'మామాంగం' మూవీ రివ్యూ

Thursday,December 12,2019 - 03:50 by Z_CLU

నటీ నటులు : మమ్ముట్టి, ప్రాచి తెహెలన్, ఉన్ని ముకుందన్, మోహన్ శర్మ, అను సితార, ప్రాచీ దేశాయ్, మాళవికా మీనన్, అభిరాం అయ్యర్ తదితరులు

ఛాయాగ్రహణం : మనోజ్ పిళ్ళై

సంగీతం : ఎం. జయచంద్రన్

నేపథ్య సంగీతం : సంచిత్ బల్హారా & అంకిత్ బల్హారా

స్క్రీన్ ప్లే : శంకర్ రామకృష్ణన్

మాటలు : కిరణ్

దర్శకత్వం : ఎం. పద్మకుమార్

నిర్మాత : వేణు కున్నపిళ్లి

విడుదల తేది : 12 డిసెంబర్ 2019

 

‘బాహుబలి’, ‘కె.జి.యఫ్’ భారీ బడ్జెట్ సినిమాలకు కొత్త ఉత్సాహాన్ని అందించాయి. మేకర్స్ భారీ బడ్జెట్ పెట్టడానికి ముందుకు వచ్చేందుకు ఆ సినిమాలు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. గొప్ప కథతో వస్తే భాషాబేధం లేకుండా సినిమాకు దేశవ్యాప్తంగా ప్రేక్షకాదరణ దక్కుతుండడంతో పాన్ ఇండియన్ సినిమాల సంఖ్య పెరుగుతోంది. తాజాగా మమ్ముట్టీ కూడా ‘మామాంగం అనే భారీ బడ్జెట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. మరి ఈ సినిమా రిజల్ట్ ఏంటి ..? జీ సినిమాలు ఎక్స్ క్లూజీవ్ రివ్యూ.

 

కథ :

నాలుగు శతాబ్దాల క్రితం కేరళలో ప్రతి 12 ఏళ్లకు జరిగే ‘మామాంగం’ మాహోత్సవానికి సాముద్రి మహారాజును అంతం చేయాలనే లక్ష్యంతో వెళ్లువనాడు నుండి చావేరుళ్ వంశస్థులు ఒక్కరైనా వస్తారు. ఓసారి చంద్రోత్ వీర పానికర్ సాముద్రి మహారాజును చేరుకుంటాడు. కానీ, రాజును అంతం చేయకుండా వెళ్ళిపోతాడు. మళ్ళీ 24 ఏళ్లకు చావేరుళ్ నుండి చంద్రోత్ వంశంలో చివరి పానికర్ (ఉన్ని ముకుందన్), అతడి మేనల్లుడు (మాస్టర్ అచ్యుతన్) వస్తారు. మార్గమధ్యలో ఇద్దరూ ప్రమాదంలో చిక్కుకున్నప్పుడు కృపాచారి (మమ్ముట్టి) సహాయం చేసి వారి ప్రయాణానికి అండగా నిలుస్తాడు. అయితే అతడు ఎవరు? చావేరుళ్ కి ఎందుకు సహాయం చేశాడు? చివరికి సాముద్రి మహారాజును చావేరుళ్ చంపగలిగారా? అనేది సినిమా కథాంశం.

 

నటీ నటుల పనితీరు :

మమ్ముట్టీ నటన గురించి కొత్తగా చెప్పేదేముందు పాత్రలో ఒదిగిపోయే హీరోల్లో ఆయనొకరు. రెండు వేరియేషన్స్ ఉన్న క్యారెక్టర్ లో బాగా నటించాడు. ముఖ్యంగా యుద్ద సన్నివేశాల్లో ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాడు. చంద్రోత్ పానికర్ పాత్రలో ఉన్ని ముకుందన్ బాగా నటించాడు. ఆ పాత్రకు సరిగ్గా సరిపోయాడు కూడా. తరుణ్ అరోరా పాత్రలో విలనిజం కనిపించలేదు. ప్రాచీ తెహ్లాన్ నటనతో మెప్పించింది. కొన్ని సన్నివేశాల్లో మాస్టర్ అచ్యుతన్ నటన ఆకట్టుకుంటుంది. మోహన్ శర్మ, అను సితార, ప్రాచీ దేశాయ్, మాళవికా మీనన్, అభిరాం అయ్యర్ తదితరులు పాత్రలకు న్యాయం చేసారు.

 

సాంకేతిక వర్గం పనితీరు :

భారీ బడ్జెట్ సినిమాలకు టెక్నికల్ సపోర్ట్ ఉండాల్సిందే. లేదంటే ఎంత ఖర్చు పెట్టినా ఆ ఇంపాక్ట్ తీసుకురాలేరు. సినిమాకు పనిచేసిన ప్రతీ టెక్నీషియన్ బెస్ట్ అవుట్ పుట్ ఇచ్చాడు. ముఖ్యంగా మనోజ్ పిళ్ళై సినిమాటోగ్రఫీ సినిమాకు కలిసొచ్చింది. గ్రాండ్ విజువల్స్ అందించంచడంలో తెరపై అతని ప్రతిభ కనిపించింది. ఎం. జయచంద్రన్ కంపోజ్ చేసిన పాటలు బాగున్నాయి. కొన్ని యుద్ద సన్నివేశాలకు సంచిత్ బల్హారా & అంకిత్ బల్హారా అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. ఎడిటింగ్ పరవాలేదు. కమలకన్నన్ వి.ఎఫ్.ఎక్స్ వర్క్ ప్లస్ అయింది. శామ్ కౌశల్ కంపోజ్ చేసిన ఫైట్స్ ఎట్రాక్ట్ చేస్తాయి. కథ బాగున్నప్పటికీ కథనం మాత్రం బెడిసి కొట్టింది. ప్రొడక్షన్ వాల్యూస్ గ్రాండియర్ గా ఉన్నాయి.

 

జీ సినిమాలు సమీక్ష :

భారీ బడ్జెట్ తో ఓ సినిమా చేసే ముందు స్క్రిప్ట్ పై ఎక్కువ శ్రద్ధ పెట్టి బలమైన సన్నివేశాలు రాసుకోవాలి. ‘మామాంగం’కి సంబంధించి అదే పెద్ద మైనస్. బలమైన కథకు అంతే బలం చేకూర్చే కథనం కానీ సన్నివేశాలు కానీ పడలేదు. అక్కడే సినిమా తేడా కొట్టేసింది. హిస్టారికల్ స్టోరీ స్క్రీన్ మీదకి వచ్చే సరికి మరింత ఆసక్తిగా అనిపించాలి. కానీ ‘మామాంగం’ ఎక్కడా ఆసక్తికరంగా అనిపించదు.

సినిమా ఆరంభంలో ప్రేక్షకులు ఏదో ఉండబోతుందని ఎగ్జైట్ అయ్యే లోపే సెంటిమెంట్ సన్నివేశాలతో సినిమా నెమ్మదిగా సాగుతుంది. సన్నివేశాలు మరీ నత్తనడక సాగడంతో ప్రేక్షకుడు చాలా చోట్ల బోర్ ఫీలవుతాడు. అలా కాకుండా ప్రేక్షకులకు గొప్ప అనుభూతి కలిగించే సన్నివేశాలు పడుంటే సినిమా నెక్స్ట్ లెవెల్ లో ఉండేది. కేరళలో ప్రాచీన యుద్ధవిద్య కలరి నేపథ్యంలో రూపొందిన ఎమోషనల్ మూవీగా ‘మామాంగం’ ను తెరకెక్కించిన దర్శకుడు చాలా వరకూ తడబడి ప్రేక్షకులకు విసుగు తెప్పించాడు. ఒక ఆసక్తికర యుద్ధంతో సినిమా మొదలు పెట్టి , అక్కణ్ణుంచి కథను ఎక్కడికొ తీసుకెళ్ళాడు. కొన్ని సందర్భాల్లో కామన్ ఆడియన్ కి స్క్రీన్ మీద ఏం జరుగుతుందనేది అర్థం కానీ పరిస్థితి. ఆ సమయంలో స్క్రీన్ మీద ఏవో సన్నివేశాలు వస్తూ వెళ్తూ ఉన్నట్టుగా మాత్రమే ప్రేక్షకుడు ఫీలవుతాడు తప్ప పెద్దగా కనెక్ట్ అవ్వడు.

చావేరుళ్, సాముద్రి మహారాజులు మధ్య వైరం గురించి…. ఓపక్క మామాంగం మహోత్సవంలో భర్తలు, పిల్లలను కోల్పోయిన మహిళల బాధను, కోల్పోతామేమోనని బాధ పడుతున్న మహిళల ఆవేదనను చూపించే సన్నివేశాలు ఒకదాని తర్వాత మరొకటి వస్తాయి. మధ్యలో సాముద్రి మహారాజు అనుచరులు ప్రజలను ఏ విధంగా బాధ పెడుతున్నదీ చూపించే సన్నివేశాలు వస్తాయి. కానీ అవేవీ ఆకట్టుకోవు. యుద్ధం కంటే ఎమోషన్ మీద దర్శకుడు ఎక్కువ శ్రద్ధ పెట్టాడు. ఆ ఎమోషన్ కానీ, ఆ రాజుల కథ కానీ తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకునేలా లేవు. నిజానికి కేరళ ప్రజలకు మాత్రమే కనెక్ట్ అయ్యే కథ ఇది. మిగతా ప్రేక్షకులు మాత్రం కథకు పెద్దగా కనెక్ట్ అవ్వలేరు. యుద్ధం కంటే శాంతి ముఖ్యమని చెప్పే బుద్ధుడి లాంటి ఓ రాజు కథ ఇది. దాన్ని దర్శకుడు నేరుగా చెప్పకుండా… కన్ఫ్యూజ్ చేస్తూ కొన్ని మలుపులతో చెప్పాలని ప్రయత్నించాడు.ఈ సినిమా చూడాలంటే… కేరళ కలరి విద్య నేపథ్యంలో సన్నివేశాలు చూడాలనే ఆసక్తి మాత్రమే ఉంటే సరిపోదు. సహనం, శాంతి, ఓపిక కూడా కావాలి. ఇక చారిత్రక నేపథ్యంలో యుద్ధ సన్నివేశాలతో కూడిన గొప్ప సినిమా చూడాలని థియేటర్లకు వెళ్లిన ప్రేక్షకులకు మాత్రం నిరాశ తప్పదు.

రేటింగ్ : 2 /5