మిస్టర్ KK రివ్యూ

Friday,July 19,2019 - 02:25 by Z_CLU

నటీనటులు: విక్రమ్, అక్షర హాసన్, అబిహాసన్, లీనా, వికాస్, జాస్మిన్ తదితరులు..
బ్యానర్ : పారిజాత మూవీ క్రియేష‌న్స్
నిర్మాత : నరేష్ కుమార్, శ్రీధర్
మ్యూజిక్‌.. జిబ్రాన్‌
సినిమాటోగ్రఫీ: శ్రీనివాస్
ఎడిటింగ్ : ప్రవీణ్
రన్ టైమ్ : 120 నిమిషాలు
రిలీజ్ డేట్ : 19 జులై, 2019

విక్రమ్ సినిమాలు డిఫరెంట్ గా ఉంటాయనే ఇమేజ్ ఉంది. మిస్టర్ KK కూడా అందుకు మినహాయింపు కాదు. ఇది కూడా డిఫరెంట్ గానే ఉంది. కానీ విక్రమ్ ఆశించిన విజయం ఈ సినిమాతో అతడికి దక్కిందా? జీ సినిమాలు ఎక్స్ క్లూజివ్ రివ్యూ

కథ
డాక్టర్ వాసు (అబి హాసన్), అతడు భార్య అదిర (అక్షర హాసన్) మలేషియాలో సెటిల్ అవ్వాలనుకుంటారు. అప్పటికి వాళ్లు మలేషియా వచ్చి 20 రోజులే అవుతుంది. గర్భవతిగా ఉన్న అదిరాను ఇంట్లో ఉంచి వాసు హాస్పిటల్ కు వెళ్తాడు. అప్పుడే యాక్సిడెంట్ కు గురవుతాడు కేకే (విక్రమ్). కెకెను హాస్పిటల్ నుంచి బయటకు తీసుకొచ్చేందుకు, అతడి తమ్ముడు అదిరాను కిడ్నాప్ చేస్తారు. భార్య కోసం కెకెను బయటకు తీసుకొస్తాడు వాసు.

కానీ అనుకోని పరిస్థితుల మధ్య కెకె తమ్ముడ్ని మరో గ్యాంగ్ హతమారుస్తుంది. అదిరాను వాళ్లు కిడ్నాప్ చేస్తారు. ఇంతకీ ఆ గ్యాంగ్ ఎవరు? అదిరాను వాళ్లు ఏం చేశారు? వాసు-అదిరాను ఈ కేసు నుంచి కెకె ఎలా తప్పించాడు అనేది మిగతా స్టోరీ.

నటీనటుల పనితీరు
విక్రమ్ కొత్త గెటప్ తో ఆకట్టుకున్నాడు. ఫిజిక్ పరంగా పెద్దగా మార్పులు చూపించలేదు కానీ, డిఫరెంట్ హెయిల్ స్టయిల్, గడ్డంతో న్యూలుక్ లో కనిపించాడు. సినిమాలో విక్రమ్ చాలా తక్కువ డైలాగ్స్ చెప్పాడు. ఇంకా చెప్పాలంటే అతడు చెప్పిన డైలాగ్స్ ను వేళ్లపై లెక్కించొచ్చు. పూర్తిగా హావభావాలతోనే సినిమాను నడిపించాడు. గర్భవతిగా అక్షర హాసన్ చాలా బరువైన పాత్ర పోషించింది. చిన్న పిల్లలా కనిపించే ఆమె ఫేస్ కు, ప్రెగ్నెంట్ గెటప్ కు అస్సలు సింక్ అవ్వలేదు. కానీ తన యాక్టింగ్ తో క్యారెక్టర్ ను బాగా పండించింది.

విలన్ గా నటించిన వికాస్, పోలీసాఫీసర్ గా నటించిన లీనా బాగా నటించారు. వీళ్లతో పాటు అభిహాసన్, జాస్మిన్, చెర్రీ, రాజేష్ కమార్ తమ పాత్రలకు సరిగ్గా సూట్ అయ్యారు.

టెక్నీషియన్స్ పనితీరు
ముందుగా దర్శకుడు రాజేశ్ సెల్వ గురించి చెప్పుకోవాలి. ఇలాంటి కథలు రాయడంలో ఇతడు ఎక్స్ పర్ట్ అనే విషయం చీకటిరాజ్యం సినిమాతోనే అర్థమైంది. ఈసారి అంతకంటే గ్రిప్పింగ్ గా స్టోరీ, స్క్రీన్ ప్లే రాసుకున్నాడు రాజేష్. సినిమాలో మెయిన్ ఎట్రాక్షన్ ఇతడు రాసిన స్క్రీన్ ప్లే. దీని తర్వాత చెప్పుకోదగ్గది జిబ్రాన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్. పెద్దగా పాటలిచ్చే పనిలేకపోవడంతో పూర్తిగా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ పై దృష్టిపెట్టాడు జిబ్రాన్. అటు స్క్రీన్ ప్లే, ఇటు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ రెండూ బాగా ఎట్రాక్ట్ చేస్తాయి. శ్రీనివాస్ సినిమాటోగ్రఫీ, ప్రవీణ్ ఎడిటింగ్ కూడా బాగున్నాయి.


జీ సినిమాలు సమీక్ష
యాక్షన్ సబ్జెక్టులు అంతా చేస్తారు. కానీ తీసుకున్న సబ్జెక్ట్ ను ఎంత గ్రిప్పింగ్ గా చెప్పాం, కట్టిపడేసేలా స్క్రీన్ ప్లే ఎంత బాగా రాసుకున్నాం అనే విషయాల్ని ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకోవాలి. చాలామంది మేకర్స్ ఈ విషయంలో ఔట్ ఆఫ్ ది బాక్స్ ఆలోచించలేరు. చేసేది యాక్షన్ అయినా అందులో కామెడీ పెట్టాలని , 5 పాటలు మస్ట్ గా ఉండాలని గిరి గీసుకుంటారు. ఇలాంటివేం పట్టించుకోకుండా పక్కాగా కథ, స్క్రీన్ ప్లే నమ్ముకొని తీసిన సినిమా మిస్టర్ KK.

రన్ టైమ్, సాంగ్స్ లాంటి కమిట్ మెంట్స్ పెట్టుకోకుండా పక్కా స్క్రీన్ ప్లే ఆధారంగా తీసిన సినిమా మిస్టర్ KK. అయితే సినిమాకు ఇది ఎంత ప్లస్ అయిందో, సేమ్ టైమ్ అంతే మైనస్ కూడా అయింది. స్క్రీన్ ప్లేపై దృష్టిపెట్టిన దర్శకుడు యాక్షన్ సన్నివేశాల్ని రాసుకోవడంలో ఫెయిల్ అయ్యాడు. ఇలాంటి కథలకు థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఎంత ముఖ్యమో.. యాక్షన్ సన్నివేశాలు కూడా అంతే కీలకం. నిజానికి ఈ జానర్ ను ఇష్టపడే ప్రేక్షకులు థియేటర్లకు వచ్చేది కూడా ఇందుకే. మంచి ఛేజింగ్స్, యాక్షన్ సీన్స్ ఉంటాయనే వస్తారు. కానీ ఈ విషయంలో మిస్టర్ KK నిరాశపరుస్తాడు.

కథను సస్పెన్స్, థ్రిల్ మెయింటైన్ చేస్తూ ముందుకు తీసుకెళ్లిన దర్శకుడు యాక్షన్ సన్నివేశాల్ని రాసుకోవడం మరిచిపోయినట్టున్నాడు. విక్రమ్ లాంటి నటుడ్ని పెట్టుకొని అతడితో యాక్షన్ చేయించకుండా పరుగులు పెట్టించాడు. సినిమాకు అతిపెద్ద మైనస్ పాయింట్ ఇదే.

ఈసారి సినిమాలో అదిరిపోయే యాక్షన్ సీన్ వస్తుందంటూ ప్రేక్షకులు రెండు మూడు సందర్భాల్లో ఫీలైన మూమెంట్స్ ఉన్నాయి. అలాంటి మూమెంట్స్ లో కచ్చితంగా యాక్షన్ సీన్స్ పెట్టాలి. దర్శకుడు ఆ పనిచేయలేదు. యాక్షన్ సన్నివేశాలు పెట్టాల్సిన చోటు హీరో తన తెలివితేటలతో తప్పించుకుంటాడు. ఫలితంగా ఆడియన్స్ డిసప్పాయింట్ అవుతారు. ఇలా 2-3 మంచి సందర్భాల్ని దర్శకుడు మిస్ చేశాడు.

యాక్షన్ సన్నివేశాలు లేని ఈ “యాక్షన్” సినిమాలో విక్రమ్ ఉన్నా ఒకటే, లేకున్నా ఒకటే. పైగా తన లుక్స్ తో కూడా విక్రమ్ నిరాశపరిచాడు. ఇవన్నీ ఒకెత్తయితే… హీరో ఫ్లాష్ బ్యాక్, గతంలో అతడు చేసిన వీరోచిత విన్యాసాలు లాంటివేవీ చూపించకుండా అతడిపై “వీడు విక్రమార్కుడు…” అంటూ మాంటేజ్ సాంగ్ పడుతుంటే నవ్వుకోవాల్సి వస్తుంది. ప్రతి ఫ్రేమ్ లో తప్పించుకోవడానికే ట్రై చేసే హీరో ఎలా విక్రమార్కుడు అవుతాడో మేకర్స్ కే తెలియాలి. అయితే ఈమధ్య కాలంలో ఇంత గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే తో వచ్చిన సినిమా మాత్రం ఇంకోటి లేదు. జస్ట్ 2 గంటల్లో సినిమా ముగుస్తుంది.

ఓవరాల్ గా మిస్టర్ KK సినిమా… యాక్షన్, థ్రిల్లర్, స్టయిలిష్ మేకింగ్ ఇష్టపడేవాళ్లకు కొంచెం నచ్చుతుంది.

రేటింగ్2.5/5