Movie Review - దృశ్యం 2

Thursday,November 25,2021 - 09:48 by Z_CLU

నటీనటులు: వెంకటేష్, మీనా, కృతిక, ఎస్తర్, VKనరేష్, నదియా, తనికెళ్ళ భరణి, అన్నపూర్ణమ్మ, సంపత్ రాజ్, పూర్ణ, సత్యం రాజేష్, షఫీ తదితరులు

సినిమాటోగ్రఫీ : సతీష్ కురూప్

మ్యూజిక్ : అనూప్ రుబెన్స్

నిర్మాతలు : సురేష్ బాబు ,ఆంటోనీ పెరుమ్బవూర్ , రాజ్ కుమార్ సేతుపతి , జాకర్ కె బాబు

రచన -దర్శకత్వం : జీతూ జోసెఫ్

నిడివి : 157 నిమిషాలు

విడుదల తేది : 25 నవంబర్ 2021

‘దృశ్యం’ సినిమా అనేక భాషల్లో సూపర్ హిట్టయింది. తెలుగులో కూడా మంచి విజయం సాధించింది. అందుకే ఆ కథకి ఇప్పుడు సీక్వెల్ రెడీ చేశారు. మలయాళంలో జీతూ జోసెఫ్ దర్శకత్వంలో మోహన్ లాల్ నటించిన ‘దృశ్యం 2’ ని తెలుగులో రీమేక్ చేశాడు వెంకటేష్. ఈరోజే డైరెక్ట్ గా OTTలో విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులకు మెప్పించి థ్రిల్ చేసిందా ? జీ సినిమాలు ఎక్స్ క్లూజీవ్ రివ్యూ.

కథ :

‘దృశ్యం’ మొదటి పార్ట్ కథ అందరికీ తెలిసిందే. మొదటి పార్ట్ లో కీలక సంఘటనల అనంతరం రాంబాబు(వెంకటేష్) తన భార్య జ్యోతి(మీనా) పిల్లలు అంజు(కృతిక), అను(ఎస్తర్) లు వరుణ్ హత్య కేసు నుండి తన తెలివి తేటలతో బయటపడేస్తాడు. ఇప్పుడు సీక్వెల్ కి వస్తే రాంబాబు కుటుంబ పరిస్థితులు అన్నీ మారతాయి. ఆరేళ్లలో రాంబాబు తనకున్న సినిమాపై మక్కువతో ఆ రంగంలోనే థియేటర్ నుంచి నిర్మాత స్థాయికి ఎదుగుతాడు.

తన బిడ్డ వరుణ్ ను పోగొట్టుకున్న తల్లిదండ్రులు ఐజీ గీతా ప్రభాకర్, ఆమె భర్త ప్రభాకర్ లు యూఎస్ లో సెటిల్ అవుతారు. కానీ ఏదో ఒకరోజు తమ బిడ్డ శవం దొరుకుతుందేమో అనే ఆశతో రాంబాబు ఉన్న గ్రామానికి తరచూ వస్తుంటారు. మరో వైపు అక్కడికి కొత్తగా వచ్చిన ఐజీ(సంపత్ రాజ్) క్లోజ్ అయిన వరుణ్ కేసును సీక్రెట్ గా రీ ఇన్వెస్టిగేట్ చేస్తుంటాడు. అక్కడి నుండి మళ్ళీ రాంబాబు కుటుంబానికి సవాళ్లు ఎదురవుతాయి.మళ్ళీ వరుణ్ దేహం బయటకు వస్తుందా? ఈసారి రాంబాబు తన కుటుంబాన్ని ఎలా కాపాడుకున్నాడు ? అనేది మిగతా కథ.

నటీనటుల పనితీరు :

దృశ్యం మొదటి పార్ట్ లో రాంబాబు పాత్రలో ఒదిగిపోయిన వెంకటేష్ మరోసారి అదే పాత్రతో మెప్పించి సీక్వెల్ కి కూడా హైలైట్ గా నిలిచాడు. ముఖ్యంగా కొన్ని థ్రిల్ కలిగించే సన్నివేశాల్లో వెంకటేష్ నటనని మెచ్చుకోవాల్సిందే. అన్ని భాషల్లో చేసిన అదే పాత్ర కావడంతో మీనా ఎప్పటిలానే తన నటనతో జ్యోతి పాత్రకు బలం చేకూర్చింది. కృతిక మరోసారి మంచి నటన కనబరిచింది. ఎస్తర్ తన క్యారెక్టర్ కి బెస్ట్ ఇచ్చింది.

నరేష్ , నదియా ఇద్దరూ మొదటి భాగంలో ఆకట్టుకున్న తీరులోనే మరోసారి ఆ పాత్రలతో ఎమోషనల్ సీన్స్ తో ఇంప్రెస్ చేశారు. కేసు రీ ఇన్వెస్ట్ చేసే పోలిస్ పాత్రలో సంపత్ రాజ్ , సినిమా దర్శకుడి పాత్రలో తనికెళ్ళ భరణి , అడ్వకేట్ పాత్రలో పూర్ణ , షఫీ , సత్యం రాజేష్ , సుజా వరుణీ తదితరులు తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు.

సాంకేతిక వర్గం పనితీరు :

సినిమాకి టెక్నికల్ టీం నుండి మంచి సపోర్ట్ అందింది. ప్రతీ ఒక్కరూ తమ పూర్తి ఎఫర్ట్స్ పెట్టి పనిచేశారు. సతీష్ కురుప్ నాచురల్ సినిమాటోగ్రఫీ సినిమాకు మంచి ఎస్సెట్ గా నిలవగా అనూప్ రుబెన్స్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ సన్నివేశాలను ఎలివేట్ చేసి హైలైట్ గా నిలిచింది. మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటింగ్ బాగుంది. కానీ మొదటి భాగంలో కాస్త ట్రిమ్ చేసి క్రిస్ప్ చేసి ఎడిట్ చేసి ఉంటే బెటర్ ఆ ఉండేది. ఆర్ సామల రాసిన సంభాషణలు బాగున్నాయి. ఆర్ట్ వర్క్ బాగుంది.

దర్శకుడు జీతూ జోసెఫ్ బ్రిలియెంట్ టేకింగ్ తో మెస్మరైజ్ చేశాడు. సీక్వెల్ కోసం మరోసారి ఆసక్తిగా సాగే కథను రాసుకొని అంతే ఆసక్తిగా తెరకెక్కించాడు.ముఖ్యంగా తన నెరేషన్ తో మైండ్ బ్లోయింగ్ అనిపించాడు. అక్కడక్కడా కాస్త స్లో నరేషన్ తప్పిస్తే చివరి వరకు ఆద్యంతం ఆసక్తికరంగా నడిపించిన విధానం, రాసుకున్న సీక్వెన్స్ లు హైలైట్ అని చెప్పాలి. ప్రొడక్షన్ వాల్యూస్ సినిమా క్వాలిటీని పెంచాయి.

Drushyam 2 venkatesh

జీ సినిమాలు సమీక్ష :

‘దృశ్యం’ మొదటి పార్ట్ చూస్తే హీరో పాత్రే చివరి వరకు స్ట్రాంగ్ కంటెంట్ ను తన భుజ స్కందాలపై మోస్తుంది. ఈసారి కూడా వెంకటేష్ క్యారెక్టర్ అవుట్ స్టాండింగ్ అనిపిస్తూ మెయిన్ హైలైట్ గా నిలిచింది. వెంకటేష్ ఇంటెలిజెన్స్ పెర్ఫామెన్స్ ప్లస్ అయింది. రాంబాబు కుటుంబంపై వచ్చే ఎపిసోడ్స్ , ఎమోషన్స్ అన్నీ స్ట్రాంగ్ గా ఎలివేట్ అయ్యాయి. మొదటి పార్ట్ తో పోలిస్తే దర్శకుడు జీతూ జోసెఫ్ ని ఇంకా బాగా డీల్ చేశాడనిపించింది. ముఖ్యంగా సెకండాఫ్ లో వచ్చే సన్నివేశాలు ఆడియన్స్ ను బాగా మెప్పిస్తాయి. ఫస్ట్ హాఫ్ లో వచ్చే కొన్ని సన్నివేశాలు బోర్ కొట్టినా రెండో భాగంలో కథ ఆసక్తిగా నడిచే విధానం ఆకట్టుకుంది. సెకండాఫ్ లో వచ్చే ఇన్వెస్టిగేషన్ డ్రామా , కోర్ట్ రూమ్ సన్నివేశాలు ఆకట్టుకున్నాయి. ఫస్ట్ హాఫ్ లో వెంకటేష్ పాత్ర తాలూకు పర్సనల్ లైఫ్ కి సంబంధించిన సన్నివేశాలు కాస్త ఎక్కువగా ఉన్నట్టు అనిపిస్తాయి. అవి బోర్ కొట్టేలా ఉన్నాయి.

పార్ట్ 1 కి కొనసాగింపుగా జీతూ రాసుకున్న కథ -కథనం ఈ సీక్వెల్ కి మెయిన్ హైలైట్ అని చెప్పొచ్చు. ‘ద్రిశ్యం 2’ కి సంబంధించి దర్శకుడిగా మల్లువుడ్ లో మంచి కాంప్లిమెంట్స్ అందుకున్నాడు జీతూ. అందుకే సురేష్ బాబు తెలుగులో తెరకెక్కిన ఈ సీక్వెల్ కి కూడా అతన్నే దర్శకుడిగా తీసుకొని జీతూ చేతిలో పెట్టాడనుకోవచ్చు. తెలుగు వర్షన్ ని కూడా బాగానే డీల్ చేసి సోల్ మిస్ అవ్వకుండా ఫ్రేం టు ఫ్రేమ్ తీసి మెప్పించాడు దర్శకుడు. తెలుగులో కూడా పాత్రలకు బెస్ట్ ఇచ్చే నటీ నటులు దొరకడంతో జీతూ పని ఈజీ అయిపొయింది. అందుకే చాలా తక్కువ టైంలోనే ఈ సినిమాను కంప్లీట్ చేసిచ్చాడు.

ఫస్ట్ హాఫ్ లో నత్త నడకన సాగుతూ బోర్ కొట్టించే సన్నివేశాలు మినహాయిస్తే మిగతా కంటెంట్ మెప్పిస్తుంది. మంచి నిర్మాణ విలువలు, కథ- కథనం, వెంకటేష్ అవుట్ స్టాండింగ్ పెర్ఫామెన్స్, జీతూ జోసెఫ్ బ్రిలియెంట్ డైరెక్షన్, థ్రిల్లింగ్ స్క్రీన్ ప్లే, ప్రీ క్లైమాక్స్ -క్లైమాక్స్ సన్నివేశాలు సినిమాకు మేజర్ హైలైట్స్. ఫైనల్ గా ‘దృశ్యం 2’ ఒక పర్ఫెక్ట్ సీక్వెల్ అని చెప్పొచ్చు.

రేటింగ్ 3/5