మన్మథుడు 2 మూవీ రివ్యూ

Friday,August 09,2019 - 01:34 by Z_CLU

నటీనటులు – నాగార్జున‌, ర‌కుల్ ప్రీత్‌, ల‌క్ష్మి, వెన్నెల‌కిషోర్‌, రావు ర‌మేష్‌, ఝాన్సీ, దేవ‌ద‌ర్శిని త‌దిత‌రులు
స్క్రీన్ ప్లే – ద‌ర్శ‌క‌త్వం:  రాహుల్ ర‌వీంద్ర‌న్‌
నిర్మాత‌లు:  నాగార్జున అక్కినేని, పి.కిర‌ణ్‌
నిర్మాణ సంస్థ‌లు: మ‌నం ఎంట‌ర్‌ప్రైజెస్‌, ఆనంది ఆర్ట్ క్రియేష‌న్స్‌, వ‌యాకామ్ 18 మోష‌న్ పిక్చ‌ర్స్‌
మ్యూజిక్:  చైత‌న్య  భ‌రద్వాజ్‌
సినిమాటోగ్ర‌ఫీ:  ఎం.సుకుమార్‌
ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్స్‌:  ఎస్‌.రామ‌కృష్ణ‌, మౌనిక‌
స్క్రీన్‌ప్లే:  రాహుల్ ర‌వీంద్ర‌న్, స‌త్యానంద్‌
ఎడిట‌ర్స్‌:  ఛోటా కె.ప్ర‌సాద్‌, బి.నాగేశ్వ‌ర రెడ్డి
డైలాగ్స్‌:  కిట్టు విస్సా ప్ర‌గ‌డ‌, రాహుల్ ర‌వీంద్ర‌న్‌
కాస్ట్యూమ్స్‌:  అనిరుధ్ సింగ్‌, దీపికా ల‌ల్వాని
సెన్సార్ : U/A
రన్ టైమ్ : 155 నిమిషాలు

రిలీజ్ డేట్: ఆగస్ట్ 9, 2019

మరోసారి మన్మథుడు టైటిల్ తో మనముందుకొచ్చాడు నాగార్జున. ఈ జనరేషన్ కుర్రాడిలా రొమాన్స్ చేశాడు. మరి ఆడియన్స్ ను ఆకట్టుకున్నాడా? మన్మథుడు-2 రిజల్ట్ ఏంటి? జీ సినిమాలు ఎక్స్ క్లూజివ్ రివ్యూ


కథ

1927లోనే పోర్చుగల్ లో సెటిల్ అవుతారు శామ్ పూర్వీకులు. అలా అక్కడే పుట్టిపెరిగిన సాంబశివరావు అలియాస్ శామ్ (నాగార్జున) పెర్ఫ్యూమర్ గా కెరీర్ కొనసాగిస్తుంటాడు. అయితే యంగేజ్ లో జరిగిన కొన్ని సంఘటనల వల్ల ప్రేమపై పెద్దగా ఆసక్తి ఉండదు. ఇంకా చెప్పాలంటే అమ్మాయిలు అతడికి పడతారు కానీ శామ్ మాత్రం ప్రేమలో పడడు. అలా వయసైపోతుంటుంది.

కానీ శామ్ తల్లి (లక్ష్మి) మాత్రం తను చనిపోయేలోపు కొడుకు పెళ్లి చేయాలనుకుంటుంది. అటు శామ్ అక్కాచెల్లెళ్లు కూడా అతడికి పెళ్లి చేయాలనే ఫిక్స్ అవుతారు. వీళ్ల నుంచి తప్పించుకోవడం కోసం కాంట్రాక్ట్ మీద అవంతికను (రకుల్) సీన్ లోకి తీసుకొస్తాడు శామ్. అలా శామ్ ఇంట్లోకి ఎంటరైన అవంతిక ఏం చేసింది? శామ్ తల్లి కోరిక తీరిందా లేదా? ఇంతకీ అవంతిక ఎవరు? అనేది బ్యాలెన్స్ కథ.

నటీనటుల పనితీరు

అక్కడ అభి… ఇక్కడ శామ్.. ఈ రెండు పాత్రల మధ్య 17 ఏళ్ల గ్యాప్ ఉంది. అయితే ఆ గ్యాప్ పాత్రల మధ్య మాత్రమే. నాగ్ లుక్స్ లో ఆ తేడా కనిపించలేదు. అప్పటికీ ఇప్పటికీ నాగ్ మన్మథుడే. ఈమధ్య కాలంలో నాగ్ బెస్ట్ లుక్ ఇదే. అవంతిక పాత్రలో రకుల్ గ్లామరస్ గా కనిపించడమే కాకుండా, చక్కగా నటించింది కూడా. వీళ్లిద్దరి తర్వాత చెప్పుకోవాల్సిన పాత్ర వెన్నెల కిషోర్. ఫస్టాఫ్ లో కొంత సాగతీత ఉన్నప్పటికీ దాన్ని మరిపించేలా చేశాడు వెన్నెల కిషోర్. ఇతడి కామెడీ సినిమాకు హైలెట్.

ఇతర నటీనటుల్లో లక్ష్మి, ఝాన్సీ, రావురమేష్, దేవదర్శిని తమ పాత్రలకు న్యాయం చేశారు. కీలకమైన క్యామియో అంటూ చెప్పిన సమంత, కీర్తిసురేష్ పాత్రలు థియేటర్ నుంచి బయటకొచ్చిన తర్వాత గుర్తుండవు. మన్మథుడు కనెక్ట్ కోసం పెట్టిన బ్రహ్మానందం కూడా ఇలా వచ్చి అలా వెళ్లిపోతాడు.

టెక్నీషియన్స్ పనితీరు

దర్శకుడు రాహుల్ రవీంద్రన్ ప్రీ-ప్రొడక్షన్ బాగా చేశాడు. పోర్చుగల్ లో ఉన్న తెలుగు కుటుంబం ఎలా మాట్లాడుకుంటుంది, హీరోహీరోయిన్లకు ఎలాంటి దుస్తులు డిజైన్ చేయాలి, ఎలాంటి లొకేషన్స్ అయితే బాగుంటాయి లాంటి అంశాలన్నీ బాగానే వర్కవుట్ చేశాడు. అదే ఫోకస్ సన్నివేశాలపై కూడా పెడితే బాగుండేది. రాహుల్ రాసుకున్న సన్నివేశాల వల్ల సినిమా అలా సాగిపోతుంది తప్ప ఎక్కడా హై-పాయింట్స్ కనిపించవు. కిట్టు, రాహుల్ కలిసి రాసుకున్న డైలాగ్స్ బాగున్నాయి.

సుకుమార్ మరోసారి తన టాలెంట్ చూపించాడు. పోర్చుగల్ అందాల్ని అద్భుతంగా తెరపై ఆవిష్కరించాడు. అనిరుధ్, దీపిక డిజైన్ చేసిన దుస్తులు టోటల్ ఫ్రేమ్ కు ఓ కొత్త కలర్ తీసుకొచ్చాయి. చైతన్ భరధ్వాజ్ ఆర్ఎక్స్100 మేజిక్ ను రిపీట్ చేయలేకపోయాడు. మంచి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అయితే ఇచ్చాడు కానీ, పిల్లా రా రేంజ్ లో గుర్తుండిపోయే ట్యూన్ ఇవ్వలేకపోయాడు. మనం ఎంటర్ టైన్ మెంట్స్, ఆనంది ఆర్ట్స్ ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి.


జీ సినిమాలు సమీక్ష

మన్మథుడు, మన్మథుడు-2 సినిమాలకు అస్సలు సంబంధం లేదు. కానీ కథ ప్రకారం ఈ సినిమాకు మన్మథుడు-2 టైటిల్ సెట్ అయిందని మేకర్స్ ప్రకటించారు. అది నిజమే. టైటిల్ సెట్ అయింది. కానీ అప్పటి మేజిక్ మాత్రం రిపీట్ అవ్వలేదు. అవును.. మన్మథుడు సినిమా హోల్ అండ్ సోల్ గా ఎంటర్ టైన్ చేస్తే.. ఈ హైటెక్ మన్మథుడు పార్ట్ లు పార్ట్ లుగా మెప్పిస్తాడు.

ఈమధ్య చాలా సినిమాల్లో బ్యాక్ డ్రాప్స్ బాగుంటున్నాయి. మన్మథుడు-2కు కూడా మంచి బ్యాక్ డ్రాప్ సెట్ అయింది. పోర్చుగల్ లో సెటిల్ అయిన కుటుంబం, వాళ్ల భాష, ఆ దేశం అందాలు ఇలా అన్నీ కాస్త కొత్తగా ఉన్నాయి. కానీ చిక్కంతా ఎక్కడొచ్చిందంటే.. కేవలం మంచి బ్యాక్ డ్రాప్ పైనే అంతా కలిసి దృష్టిపెట్టినట్టున్నారు. మంచి స్క్రీన్ ప్లే పై కూడా దృష్టి పెట్టి ఉండే బాగుండేది. మన్మథుడు-2లో అది మిస్ అయింది.

ఓ ఫారిన్ సినిమాకు రీమేక్ గా తెరకెక్కించడంతోనే వచ్చింది చిక్కంతా. ఆ విదేశీ చిత్రాన్ని మక్కికి మక్కి దించలేక, మన నేటివిటీకి తగ్గట్టు మార్పులు చేయలేక దర్శకుడు రాహుల్ చాలా ఇబ్బంది పడినట్టు అనిపించింది. దీనికి తోడు నాగార్జున కోసం చేసిన మార్పులు, అప్పటి మన్మథుడు సినిమాను కూడా కవర్ చేయాలని (టైటిల్ జస్టిఫికేషన్ కోసం) చేసిన ఫీట్లు అంతగా మెప్పించవు. సినిమా మొత్తం మన కనుసన్నల్లోనే సాగిపోతుంది. సీన్లన్నీ మనం అనుకున్నట్టుగానే నడుస్తాయి. చివరికి క్లైమాక్స్ కూడా మనం ఊహించిందే జరుగుతోంది. ఇలాంటి కథలకు ఇలాంటి స్క్రీన్ ప్లే సహజం. కానీ బలమైన సన్నివేశాలు పడితే వీక్ గా ఉన్న కథ కూడా క్లిక్ అయిపోతుంది. అలాంటి సన్నివేశాలు మన్మథుడు-2లో అక్కడక్కడ మాత్రమే కనిపిస్తాయి.

ఇలాంటి బలహీనతల మధ్య కూడా ఈ సినిమాను ఓసారి చూడాలనిపించేలా చేస్తుంది నాగార్జున యాక్టింగ్. ఈ వయసులో కూడా నాగార్జున గ్లామర్ అమ్మాయిల్ని పిచ్చెక్కిస్తుందనడం అతి అనిపించుకోదు. నాగ్ తో పాటు రకుల్ కూడా అదరగొట్టింది. గ్లామరస్ గా కనిపిస్తూనే చక్కగా నటించింది. నిజానికి సినిమాలో చాలా సన్నివేశాలు రకుల్, వెన్నెల కిషోర్ చలవతోనే గట్టెక్కేశాయి. మరీ ముఖ్యంగా ఫస్టాఫ్ మొత్తం వెన్నెల కిషోర్ మేజిక్ కనిపిస్తుంది. సెకండాఫ్ ఫ్లాట్ గా సాగినప్పటికీ పాస్ అయిపోతుంది.

ఓవరాల్ గా అలనాటి మన్మథుడుతో పోల్చిచూడకుండా, ఎలాంటి అంచనాల్లేకుండా థియేటర్లకు వస్తే ఈ నవ మన్మథుడు కూడా ఉన్నంతలో బాగానే ఎట్రాక్ట్ చేస్తాడు.

రేటింగ్2.75/5