'మెహబూబా' మూవీ రివ్యూ

Friday,May 11,2018 - 01:41 by Z_CLU

నటీనటులు : ఆకాశ్, నేహా శెట్టి, విషు రెడ్డి, మురళి శర్మ, అశ్వని, జ్యోతి రానా, టార్జాన్‌, షేక్‌ జునైద్‌, షాయాజీ షిండే

మ్యూజిక్ : సందీప్ చౌతా

ఎడిటింగ్ : జునైద్

సినిమాటోగ్రఫీ : విష్ణు శర్మ

ఎడిటింగ్ : జునైద్ సిద్ధిఖి

నిర్మాణం : పూరి టూరింగ్ టాకీస్

కథ- స్క్రీన్ ప్లే-మాటలు-దర్శకత్వం-నిర్మాత : పూరి జగన్నాథ్

రిలీజ్ డేట్ : 11 మే 2018

సెన్సార్ : U/A

 

పూరి సినిమాలు చూస్తే కథలన్నీ ఒకేలా ఉంటాయి. క్యారెక్టరైజేషన్ పైనే ఎక్కువ ఫోకస్ ఉంటుంది. కానీ చాన్నాళ్లతర్వాత కథపై ఫోకస్ పెట్టాడు ఈ డైరక్టర్. విజువల్స్ పై ఎక్కువ కేర్ తీసుకున్నాడు. కొడుకును హీరోగా పెట్టి ‘మెహబూబా’ తీశాడు. మరి పూరి ప్రయత్నం ఫలించిందా..? జీ సినిమాలు ఎక్స్ క్లూజివ్ రివ్యూ.

కథ :

హీరోహీరోయిన్లుకు చిన్నప్పట్నుంచి తమ పునర్జన్మ గుర్తొస్తూ ఉంటుంది. తను ఎవరికో మాటిచ్చానని తల్లితో చెబుతూ ఉంటాడు రోషన్ (ఆకాష్ పూరి). హిమాలయాలకు తనకు ఎదో కనెక్షన్ ఉన్నట్టు, ఆల్రెడీ ఎవరితోనో ప్రేమలో ఉన్నట్టు ఫీల్ అవుతుంటాడు. పాకిస్థాన్ లో ఉన్న అఫ్రిన్ (నేహా షెట్టి)ది కూడా సేమ్ ఫీలింగ్. ఇండియాను తన సొంతిల్లుగా ఫీల్ అవుతుంటుంది. గత జన్మలో జరిగిన ఘటనలు గుర్తొస్తుంటాయి. చదువుకోవడానికి పాకిస్థాన్ నుంచి హైదరాబాద్ వచ్చిన అఫ్రిన్.. ఓ సందర్భంలో రోషన్ ను కలుస్తుంది. గత జన్మ ఎఫెక్ట్ కారణంగా ఇద్దరూ తొలిచూపులోనే దగ్గరైపోతారు. కానీ ఆ వెంటనే విడిపోతారు.కట్ చేస్తే.. ట్రెక్కింగ్ కోసం హిమాలయాలకు వెళ్తాడు రోషన్. అక్కడ జరిగిన చిన్న యాక్సిడెంట్ లో 40 ఏళ్ల కిందటచనిపోయిన తన ప్రేయసి డెడ్ బాడీ చూస్తాడు. మంచు కారణంగా ఆమె శరీరం పాడవ్వకుండా అలానే ఉంటుంది.అక్కడే ఉన్న డైరీ చదివిన తర్వాత పూర్తిగా తన గత జన్మ తెలుసుకుంటాడు. ఇండో-పాక్ యుద్ధం నేపథ్యంలో జరిగిన ఆ ఫ్లాష్ బ్యాక్ లో తన ప్రేయసిని పోగొట్టుకున్న విషయం గ్రహిస్తాడు. మీడియా ద్వారా ఈ విషయం అఫ్రిన్ కు కూడా తెలుస్తుంది. తను మళ్లీ పుట్టానని, రోషన్ కోసమే ఉన్నానని గ్రహిస్తుంది. పాకిస్థాన్ లో ఉన్న అఫ్రిన్ ను రోషన్ ఎలా కలుసుకున్నాడు.. ఆమెను ఇండియాకు ఎలా తీసుకొచ్చాడనేది బ్యాలెన్స్ కథ.

 

నటీనటుల పనితీరు

కొడుకును ఫుల్ లెంగ్త్ హీరోగా ప్రజెంట్ చేయాలనే పూరి జగన్నాధ్ కల, మెహబూబాతో నెరవేరింది. ఆకాష్ పూరి యాక్టింగ్ బాగుంది. యాక్షన్, డైలాగ్ డెలివరీ అన్నీ కుదిరాయి. కానీ ఈ కథకు ఆకాష్ కాకుండా స్టార్ డమ్ ఉన్న హీరో అయితే బాగుండేది. హీరోయిన్ నేహా షెట్టి బాగా చేసింది. యాక్టింగ్ లో ఆమెకు మంచి మార్కులు పడతాయి. అక్కడక్కడ లుక్స్ పరంగా కూడా బాగుంది. వీళ్లిద్దరు మినహా సినిమాలో ఎవరికీ నటించడానికి పెద్దగా ఛాన్స్ ఇవ్వలేదు పూరి జగన్నాథ్.

 

టెక్నీషియన్స్ పనితీరు :

ఈ సినిమాకు అదిరిపోయే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇచ్చాడు సందీప్ చౌతా. రెండు హిట్ సాంగ్స్ కూడా అందించాడు. విష్ణు శర్మ సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. జునైద్ ఎడిటింగ్ బాగుంది కానీ, స్క్రీన్ ప్లే లో జర్క్ ల వల్ల కొన్ని చోట్ల సింక్ మిస్ అయింది. ఆద్విత క్రియేటివ్ స్టుడియోస్ అందించిన గ్రాఫిక్స్ మెప్పిస్తాయి. పూరి టూరింగ్ టాకీస్ ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. ఖర్చుకు వెనకాడకుండా సినిమా తీసారు.

జీ సినిమాలు ఎక్స్ క్లూజివ్ రివ్యూ :

పునర్జన్మల కాన్సెప్ట్ తో ఇప్పటికే మనం కొన్ని సినిమాలు చూశాం. అలాంటి పునర్జన్మ కాన్సెప్ట్ కు పూరి మార్క్ యాడ్చేస్తే ఎలా ఉంటుంది..? అదే మెహబూబా సినిమా. గత జన్మలో మిస్ అయిన హీరోయిన్ కోసం ఈ జన్మలో హీరో ఏకంగా పాకిస్థాన్ కు వెళ్తాడు. అక్కడ జనాలతో ఫైట్ చేసి హీరోయిన్ ను ఇండియాకు తీసుకొచ్చేస్తాడు. ఈ మొత్తం ఎపిసోడ్ లో పూరి జగన్నాధ్ అక్కడక్కడ తడబడ్డాడు. కథ-స్క్రీన్ ప్లే-మాటలు-దర్శకత్వం-నిర్మాత… చూశారుగా ఇన్ని బాధ్యతలు తలకెత్తుకున్నాడు పూరి. సినిమా కోసం పూరి పోషించిన ఈ రోల్స్ అన్నీ మెహబూబాలో సగం సగమే కనిపిస్తాయి. దర్శకుడిగా పూరి మెరుపులు ఇందులో లేవు. అతడి మార్క్ పంచ్ లు కూడా ఒకట్రెండు మినహా కనిపించవు. ఇక స్క్రీన్ ప్లే విషయానికొస్తే ఫ్లాష్ బ్యాక్ స్టార్ట్ అయిన వెంటనే పూరి ఫెయిల్యూర్ బయటపడింది.

అలా అని సినిమాలో హై-పాయింట్స్ లేవని చెప్పలేం. ఫ్లాష్ బ్యాక్ ను రివీల్ చేయడం, జిందాబాద్ డైలాగ్ చెప్పించడం, హీరోయిన్ కోసం హీరో సెర్చింగ్ లాంటి ఎపిసోడ్స్ లో పూరి మార్క్ కనిపిస్తుంది. కానీ అక్కడక్కడ మెరిసిన సన్నివేశాల కంటే బోర్ కొట్టించే సీన్లే మెహబూబాలో ఎక్కువ. ఓవరాల్ గా మెహబూబా సినిమాతో తనయుడు ఆకాష్ ను కొత్తగా చూపించడమే కాకుండా.. తనను తాను కొత్తగా ప్రజెంట్ చేసుకున్నాడు పూరి జగన్నాధ్. కాకపోతే కంటెంట్ పుష్కలంగా ఉన్న ఈ కథను సరైన క్రమంలో చూపించడంలో విఫలమయ్యాడు . ఇంకా చెప్పాలంటే ఇంత కంటెంట్ ఉన్న కథను పూరి ఈమధ్య కాలంలో హ్యాండిల్ చేయలేదు కూడా. అందుకే తనకెంతో ఇష్టమైన అలీతో కామెడీ ట్రాక్ ను, ఐటెంసాంగ్ ను ఇందులో పెట్టలేకపోయాడు.

ఈ సినిమా ఫస్టాఫ్ పరవాలేదనిపిస్తుంది. సెకెండాఫ్ నుంచి సినిమా ఊపందుకుంటుంది… కానీ క్లయిమాక్స్ లో మళ్లీ ఆ ఊపు కనిపించకపోవడం మైనస్ .

ప్లస్ పాయింట్స్

– కథ

– హీరోహీరోయిన్ల పెర్ఫార్మెన్స్

– బ్యాక్ గ్రౌండ్ స్కోర్, సాంగ్స్

– అక్కడక్కడ పూరి మార్క్ పంచ్ లు

 

మైనస్ పాయింట్స్

– స్క్రీన్ ప్లే లో లోపాలు

– పూరి జగన్నాథ్ స్టైల్ మిస్ అవ్వడం

– క్లయిమాక్స్ ఆశించిన స్థాయిలో లేకపోవడం

 

బాటమ్ లైన్ – మధ్య మధ్యలో మెరిసిన మెహబూబా

రేటింగ్ : 2.5 /5