మేడ మీద అబ్బాయ్ రివ్యూ

Friday,September 08,2017 - 04:49 by Z_CLU

నటీనటులు : అల్లరి నరేష్, నిఖిల విమల్, అవసరాల శ్రీనివాస్, హైపర్ ఆది, తులసి, సత్యం రాజేష్ తదితరులు

సినిమాటోగ్రఫీ: ఉన్ని ఎస్. కుమార్

సంగీతం: షాన్ రెహమాన్

ఎగ్జిక్యూటివ్ నిర్మాత: ఎం.ఎస్.కుమార్,

సమర్పణ:  శ్రీమతి నీలిమ

నిర్మాత: బొప్పన చంద్రశేఖర్,

స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: జి.ప్రజిత్

విడుదల తేదీ : సెప్టెంబర్ 8, 2017

“ఈ సినిమాతో నా ట్రాక్ మార్చాను. సినిమా చూసిన తర్వాత కొత్త కథలతో దర్శకులు నన్ను సంప్రదిస్తారు. ఓ కొత్త జానర్ లో ప్రయత్నించిన సినిమా ఇది.” మేడమీద అబ్బాయ్ ప్రీ-రిలీజ్ ఫంక్షన్ లో అల్లరినరేష్ స్టేట్ మెంట్ ఇది. అది నిజమే. మేడ మీద అబ్బాయ్ సినిమాతో ఓ కొత్త ప్రయత్నం చేశాడు అల్లరినరేష్. మరి ఆ ప్రయత్నం ఏ మేరకు ఫలించింది. లెట్స్ సీ..

కథ

బీటెక్ ఫెయిల్ అయిన హీరో, సినిమాలపై ఆసక్తితో ఏకంగా డైరక్టర్ అయిపోదాం అనుకుంటాడు. అంతకంటే ముందు తన మిత్ర బృందంతో కలిసి ఓ షార్ట్ ఫిలిం కూడా తీస్తాడు.  కానీ అనుకోని కారణాల వల్ల ఆ షార్ట్ ఫిలిం గల్లంతు కావడంతో ఈసారి ఏకంగా సినిమా అవకాశాల కోసం హైదరాబాద్ చేరుకుంటాడు. అదే సమయంలో అతడితో పాటు ట్రైన్ లో ప్రయాణించిన హీరోయిన్ మిస్ అవుతుంది. హీరోయిన్ తో పాటు దిగిన సెల్ఫీ చూసి అంతా అల్లరినరేష్ నే అనుమానిస్తారు. ఇంతకీ ఆ హీరోయిన్ ఏమైంది.. హీరో, హీరోయిన్ ను కనుక్కున్నాడా… క్లైమాక్స్ లో హీరోహీరోయిన్లు ఏమౌతారు.. అనేది ఈ సినిమా స్టోరీ.

నటీనటుల పనితీరు

అల్లరి నరేష్ నిజంగానే ఓ కొత్త ప్రయత్నం చేశాడు. సినిమాలో తన మార్క్ కామెడీని పక్కనపెట్టి కథలో లీనమైపోయాడు. అల్లరిన నరేష్ పంచ్ లు కోరుకునేవారికి ఈ సినిమాలో ఆ లోటును హైపర్ ఆది భర్తీ చేశాడు. ఈ సినిమా అతడికి నిజంగా చాలా పెద్ద ప్లస్ అవుతుంది. కెరీర్ స్టార్టింగ్ లోనే ఇంత ఫుల్ లెంగ్త్ రోల్ దక్కినందుకు హైపర్ ఆది నిజంగా అదృష్టవంతుడు. తన కామెడీ టైమింగ్ కు కాస్త యాక్టింగ్ ను కూడా డెవలప్ చేసుకుంటే హైపర్ ఆదికి మంచి ఫ్యూచర్ ఉంటుంది.

ఈ సినిమాతో టాలీవుడ్ కు పరిచయమైన నిఖిలా విమల్ చక్కగా నటించింది. అవసరాల శ్రీనివాస్, జయప్రకాష్, తులసి, సత్యం రాజేష్ తమ పాత్రల మేరకు నటించారు.

టెక్నీషియన్స్ పనితీరు

టెక్నీషియన్లలో ముందుగా చెప్పుకోవాల్సింది దర్శకుడు ప్రజీత్ గురించే. ఈ సినిమా ఒరిజినల్ మలయాళం వెర్షన్ కు ఇతడే దర్శకుడు. తెలుగులో ప్రజిత్ కు ఇదే తొలి సినిమా. మంచి కథకు, చక్కటి స్క్రీన్ ప్లే రాసుకున్నాడు ప్రజిత్. కానీ సన్నివేశాల్ని మరింత బలంగా రాసుకుంటే బాగుండేది. మరీ ముఖ్యంగా తెలుగు నేటివిటీ కోసం ప్రజిత్ చేసిన ప్రయత్నాలేవీ పెద్దగా వర్కవుట్  కాలేదు.

మ్యూజిక్ డైరక్టర్ షాన్ రెహ్మాన్ కూడా పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. మొదటి, చివరి పాటలు మినహాయిస్తే షాన్ వర్క్ లో చెప్పుకోదగ్గ మెరుపుల్లేవు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అస్సలు బాగాలేదు. మూవీ ఎడిటింగ్ కూడా యావరేజ్ గా ఉంది. సెకెండాఫ్ లో చాలా ట్రిమ్ చేయొచ్చు. మరీ ముఖ్యంగా అవసరాల శ్రీనివాస్ పాత్రను అంత అనుమానాస్పదంగా చూపించాల్సిన అవసరం లేదు. ఈ విషయంలో దర్శకుడు, ఎడిటర్ ముందే చర్చించుకుంటే బాగుండేది. ఉన్ని ఎస్.కుమార్ సినిమాటోగ్రఫీ బాగుంది.

జీ సినిమాలు రివ్యూ

ముక్కుమొహం తెలియని వ్యక్తులతో ఫేస్ బుక్ పరిచయాలు అమ్మాయిల్ని ఎలా మోసం చేస్తున్నాయో నిత్యం చూస్తూనే ఉన్నాం. అలా మోసపోవద్దంటూ చెప్పే మంచి ప్రయత్నమే ఈ ‘మేడ మీద అబ్బాయ్’ సినిమా. మలయాళంలో హిట్ అయిన ఓరు ఒడక్కన్ సెల్ఫీ అనే సినిమాకు రీమేక్ గా దీన్ని తీశారు. కానీ యాజ్ ఇటీజ్ గా దాన్నే తీసి ఉంటే బాగుండేదేమో. తెలుగు కమర్షియల్ టచ్ ఇచ్చే ప్రయత్నం చేశారు. మరీ ముఖ్యంగా హైపర్ ఆదితో పంచ్ ల వర్షం కురిపించారు. అందులో సగం పంచ్ లు పేలలేదు. కథ, కథనం, పంచ్ లు అన్నీ బాగున్నప్పటికీ దాన్ని తెరపై ఇంట్రెస్టింగ్ గా చూపించలేకపోయాడు మేడ మీద అబ్బాయ్.

ఇంతకుముందే మనం చెప్పుకున్నట్టు అల్లరినరేష్ ఈ సినిమాలో కొత్తగా చేశాడు. ఎక్కడా కామెడీ చేయలేదు. ఈసారి ఆ బాధ్యత మొత్తాన్ని హైపర్ ఆదికి అప్పగించాడు. కాకపోతే పంచ్ ల్ని అలానే ఉంచి ఆది స్థానంలో వెన్నెల కిషోర్ లేదా శ్రీనివాసరెడ్డి లాంటి స్టార్ కమెడియన్ ను పెట్టుకుంటే మేడ మీద అబ్బాయ్ రిజల్ట్ మరోలా ఉండేది.

అక్కడక్కడ పేలే హైపర్ ఆది పంచ్ లు, 2 పాటలు, ఇంటర్వెల్ బ్యాంగ్, క్లైమాక్స్ మాత్రం సినిమాకు ప్లస్ పాయింట్స్. పేలవంగా అనిపించే సన్నివేశాలు, కథను రకరకాలుగా తిప్పేసే స్క్రీన్ ప్లే, బ్యాక్ గ్రౌండ్ స్కోర్, డైరక్షన్ మైనస్ పాయింట్స్.

ఫైనల్ గా.. ఓ కొత్త కథను చూడాలనుకునేవారికి, హైపర్ ఆది పంచ్ లు కోరుకునే వారికి ‘మేడమీద అబ్బాయ్’ నచ్చుతాడు.

రేటింగ్2.5/5