Movie Review - ఫస్ట్ డే ఫస్ట్ షో

Friday,September 02,2022 - 07:03 by Z_CLU

నటీనటులు: శ్రీకాంత్ రెడ్డి, సంచిత బసు, తనికెళ్ల భరణి, వెన్నెల కిషోర్, శ్రీనివాసరెడ్డి, మహేష్ ఆచంట, ప్రభాస్ శ్రీను, గంగవ్వ, సివిఎల్ నరసింహారావు, వంశీధర్ గౌడ్, సాయి చరణ్ బొజ్జా తదితరులు
సమర్పణ: ఏడిద శ్రీరామ్
కథ: అనుదీప్ కెవి
నిర్మాత: శ్రీజ ఏడిద
దర్శకత్వం: వంశీధర్ గౌడ్, లక్ష్మీ నారాయణ పి
స్క్రీన్ ప్లే: అనుదీప్ కెవి, వంశీధర్ గౌడ్, కళ్యాణ్
డైలాగ్స్: అనుదీప్ కెవి, వంశీధర్ గౌడ్
సంగీతం: రధన్
డీవోపీ: ప్రశాంత్ అంకిరెడ్డి
ఎడిటర్: మాధవ్
నిడివి: 117 నిమిషాలు
సెన్సార్: U/A
రిలీజ్ డేట్: సెప్టెంబర్ 2, 2022

జాతిరత్నాలతో బ్లాక్ బస్టర్ అందుకున్న అనుదీప్ కేవి.. ఈ సినిమాకు కథ-స్క్రీన్ ప్లే-డైలాగ్స్ అందించాడు. అందుకే ఫస్ట్ డే ఫస్ట్ షో మూవీకి కాస్త బజ్ వచ్చింది. మరి ఓ మోస్తరు అంచనాలతో వచ్చిన ఈ సినిమా ఎలా ఉంది.. జీ సినిమాలు ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూ

First-Day-First-Show-Movie-Review

కథ
తెలంగాణలోని నారాయణ్ ఖేడ్ అనే ప్రాంతంలో 2001లో 3 రోజుల పాటు జరిగిన కథ ఇది. కె.శ్రీనివాస్ అలియాస్ శీను (శ్రీకాంత్ రెడ్డి) పవన్ కల్యాణ్ ఫ్యాన్. పవన్ కల్యాణ్ నటించిన ప్రతి సినిమాను ఫస్ట్ డే ఫస్ట్ షో చూడాల్సిందే. ఈ క్రమంలో తండ్రి, స్కూల్ హెడ్ మాస్టర్ ధర్మరాజు (తనికెళ్ల భరణి) పరువు తీస్తుంటాడు. సరిగ్గా ఇలాంటి టైమ్ లో ఖుషీ రిలీజ్ వస్తుంది. ఎప్పట్లానే ఈ సినిమా టికెట్ల కోసం ప్రయత్నిస్తుంటాడు శీను. అయితే కాలేజ్ లో శీనును ఇష్టపడే లయ (సంచిత బసు) తొలిసారి అతడితో మాట్లాడుతుంది. దీనికి కారణం ఖుషి సినిమా. ఆ సినిమా టికెట్లు కావాలని శీనుని కోరుతుంది. అతడితో కలిసి సినిమా చూడాలనే కోరికను బయటపెడుతుంది. ప్రేయసి కోరడంతో శ్రీను ఖుషీ ఫస్ట్ డే ఫస్ట్ షో టికెట్ల కోసం తెగ ప్రయత్నిస్తాడు. ఈ క్రమంలో పోలీసులకు కూడా దొరికిపోతాడు. మరి చివరికి తన గర్ల్ ఫ్రెండ్ తో కలిసి శీను ఖుషి సినిమా ఫస్ట్ డే ఫస్ట్ షో చూశాడా లేదా అనేది ఈ సినిమా స్టోరీ.

నటీనటుల పనితీరు
హీరోగా నటించిన శ్రీకాంత్ రెడ్డి బాగా చేశాడు. అతడి అమాయకమైన లుక్స్ ఈ కథకు బాగా కలిసొచ్చాయి. అనుదీప్ రాసిన కామెడీ డైలాగ్స్ కు ఇతడి మేనరిజమ్స్ సరిగ్గా సరిపోయాయి. హీరోయిన్ సంచిత బసు ఎక్స్ ప్రెషన్స్ ఎక్కువ ఇచ్చింది, యాక్టింగ్ తక్కువ చేసింది. వెన్నెల కిషోర్, వంశీధర్ గౌడ్ కామెడీ అక్కడక్కడ పేలింది. తణికెళ్ల భరణి, సీవీఎల్ నరసింహారావు, మహేష్ ఆచంట, శ్రీనివాసరెడ్డి తమ పాత్రలకు న్యాయం చేశారు.

టెక్నీషియన్స్ పనితీరు
రథన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఓకే. ఓ పాటకు మాత్రం మంచి బాణీలు అందించాడు. ప్రశాంత్ సినిమాటోగ్రఫీ బాగుంది. పూర్ణోదయ క్రియేషన్స్, శ్రీజ ఎంటర్‌టైన్‌మెంట్స్ ప్రొడక్షన్ వాల్యూస్ కథకు తగ్గట్టు ఉన్నాయి. ఈ సినిమాకు కథ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందించిన అనుదీప్, పూర్తి స్థాయిలో సక్సెస్ అవ్వలేకపోయాడు. కామెడీ అనుకొని అతడు రాసిన చాలా డైలాగ్స్ పేలలేదు. క్యారెక్టరైజేషన్స్ కూడా కుదరలేదు. అనుదీప్, వంశీధర్ గౌడ్, కల్యాణ్ కలిసి రాసుకున్న స్క్రీన్ ప్లే కూడా సెట్ అవ్వలేదు. 2 గంటల నిడివి కూడా ఎక్కువైన ఫీలింగ్ కలిగింది. ఇక వంశీధర్ విషయానికొస్తే, ఈ సినిమాలో ఓ కామెడీ పాత్ర పోషించిన ఈ దర్శకుడు.. డైరక్టర్ గా కంటే కమెడియన్ గా బాగా రాణిస్తాడు.

First-Day-First-Show-Movie-Review

జీ సినిమాలు సమీక్ష
పవన్ కల్యాణ్ హీరోగా నటించిన ఖుషి సినిమా ఫస్ట్ డే ఫస్ట్ షో టికెట్లు సంపాదించడం ఎలా? క్లయిమాక్స్ కు వచ్చేసరికి హీరో టికెట్లు సంపాదించాడా లేదా? ఫస్ట్ డే ఫస్ట్ షో సినిమా స్టోరీ మొత్తం ఇదే. ఇందులో ఎలాంటి డీవియేషన్స్ లేవు. ఎలాంటి యాడ్-ఆన్స్ లేవు. సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు దర్శకుడు ఇదే పాయింట్ పై కథను నడిపించాడు. ఈ చిన్న పాయింటే సినిమాకు ప్లస్ అయింది, మైనస్ కూడా అయింది.

సినిమా ఓపెన్ అవ్వడమే హీరో, ఖుషి సినిమా టికెట్ల కోసం ఎలా తన ప్రయత్నాలు మొదలుపెట్టాడనే ఎలిమెంట్ తో స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత గర్ల్ ఫ్రెండ్ ను సీన్ లోకి తీసుకురావడం, ఆమె కూడా టికెట్లు కావాలని కోరడంతో, ఇక టికెట్లు సంపాదించడమే తన జీవిత లక్ష్యంగా పెట్టుకుంటాడు హీరో. ముందుగా ఇద్దర్నీ నమ్ముకుంటాడు. వాళ్లు ఇద్దరూ ఒకర్నొకరు కొట్టుకొని హాస్పిటల్ లో చేరతారు. ఆ తర్వాత వెన్నెల కిషోర్ ఎంటర్ అవుతాడు.

వెన్నెల కిషోర్ ఇంట్రీతో సినిమాలో నవ్వుల డోస్ కాస్త పెరుగుతుంది తప్ప మరీ హిలేరియస్ గా అనిపించదు. అదే ఊపులో ఓ శవం ఎపిసోడ్ కూడా స్టార్ట్ చేసి ఆసక్తిరకంగా ఇంటర్వెల్ బ్యాంగ్ వేశారు దర్శకులు. ఇంటర్వెల్ తర్వాత కూడా కథ సినిమా టికెట్ల చుట్టూనే తిరుగుతుంది. రంగస్థలం మహేష్ ఎంట్రీతో పాటు మరోసారి వెన్నెల కిషోర్ ఎంట్రీ ఇస్తాడు. చివరికి ఎమోషనల్ డైలాగ్స్, సీన్స్ తో క్లయిమాక్స్ పడుతుంది.

ఈ మొత్తం వ్యవహారంలో కథ-స్క్రీన్ ప్లే రచయిత అనుదీప్ అసలు పాయింట్ ను మరిచిపోయాడు. ప్రేక్షకుడ్ని 2 గంటల పాటు కడుపుబ్బా నవ్వించడం అనేది ఈ సినిమా ముఖ్య ఉద్దేశం. పవన్ కల్యాణ్ అభిమాని స్ట్రగుల్ ను చూపించే క్రమంలో కామెడీని మరిచిపోయినట్టున్నాడు అనుదీప్. సినిమాలో మంచి సీన్స్ పడ్డాయి. మరీ ముఖ్యంగా శవం ఎపిసోడ్, వెన్నెల కిషోర్ ఎపిసోడ్, పోలీస్ స్టేషన్ ఎపిసోడ్స్ లాంటివి బాగానే పడ్డాయి. కానీ ఆ సన్నివేశాల్లో అనుదీప్ కథను నడిపించే ప్రయత్నం చేశాడు తప్ప, కామెడీని పండించే ప్రయత్నం చేయలేదు.

ఇక్కడ కచ్చితంగా జాతిరత్నాలతో పోలిక తీసుకురావాల్సిందే. జాతిరత్నాలు సినిమాలో కేవలం నవ్వించడమే పరమావధిగా పెట్టుకున్నారు. లాజిక్ లేని సన్నివేశాలు వస్తాయి, పొంతన లేకుండా స్క్రీన్ ప్లే నడుస్తుంది, చివరికి జంప్ కట్స్ కూడా కనిపిస్తాయి. కానీ ప్రేక్షకులు ఆ సినిమాను ఎంజాయ్ చేశారు. ఎందుకంటే, వాళ్లు కామెడీ ఆశించారు అది అందులో ఉంది. ఫస్ట్ డే ఫస్ట్ షో అనే సినిమాలో కూడా ప్రేక్షకులు కామెడీ ఆశించారు, కానీ అది తక్కువ మోతాదులో ఉంది.

సినిమాలో అనుదీప్ మార్క్ పంచులు బాగానే ఉన్నాయి. సెలూన్ షాప్ లో, శవం దగ్గర, క్లయిమాక్స్ లో ఈ పంచ్ లు మనకు కనిపిస్తాయి. కానీ జాతిరత్నాలు టైపులో అడుగడుగునా కనిపించవు. ఆ సినిమా రేంజ్ లో కామెడీ డైలాగ్స్ పేలలేదు. ఈ సంగతి పక్కనపెడితే, జాతిరత్నాల్లో పాత్రలతో ప్రేక్షకుడు కనెక్ట్ అయ్యాడు. ఇందులో అలా కనెక్ట్ అయ్యే పాత్రలు పెద్దగా కనిపించవు. ఇది కూడా ఓ మైనస్. ఇక సినిమా కథ 20 ఏళ్ల కిందటిది. అప్పట్లో ఆన్ లైన్ టికెట్ వ్యవస్థ లేదు. బుకింగ్ కౌంటర్ వద్ద చొక్కాలు చిరిగేలా కొట్టుకున్న పాట్లు, అవస్థలు ఈ తరం కుర్రాళ్లకు తెలియవు. కాబట్టి వాళ్లు ఈ కథతో ఏ స్థాయిలో కనెక్ట్ అవుతారనేది కూడా సందేహమే.

ఉన్నంతలో ఈ సినిమాను హీరో శ్రీకాంత్ తో పాటు.. వెన్నెల కిషోర్, రంగస్థలం మహేష్ గట్టెక్కించే ప్రయత్నం చేశారు. వీళ్లు ముగ్గురు అక్కడక్కడ మెరుపులు మెరిపించారు. శ్రీనివాసరెడ్డి, ప్రభాస్ శ్రీను, గంగవ్వ కామెడీ పండలేదు. హీరోయిన్ స్లో మోషన్ లో సైడ్ యాంగిల్ లో చూస్తూ నవ్వులు చిందించడం తప్ప పెద్దగా నటించలేదు. టెక్నీషియన్స్ అంతా కథకు తగ్గట్టు వర్క్ చేశారు. సినిమాటోగ్రఫీ, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కథకు తగ్గట్టు ఉన్నాయి. నీ నవ్వే సాంగ్ బాగుంది. మళ్లీ మళ్లీ వినాలనిపించేలా ఉంది కానీ సినిమాలో దాని ప్లేస్ మెంట్ కుదరలేదు. ప్రొడక్షన్ వాల్యూస్ ఓకే.

ఓవరాల్ గా ఫస్ట్ డే ఫస్ట్ షో సినిమాను జాతిరత్నాలతో కంపేర్ చేయకుండా చూస్తే ఓ మోస్తరుగా ఆకట్టుకుంటుంది. పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ కు మాత్రం బాగా నచ్చుతుంది.

రేటింగ్ – 2/5