Movie Review - K3 కోటికొక్కడు

Friday,September 16,2022 - 03:13 by Z_CLU

నటీనటులు : కిచ్చా సుదీప్, మడోన్నా సెబాస్టియన్, శ్రద్దా దాస్, రవి శంకర్, ఆఫ్తాబ్ శివదాసానీ, నవాబ్ షా తదితరులు
దర్శకత్వం: శివ కార్తీక్
బ్యానర్ : గుడ్ సినిమా గ్రూప్
నిర్మాతలు : శ్రేయాస్ శ్రీనివాస్, దేవేంద్ర డీకే
మాటలు : కే రాజేష్ వర్మ
సంగీతం: అర్జున్ జన్యా
డీఓపీ : శేఖర్ చంద్రు
ఎడిటర్ : ప్రవీణ్ ఆంటోని
రన్ టైమ్ : 2 గంటల 20 నిమిషాలు
సెన్సార్ : U/A
రిలీజ్ : సెప్టెంబర్ 16, 2022

ఈగ, బాహుబలి లాంటి సినిమాలతో టాలీవుడ్ కు కూడా దగ్గరయ్యాడు హీరో సుదీప్. ఈమధ్య వచ్చిన విక్రాంత్ రోణతో కూడా ఆకట్టుకున్నాడు. అందుకే అతడు నటించిన K3 కోటికొక్కడు సినిమాపై ఓ మోస్తరు అంచనాలు పెరిగాయి. మరి ఆ అంచనాల్ని కిచ్చా సుదీప్ అందుకున్నాడా? జీ సినిమాలు ఎక్స్ క్లూజివ్ రివ్యూ

కథ
సత్య ఓ సాధారణ కుర్రాడు. పైగా అనాధ. నలుగురికి సాయం చేస్తూ మంచిగా ఉంటాడు. సత్య ఉండే అనాధాశ్రయంలోనే ఓ చిన్న పాప ఉంటుంది. ఆమెకు చాలా పెద్ద ఆరోగ్య సమస్య ఎదురవుతుంది. సర్జరీ కోసం పాపను తీసుకొని పోలెండ్ వెళ్తాడు సత్య. అదే సమయంలో పోలెండ్ లో బాంబు దాడులు జరుగుతాయి. అది సత్య చేశాడని పోలీసులు అనుమానిస్తారు. అతడ్ని అరెస్ట్ చేస్తారు. అదే టైమ్ లో ఘోస్ట్ అంటూ అందరూ పిలిచే శివ ఈ పని చేశాడని ఇంటర్ పోల్ భావిస్తుంది.

మరోవైపు బిలియనీర్ దేవేంద్ర ప్రజల ఆరోగ్యంతో చెలగాడం ఆడుతుంటాడు. ఓ వైరస్ తయారుచేసి, దాన్ని పుట్టకముందే పిల్లలకు ఎక్కించేస్తుంటాడు. దానికి విరుగుడు కూడా అతడే తయారుచేసి కోట్లకు అధిపతి అవుతాడు. శివకు, దేవేంద్రకు సంబంధం ఏంటి? అసలు శివ-సత్య ఒకరేనా? లేక ఇద్దరున్నారా? క్లైమాక్స్ లో సత్య ఏం చేశాడు అనేది ఈ కోటికొక్కడు సినిమా.

నటీనటుల పనితీరు
సుదీప్ ఎప్పట్లానే ఎనర్జిటిక్ గా కనిపించాడు. అతడి ఫ్యాన్స్ కు ఈ సినిమా పండగే. డిఫరెంట్ షేడ్స్ లో సుదీప్ మెప్పించాడు. ఇంట్రడక్షన్ లో వేసిన ముసలి గెటప్ అదిరిపోయింది. ఇక సుదీప్ తర్వాత ఏసీపీ కిషోర్ పాత్ర పోషించిన రవిశంకర్ గురించి చెప్పుకోవాలి. సుదీప్ తో పాటు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కనిపించిన రవిశంకర్, తన డైలాగ్ డెలివరీ, యాక్టింగ్ తో ఆకట్టుకున్నాడు. ఈ సీరియస్ మూవీలో అంతే సీరియస్ గా కామెడీ కూడా పండించాడు రవిశంకర్. హీరోయిన్లు శ్రద్దా దాస్, మడొన్నా సెబాస్టియన్లకు చెప్పుకోదగ్గ పాత్రలు దక్కలేదు. ఇంటర్ పోల్ ఆఫీసర్ గా నటించిన ఆఫ్తాబ్ శివదాసానీ, విలన్ పాత్ర పోషించిన నవాబ్ షా.. తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు.

టెక్నీషియన్స్ పనితీరు
టెక్నికల్ గా సినిమా రిచ్ గా ఉంది. శేఖర్ చంద్ర సినిమాటోగ్రఫీ, అర్జున్ జన్య బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఓకే. ఎడిటింగ్ మాత్రం వీక్ గా ఉంది. కనీసం మరో 10 నిమిషాలైనా కట్ చేయొచ్చు అనిపిస్తుంది. మరీ ముఖ్యంగా ఐటెంసాంగ్ లాంటివి పెట్టి, ఇంకా ఓల్డ్ స్టయిల్ లోనే వెళ్లారు. నిర్మాణ విలువలు మాత్రం రిచ్ గా ఉన్నాయి. పోలెండ్ లో తీసిన సన్నివేశాల కోసం బాగా ఖర్చు చేశారు. యాక్షన్ ఎపిసోడ్స్ ప్రధాన ఆకర్షణ. ఇక దర్శకుడు శివ కార్తీక్ విషయానికొస్తే.. చెప్పాలనుకున్న కథను స్ట్రయిట్ గా కాకుండా, మాస్-మసాలా మిక్స్ చేసి చెప్పాలనుకున్నాడు. మరీ ముఖ్యంగా సుదీప్ కు కన్నడనాట ఉన్న క్రేజ్ ను దృష్టిలో పెట్టుకొని ఎపిసోడ్స్ రాసుకున్నాడు. దీంతో తెలుగు వెర్షన్ కు వచ్చేసరికి కొన్ని చోట్ల సినిమా బోర్ కొట్టిస్తుంది.

జీ సినిమాలు సమీక్ష
సుదీప్ కు కన్నడలో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ప్రత్యేకంగా వాళ్లను దృష్టిలో పెట్టుకొని తీసిన సినిమా ఈ K3-కోటికొక్కడు. గతేడాది కన్నడనాట రిలీజైన ఈ సినిమా మంచి విజయాన్నందుకుంది. కిచ్చా ఫ్యాన్స్ ను ఓ ఊపు ఊపింది. దీంతో అదే మూవీని యాజ్ ఇటీజ్ గా తెలుగులో డబ్ చేసి వదిలారు. కంటెంట్, ప్రొడక్షన్ వాల్యూస్ పరంగా ఈ సినిమా తెలుగు ఆడియన్స్ కు నచ్చే విధంగానే ఉన్నప్పటికీ, సుదీప్ ఎలివేషన్స్ తో టాలీవుడ్ ఆడియన్స్ కనెక్ట్ అవ్వలేరు.

ఈగ, బాహుబలి లాంటి సినిమాలతో టాలీవుడ్ లో కూడా పాపులరయ్యాడు సుదీప్. ఇక తాజాగా వచ్చిన విక్రాంత్ రోణ సినిమాతో తెలుగులో కూడా హిట్ కొట్టాడు. అయితే సుదీప్ కు ఇక్కడ ఎంత ఆదరణ ఉన్నప్పటికీ, తెలుగు ఆడియన్స్ దృష్టిలో అతడు కేవలం నటుడు మాత్రమే. మాస్ హీరో కాదు. K3-కోటికొక్కడు సినిమాలో మాత్రం సుదీప్ పై మాస్ ఎలివేషన్స్ ఎక్కువగా పెట్టారు. కనీసం తెలుగు వెర్షన్ కోసమైన ఆ ఎలివేషన్స్ తగ్గించి, కంటెంట్ చూపించి ఉంటే… మంచి రిజల్ట్ వచ్చి ఉండేది, పనిలోపనిగా రన్ టైమ్ కూడా తగ్గి ఉండేది. కానీ తెలుగు నిర్మాతలు అలాంటి ప్రయత్నం చేయలేదు. మక్కికిమక్కి డబ్బింగ్ చేసి వదిలారు. కనీసం కన్నడ పదాల్ని సీజీలో తెలుగులోకి మార్చే ప్రయత్నం కూడా చేయలేదు.

ఈ ఒక్క డ్రాబ్యాక్ ను పక్కనపెడితే.. టోటల్ సినిమా మొత్తం ఆస్వాదించేలా ఉంటుంది. హీరో ఒకడా, ఇద్దరా అనే సస్పెన్స్ ను చివరి వరకు బాగా మెయింటైన్ చేస్తూ స్క్రీన్ ప్లే నడిపించాడు దర్శకుడు శివ కార్తీక్. గ్రాఫ్ పడుతున్న ప్రతి సారి ఓ చిన్న ట్విస్ట్ పెట్టడం లేదా భారీ యాక్షన్ సీన్ పెట్టడం లాంటివి చేసి పక్కా కమర్షియల్ ఫార్మాట్ లో సినిమాను నడిపించాడు.

నిజానికి ఇలాంటి కథలు, స్క్రీన్ ప్లే తెలుగు ఆడియన్స్ కు కొత్త కాదు. కిక్ సినిమా నుంచి ప్రేక్షకులు చూస్తూనే ఉన్నారు. అయితే ఇలాంటి కథలు, కమర్షియల్ ఫార్ములాస్ తో బెనిఫిట్ ఏంటంటే.. మంచి సీన్లతో, ఎంగేజింగ్ స్క్రీన్ ప్లేతో చూపిస్తే ఏ భాషలోనైనా చూస్తారు. K3-కోటికొక్కడు విషయంలో కూడా అదే జరిగింది. కథ ఏంటి, నెక్ట్స్ ఏం జరుగుతుంది లాంటివి గెస్ చేసేలా ఉన్నప్పటికీ చివరివరకు ఈ సినిమాను చూడొచ్చు. ఫారిన్ లొకేషన్స్, అదిరిపోయే యాక్షన్ సీక్వెన్సులు, ఛేజింగ్ లు కట్టిపడేస్తాయి.

సినిమా మొత్తం సుదీప్ వన్ మ్యాన్ షో కనిపిస్తుంది. శివ, సత్యగా రెండు డిఫరెంట్ షేడ్స్ లో సుదీప్ బాగా చేశాడు. యాక్షన్ సీన్స్ లో మెప్పించాడు. ఇంటర్ పోల్ ఆఫీసర్ గా నటించిన శ్రద్ధాదాస్ ఓ సన్నివేశంలో బికినీలో కనిపించి మెరుపులు మెరిపించగా, డాక్టర్ గా నటించిన మడొన్నా సెబాస్టియన్ కు సరైన పాత్ర దొరకలేదు. రవిశంకర్ మరోసారి మెరుపులు మెరిపించాడు.

ఓవరాల్ గా భారీ ప్రొడక్షన్ వాల్యూస్ తో రిచ్ గా తెరకెక్కిన K3-కోటికొక్కడు సినిమాను ఓసారి చూడొచ్చు. కథ-స్క్రీన్ ప్లే అన్నీ మనకు తెలిసినట్టే అనిపించినప్పటికీ, సినిమా ఎక్కడా విసిగించదు.

రేటింగ్ – 2.5/5