మోహిని మూవీ రివ్యూ

Friday,July 27,2018 - 05:04 by Z_CLU

న‌టిన‌టులు.. త్రిష‌, జాకి భగ్నానీ, యోగి బాబు, పూర్ణిమ భాగ్యరాజ్ త‌దిత‌రులు..
ద‌ర్శ‌కుడు.. ఆర్‌. మాధేష్‌
సంగీతం.. వివేక్ మెర్విన్‌
సినిమాటోగ్ర‌ఫి.. ఆర్‌.బి.గురుదేవ్‌
ఎడిట‌ర్‌.. దినేష్ పూన‌రాజ్‌
స‌హ‌-నిర్మాత‌లు.. గుంటూరు కాశిబాబు, డి.వి.మూర్తి
నిర్మాత‌లు.. ఎస్‌.ల‌క్ష్మ‌ణ్ కుమార్‌, శ్రీనివాస‌రావు ప‌ల్లెల‌, క‌ర‌ణం మ‌ధుల‌త‌
బ్యాన‌ర్‌.. ప్రిన్స్ పిక్చ‌ర్స్ మ‌రియు శ్రీ ల‌క్ష్మి పిక్చ‌ర్స్‌
సెన్సార్.. U/A
రిలీజ్ డేట్.. జులై 27, 2018

15 ఏళ్లుగా హీరోయిన్ గా ఇండస్ట్రీలో ఉంది. ఇంత సీనియారిటీ వచ్చిన తర్వాత కూడా హీరోల పక్కన ఆడిపాడాలంటే కష్టం. అందుకే చాన్నాళ్ల కిందటే లేడీ ఓరియంటెడ్ సినిమాలు షురూ చేసింది త్రిష. ఇప్పుడు ఆ సెగ్మెంట్ లోనే మరో ప్రయోగం చేసింది. అదే మోహిని. ఈరోజు థియేటర్లలోకొచ్చిన ఈ సినిమా ఎలా ఉంది..? అందులో త్రిష చేసిన ప్రయోగం ఏంటి..? జీ ఎక్స్ క్లూజివ్ రివ్యూ

కథ
ఇండియాలో పాపులర్ చెఫ్ వైష్ణవి (త్రిష). ఆమెకు లండన్ నుంచి ఊహించని ఆఫర్ వస్తుంది. అక్కడకు తన టీమ్ తో పాటు వెళ్తుంది వైష్ణవి. అక్కడే సందీప్ (జాకీ భగ్నానీ) ను కలుస్తుంది. తొలిచూపులోనే ఇద్దరూ ప్రేమించుకుంటారు. తన ప్రేమ విషయాన్ని తల్లికి (పూర్ణిమ) కూడా చెప్పేస్తుంది వైష్ణవి. ఇక్కడ వరకు అంతా ప్రశాంతం.

సడెన్ గా తన బాయ్ ఫ్రెండ్ సందీప్, టీమ్ తో కలిసి బోటు షికారుకు వెళ్తుంది వైష్ణవి. అక్కడే ఊహించని సంఘటన జరుగుతుంది. ఆ ఘటన కారణంగా సముద్ర గర్భంలో ఓ శంఖంలో కొన్నేళ్లుగా ఉన్న మోహిని (త్రిష) ఆత్మ బయటకు వస్తుంది. బయటకొచ్చి తనలా ఉన్న వైష్ణవిని చూసి ఆమెలో ప్రవేశిస్తుంది.

గతంలో తనకు అన్యాయం చేసిన వ్యక్తులపై వైష్ణవి రూపంలో ఉన్న మోహిని ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటుంది. ఇందులో భాగంగా తనను చంపిన గుంపులో సందీప్ కూడా ఉన్నాడనే చేదు నిజం తెలుసుకుంటుంది. వైష్ణవిలోకి మోహిని ప్రవేశించిందనే విషయాన్ని సందీప్ తో పాటు విలన్లు గుర్తిస్తారు. మరో క్షుద్ర మాంత్రికుడితో కలిసి మోహినిని బంధించాలని, అవసరమైతే వైష్ణవిని చంపేయాలని చూస్తారు. ఫైనల్ గా విలన్లను మోహిని ఏం చేసింది.. విలన్ల బారి నుంచి వైష్ణవిని మోహిని ఎలా కాపాడింది అనేది ఈ సినిమా స్టోరీ.

 

నటీనటుల పనితీరు
కెరీర్ లో ఫస్ట్ టైం డ్యూయల్ రోల్ చేసింది త్రిష. ఫుల్ లెంగ్త్ హారర్ సినిమాతో పాటు ద్విపాత్రాభినయం చేయాలనే కోరికను మోహిని రూపంలో నెరవేర్చుకుంది. సినిమా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు త్రిష మాత్రమే కనిపిస్తుంది. చెఫ్ గా అలరించిన ఈ బ్యూటీ, మోహిని ఆత్మగా మాత్రం చెప్పుకోదగ్గ స్థాయిలో మెప్పించలేకపోయింది.

త్రిష గ్యాంగ్ లో ఉన్న యోగి బాబు కాస్త కామెడీ చేయడానికి ట్రై చేశాడు కానీ ఆ కామెడీ తెలుగు ఆడియన్స్ కు కనెక్ట్ కాదు. ఇక త్రిష అమ్మగా నటించిన పూర్ణమ, బాయ్ ఫ్రెండ్ గా నటించిన జాకీ భగ్నానీ, మాంత్రికుడిగా సురేష్ తమ పరిథి మేరకు నటించారు.

 

టెక్నీషియన్స్ పనితీరు
కోలీవుడ్ టాప్ టెక్నీషియన్స్ ఎవరూ ఈ సినిమాకు పనిచేయలేదు. వర్క్ చేసిన వాళ్ల దగ్గర్నుండి బెటర్ అవుట్ పుట్ ను దర్శకుడు తీసుకోలేకపోయాడు. దీంతో మోహిని సినిమా టెక్నికల్ గా ఎక్కడా మెప్పించదు. ఉన్నంతలో సినిమాటోగ్రాఫర్, సంగీత దర్శకుడు మాత్రం శక్తిమేర పనిచేశారు. వాళ్లే ఈ సినిమాకు ఆపద్బాంధవులు.

దర్శకుడిగా మాధేస్ కు పాస్ మార్కులు మాత్రమే పడతాయి. కేవలం త్రిషను మెప్పించడం కోసం మాత్రమే మాధేష్ ఈ కథ రాసుకున్నాడేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఈ కాలంలో రావాల్సిన కథ కాదిది. అప్పుడెప్పుడో వచ్చిన అరుంధతి కంటే ఓ పదేళ్ల ముందే రావాల్సిన సినిమా. కథ రొటీన్ అని తెలిసి కూడా బలమైన సన్నివేశాలు రాసుకోకపోవడం మాధేష్ చేసిన తప్పు.

 

జీ సినిమాలు రివ్యూ
“ఈ సినిమా కేవలం హారర్ మూవీ మాత్రమే కాదు. ఇందులో కామెడీ ఉంది. రొమాన్స్ ఉంది. అక్కడక్కడ యాక్షన్ కూడా ఉంటుంది.” రిలీజ్ కు ముందు త్రిష చెప్పిన మాటిది. నిజమే, మోహిని సినిమాలో అన్నీ ఉన్నాయి. కానీ ఏదీ పండలేదు. అదే ఈ సినిమాకు పెద్ద మైనస్.

చెఫ్ గా త్రిష అందంగా ఉంది. ఆ పాత్రకు తగ్గట్టు నటించింది కూడా. సినిమా ముందుకు సాగేకొద్దీ మోహిని పాత్ర ఎంటరయ్యే కొద్దీ త్రిషను నిజంగానే మోహిని ఆవహించిందేమో అనిపిస్తుంది. ఆ యాక్టింగ్, ఆమె ఎక్స్ ప్రెషన్స్.. 15 ఏళ్ల ఆమె కెరీర్ ను రిప్రజెంట్ చేయలేకపోయాయి. ఎందుకో త్రిష చాలా సన్నివేశాల్లో బిగుసుకుపోయింది. బహుశా అది ఆమె తప్పు కాదేమో. దర్శకుడు అలా చేయమన్నాడేమో. కొన్ని చోట్ల భయపెట్టాల్సిన సందర్భాల్లో తనే భయపడినట్టు కనిపించి నవ్వు తెప్పించింది.

హారర్ సినిమాకు ఉండాల్సిన బేసిక్ క్వాలిటీ భయపెట్టడం. ఆ యాంగిల్ లో మోహిని మెప్పించదు. అసలే రొటీన్ కథ. అలాంటి కథను కనీసం ఊపిరి బిగబట్టే సన్నివేశాలతోనైనా కట్టిపడేయాలి. కానీ ఆ ప్రయత్నం మోహినిలో లోపించింది. దీనికి తోడు పేలవంగా ఉన్న గ్రాఫిక్స్ మోహనిని మరింత వీక్ చేసి పడేశాయి.

ఉన్నంతలో ఈ సినిమాకు ప్లస్ ఏదైనా ఉందంటే అది సినిమాటోగ్రఫీ, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మాత్రమే. లండన్ లొకేషన్లను సినిమాటోగ్రాఫర్ గురుదేవ్ బాగా చూపించాడు. ఇక సంగీత దర్శకుడు వివేక్ మెర్విన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో ఆకట్టుకున్నాడు. త్రిషను అమితంగా ఇష్టపడేవాళ్లకు మాత్రం మోహిని నచ్చుతుంది.

రేటింగ్2/5