మెర్క్యూరీ మూవీ రివ్యూ

Friday,April 13,2018 - 03:45 by Z_CLU

నటీ నటులు: ప్రభుదేవా, అనీష్ పద్మన్, ఇందుజ, సనంత్ రెడ్డి, దీపక్ పరమేష్, శశాంక్, పురుషోత్తం, గజరాజ్, రెమ్య నంబీశన్ తదితరులు

సినిమాటోగ్రఫీ : తిఱు

మ్యూజిక్ : సంతోష్ నారాయణన్, మిథూన్ శర్మ

నిర్మాణం : స్టోన్ బెంచ్ ప్రై.లి.

రచన- స్క్రీన్ ప్లే -దర్శకత్వం : కార్తీక్ సుబ్బరాజు

రిలీజ్ డేట్ : 13 ఏప్రిల్ 2018

ప్రభుదేవా ప్రధాన పాత్రలో కార్తీక్ సుబ్బరాజు డైరెక్షన్ తెరకెక్కిన సైలెంట్ థ్రిల్లర్ ‘మెర్క్యూరీ’ ఈరోజే థియేటర్స్ లోకి వచ్చింది. గతంలో పిజ్జా సినిమాతో థ్రిల్ చేసిన కార్తీక్ మరి ఈ సినిమాతో ఎలా థ్రిల్ చేసాడో..చూద్దాం.

కథ :

1992లో మెర్క్యూరీ ఫ్యాక్టరీ నుండి వెలువడిన విషపూరితమైన కాలుష్యం వల్ల ఆ ఫ్యాక్టరీ కి దగ్గరలో నివసించే 84 మంది చనిపోతారు. ఆ విషపూరితమైన కాలుష్యం వల్ల చనిపోయిన వారి తదుపరి తరం వినికిడి, అంధలోపంతో పుడతారు. అలా ఆ ఫ్యాక్టరీ వల్ల ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు సంబంధించిన ఒక యువతి నలుగురు యువకులు గతంలో చదువుకున్న స్కూల్ ని సందర్శించడానికి ఆ ప్రదేశానికి వెళతారు. వాళ్లకు మాటలు వినబడవు. మాటలు మాట్లాడలేరు. చెవుడు, మూగ అన్నమాట. ఆ ఐదుగురు అనుకోకుండా ఓ సంఘటన వల్ల మూసేసిన మెర్సురీ ఫ్యాక్టరీలో లాక్ అయిపోతారు. ఆ సంఘటన ఏంటి..?? చివరికి ఆ ఐదుగురు ఆ ఫ్యాక్టరీ నుండి బయటపడ్డారా…. లేదా అనేది మిగతా కథ.

నటీనటుల పనితీరు:

ఇప్పటికే ఎన్నో సినిమాల్లో తన పెర్ఫార్మెన్స్ తో నటుడిగా మంచి మార్కులు అందుకున్న ప్రభుదేవా నెగెటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ లో నటించి నటుడిగా బెస్ట్ అనిపించుకున్నాడు. ముఖ్యంగా ఇలాంటి ఛాలెంజింగ్ రోల్స్ ను అలవోకగా చేయగలనని మరోసారి రుజువు చేసి సినిమాకు మెయిన్ హైలైట్ గా నిలిచాడు. సనంత్ రెడ్డి, అనీష్ పద్మన్, ఇందుజ, దీపక్ పరమేష్, శశాంక్, పురుషోత్తం, గజరాజ్, రెమ్య నంబీశన్ వారి క్యారెక్టర్స్ కి బెస్ట్ అనిపించుకున్నారు. ఇలాంటి సైలెంట్ థ్రిల్లర్ సినిమాల్లో నటించడం కాస్త కష్టం అయినప్పటికీ తమ పెర్ఫార్మెన్స్ తో మెస్మరైజ్ చేయగలిగారు.

టెక్నిషియన్స్ పనితీరు :

టెక్నికల్ గా ప్రతీ ఒక్కరూ వారి పరిధిలో బెస్ట్ అనిపించుకున్నారు. ముఖ్యంగా తిరు సినిమాటోగ్రఫీ సినిమాకు మేజర్ హైలైట్ గా నిలిచింది. సంతోష్ నారాయణ్ బాగ్రౌండ్ స్కోర్ పరవాలేదు. నిజానికి ఇలాంటి థ్రిల్లర్ సినిమాలకు పర్ఫెక్ట్ ఎడిటింగ్ అనేది చాలా ముఖ్యం. కథను సాగదీయడం వల్ల థ్రిల్ మిస్ అయి బోర్ కొట్టే ప్రమాదం ఉంది. వివేక్ హర్షన్ ఎడిటింగ్ పర్ఫెక్ట్ గా ఉంది. సౌండ్ డిజైనింగ్, ఆర్ట్ వర్క్ బాగుంది. కార్తీక్ సుబ్బరాజు ఎంచుకున్న రివేంజ్ స్టోరీ రొటీన్ అనిపించినా తన స్క్రీన్ ప్లే తో మేజిక్ చేశాడు. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి.


జీ సినిమాలు సమీక్ష :

కోలీవుడ్ లో కొందరు దర్శకులు అప్పుడప్పుడూ తెలుగులోనూ సందడి చేస్తూ వారి సినిమాలతో తెలుగు ప్రేక్షకులను కూడా ఎంటర్ టైన్ చేస్తుంటారు. వాళ్ళల్లో కార్తీక్ సుబ్బరాజు కూడా ఒకడు. చేసింది తక్కువ సినిమాలే అయినా తెలుగులో ‘పిజ్జా’ దర్శకుడిగా మంచి గుర్తింపు అందుకున్నాడు ఈ డైరక్టర్.

తనకి కలిసొచ్చిన థ్రిల్లర్ కథతో దానికి సైలెన్స్ అనే మరో ఎట్రాక్టివ్ ఎలిమెంట్ ను జోడించి మెర్క్యూరీ అనే నాన్-లాంగ్వేజ్ థ్రిల్లర్ సినిమాను తెరకెక్కించిన కార్తీక్ రిలీజ్ కి ముందే ట్రైలర్ తో సినిమాపై బజ్ నెలకొనేలా చేసాడు. ఇక సైలెంట్ థ్రిల్లర్స్ కి తమ హావభావాలతో ఆకట్టుకోగలిగిన నటీనటులను ఎంచుకోవడమే మొదటి విజయం. అలా క్యారెక్టర్స్ కి పర్ఫెక్ట్ అనిపించి తమ నటనతో ఆకట్టుకోగలిగే నటీ నటులను ఎంచుకొని దర్శకుడిగా సక్సెస్ అయ్యాడు. తనకు అనుభవం ఉన్న జోనర్ కావడంతో తన స్క్రీన్ ప్లే తో ఆడియన్స్ ను ఎంగేజ్ చేయగలిగాడు. ముఖ్యంగా ప్రభు దేవా క్యారెక్టర్ పెర్ఫార్మెన్స్ ఈ సినిమాను నిలబెట్టాయి. భాషతో పనిలేని మూకీ సినిమా కావడంతో అందరికీ కనెక్ట్ అయ్యే సినిమా ఇది. కార్పొరేట్ ఫ్యాక్టరీలు భూమిని, వాతావరణాన్ని ఎలా కలుషితం చేస్తాయో.. వాటి వలన అక్కడ జీవించే మనుషుల జీవితాలు ఎలా నాశనం అవుతాయో దర్శకుడు చక్కగా చూపించాడు. క్లైమాక్స్ లో ఎమోషనల్ సీన్స్ ను కూడా సైలెంట్ మోడ్ తో కనెక్ట్ చేయగలిగాడు.

భారతీయ సినిమా చరిత్రలో దాదాపు ౩౦ ఏళ్ల తర్వాత వచ్చిన మూకీ సినిమా ఇది. మళ్ళీ ఇన్నేళ్ళ తర్వాత ఓ సోషల్ మెసేజ్ తో ఇలాంటి ఓ ప్రయోగాత్మక సినిమా చేసినందుకు దర్శకుడు కార్తీక్ సుబ్బరాజు ని అభినందించాలి. కాకపోతే ఈ జోనర్ లో గతంలో వచ్చిన సినిమాలు చూసిన వారికి మాత్రం ఈ సినిమా అంతగా నచ్చకపోవచ్చు.

ప్రభుదేవా పెర్ఫార్మెన్స్, థ్రిల్ కలిగించే కొన్ని సన్నివేశాలు, స్క్రీన్ ప్లే, ప్రీ క్లైమాక్స్ సన్నివేశాలు సినిమాకు హైలైట్ గా నిలిచాయి. అయితే  కొన్ని సన్నివేశాలు గతంలో  సినిమాలను గుర్తుచేయడం, ఊహించగలిగే సన్నివేశాలు, అసలు కథ తెలిసిపోయాక మిగతా కథపై ఆసక్తి కలగకపోవడం లాంటివి సినిమాకు మైనస్.

రేటింగ్ : 2 .75 / 5