మీకు మాత్రమే చెప్తా మూవీ రివ్యూ

Friday,November 01,2019 - 02:17 by Z_CLU

నటీనటులు: తరుణ్ భాస్కర్, అనసూయ భరద్వాజ్, అభినవ్ గోమటం, పావని గంగిరెడ్డి, నవీన్ జార్జ్ థామస్, వాణి భోజన్, అవంతిక మిశ్రా, వినయ్ వర్మ తదితరులు
సినిమాటోగ్రఫీ : మదన్ గుణదేవా,
సంగీతం : శివకుమార్,
ఆర్ట్ డైరెక్టర్ : రాజ్ కుమార్,
ఎక్సిక్యూటివ్ ప్రొడ్యూసర్ : అనురాగ్ పర్వతినేని,
నిర్మాతలు : విజయ్ దేవరకొండ, వర్ధన్ దేవరకొండ.
రచన- దర్శకత్వం : షమ్మీర్ సుల్తాన్
సెన్సార్: U/A
రన్ టైమ్: 120 నిమిషాలు
రిలీజ్ డేట్: నవంబర్ 1, 2019


కథ

రాకేష్ (తరుణ్ భాస్కర్) ఓ టీవీ ఛానెల్ లో పనిచేస్తుంటాడు. కష్టపడి డాక్టర్ స్టెఫీ (పావని)ను ప్రేమించి ఒప్పిస్తాడు. తర్వాత ఆమె కుటుంబ సభ్యుల్ని కూడా పెళ్లికి ఒప్పిస్తాడు. అంతా బాగానే ఉంటుంది కానీ స్టెఫీ మాత్రం చాలా స్ట్రిక్ట్. అబద్ధాలు ఆడితే అస్సలు సహించలేదు. అలాంటి అమ్మాయి దగ్గర చాలా విషయాలు దాస్తుంటాడు రాకేష్. సిగరెట్ తాగనని, మందు కొట్టనని చెప్పి మేనేజ్ చేస్తుంటాడు.

అయితే ఊహించని విధంగా రాకేష్ కు చెందిన ఓ ప్రైవేట్ వీడియో లీక్ అవుతుంది. అది తన కాబోయే భార్య చూస్తే లేనిపోని గొడవలు అవుతాయని భావించిన రాకేష్, దాన్ని డీలీట్ చేయించడం కోసం తెగ కష్టపడుతుంటాడు. ఇంతకీ తన ప్రైవేట్ వీడియోను డిలీట్ చేయడంలో రాకేష్ సక్సెస్ అయ్యాడా లేదా? స్టెఫీ ఆ వీడియో చూసిందా లేదా? ఇంతకీ ఆ వీడియోలో నటించింది ఎవరు? అనేది సినిమా స్టోరీ.

నటీనటుల పనితీరు

దర్శకుడి నుంచి హీరోగా మారిన తరుణ్ భాస్కర్ ఎక్కడా కొత్త నటుడు అనిపించడు. అంత సహజంగా నటించాడు. మరీ ముఖ్యంగా అబద్ధాలు చెప్పినప్పుడు, తనకు సంబంధించిన పర్సనల్ వీడియో బయటపడినప్పుడు అతడిచ్చిన ఎక్స్ ప్రెషన్స్ చాలా బాగున్నాయి. ఇకపై డైరక్షన్ తో పాటు.. నటుడిగా కూడా తరుణ్ ట్రై చేయొచ్చు. అతడిలో ఆ టాలెంట్ ఉంది.

హీరో ఫ్రెండ్ గా, క్లైమాక్స్ ట్విస్టర్ గా అభినవ్ గోమటం తన క్యారెక్టర్ కు హండ్రెడ్ పర్సెంట్ న్యాయం చేశాడు. సినిమాలో కామెడీ పార్ట్ మొత్తం ఇతడిదే. సినిమాలో తరుణ్ కు ఎంత స్క్రీన్ స్పేస్ ఉందో, అంతకంటే ఎక్కువే అభినవ్ కు కూడా ఉంది. ఇక హీరోయిన్లు పావని, వాణి తమ పాత్రలకు న్యాయం చేశారు. కీలక పాత్రల్లో నటించిన అనసూయ, అవంతిక మిశ్రా కూడా కూడా మెప్పించారు.

టెక్నీషియన్స్ పనితీరు

టెక్నికల్ గా సినిమాలో చెప్పుకోదగ్గ మెరుపుల్లేవు. కంటెంట్, బడ్జెట్ కు తగ్గట్టే అవుట్ పుట్ ఉంది. ఉన్నంతలో శివకుమార్ నేపథ్య సంగీతం అక్కడక్కడ మెరుస్తుంది. మదన్ సినిమాటోగ్రఫీ ఓకే. సన్నివేశాల పరంగా స్లోగా నడిచే ఈ కథను ఫాస్ట్ గా చూపించడంలో సక్సెస్ అయిన ఎడిటర్ ను మాత్రం మెచ్చుకోవాలి. ఆర్ట్ వర్క్ అంతంతమాత్రం.
ఇక దర్శకుడు షమ్మీర్ సుల్తాన్ విషయానికొస్తే అతడు మంచి పాయింట్ రాసుకున్నాడు. టెక్నాలజీని దుర్వినియోగం చేస్తే ఏం జరుగుతుంది, ఇలాంటి ఓ సంఘటన నిజంగా జరిగితే ఆ వ్యక్తి పరిస్థితేంటి లాంటి ఎలిమెంట్స్ ను ఫన్నీగా రాసుకున్నాడు.

దర్శకుడిగా నటీనటుల నుంచి మంచి ఔట్ పుట్ తీసుకున్న షమ్మీర్ కు, రచయితగా మాత్రం పాస్ మార్కులే పడతాయి. ఇక నిర్మాత విజయ్ దేవకొండ గురించి ఇక్కడ ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఈ సినిమా నిర్మించడం కోసం కింగ్ ఆఫ్ ది హిల్ ప్రొడక్షన్ అంటూ ఓ బ్యానర్ పెట్టి, ప్రొడ్యూసర్ గా మారిన విజయ్ దేవరకొండ కథకు తగ్గట్టు బడ్జెట్ అందించాడు. కానీ ఇంకాస్త ఎక్కువ బడ్జెట్ పెట్టి ఉంటే బాగుండేది.

జీ సినిమాలు రివ్యూ

వెబ్ కంటెంట్ కు సినిమా కంటెంట్ కు చాలా తేడా ఉంది. ఈ చిన్న విషయాన్ని ఈమధ్య చాలామంది మరిచిపోతున్నారు. వెబ్ కు పనికొచ్చే కంటెంట్ ను సినిమాగా తీస్తున్నారు. ఓ 4-5 భాగాల్లో రావాల్సిన వెబ్ సిరీస్ కాస్తా సినిమాగా వస్తే ఎలా ఉంటుందో మీకు మాత్రమే చెప్తా సినిమా అలా ఉంది. కేవలం కంటెంట్ పరంగానే కాదు.. మేకింగ్, టెక్నికల్ గా కూడా ఈ సినిమా అదే స్టాండర్డ్ మెయింటైన్ చేస్తుంది.

దర్శకుడు షమ్మీర్ సుల్తాన్ ఎంచుకున్న పాయింట్ బాగుంది. ఇప్పటి జనరేషన్ కు కనెక్ట్ అయ్యేలా పెర్ ఫెక్ట్ గా ఉంది. కానీ అదే పాయింట్ ను 2 గంటల సినిమాగా మార్చడంలో షమ్మీర్ ఇబ్బంది పడ్డాడు. తడబడ్డాడు అనే కంటే ఫెయల్ అయ్యాడని చెప్పడం కరెక్ట్ ఇక్కడ. షమ్మీర్ రాసుకున్న సన్నివేశాలే అలా ఉన్నాయా లేక నిర్మాత విజయ్ దేవరకొండ పెట్టిన ఖర్చుకు తగ్గట్టు సినిమా ఇలా వచ్చిందా అనేది అంతులేని ప్రశ్న.

అన్నట్టు విజయ్ దేవరకొండ అంటే గుర్తొచ్చింది.. ఈ సినిమా కోసం తన సంపాదనంలో 70శాతం ఖర్చు పెట్టానని ప్రకటించుకున్నాడు దేవరకొండ. అంటే అతడి సంపాదన కేవలం 2 కోట్ల రూపాయలకు అటుఇటు మాత్రమే అని అనుకోవాలేమో. అవును.. ఈ సినిమా ప్రొడక్షన్ వాల్యూస్ మరీ తీసికట్టుగా ఉన్నాయి. నిజానికి షమ్మీర్ రాసుకున్న లైన్
కు, అల్లుకున్న సన్నివేశాలకు పెద్దగా ఖర్చు అక్కర్లేదు. కనీసం పెళ్లి సీన్లు తీసినప్పుడైనా కాస్త రిచ్ లుక్ చూపించి ఉంటే బాగుండేది. కంటెంట్ కు తగ్గట్టే పెట్టామని నిర్మాతలు సమర్థించుకోవచ్చు కానీ ఇంకాస్త పెడితే మరింత బెటర్ అవుట్ పుట్ వచ్చేది. ఫ్రేమ్స్ మరింత రిచ్ గా కనిపించేవి.

తక్కువ రన్ టైమ్ లోనే సినిమా ముగించడం ఈ సినిమాకు అతిపెద్ద ప్లస్ పాయింట్ కాగా.. హీరోగా మారిన దర్శకుడు తరుణ్ భాస్కర్ నటన మరో పెద్ద ఎస్సెట్. తరుణ్ భాస్కర్ ఈ సినిమాను ఒంటిచేత్తో నడిపించాడు. అతడు డైలాగ్స్ చెప్పిన విధానం, టెన్షన్ పడడం అంతా బాగుంది. కానీ ఆ టెన్షన్ ను ప్రేక్షకుడు కూడా ఫీల్ అయ్యేలా చేయలేకపోయాడు దర్శకుడు.

ప్రతి ఫ్రేమ్ లో కామెడీ కోసం పాకులాడడంతో వచ్చిన ఇబ్బంది ఇది. ఆ ప్రయత్నమైతే గట్టిగానే జరిగింది కానీ రిజల్ట్ మాత్రం అక్కడక్కడ మాత్రమే కనిపిస్తుంది. కామెడీ పార్ట్ ఏమైనా క్లిక్ అయిందంటే ఆ క్రెడిట్ మొత్తాన్ని అభినవ్ గోమటంకు ఇచ్చేయాలి. ఇక క్లైమాక్స్ లో డైరక్టర్ ఇచ్చిన ట్విస్ట్ కూడా చెప్పుకోదగ్గ విధంగా ఉంది. క్లైమాక్స్ ట్విస్ట్, అరడజను కామెడీ పంచ్ లు మాత్రమే ఆకట్టుకుంటాయి.

ఓవరాల్ గా మీకు మాత్రమే చెప్తానంటూ విజయ్ దేవరకొండ తీసిన ఈ సినిమా గురించి ఇంతకంటే చెప్పుకోవడానికేం లేదు. యూత్ కు ఏ రేంజ్ లో కనెక్ట్ అవుతుందనే అంశంపైనే ఈ సినిమా రిజల్ట్ ఆధారపడి ఉంటుంది.

రేటింగ్2.5/5