'మను' మూవీ రివ్యూ

Friday,September 07,2018 - 12:06 by Z_CLU

నటీనటులు : రాజా గౌతమ్‌, చాందిని చౌదరి, జాన్‌ కొటొలి, మోహన్‌ భగత్‌, అభిరామ్‌, శ్రీకాంత్‌ ముళ్లగరి తదితరులు

కెమెరా : విశ్వనాథ్‌ రెడ్డి

సంగీతం : నరేష్ కుమారన్

సమర్పణ: నిర్వాణ సినిమాస్

నిర్మాణం : క్రౌడ్‌ ఫండింగ్‌ మూవీ (115 మెంబర్స్‌)

రచన, దర్శకత్వం : ఫణీంద్ర నారిశెట్టి

విడుదల తేదీ : 7 సెప్టెంబర్ 2018

సెన్సార్ : A

తెలుగులో ఇప్పుడిప్పుడే క్రౌడ్ ఫండింగ్ సినిమాలొస్తున్నాయి. అలా 115 మంది నిర్మాతలుగా దర్శకుడు ఫణింద్ర నర్శెట్టి (షార్ట్ ఫిలిం మేకర్) తెరకెక్కించిన సినిమా ‘మను’. రాజా గౌతం, చాందిని చౌదరి లీడ్ రోల్స్ ప్లే చేసిన ఈ సినిమా ఈరోజే థియేటర్స్ లోకి ఎంట్రీ ఇచ్చింది. మరి డెబ్యూ డైరెక్టర్ ఫణింద్ర తన టాలెంట్ తో మెస్మరైజ్ చేశాడా… ట్రైలర్ తో ఎట్రాక్ట్ చేసిన ఈ సినిమా ప్రేక్షకులను అలరించిందా.. జీ సినిమాలు ఎక్స్ క్లూజీవ్ రివ్యూ.


కథ :

సియా అనే దీవి దగ్గర జరిగే కథ ఇది. మను(రాజా గౌతం) అనే ఒక వ్యక్తి పెయింటింగ్స్ వేస్తూ తన కళను చాటుకుంటుంటాడు.. ఇక తన ఇల్లును ఎవరికైనా అద్దెకిచ్చి అక్కడి నుండి వేరే ప్రదేశానికి వెళ్ళాలనుకుంటుంది నీల(చాందిని చౌదరి).. ఒకానొక సందర్భంలో మను ను చూసి ప్రేమలో పడుతుంది. అయితే నీలని చూడకుండానే ఆమె గొంతు విని ప్రేమలో పడిపోతాడు మను. మరోవైపు హీరోహీరోయిన్లిద్దరూ ఒకరికి తెలియకుండా మరొకరు తమకు అన్యాయం చేసిన వ్యక్తులపై పగ తీర్చుకోవాలని చూస్తుంటారు. ఇంతకీ వీరిద్దరి జీవితంలో జరిగిన సంఘటనలేంటి..? వీరిద్దరూ పగ తీర్చుకోవలనుకునే ఆ వ్యక్తులెవరు.. అనేది మను కథ.

 

నటీనటుల పనితీరు:

హీరోగా నాలుగేళ్ల గ్యాప్ తీసుకున్న బ్రహ్మానందం తనయుడు రాజా గౌతమ్ హీరోగా ఓ డిఫరెంట్ క్యారెక్టర్ తో మెప్పించాడు. తన పరిధిలో ఆ మను అనే క్యారెక్టర్ కి బెస్ట్ ఇచ్చాడు. ఇప్పటివరకూ పెద్దగా గుర్తింపు లేని క్యారెక్టర్స్ లో కనిపించిన చాందిని కి ఎట్టకేలకు నటి గా ప్రూవ్ చేసుకునే క్యారెక్టర్ లభించింది. నీల అనే క్యారెక్టర్ తో ఆకట్టుకుని సినిమాకు ప్లస్ అయ్యింది. ఇక జాన్‌ కొటొలి, మోహన్‌ భగత్‌, అభిరామ్‌, శ్రీకాంత్‌ ముళ్లగరి తదితరులు ప్రేక్షకులకు కొత్త అయినప్పటికీ తమ పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకున్నారు.

 

సాంకేతికవర్గం పనితీరు:

సాంకేతికంగా మను బెస్ట్ సినిమా.. టెక్నీషియన్స్ అందరు తమ పూర్తి ఎఫెర్ట్ పెట్టి పనిచేశారు. ముఖ్యంగా సినిమాటోగ్రాఫర్ విశ్వనాధ్ రెడ్డి తన సినిమాటోగ్రఫీ తో మూవీని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్ళాడు. ప్రతి ఫ్రేమ్ హాలీవుడ్ స్టైల్ లో కొత్త అనుభూతి కలిగించింది. విశ్వనాధ్ సినిమాటోగ్రఫీ సినిమాకు మెయిన్ హైలైట్ అని చెప్పొచ్చు. ఇక నరేష్ కుమారన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాకు మరో హైలైట్. సచిన్‌ సుధాకరన్‌, హరిహరన్‌ సౌండ్ డిజైనింగ్ బాగుంది. శివ్‌కుమార్‌ ఆర్ట్ వర్క్ ప్రేక్షకుడిని మెస్మరైజ్ చేస్తుంది. కొన్ని సందర్భాల్లో కవిత్వపు ధోరణిలో వచ్చే మాటలు ఆకట్టుకుంటాయి. ఫణీంద్ర నర్శెట్టి దర్శకుడిగా మంచి మార్కులే అందుకున్నా స్క్రీన్ ప్లే రైటర్ గా మెస్మరైజ్ చేయలేకపోయాడు. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి.

 


జీ సినిమాలు సమీక్ష:

మను అనే టైటిల్ తో టెక్నికల్ గా ఓ బ్రిలియంట్ సినిమా చూపిద్దామనుకున్నాడు దర్శకుడు ఫణింద్ర నర్శెట్టి. కానీ సాంకేతికంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి.. ఎలాంటి బ్రిలియంట్ స్క్రీన్ ప్లే తో ఎంటర్ టైన్ చేయాలి…అనే విషయంపై మాత్రం పెద్దగా శ్రద్ధ పెట్టలేదు. అలా సినిమాపై 115 మంది పెట్టిన పెట్టుబడిని వృధా చేశాడు.

నిజానికి ఈ మధ్య కాలంలో ఓ ట్రైలర్ టెక్నికల్ గా ఈ రేంజ్ లో ఇంప్రెస్ చేసింది లేదు.. ట్రైలర్ తో అందరినీ ఎట్రాక్ట్ చేసిన ఈ సినిమా థియేటర్స్ కొచ్చిన ప్రేక్షకుడిని మాత్రం పూర్తి స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. నిజానికి ఇలాంటి కొత్త ప్రయోగాలు టాలీవుడ్ లో అవసరమే… కొత్త దర్శకులు కొత్త ఆలోచనతో వస్తే ప్రేక్షకులు ఎప్పుడూ స్వాగతిస్తారు.. కానీ ఆ కాన్సెప్ట్ ను వారికి అర్థమయ్యేలా చెప్తూ ఎంటర్ టైన్ చేయగలగాలి.. అక్కడే దర్శకుడి ప్రతిభేంటో తెలిసేది.. షార్ట్ ఫిలిం మేకర్ గా కొత్త ఐడియాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన దర్శకుడు ఫణింద్ర తను అనుకున్న కాన్సెప్ట్ ను సరిగ్గా ఎగ్జిక్యూట్ చేయలేకపోయాడు.  ఇక్కడే ‘మను’ రిజల్ట్ తేడాకొట్టింది.

ఇది హాలీవుడ్ స్టైల్ ఆఫ్ మేకింగ్ తో తెరకెక్కిన సినిమా కాబట్టి ఇక్కడి ప్రేక్షకులను ఆకట్టుకోలేదు.. ఇలాంటి సినిమాలు వర్కౌట్ అవ్వనప్పుడు రెగ్యులర్ గా వినిపించే మాటలివే.. నిజానికి దర్శకుడు ఏ రేంజ్ లో ఆలోచించి కథను రెడీ చేసుకున్నా అర్థమయ్యేలా చెప్పగలిగితే ప్రేక్షకులు ఎప్పుడూ ఇలాంటి సినిమాలను ప్రోత్సహిస్తారు. ఇటివలే సూపర్ హిట్ గా నిలిచిన ప్రయోగాత్మక సినిమాలే దీనికి ఉదాహరణ… సినిమా ప్రారంభం నుండి ఏదో కొత్త అనుభూతి కలిగిస్తూ ఎండింగ్ వరకూ అదే ఫీల్ కలిగిస్తాడనుకున్న ప్రేక్షకులను చాలా విసిగించాడు దర్శకుడు..
మూడు గంటల నిడివి, సినిమాకు అతి పెద్ద మైనస్. ఈ కథతో ప్రేక్షకులను అంత సేపు కుర్చీలో కూర్చోబెట్టడం అంటే మాములు విషయం కాదు. పోనీ కథ పరంగా ఈ సినిమాకు అంత నిడివి అవసరమా అంటే అదీ లేదు. ఒక రివేంజ్ థ్రిల్లర్ డ్రామాను మిస్టరీ గా చూపించే కథ ఇది. సరిగ్గా చెప్పాలంటే ఈ కథను జస్ట్ రెండు గంటల్లో హై టెక్నికల్ ఎలిమెంట్స్ తో చెప్పేయొచ్చు. మరి ఫణింద్ర ఎందుకు ఈ కథకి అంత సమయం తీసుకున్నాడో..అతనికే తెలియాలి. ముఖ్యంగా తాళం చెవి- తాళం కప్ప, స్కల్ప్ ఆర్ట్, పెయింటింగ్, పెర్ఫ్యూమ్, ఎలుకలు, ఇలా ఒకటా రెండా…ఒకే సినిమాలో ఎన్నో విషయాల గురించి చెప్పే ప్రయత్నం చేసి ప్రేక్షకుడితో “ఇది అవసరమా మాకు” అనిపించాడు.

కొన్ని సందర్భాల్లో వచ్చే మరీ సాగదీత లా అనిపించే సీన్స్ , స్లో నేరేషన్ , డ్యూరేషన్ కథకి అడ్డుకట్టలా అనిపిస్తాయి… ప్రీ ఇంటర్వెల్ ఎపిసోడ్ , ప్రీ క్లైమాక్స్ లో వచ్చే సీన్స్ , క్లైమాక్స్ ట్విస్ట్ సినిమాకు హైలైట్ గా నిలిచాయి. నిడివి విషయంలో జాగ్రత్త తీసుకొని కాస్త అర్థమయ్యే స్క్రీన్ ప్లే తో కథను చెప్తే రిజల్ట్ బెటర్ గా ఉండేది. ముఖ్యంగా సినిమా చివరికి వచ్చే సరికి దర్శకుడు ఏం చెప్పాలనుకున్నాడో కూడా ప్రేక్షకుడికి అర్థం కాని పరిస్థితి.

ఫైనల్ గా చెప్పాలంటే టెక్నికల్ గా ‘మను’ బెస్ట్. కంటెంట్ పరంగా జస్ట్ పరవాలేదనిపిస్తుంది.

రేటింగ్ : 2 / 5