రివ్యూ - మంగళవారం

Friday,November 17,2023 - 01:21 by Z_CLU

నటీ నటులు : పాయల్ రాజ్‌పుత్, అజ్మల్ అమీర్, శ్రీ తేజ్, చైతన్య కృష్ణ, అజయ్ ఘోష్, లక్ష్మణ్

సినిమాటోగ్రఫీ : దాశరథి శివేంద్ర,

మ్యూజిక్ : ‘కాంతార’ ఫేమ్ బి. అజనీష్ లోక్‌నాథ్,

ఎడిటర్ : మాధవ్ కుమార్ గుళ్ళపల్లి,

మాటలు : తాజుద్దీన్ సయ్యద్, రాఘవ్,

నిర్మాతలు : స్వాతి రెడ్డి గునుపాటి, సురేష్ వర్మ .ఎం,

కథ – స్క్రీన్ ప్లే – దర్శకత్వం : అజయ్ భూపతి.

విడుదల తేదీ : 17 నవంబర్ 2023

ఆర్ ఎక్స్ 100 తర్వాత అజయ్ భూపతి, పాయాల్ రాజ్ పుత్ కాంబోలో తెరకెక్కిన మంగళవారం మంచి అంచనాల నడుమ ఈరోజే విడుదలైంది.

ప్రీ రిలీజ్ కంటెంట్ సినిమాపై ఎక్స్ పెక్టేషన్స్ పెంచాయి. మరి అజయ్ భూపతి ఈ జోనర్ తో ఆ అంచనాలను అందుకొని మెస్మరైజ్ చేశారా ? జీ సినిమాలు ఎక్స్ క్లూసివ్ రివ్యూ.

కథ :

మహాలక్ష్మిపురం అనే ఊరిలో ప్రతీ మంగళవారం ఆత్మహత్యలు జరుగుతాయి.  వరుస చావులు ఊరి జనాలని ఒక సందిగ్ధంలో పడేస్తాయి. ఈ కేసు ఇన్వెస్టిగేషన్ చేసే లేడీ పోలీస్ ఆఫీసర్ (నందితా శ్వేత) అవి ఆత్మ హత్యలు కావని, హత్యలని ఊరి జనాలకు చెప్పి ఈ మర్డర్ మిస్టరీని తెరదించాలని చూస్తుంటుంది.

ఈ హత్యలకు శైలజ(పాయల్ రాజ్ పుత్) నే కారణమని ఊరి జనం నమ్ముతుంటారు. అసలు శైలజ ఎవరు ? నిజంగా ఆమెకి మంగళవారం జరిగే హత్యలకు సంబంధం ఏమిటి ? అనేది మిగతా కథ.

నటీ నటుల పనితీరు :

పాయల్ రాజ్ పుత్ కి ఎమోషనల్ టచ్ ఉన్న ఇంపాక్ట్ క్రియేట్ చేసే పాత్ర దక్కడంతో నటిగా మరో సారి మెప్పించి మంచి మార్కులు అందుకుంది. నందితా శ్వేత పోలీస్ పాత్రకు పర్ఫెక్ట్ అనిపించుకుంది. అజ్మల్ అమీర్ కి ఫ్లాష్ బ్యాక్ లో చిన్న పాత్రే దక్కింది. ఆ పాత్రతో పరవాలేదనిపించుకున్నాడు. దివ్య పిళ్ళై, శ్రీ తేజ్, చైతన్య కృష్ణ, అజయ్ ఘోష్, లక్ష్మణ్ తమ పాత్రలతో ఆకట్టుకున్నారు.

సాంకేతిక వర్గం పనితీరు :

టెక్నికల్ గా మాట్లాడుకునే సినిమాలు అరుదుగా వస్తుంటాయి. తమ పనితనం చూపించుకునే ఇలాంటి సినిమాలు టెక్నీషియన్స్ వర్క్ బయట పెడతాయి. టెక్నికల్ గా సినిమాకు బెస్ట్ సపోర్ట్ లభించింది. ముఖ్యంగా అజనీష్ లోక్ నాథ్ సంగీతం బిగ్ ప్లస్ పాయింట్ అని చెప్పాలి. నేపథ్య సంగీతం సినిమాను నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్ళింది. కొన్ని సన్నివేశాలకు సౌండ్ డిజైనింగ్ కూడా బలాన్నిచ్చింది.
దాశరథి శివేంద్ర కెమెరా, మాధవ్ కుమార్ ఎడిటింగ్ కూడా ప్లస్ అయ్యాయి. విజువల్స్, వాటిని కట్ చేసిన తీరు బాగా ఆకట్టుకుంటాయి. మోహన్ తాళ్లూరి ఆర్ట్ వర్క్ , రఘు కులకర్ణి ప్రొడక్షన్ డిజైనింగ్ , రియల్ సతీష్, పృథ్వి యాక్షన్ కంపోజిషన్ బాగున్నాయి.

అజయ్ భూపతి ఒక బోల్డ్ పాయింట్ తీసుకొని దాన్ని మర్డర్ మిస్టరీ గా మలచి రాసుకున్న కథ, కథనం బాగున్నాయి. ప్రొడక్షన్ వేల్యూస్ కథకి తగ్గట్టుగా ఉన్నాయి.

జీ సినిమాలు సమీక్ష :

ఒక పల్లెటూరు, వరుస ఆత్మ హత్యలు, ఊరంతా గందరగోళం అవి మర్డర్స్ అని తెలిసి ఎవరు చేశారనే ఇన్వెస్టిగేషన్ ఈ తరహా క్రైమ్ థ్రిల్లర్ కథలు చాలా వచ్చాయి. మంగళవారం కూడా ఇదే కథతో తెరకెక్కిన సినిమా. కానీ ఇందులో అమ్మాయిల గురించి ఒక బోల్డ్ విషయాన్ని కథ చేశాడు దర్శకుడు అజయ్ భూపతి. ఫస్ట్ హాఫ్ అంతా మర్డర్ మిస్టరీతో ఆసక్తిగా కథను నడిపించి రెండో భాగమంతా ఎమోషనల్ , సింపతీ , ట్విస్టులతో ముందుకు నడిపించారు దర్శకుడు.

మొదటి సినిమాలో హీరోయిన్ ను నెగటివ్ గా చూపించి ఎవ్వరూ చేయని ఓ సాహసం చేసి మంచి వసూళ్లు రాబట్టిన కమర్షియల్ హిట్ అందుకున్న అజయ్ భూపతి ఈసారి కూడా అలాంటి బోల్డ్ అటెంప్ట్ చేశాడు. కాకపోతే ఈసారి క్రైమ్ థ్రిల్లర్ జానర్ లో ఒక విషయం చెప్పే ప్రయత్నం చేశాడు. మర్డర్ మిస్టరీ తో మొదటి భాగాన్ని బాగానే నడిపించినప్పటికీ రెండో భాగంలో అసలు కథ ఓపెన్ చేసి ఏదో చెప్పాలని చూస్తూ తడబడ్డాడు దర్శకుడు. రెండో భాగమంతా హీరోయిన్ ఎమోషనల్ పార్ట్ చూపించడంతో కాస్త గ్రాఫ్ తగ్గింది. కానీ ప్రీ క్లైమాక్స్ , క్లైమాక్స్ వర్కౌట్ అయ్యాయి. ఇంటర్వల్, ప్రీ క్లైమాక్స్ సస్పెన్స్ క్యారెక్టర్ ట్విస్ట్ పరవాలేదు అనిపిస్తాయి. క్లైమాక్స్ ట్విస్ట్ మాత్రం ఎవరూ ఊహించని విధంగా డిజైన్ చేసుకున్నాడు దర్శకుడు. ఆ ట్విస్ట్ ప్రేక్షకులకు కచ్చితంగా షాక్ ఇస్తుంది. హీరోయిన్ తాలూకు ఫ్లాష్ బ్యాక్ లో కొంత వరకూ సింపతీ కొంత వరకూ మాత్రమే క్రియేట్ అయ్యింది తప్ప ఆ ఎపిసోడ్ ఎమోషనల్ కనెక్ట్ అవ్వలేదు.

విలేజ్ పాత్రలు, ఆసక్తి గా సాగే కొంత కథనం, క్లైమాక్స్ ట్విస్టు , నేపథ్య సంగీతం సినిమాకు మేజర్ హైలైట్స్ కాగా సెకండాఫ్ లో కొన్ని సీన్స్, అక్కడక్కడా రొటీన్ అనిపించే సీన్స్  మైనస్ అనిపిస్తాయి. ప్రీ క్లైమాక్స్ లో వచ్చే కేరెక్టర్ షాక్ ఇవ్వలేదు కానీ కొంత సర్ప్రైజ్ చేస్తుంది. సెకండ్ పార్ట్ కి లీడ్ ఇచ్చి సినిమాను ముగించాడు దర్శకుడు.

రేటింగ్ : 2.75 /5