మంచు కురిసే వేళలో మూవీ రివ్యూ

Friday,December 28,2018 - 01:01 by Z_CLU

నటీనటులు: రామ్ కార్తీక్, ప్రణాలి
సంగీతం: శ్రావణ్ భరద్వాజ్
కెమెరా: తిరుజ్ఞాన, ప్రవీణ్ కుమార్ పంగులూరి
కూర్పు: కోటగిరి వెంకటేశ్వరరావు
కధ- స్క్రీన్ ప్లే- నిర్మాత- దర్శకత్వం: బాల బోడెపూడి
సెన్సార్: U
రిలీజ్ డేట్: 28-12-2018

 

చిన్న సినిమానే అయినప్పటికీ విజువల్స్, టైటిల్ ట్రాక్ తో విడుదలకు ముందే ఎట్రాక్ట్ చేసింది మంచు కురిసే వేళలో సినిమా. అలా ఓ మోస్తరు అంచనాలతో ఈ రోజు థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా ఎలా ఉంది? జీ సినిమాలు ఎక్స్ క్లూజివ్ రివ్యూ


కథ
ఎఫ్ఎం రేడియోలో జాకీగా పనిచేసే ఆనంద్ కృష్ణ (రామ్ కార్తీక్), తను చేసే ఎఫ్ఎం ప్రొగ్రామ్ లో భాగంగా ఆత్మహత్య చేసుకోబోతున్న ఓ వ్యక్తిని ఆపుతాడు. ఆత్మహత్య ఆలోచన నుంచి శ్రీను (విజయ్ సాయి)ను
మళ్లించేందుకు తన ప్రేమకథ చెబుతాడు. ప్రారంభంలో ఇది కట్టుకథ మాత్రమే. కానీ నిజంగానే అలాంటి అమ్మాయిని చూస్తాడు ఆనంద్. తొలిచూపులోనే గీతాంజలి (ప్రణాలి)ని ఇష్టపడతాడు.

ఆమెను మెప్పించడం కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తాడు. ఈ క్రమంలో ఆమె కుటుంబసభ్యులకు కూడా దగ్గరవుతాడు. కానీ గీతాంజలి మాత్రం ఆనంద్ ను ఆ కోణంలో చూడదు. ఆనంద్ చేసే పనుల్ని మాత్రం ఇష్టపడుతుంది కానీ తన ప్రేమను మాత్రం ఆనంద్ కు చెప్పదు. మరోవైపు గీతాంజలి ఎందుకు ఆనంద్ ను ప్రేమించడం లేదు, ఫైనల్ గా వీళ్లిద్దరూ కలిశారా లేదా అనే ఉత్కంఠ ఎఫ్ఎం వినే విశాఖ వాసుల్లో
పెరిగిపోతుంది.

ఇంతకీ గీతాంజలి సమస్య ఏంటి? ఇష్టపడిన ఆనంద్ కు తన ప్రేమను ఎందుకు చెప్పదు. ఫైనల్ గా వీళ్లిద్దరూ కలిశారా లేదా? ఆత్మహత్యకు ప్రయత్నించిన శ్రీనుగాడు క్లైమాక్స్ లో ఏం చేశాడు? అనేది బ్యాలెన్స్ స్టోరీ.

 

నటీనటుల పనితీరు
హీరో రామ్ కార్తీక్ బాగా చేశాడు. లవర్ బాయ్ గా అతడి యాక్టింగ్, ఎక్స్ ప్రెషన్స్ బాగున్నాయి. మంచి కథలు సెలక్ట్ చేసుకుంటే భవిష్యత్తులో బాగా రాణిస్తాడు. హీరోయిన్ ప్రణాలి లుక్స్ బాగున్నాయి. ప్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో ఆమె యాక్టింగ్ కూడా బాగుంది. ఎఫ్ఎం రేడియో ప్రొగ్రామ్ డైరక్టర్ గా చమ్మక్ చంద్ర అక్కడక్కడ నవ్విస్తాడు. ఇక శ్రీనుగాడుగా విజయ్ సాయి (late), హీరోయిన్ తల్లిదండ్రులుగా అరుణ్ కుమార్-జయలక్ష్మి, హీరో తల్లిగా శిరీషా సౌగంధి తమ పాత్రల మేరకు నటించారు.

 

టెక్నీషియన్స్ పనితీరు
తిరుజ్ఞాన, ప్రవీణ్ కుమార్ సినిమాటోగ్రఫీ బాగుంది. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో విజువల్స్ తో పాటు ఇంకొన్ని సన్నివేశాల్ని ఎట్రాక్టివ్ గా చూపించారు. శ్రావణ్ భరద్వాజ్ కంపోజ్ చేసిన 2 పాటలు బాగున్నాయి. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఓకే. చిన్న సినిమా కావడంతో నిర్మాత బాల పెద్దగా ఖర్చుపెట్టలేదు. తనే దర్శకుడు, కథకుడు కూడా తనే కావడంతో ఉన్నంతలో సినిమాను నీట్ గా తీశాడు. ఇంతకుమించి టెక్నికల్ గా సినిమా గురించి చెప్పుకోవడానికేం లేదు.

జీ సినిమాలు రివ్యూ
ప్రతి ఏడాది వచ్చే సినిమాల్లో సగానికి పైగా చిన్న సినిమాలే ఉంటాయి. అన్ని వందల చిత్రాల మధ్య ఓ చిన్న సినిమా ఆడియన్స్ ను ఎట్రాక్ట్ చేయాలంటే చాలా కష్టం. కానీ మంచు కురిసే వేళలో మూవీ ఎట్రాక్ట్ చేసింది. దీనికి కారణం టైటిల్ సాంగ్ హిట్ అవ్వడంతో పాటు మంచి విజువల్స్. అలా క్లీన్ బజ్ మధ్య వచ్చిన ఈ సినిమా ప్రేక్షకుల్ని థియేటర్లలో కూర్చోబెట్టలేకపోయింది.

కథ, స్క్రీన్ ప్లే, నిర్మాత, దర్శకత్వం.. ఇలా కీలకమైన విభాగాలన్నింటినీ బాల స్వయంగా హ్యాండిల్ చేశాడు. కానీ అన్ని పనుల్ని బ్యాలెన్స్ చేయలేకపోయాడు. కథ రాసుకున్నాడు కానీ స్క్రీన్ ప్లేతో మేజిక్ చేయలేకపోయాడు. అక్కడక్కడ స్క్రీన్ ప్లే బాగున్నప్పటికీ ఆ సన్నివేశాల్లో నిర్మాతగా కాంప్రమైజ్ అయ్యాడు. కథ, స్క్రీన్ ప్లే లో
లోపాల వల్ల దర్శకుడిగా కూడా ఫెయిలయ్యాడు. ఇలా అన్నీ అరకొరగా చేయడం వల్ల థియేటర్లలో ఆశించిన స్థాయిలో మంచు కురిపించలేకపోయాడు.

ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నిస్తున్న ఓ వ్యక్తిని మభ్యపెట్టడం కోసం హీరో తన ప్రేమకథ చెప్పడం, అలా ఎఫ్ఎం రేడియోలో కథ చెబుతూ విశాఖపట్నంలోని శ్రోతలందర్నీ తనవైపు తిప్పుకోవడం అనే కాన్సెప్ట్ బాగున్నప్పటికీ శివమణి లాంటి సినిమాలు చప్పున గుర్తొస్తాయి. పైగా ఆ సన్నివేశాల్ని ఎఫెక్టివ్ గా చూపించడంలో దర్శకుడు పూర్తిగా ఫెయిలయ్యాడు. దీనికి తోడు కామెడీ మిస్ ఫైర్ అవ్వడం మరో మైనస్.

హీరోయిన్ ను కాస్త మూడీగా చూపించి ఇంటర్వెల్ వరకు ట్విస్ట్ బాగానే మెయింటైన్ చేసిన డైరక్టర్, హీరోయిన్ ఫ్లాష్ బ్యాక్ ను మాత్రం నీరుగార్చేశాడు. మరీ ముఖ్యంగా హీరో ప్రేమను అర్థంచేసుకొని వెంటనే అతడికి కనెక్ట్ అయ్యే సన్నివేశాన్ని ఓ డ్రామాగా, ఎమోషనల్ గా చూపించి ఉంటే బాగుండేది. ఠపీమని ఒక్క సీన్ లో హీరోయిన్ మనసు మార్చేసి, హీరో సరసర చేరిపోవడం అంతగా బాగాలేదు. దీనికి తోడు సినిమాలో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు వచ్చే కవితలు ఈ జనరేషన్ కుర్రాళ్లను ఇబ్బందిపెడతాయి. ఫ్లాష్ బ్యాక్ లో అయితే ఈ కవిత్వం మరింత ఇబ్బందిపెడుతుంది.

ఓవరాల్ గా కొన్ని ఫ్రెష్ సీన్స్ కోసం, టైటిల్ సాంగ్ కోసం, 2-3 కామెడీ పంచ్ ల కోసం మంచు కురిసే వేళలో సినిమాను చూడొచ్చు.

రేటింగ్ : 2/5