , నాగ మహేష్ మిగతా నటీ నటులంతా పాత్రల్లో ఒదిగిపోయి నటించారు.

సాంకేతిక వర్గం పనితీరు :

ఏ లవ్ స్టోరి కయినా మంచి ఇంపాక్ట్ తీసుకొచ్చే మ్యూజిక్ ఇంపార్టెంట్. సినిమాకు పవన్ అందించిన మ్యూజిక్ హైలైట్ గా నిలిచింది. రిలీజ్ కి ముందే సారంగ దరియా పాటతో సెన్సేషన్ క్రియేట్ చేసిన పవన్ మిగతా పాటలతో ముఖ్యంగా నేపథ్య సంగీతంతో సినిమాకు బెస్ట్ వర్క్ అందించాడు. నీ చిత్రం చూసినా అలాగే మిగతా పాటలు కూడా బాగున్నాయి. పాటలకు సుద్దాల అశోక్ తేజ, సురేంద్ర మిట్టపల్లి, భాస్కర్ భట్ల రవి కుమార్, చైతన్య పింగళి అందించిన సాహిత్యం కలిసొచ్చింది. విజయ్ సి కుమార్ సినిమాటోగ్రఫీ కూడా సినిమాకు మరో ప్లస్ పాయింట్. తన కెమెరా వర్క్ తో బెస్ట్ విజువల్స్ అందించి సినిమాను కలర్ ఫుల్ గా తీర్చిదిద్దాడు. పాటల చిత్రీకరణలో కూడా తన కెమెరా వర్క్ ఆకట్టుకుంది. మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటింగ్ వర్క్ బాగుంది. కాకపోతే అక్కడక్కడా కాస్త ల్యాగ్ అనిపించింది. సారంగా దరియా పాటకు శేఖర్ మాస్టర్ కోరియోగ్రఫీ మెస్మరైజ్ చేసింది. శేఖర్ కమ్ముల తను రాసుకున్న పాయింట్ అనుకున్నట్టుగా కొన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ యాడ్ చేసి తన సింపుల్ స్క్రీన్ ప్లే తో మెప్పించాడు. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి.

love-story-nagachaitanya-sai-pallavi

జీ సినిమాలు సమీక్ష :

కొన్ని సినిమాలు కాంబినేషన్స్ నుండే ఆసక్తి రేకెత్తిస్తాయి. అలాంటి కాంబో సినిమానే ఇది. నాగ చైతన్య , సాయి పల్లవి , శేఖర్ కమ్ముల ఈ ముగ్గురి కాంబోలో సినిమా అని ఎనౌన్స్ అయినప్పటి నుండే ‘లవ్ స్టోరి’ పై ఎక్స్ పెక్టేషన్స్ మొదలయ్యాయి. ఈ సినిమా కోసం ఇప్పటి వరకు ఎవరూ టచ్ చేయని ఓ సెన్సిబుల్ పాయింట్ తీసుకున్నాడు శేఖర్ కమ్ముల. దాని చుట్టూ ఓ లవ్ స్టోరి అలాగే కెరీర్ కోసం కామన్ మెన్ పడే స్ట్రగుల్స్ అనే లేయర్స్ అల్లాడు. అయితే శేఖర్ కమ్ముల నుండి ఇలాంటి ఓ లవ్ స్టోరి ఎక్స్ పెక్ట్ చేయని వారికి ఇది కొత్తగా అనిపిస్తుంది. అలాగని సినిమాలో శేఖర్ కమ్ముల స్టైల్ లవ్ ట్రాక్ , రొమాంటిక్ సీన్స్ ఉండవనడానికి లేదు. అవన్నీ ఉన్నాయి కానీ ఈసారి చైల్డ్ అబ్యూస్ అనే పాయింట్ ని తీసుకొని సమాజంలో ఇలాంటివి జరుగుతున్నాయని తల్లి దండ్రులు జాగ్రత్తగా గమనిస్తూ ఉండాలని ఆ విషయాన్ని రైజ్ చేశాడు. కాకపోతే క్లైమాక్స్ వరకూ తను చెప్పాలనుకుంటున్న పాయింట్ దాచి పెట్టి అక్కడక్కడా హింట్ ఇస్తూ ప్రీ క్లైమాక్స్ లో ఆ విషయాన్ని ఓపెన్ చేసి క్లైమాక్స్ లో హీరోతో విలన్ ని చంపించి ఎండ్ చేశాడు.

శేఖర్ కమ్ముల అంటే నేచురల్ లోకేషన్స్ , నేచురల్ పెర్ఫార్మెన్స్ లు కనిపిస్తాయి. అందుకే ఆయన సినిమాలు నిజ జీవితానికి చాలా దగ్గర ఉంటూ అందరికీ కనెక్ట్ అవుతాయి. ఇక తను రాసుకున్న కథలను తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో చెప్పడానికే ఎక్కువ ఇష్టపడే శేఖర్ కమ్ముల ఈసారి కూడా లవ్ స్టోరి కోసం అదే బ్యాక్ డ్రాప్ ఎంచుకున్నాడు. ఆర్మూరు అనే ఊరిలో కథను నడిపించాడు. అందుకే ఫిదా తో భానుమతి గా మెప్పించిన సాయి పల్లవి నే మళ్ళీ రిపీట్ చేసి మౌనిక పాత్రతో మరోసారి మేజిక్ చేశాడు. నాగ చైతన్య ని కూడా కొత్తగా చూపిస్తూ రేవంత్ క్యారెక్టర్ డిజైన్ చేశాడు శేఖర్ కమ్ముల. చైతులో నటుడిని ఇంకాస్త బయటికి తీసుకొచ్చేలా కొన్ని సన్నివేశాలు రాసుకొని రేవంత్ పాత్ర గురించి కూడా మాట్లాడుకునేలా చేశాడు. ఫస్ట్ హాఫ్ లో హీరో ఫ్రెండ్ తో మంచి కామెడీ వర్కౌట్ చేస్తే బాగుండేది. ఇక రెండు మూడు సన్నివేశాల్లో గంగవ్వ , ఉత్తేజ్ డైలాగ్ కామెడీ నవ్విస్తుంది.

పల్లెటూరిలో ఉండే అంటరానితనం చూపిస్తూ చైల్డ్ వుడ్ ఎపిసోడ్ తో సినిమాను స్టార్ట్ చేసిన శేఖర్ కమ్ముల ఆ తర్వాత సిటీకి వచ్చిఆ కుర్రాడు పడే స్ట్రగుల్స్ చూపిస్తూ , హీరో -హీరోయిన్ మధ్య లవ్ ట్రాక్ తో కథను ముందుకు నడిపించాడు. కాకపోతే స్లో నెరేషన్ తో సినిమాను అక్కడక్కడా నత్త నడకన నడిపించి బోర్ కొట్టించాడు. కానీ తన స్టైల్ ఆఫ్ సీన్స్ , చైతు – సాయి పల్లవి క్యారెక్టర్స్ , ఎమోషనల్ సీన్స్ , మళ్ళీ మళ్ళీ వినాలనిపించే సాంగ్స్ , చైల్డ్ అబ్యుస్ పాయింట్ తో ఆకట్టుకొని ఫైనల్ గా మెప్పించాడు. ఓవరాల్ గా లవ్ స్టోరి ఫీల్ గుడ్ ఎమోషనల్ డ్రామాగా ఆకట్టుకుంటుంది.

మైనస్ పాయింట్

స్లో నెరేషన్

కొన్ని సన్నివేశాలు ల్యాగ్ అనిపించడం

క్లైమాక్స్

ప్లస్ పాయింట్స్

నాగ చైతన్య , సాయి పల్లవి నటన

మ్యూజిక్

కథ

శేఖర్ కమ్ముల డైరెక్షన్

కొన్ని ఎమోషనల్ సీన్స్

రేటింగ్   3/5