'మాస్టర్' మూవీ రివ్యూ

Wednesday,January 13,2021 - 03:25 by Z_CLU

నటీనటులు: విజయ్‌, విజయ్‌ సేతుపతి, మాళవికా మోహనన్‌, ఆండ్రియా, సంతాను భాగ్యరాజ్‌, అర్జున్‌ దాస్‌ తదితరులు

కెమెరా : సత్యం సూర్యన్

సంగీతం : అనిరుద్ రవిచందర్

నిర్మాత : గ్జేవియర్‌ బ్రిట్టో

రచన -దర్శకత్వం : లోకేశ్‌ కనకరాజ్

రిలీజ్ : ‘ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్’ మహేష్ కోనేరు

నిడివి : 179 నిమిషాలు

విడుదల తేది : 13 జనవరి 2021

ఈ సంక్రాంతికి ‘మాస్టర్’ సినిమాతో ప్రేక్షకులను పలకరించడానికి థియేటర్స్ లోకి ఎంట్రీ ఇచ్చాడు విజయ్. లోకేష్ కనగరాజ్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా భారీ అంచనాల నడుమ ఈరోజే రిలీజైంది. మరి విజయ్-లోకేష్ కాంబోలో వచ్చిన ఈ సినిమా ఆ అంచనాలను అందుకొని అలరించిందా ? జీ సినిమాలు ఎక్స్ క్లూజీవ్ రివ్యూ.

vijay-master-movie-review-telugu
కథ :

ఓ కాలేజీలో ప్రొఫెసర్ గా పనిచేసే జేడీ(విజయ్). ఆ కాలేజీలో మెనేజ్మెంట్ కి నచ్చని పనులు చేస్తూ స్టూడెంట్స్ కి ఫేవరేట్ అవుతాడు. కాలేజీలో జరిగే స్టూడెంట్ ఎలక్షన్స్ గొడవ కారణంగా ఓ 3 నెలలు సస్పెండ్ అయి బాల నేరస్థుల స్కూల్ కి ట్రాన్స్ ఫర్ అయి అక్కడి బాల నేరస్తులకు మాస్టర్ గా జాయిన్ అవుతాడు. మరోవైపు ఆ జైల్లోని పిల్లలను తన అసాంఘీక కార్యకలాపాలకు వాడుకుంటూ తన రాజకీయ భవిష్యత్తు కోసం వారిని రౌడీలుగా తీర్చిదిద్దుతాడు భవాని (విజయ్ సేతుపతి). విషయం తెలుసుకున్న జేడీ.. భవానికి ఎదురెళ్ళి అతడి చెరలో ఉన్న బాల నేరస్తులను తనవైపుకి తిప్పుకుంటాడు. మరి మాస్టర్ చేసే పనులకు భవాని ఎలా రియాక్ట్ అవుతాడు..? చివరికి భవానిని జేడీ ఎలా అంతమొందించాడు అనేది మిగతా కథ.

నటీనటుల పనితీరు:

తన యాక్షన్, మేనరిజమ్స్ తో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న విజయ్ మరోసారి మాస్టర్ గా మంచి నటన కనబరిచాడు. ముఖ్యంగా యాక్షన్ ఎపిసోడ్స్ లో మాస్ ఆడియన్స్ ను మెప్పించాడు. నటుడిగా ఇప్పటికే అందరి ప్రశంసలు దక్కించుకున్న విజయ్ సేతుపతి తన విలనిజంతో మెప్పించి సినిమాకు హైలైట్ గా నిలిచాడు. ఎలాంటి క్యారెక్టర్ కైనా పూర్తి న్యాయం చేయగలిగే నటుడని మరోసారి రుజువు చేసుకున్నాడు విజయ్ సేతుపతి. మాళవికా మోహనన్‌ తన పాత్రకు న్యాయం చేసింది. ఆండ్రియా , శ్రీమణి, సంతాను భాగ్యరాజ్‌, అర్జున్‌ దాస్‌ మిగతా నటీ నటులందరు తమ పెర్ఫార్మెన్స్ తో పరవాలేదనిపించుకున్నారు.

సాంకేతిక వర్గం పనితీరు :

‘మాస్టర్’ కి అనిరుధ్ మ్యూజిక్ బిగ్గెస్ట్ ఎస్సెట్. రిలీజ్ కి ముందే కుట్టి, వాతి కమ్మింగ్ పాటలతో హోరెత్తించిన అనిరుద్ తన నేపథ్య సంగీతంతో కొన్ని సన్నివేశాలకు బలం చేకూర్చాడు. కాకపోతే రెండు పాటలు మినహా మిగతా పాటలతో ఆకట్టుకోలేక పోయాడు. కెమెరా మెన్ సత్యం సూర్యన్ సినిమాకు బెస్ట్ విజువల్స్ అందించాడు. ప్రతీ ఫ్రేమ్ డీసెంట్ గా ఉంది. ఫిలోమిన్ రాజ్ ఎడిటింగ్ సినిమాకు మేజర్ మైనస్. సినిమాలో కొన్ని సన్నివేశాలను ట్రిమ్ చేసి ఉంటే బెటర్ గా ఉండేది. ఆర్ట్ వర్క్ తో పాటు మిగతా వర్క్ అంతా నీట్ గా ఉంది. యాక్షన్ ఎపిసోడ్స్ మాస్ ఆడియన్స్ ను అలరించేలా ఉన్నాయి.

లోకేష్ కనగరాజ్ రాసుకున్న కథ రొటీన్. కనీసం స్క్రీన్ ప్లే కూడా ఎట్రాక్ట్ చేయలేకపోయింది. ప్రొడక్షన్ వాల్యూస్ కథకు తగ్గట్టుగా ఉన్నాయి.

vijay-master-movie-review-telugu
జీ సినిమాలు సమీక్ష :

‘ఖైదీ’ సినిమాతో కోలీవుడ్ ఆడియన్స్ తో పాటు తెలుగు ప్రేక్షకులను కూడా మెప్పించి దర్శకుడిగా మంచి గుర్తింపు అందుకున్న లోకేష్ కనగరాజ్ ‘మాస్టర్’ తో ఆకట్టుకోలేకపోయాడు. కమర్షియల్ గా వర్కౌట్ అయ్యే పాయింటే ఎంచుకున్నప్పటికి ఆ కథని అదిరిపోయే స్క్రీన్ ప్లే తో తెరకెక్కించడంలో విఫలమయ్యాడు. ‘ఖైదీ’ తర్వాత లోకేష్ డైరెక్షన్ లో విజయ్ హీరోగా సినిమా అనేసరికి భారీ అంచనాలు నెలకొన్నాయి. కానీ ఆ అంచనాలను అందుకోలేక మాస్టర్ ని జస్ట్ బిలో యావరేజ్ సినిమాగా తీర్చిదిద్దాడు దర్శకుడు. ముఖ్యంగా కథ-కథనం కంటే విజయ్ క్రేజ్ మీదే దృష్టి పెట్టి సినిమాను తీసాడు లోకేష్. నిజానికి కమర్షియల్ సినిమాకు కొన్ని ఎలిమెంట్స్ యాడ్ చేసి పర్ఫెక్ట్ మీటర్ లో తెరకెక్కిస్తే సక్సెస్ అందుకోవడం సులువే. కానీ లోకేష్ ఆ మీటర్ ను ఫాలో అవ్వకుండా తడబడుతూ సినిమాను ముందుకు నడిపించాడు. అసలు కథలోకి ఎంటర్ అవ్వడానికి చాలా టైం తీసుకున్నాడు. సినిమా అసలు కథ స్టార్ట్ అయిన వెంటనే అప్పటి వరకు వచ్చిన కాలేజీ సన్నివేశాలు అనవసరమని ప్రేక్షకులు ఫీలయ్యేలా చేసాడు లోకేష్.

విజయ్ మేనరిజమ్స్, ఎనర్జిటిక్ యాక్షన్ ఈ సినిమాలో మిస్ అయ్యింది. సినిమాలో సగం వరకు హీరో నిద్ర పోతూ మబ్బుగా కనిపించడం ప్రేక్షకులకు విసుగు తెప్పిస్తుంది. నిజానికి బాల నేరస్థులను తన ఎదుగుదల కోసం వాడుకుంటూ వారి జీవితాన్ని జైలుకే పరిమితం చేసే ఒక విలన్.. విలన్ కి ఎదురెళ్లి ఆ పిల్లల్ని జైలు నుండి బయటికి పంపాలని చూసే హీరో ఇలా వినడానికి కథ పరంగా వర్కౌట్ అయ్యే సినిమానే అనిపించినా దీనికి సరైన స్క్రీన్ ప్లే , ట్విస్టులు, హీరోయిజం ఇలాంటి ఎలిమెంట్స్ యాడ్ చేయకుండా లోకేష్ మాస్టర్ ని రూపొందించడం సినిమాకు పెద్ద మైనస్. మొదటి భాగం కాస్త పరవాలేదనిపించినా రెండో భాగం మాత్రం ప్రేక్షకులకు మరీ బోర్ కొట్టించేలా ఉంది.

రెండో భాగాన్ని యాక్షన్ ఎపిసోడ్స్ , థ్రిల్ కలిగించే ట్విస్టులు, హీరో-విలన్ మధ్య సీరియస్ ట్రాక్ ఇలాంటివి మరిన్ని ప్లాన్ చేసుకుంటే ‘మాస్టర్’…మాస్టర్ పీస్ లా నిలిచేది.

విజయ్ సేతుపతి నటన సినిమాకే హైలైట్. క్లైమాక్స్ లో కూడా విజయ్ ని డామినేట్ చేసేలా తన ఎక్స్ ప్రెషన్స్ తో మంచి మార్కులే కొట్టేశాడు సేతుపతి. కాకపోతే అతని క్యారెక్టర్ కి ప్రాపర్ ఎలివేషన్ తో పాటు క్లారిటీ ఇవ్వడంలో డైరెక్టర్ చొరవ చూపలేదనిపించింది. ఓవరాల్ గా కొన్ని సన్నివేశాలు, యాక్షన్ ఎపిసోడ్స్, క్లైమాక్స్ సినిమాకు ప్లస్ పాయింట్స్. ఫైనల్ గా సంక్రాంతి బరిలో నిలిచిన ‘మాస్టర్’ విసిగిస్తూ బోర్ కొట్టించాడు.

రేటింగ్ : 2.25 /5