'మిఠాయి' మూవీ రివ్యూ

Friday,February 22,2019 - 02:18 by Z_CLU

నటీనటులు: రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి, కమల్ కామరాజు, భూషణ్ కల్యాణ్, రవివర్మ, అజయ్ ఘోష్, అర్ష, శ్వేతా వర్మ, అదితి మైకెల్, విజయ్ మరార్, గాయత్రి గుప్తా తదితరులు

ఛాయాగ్రహణం: రవివర్మన్ నీలమేఘం

సంగీతం: వివేక్ సాగర్

ఎడిటర్: గ్యారీ బి.హెచ్

సాహిత్యం: కిట్టు విస్సాప్రగడ

మాటలు: ప్రశాంత్ కుమార్, బి. నరేష్

నిర్మాత: డాక్టర్ ప్రభాత్ కుమార్

దర్శకత్వం: ప్రశాంత్ కుమార్

 

తక్కువ టైంలో స్టార్ కమెడియన్ల లిస్టు లో చేరిపోయిన ప్రియదర్శి , రాహుల్ రామకృష్ణ హీరోలుగా ‘మిఠాయి’ అనే సినిమా వచ్చింది. మరి డార్క్ కామెడీ గా తెరకెక్కిన మిఠాయి టేస్ట్ ఎలా ఉంది ..? ప్రియదర్శి -రాహుల్ రామకృష్ణ ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేశారా..? జీ సినిమాలు ఎక్స్ క్లూజీవ్ రివ్యూ.


కథ :

సాయి (రాహుల్ రామకృష్ణ), జానీ (ప్రియదర్శి) బాల్య మిత్రులు. లైఫ్ లో ఎలాంటి గోల్ లేని జానీ సాయితో కలిసి రాత్రుళ్ళు తిరుగుతుంటాడు. మరోవైపు పెళ్లి చేసుకోవటానికి ఏర్పాట్లు చేసుకుంటున్న సాయి ఉన్నపళంగా సాఫ్ట్ వేర్ ఉద్యోగం మానేస్తాడు. అలా ఉద్యోగం మానేసిన సాయి ఇంట్లో అర్థరాత్రి ఓ దొంగతనం జరుగుతుంది. ఇంట్లో ఉన్న టివీ , లాప్ టాప్ తో పాటు తన కాబోయే భార్య కోసం కొన్న నెక్లెస్ కూడా పోతుంది.

అలా వస్తువులు పోగొట్టుకున్న సాయి… జానీతో కలిసి తన మిత్రుడు(రవి వర్మ) పిలిచిన పార్టీకి వెళ్తాడు. ఆ పార్టీలో జరిగిన డిస్కషన్ తర్వాత దొంగని పట్టుకున్నాకే పెళ్లి చేసుకుంటానని ఛాలెంజ్ చేస్తాడు. ఆ ఛాలెంజ్ వల్ల దొంగని పట్టుకొనే పనిలో ఉంటారు సాయి, జానీ. మరి సాయి, జానీ తో కలిసి ఆ దొంగను పట్టుకున్నాడా ? లేదా ? చివరికి సాయి పెళ్లి జరుగుతుందా.. అనేది మిగతా కథ.

 

నటీనటుల పనితీరు:

తక్కువ టైంలోనే స్టార్ కమెడియన్ల లిస్టులో చేరిపోయిన రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి మరోసారి మెప్పించారు. వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ బాగా కుదిరింది. కొన్ని సందర్భాల్లో ఇద్దరి కామెడీ టైమింగ్ ప్రేక్షకులను నవ్వించింది. కమల్ కామరాజు, రవివర్మ ఎప్పటిలాగే తమ క్యారెక్టర్ కి పర్ఫెక్ట్ అనిపించుకున్నారు. భూషణ్ కల్యాణ్, శ్వేతా వర్మ, అదితి మైకెల్ మిగతా నటీనటులంతా వారి క్యారెక్టర్స్ తో పరవాలేదనిపించుకున్నారు.

 

సాంకేతికవర్గం పనితీరు :

రవివర్మన్ నీలమేఘం సినిమాటోగ్రఫీ బాగుంది. కథకు తగ్గట్టుగా నేచురల్ లొకేషన్స్ లో చిత్రీకరించిన విధానం ఆకట్టుకుంటుంది. కొన్ని సందర్భాల్లో వివేక్ సాగర్ అందించిన నేపథ్య సంగీతం బాగున్నా పాటలు మాత్రం అలరించలేకపోయాయి. ఎడిటింగ్ సినిమాకు మైనస్. ఇంకా ట్రిమ్ చేయొచ్చు. ముఖ్యంగా సెకండ్ హాఫ్ లో చాలా సన్నివేశాలు తొలిగించొచ్చు. ప్రశాంత్ కుమార్, నరేష్ రాసుకున్న కామెడీ డైలాగ్స్ పేలలేదు. స్క్రీన్ ప్లే -డైరెక్షన్ మైనస్ అనిపించాయి. ప్రొడక్షన్ వాల్యూస్ సినిమాకు తగ్గట్టుగా ఉన్నాయి.


జీ సినిమాలు సమీక్ష :

డార్క్ కామెడీ సినిమాలు ఇష్టపడే ప్రేక్షకులు అధిక సంఖ్యలో ఉంటారు. కాస్త కామెడీ పండించి కథను ఆసక్తికరంగా చెప్పగలిగితే చాలు, ఈ జోనర్ లో హిట్టు కొట్టడం సులువు. రాహుల్ రామకృష్ణ , ప్రియదర్శి డార్క్ కామెడీ జోనర్ లో సినిమా చేస్తున్నారనగానే ‘మిఠాయి’పై కొన్ని అంచనాలు ఏర్పడ్డాయి. ట్రైలర్ రిలీజ్ నుండి సినిమా రిలీజ్ వరకూ ప్రమోషన్ కూడా బాగానే చేసారు. అయితే ఆ అంచనాలను మాత్రం మిఠాయి అందుకోలేకపోయింది.

ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమైన ప్రశాంత్ కుమార్ చాలా సందర్భాల్లో కొత్తగా ట్రై చేయాలని ప్రయత్నించి తడబడ్డాడు. సినిమా ప్రారంభంలో రాహుల్, ప్రియదర్శి క్యారెక్టర్స్ తో మంచి కామెడీ పండించినా ఆ తర్వాత ఆ కామెడీ ని కంటిన్యూ చేయలేకపోయాడు దర్శకుడు. ముఖ్యంగా సినిమా కోసం ఎంచుకున్న కథ షార్ట్ ఫిలింకి సరిపడే కథలా అనిపించింది. అదే సినిమాకు పెద్ద మైనస్.

షార్ట్ ఫిలిం పాయింట్ తో సినిమా తీయడానికి చాలా కష్టపడ్డాడు ప్రశాంత్ కుమార్. అందువల్లే సినిమా సాగదీసినట్టు అనిపిస్తుంటుంది. ప్రియదర్శి, రాహుల్ కామెడీ టైమింగ్ ను కూడా కొంత వరకే వాడుకున్నాడు దర్శకుడు. ముఖ్యంగా రాహుల్ రామకృష్ణ క్యారెక్టర్ ను ఎమోషనల్ గా చూపించే ప్రయత్నం బెడిసికొట్టింది.

కథలో క్రియేట్ చేసిన క్యారెక్టర్స్ బాగున్నప్పటికీ ఆ క్యారెక్టర్స్ తో ఆసక్తికరమైన స్క్రీన్ ప్లే అల్లడంతో విఫలం అయ్యాడు ప్రశాంత్ కుమార్. ముఖ్యంగా సినిమాను అటు కామెడీగా కాకుండా ఇటు థ్రిల్లర్ గా కాకుండా తెరకెక్కించాడు. కొన్ని సన్నివేశాలు ప్రేక్షకుల ఓపికను పరీక్షించేలా ఉన్నాయి. సెకండ్ హాఫ్ లో కామెడీ పై మరింత ఫోకస్ పెడితే బాగుండేది.

సినిమా ప్రారంభం నుండి చివరి వరకూ జీవితం గురించి ఏదో చెప్పాలని ట్రై చేసిన దర్శకుడు తను అనుకున్న పాయింట్ ను సరిగ్గా చెప్పలేకపోయాడు. కామెడీ ఆశించిన స్థాయిలో లేకపోవడం, నెరేషన్ వీక్ అనిపించడం, స్క్రీన్ ప్లే ఆసక్తికరంగా లేకపోవడం, రెండో భాగం మరీ సాగదీతలా అనిపించడం… ఇవన్నీ కలిసి మిఠాయిని రుచికరమైన సినిమాగా తయారు చేయలేకపోయాయి.

బాటమ్ లైన్ : చేదు ‘మిఠాయి’

రేటింగ్ : 1.5/5