Movie Review - ఆచార్య

Friday,April 29,2022 - 01:07 by Z_CLU

నటీనటులు : చిరంజీవి, రామ్ చరణ్, పూజ హెగ్డే, సోనూ సూద్, అజయ్, తనికెళ్ళ భరణి, శత్రు, జితు సేన్ గుప్తా తదితరులు

సంగీతం : మణిశర్మ

నిర్మాణం : మ్యాట్నీ ఎంటర్టైన్ మెంట్స్ , కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ

సమర్పణ : శ్రీమతి సురేఖ కొణిదెల

నిర్మాతలు : నిరంజన్ రెడ్డి, అన్వేష్

రచన -దర్శకత్వం : కొరటాల శివ

విడుదల తేది : 29 ఏప్రిల్ 2022

నిడివి : 154 నిమిషాలు

మెగాస్టార్ చిరంజీవి, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ఈ కాంబినేషన్ లో సినిమా అంటే… ఆటోమేటిక్ గా అంచనాలు డబుల్ అవుతాయి. ఈ ఇద్దరు కలిసి నటిస్తున్నారనే విషయం తెలిసినప్పటి నుండి ‘ఆచార్య‘ మీద భారీ అంచనాలు నెలకొన్నాయి. కొన్ని నెలలుగా పోస్ట్ పోన్ అవుతూ ప్రేక్షకులను ఊరిస్తున్న ఈ మెగా మూవీ  ఫైనల్ గా థియేటర్స్ లోకి ఎంట్రీ ఇచ్చింది. మరి మెగాస్టార్, మెగా పవర్ స్టార్ మెగా మూవీతో మెస్మరైజ్ చేశారా? కొరటాల కంటెంట్ తో మెప్పించాడా ? జీ సినిమాలు ఎక్స్ క్లూజీవ్ రివ్యూ.

కథ :

800 ఏళ్ల క్రితం జీవధార అనే నది పక్కన ఓ అడవిలో ఉంటూ ఎందరో యోగులు, మహర్షులు  సంచరిస్తూ తపస్సు చేసుకునే వారు. యోగులు, మహర్షులు పాదఘట్టంలో ఉండే తండావాసులకు పెద్ద దిక్కుగా మారి నిత్యం వారికి ధర్మం భోదిస్తూ అక్కడ ఉండే సిద్ధవనంలో దొరికే ఔషద మొక్కలతో వారికి ఆయుర్వేద శాస్త్రం నేర్పి గొప్ప నాగరికులుగా తీర్చి దిద్దుతారు. ఎన్ని తరాలు మారినా, ఏ విపత్తు ఎదురైన ఈ అడవిని వీడకుండా సిద్దవనంని కాచుకొని ఉండటం వారి ధర్మమని వారికో సృష్టి రహస్యం భోదిస్తారు.

జీవధారకి అటువైపుగా ధర్మస్థలి అనే గ్రామం నెలకొల్పి అక్కడ తమ గ్రామ దేవత ఘట్టమ్మ తల్లికి ఓ దేవాలయం నిర్మించి జీవిస్తుంటారు. అలాంటి స్థలంలో దోపిడీలు, దుర్మార్గాలు జరుగుతుండటంతో సిద్ద(రామ్ చరణ్) కి ఇచ్చిన మాట కోసం కామ్రేడ్ ఆచార్య(చిరంజీవి) అక్కడికి వస్తాడు.

ధర్మం కాపాడటం కోసం ధర్మస్థలిలో అడుగుపెట్టిన ఆచార్య ఎవరు? అతనికి, సిద్దకి సంబంధం ఏమిటి? ధర్మస్థలిలో మున్సిపల్ చైర్మన్ గా ఉంటూ అన్యాయాలకు పాల్పడుతున్న బసవ (సోను సూద్)ని ఆచార్య ఎలా అంతమొందించాడు ? అనేది మిగతా కథ.

నటీనటుల పనితీరు:

చిరంజీవితో పాటు రామ్ చరణ్ కి కూడా టైలర్ మేడ్ క్యారెక్టర్స్ దొరకడంతో ఇద్దరూ ఆచార్య, సిద్ద పాత్రలకు బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. కామ్రేడ్ ఆచార్యగా చిరు నటన బాగుంది. యాక్షన్ ఎపిసోడ్స్ , డాన్సుల్లో మరోసారి తన టాలెంట్ చూపించి సినిమాకు మెయిన్ ఎట్రాక్షన్ గా నిలిచారు చిరు. అలాగే చరణ్ కూడా సిద్ద పాత్రలో ఒదిగిపోయి నటించాడు. కొన్ని సన్నివేశాల్లో తండ్రితో పోటీ పడి నటించి ‘చిరుత’నయుడనిపించుకున్నాడు. నీలాంబరి పాత్రలో పూజాహెగ్డే ఆకట్టుకుంది. తన నటనతో గ్రామీణ యువతిగా మెప్పించింది. విలన్స్ గా సోనూ సూద్, జితు సేన్ గుప్తా, సౌరవ్ లోకేష్ శత్రు , కిషోర్ మెప్పించారు. కథలో కీలకమైన పాత్ర దొరకడంతో అజయ్ తన నటనతో ఆ క్యారెక్టర్ కి బలం చేకూర్చాడు. తక్కువ నిడివి గల శంకరన్న పాత్రలో సత్యదేవ్ బాగా నటించాడు. నాజర్ కేవలం రెండు సన్నివేశాలకే పరిమితమయ్యారు.  కమెడియన్స్ వెన్నెల కిషోర్, ప్రవీణ్ చెరో కామెడీ సన్నివేశం పంచుకున్నారు కానీ కామెడీ పండలేదు. తనికెళ్ళ భరణి, బెనర్జీ, రఘు బాబు మిగతా నటీనటులు తమ పాత్రలకు న్యాయం చేశారు.

సాంకేతికవర్గం పనితీరు:

సినిమాకు పనిచేసిన టెక్నీషియన్స్ లో ముందుగా మాట్లాడుకోవాల్సింది సినిమాటోగ్రాఫర్ తిరు, ఆర్ట్ డైరెక్టర్ సురేష్ ల గురించే. ఇద్దరు బెస్ట్ ఎఫర్ట్ పెట్టి మంచి అవుట్ పుట్ ఇచ్చారు. కొన్ని సందర్భాల్లో వచ్చే షాట్స్ , విజువల్స్ తిరు కెమెరా పనితనం తెలియజేస్తాయి. అలాగే ధర్మస్థలి సెట్ వర్క్ చూస్తే సురేష్ సెల్వ రాజన్ ని మెచ్చుకోకుండా ఉండలేం. మణిశర్మ మ్యూజిక్ పరవాలేదు. “లాహే లాహే”, “భల్లే భాంజరా” పాటలు వినసొంపుగా ఉన్నాయి మిగతా పాటలు ఆకట్టుకోలేదు. అక్కడక్కడా వచ్చే నేపథ్య సంగీతం బాగుంది తప్ప పూర్తిస్థాయిలో మెస్మరైజ్ చేయలేకపోయాడు మణి. నవీన్ నూలి ఎడిటింగ్ బాగుంది. కానీ కొన్ని స్లోగా నడిచే సన్నివేశాలు తొలగించి ఉంటే బెటర్ గా ఉండేది. కాస్ట్యూమ్స్, మేకప్ బాగున్నాయి.చిరు ఫేస్ తో చేసిన వి ఎఫ్ ఎక్స్ సరిగ్గా కుదరకపోవడంతో ఆ సన్నివేశాలు ఇబ్బంది పెట్టాయి.

కొరటాల శివ కథ -కథనం రొటీన్ గా అనిపించాయి. కొరటాల శివ నుండి ఎక్స్ పెక్ట్ చేసే పదునైన మాటలు కూడా పెద్దగా కనిపించలేదు. ట్రైలర్ లో వినిపించిన రెండు మూడు డైలాగులే ఉన్నాయి తప్ప ఊహించిన పవర్ ఫుల్ డైలాగ్స్ లేవు. మ్యాట్నీ ఎంటర్టైనర్ మెంట్స్, కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ నిర్మాణ విలువలు బాగున్నాయి.

Acharya-ramcharan-chiranjeevi1

జీ సినిమాలు సమీక్ష :

కొరటాల శివ సినిమా అంటే చాలా ఎలిమెంట్స్  ఉంటాయి. ముఖ్యంగా పవర్ ఫుల్ మెసేజ్ ని కమర్షియల్ సినిమాతో చెప్పడంలో ఆయన దిట్ట. ఇక చిరు-చరణ్ తో కొరటాల శివ సినిమా అనగానే వీటికి మించి మరేదో ఉంటుందని ఊహించుకున్నారు ప్రేక్షకులు. అయితే మెగాస్టార్, మెగా పవర్ స్టార్ కోసం కొరటాల తన స్టైల్ నుండి బయటికొచ్చి పక్కా  కమర్షియల్ సినిమా చేయడం కోసం, ఎలాంటి సందేశం లేని ఓ రొటీన్ స్క్రిప్ట్ ఎంచుకున్నాడు. ‘ఆచార్య’ కోసం ధర్మం పాటించాలనే ఓ సూత్రంతో ఈ కథ రాసుకున్నాడు కొరటాల. ఎంగేజ్ చేయగలిగే స్క్రీన్ ప్లే రాసుకోవడంలోనూ విఫలం అయ్యాడు. ఒక పెద్ద గుడి ఉన్న ఊరు, ఆ ఊరిలో దౌర్జన్యాలు చేసే విలన్, అతనికి ఎదురెళ్ళి ఆ ఊరి జనాలకు విముక్తి కలిగించే హీరో గతంలో చాలా కమర్షియల్ సినిమాల్లో చూసేసిన ఈ కథే ‘ఆచార్య’లో కనిపించింది. కాకపోతే దాన్ని ఓ అటవీ ప్రాంతంలో చూపించి నక్సలైట్ స్టోరీ యాడ్ చేశాడు దర్శకుడు.

నిజానికి చిరంజీవి, చరణ్ లాంటి మెగా కాంబో దొరికినప్పుడు కొరటాల ఏదైనా డిఫరెంట్ స్టోరీ లైన్ తో తన మార్క్ యాక్షన్ బ్లాక్స్ ఫిక్స్ చేసి మాస్ సినిమా చేసి ఉంటే బెటర్ గా ఉండేది. అలా కాకుండా ఓ రొటీన్ స్క్రిప్ట్ తీసుకోవడం సినిమాకు ఇబ్బందికరంగా మారింది. ఇక చిరు-చరణ్ కలిసి చేసిన సినిమా అంటే గూస్ బంప్స్ మూమెంట్స్ ఊహించుకొని వచ్చిన ఫ్యాన్స్ ని కూడా నిరాశ పరిచాడు కొరటాల.

ఈ దర్శకుడి ప్రతీ సినిమాలో ఓ బలమైన ఎమోషన్ ఉంటుంది. అలాగే అదిరిపోయే యాక్షన్ బ్లాక్స్ కూడా ఉంటాయి. కానీ ఈసారి అవి మిస్ అయ్యాయి. చాలా సన్నివేశాల్లో సాగతీత కనిపించింది. వాటిని ట్రిమ్ చేసి ఉంటే బాగుండేది. కొరటాల మార్క్ బలమైన సన్నివేశాలు, ఎమోషన్ కూడా ఇందులో పెద్దగా కనిపించలేదు.  ఇక చిరు, చరణ్ ఇంట్రడక్షన్ సీన్స్  కూడా అభిమానులు ఆశించిన స్థాయిలో లేవు. ఆ క్యారెక్టర్స్ ని సింపుల్ గా పరిచయం చేశాడు దర్శకుడు. కాకపోతే చిరు, చరణ్ కనిపించే ఫ్రేమ్స్ మాత్రం ఫ్యాన్స్ కి ఫీస్ట్ అనిపిస్తాయి. నిజజీవితంలో తండ్రి కొడుకులు కావడం వల్ల వారిద్దరి మధ్య కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయింది. అది ఫ్లాష్ బ్యాక్ కి బాగా కలిసొచ్చింది.

లాహే లాహే.. సానా కష్టం… భలే భలే భంజారా సాంగ్స్ లో చిరు గ్రేస్ తో వచ్చే స్టెప్స్ అభిమానులను మెప్పిస్తాయి. అలాగే చరణ్-పూజా హెగ్డే  కెమిస్ట్రీ వర్కౌట్ అవ్వడంతో వారిద్దరి మధ్య వచ్చే రొమాంటిక్ సీన్స్ ఆకట్టుకున్నాయి. కాకపోతే ఆ లవ్ ట్రాక్ పై ఇంకాస్త వర్క్ చేసి లెంగ్త్ పెంచి ఉంటే బాగుండేది. అలా చేస్తే అసలు చెప్పాలనుకున్న కథ పక్క దారి పడుతుందని కొరటాల భావించి ఉండొచ్చు.

చిరంజీవి, చరణ్ పెర్ఫార్మెన్స్ వారి స్క్రీన్ ప్రెజన్స్, పూజా హెగ్డే, సాంగ్స్, విజువల్స్, ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్,  ఆర్ట్ వర్క్ , ప్రొడక్షన్ వాల్యూస్ సినిమాకు హైలైట్స్ గా నిలిచాయి. ఇంతకుమించి చిరు-చరణ్ కాంబినేషన్ లో వచ్చిన ఆచార్యపై ఎక్కువగా ఊహించుకోవద్దు.

 రేటింగ్ : 2.5 / 5