'మజ్ను' రివ్యూ

Friday,September 23,2016 - 03:28 by Z_CLU

నటీ నటులు : నాని, అను ఇమ్మానుయేల్, ప్రియా శ్రీ, పోసాని కృష్ణ మురళి , వెన్నెల కిషోర్, సత్య, సప్తగిరి.. తదితరులు.
సినిమాటోగ్రఫీ :జ్ఞాన శేఖర్
మ్యూజిక్ : గోపీసుందర్
నిర్మాణం : ఆనంది ఆర్ట్ క్రియేషన్స్ , కేవ మూవీస్.
నిర్మాతలు : పి.కిరణ్ , గీత గొల్ల
స్టోరీ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం : విరించి వర్మ

వరుసగా విజయాలు అందుకున్నాడు. ఓవర్సీస్ లో కూడా మార్కెట్ పెంచుకున్నాడు. దీంతో నాని అనే బ్రాండ్ ఒకటి క్రియేట్ అయిపోయింది. ఆ బ్రాండ్ వాల్యూమీదే ఇప్పుడు మజ్ను విడుదలైంది. మరి ఈ హైటెక్ మజ్ను… నాని బ్రాండ్ ను నిలబెట్టాడా… మీరే చదవండి..

majnu

కథ :
భీమవరంలో ఇంజినీరింగ్ చదువు పూర్తి చేసి బెంగళూరులో ఉద్యోగం సంపాదించి తన కెరీర్ ప్లాన్ చేసుకున్న ఆదిత్య(నాని) ఓ సందర్భం లో కిరణ్మయి(అను ఇమ్మానుయేల్) అనే అమ్మాయిని చూసి తొలి చూపులోనే ప్రేమిస్తాడు. అలా కిరణ్మయితో ప్రేమలో పడిన ఆదిత్య తన ఉద్యోగం పక్కన పెట్టి… భీమవరంలోనే ఉంటూ తాను చదివిన కాలేజ్ లోనే కిరణ్మయి చదువుకుంటోందని తెలుసుకొని ఆ కాలేజ్ లో ప్రిన్సిపల్ సాయంతో జూనియర్ లెక్చరర్ గా జాయిన్ అయ్యి కిరణ్మయి ను తన ప్రేమలో పడేస్తాడు. అలా ప్రేమలో పడిన వీరిద్దరు ఓ కారణం వల్ల విడిపోతారు. అలా కిరణ్మయి నుంచి దూరమైన ఆదిత్య… రాజమౌళి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా జాయిన్ అవుతాడు. కిరణ్మయిని మరిచిపోవడానికి మరో అమ్మాయి సుమ (ప్రియా శ్రీ) ని ప్రేమిస్తాడు . ఆదిత్య కిరణ్మయిను ప్రేమించిన విధానం చూసి అతని ప్రేమలో పడుతుంది సుమ. అసలు ఆదిత్య కిరణ్మయి ల ప్రేమ బ్రేకప్ కి కారణం ఏంటి? ఆదిత్య , కిరణ్మయి మళ్ళీ కలుస్తారా? కిరణ్మయిని గాఢంగా ప్రేమించిన ఆదిత్య చివరికీ వీరిద్దరిలో ఎవరి ప్రేమను పొందుతాడు? అనేది తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.

నటీనటుల పనితీరు :
ప్రతి సినిమాలో తన నేచురల్ నటనతో సినిమాకు హైలైట్ గా నిలిచే నాని ఈ సినిమాలో కూడా తన మేజిక్ చూపించాడు. పంచ్ డైలాగ్స్ తో మరోసారి ఆకట్టుకొని సినిమాకు హైలైట్ గా నిలిచాడు. ఆదిత్య పాత్రలో నాని అలరించిన తీరు ఆకట్టుకుంది. కిరణ్మయిగా అను ఇమ్మానుయేల్ తన నటనతో పరవాలేదనిపించుకుంది. సీనియర్ లెక్చరర్ గా పోసాని కాస్త కామెడీ పండించాడు. అలాగే బన్సాలి పాత్రతో వెన్నెల కిషోర్ కూడా అలరించాడు. సుమ పాత్రలో ప్రియ, కాశి పాత్ర లో సత్య, రామకోటి పాత్రలో సప్తగిరి తదితరులు తమ పాత్రలకు న్యాయం చేశారు.

టెక్నీషియన్స్ పనితీరు :
తన సినిమాటోగ్రఫీతో సినిమాకు అందం తీసుకొచ్చాడు కెమెరామెన్ జ్ఞాన శేఖర్. ముఖ్యంగా పల్లెటూరి లొకేషన్స్, పాటల చిత్రీకరణలో తన పనితనం చూపాడు. ఇక తనదైన మెలోడీ సంగీతం, బ్యాగ్రౌండ్ మ్యూజిక్ తో సినిమాకు హైలైట్ గా నిలిచాడు గోపీ సుందర్. ‘ఊరికే అలా’,’ఓయ్ మేఘం లా’ ‘కళ్లుమూసి’ పాటలకు సాహిత్యం బాగుంది. దర్శకుడు విరించి వర్మ మాటలు ఆకట్టుకున్నాయి. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి.

జీ సినిమాలు సమీక్ష :
ఉయ్యాల-జంపాల అనే సినిమాతో తొలి ప్రయత్నంలోనే దర్శకుడిగా మంచి విజయం అందుకున్న విరించి వర్మ… ఈ సినిమా కోసం చాలా గ్యాప్ తీసుకున్నాడు. ప్రేమకథ పాతదే అయినప్పటికీ… తనదైన స్క్రీన్ ప్లే తో ‘మజ్ను’ ను ఎంటర్ టైనింగ్ గా మార్చాడు. తొలిభాగం భీమవరంలో ప్రేమ సన్నివేశాలతో అలరించిన దర్శకుడు… సెకెండాఫ్ లో అక్కడక్కడ బోర్ కొట్టించినప్పటికీ ఓవరాల్ గా పరవాలేదనిపించాడు. నాని-అను ఇమ్మానుయేల్ మధ్య జరిగే రొమాంటిక్ సన్నివేశాలు, విరించి మాటలు సినిమాకు ప్లస్ . మరీ ముఖ్యంగా థియేటర్లలో అప్పుడప్పుడు నవ్వులు పూయడం మజ్నుకు ఇంకాస్త ప్లస్ అయింది. ఈ ప్రేమకథకు కావాల్సిన మంచి పాటలు అందించి సినిమాకు హైలైట్ గా నిలిచాడు గోపి సుందర్. గెస్ట్ పాత్రలో కనిపించిన రాజమౌళి సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచాడు. ముఖ్యంగా క్లైమాక్స్ లో నాని-రాజమౌళి మధ్య కామెడీ డైలాగ్స్ బాగా అలరించాయి. ఇక ఈ సినిమాలో మరో గెస్ట్ పాత్రలో ఉన్న కాసేపు అలరించాడు రాజ్ తరుణ్. మజ్ను అనే టైటిల్ ను బాగానే ప్రమోట్ చేసిన దర్శకుడు.. ఆ టైటిల్ కు పూర్తిస్థాయిలో జస్టిఫికేషన్ మాత్రం ఇవ్వలేకపోయాడు. ముఖ్యంగా సినిమా చూస్తున్నంతసేపు కొన్ని సన్నివేశాలు నత్తనడకన సాగుతున్నట్లు అనిపించడం కాస్త మైనస్. ఫైనల్ గా ‘మజ్ను’ యూత్ ఫుల్ ఎంటర్టైనర్ తో పరవాలేదనిపించుకున్నాడు..