'మజిలీ' మూవీ రివ్యూ

Friday,April 05,2019 - 02:17 by Z_CLU

న‌టీన‌టులు: అక్కినేని నాగచైతన్య, సమంత, దివ్యాంశ కౌశిక్, రావు ర‌మేష్, సుబ్బ‌రాజు, పోసాని కృష్ణ‌ముర‌ళి త‌దిత‌రులు

సంగీతం : గోపీసుంద‌ర్

సినిమాటోగ్ర‌ఫ‌ర్ : విష్ణువ‌ర్మ‌

సంస్థ‌: షైన్ స్క్రీన్స్

నిర్మాత‌లు: సాహు గ‌ర‌పాటి, హ‌రీష్ పెద్ది

ర‌చ‌న‌, ద‌ర్శ‌కుడు: శివ నిర్వాణ

సెన్సార్ : U/A

నిడివి : 154 నిమిషాలు

రిలీజ్ డేట్ : ఏప్రిల్ 5, 2019

పెళ్లి తర్వాత నాగచైతన్య-సమంత కలిసి సినిమా చేయడం, ‘నిన్ను కోరి’ లాంటి సూపర్ హిట్ తర్వాత శివ నిర్వాణ డైరెక్షన్ , టీజర్, ట్రైలర్ ఎట్రాక్ట్ చేయడం…. ఇవన్నీ కలిసి ‘మజిలీ’ ను స్పెషల్ మూవీ చేసాయి. మరి రియల్ లైఫ్ భార్య భర్తలు రీల్ లైఫ్ భార్యభర్తలుగా మరో సారి మేజిక్ చేసారా..? మజిలీ చైతు కి హిట్ అందించిందా…? జీ సినిమాలు ఎక్స్ క్లూజీవ్ రివ్యూ.

కథ :

విశాఖపట్నంలోని జ్ఞానపురం రైల్వే కాలనీలో ఉండే పూర్ణ(నాగ చైతన్య) లక్ష్యంగా భావించే క్రికెట్ ని సైతం వదులుకొని తను ప్రేమించిన అమ్మాయి అన్షు(దివ్యాంశ కౌశిక్)నే తలుచుకుంటూ ఆమె ద్యాసలో మద్యానికి బానిసవుతాడు. తప్పని పరిస్థితుల్లో తన తండ్రి కోసం ఎదురింట్లో ఉండే శ్రావణి(సమంత) ని పెళ్లి చేసుకుంటాడు.

నిత్యం ప్రేమించి దూరంగా వెళ్ళిపోయిన ప్రియురాలిని తలుచుకుంటూ భార్య శ్రావణి సంపాదన మీదే ఆధారపడతాడు. పూర్ణ ఎప్పటికైనా ప్రియురాలిని మరిచిపోయి అతని మనసుకి తగిలిన గాయం మానాలని అనుకుంటుంది శ్రావణి. ఇక భార్యాభర్తలుగా ఎప్పటికీ కలవరనుకునే సమయంలో డెహ్రాడూన్ వెళ్లి క్రికెటర్ అవ్వాలనుకునే మీరా అనే పాపని విశాఖపట్నం తీసుకొచ్చి తనకి క్రికెట్ ట్రైనింగ్ ఇస్తాడు. ఈ క్రమంలో శ్రావణికి భర్తగా దగ్గరవుతాడు పూర్ణ. చివరికి శ్రావణి -పూర్ణ భార్యాభర్తలుగా ఎలా ఒక్కటయ్యారు..? ఇంతకీ మీరా ఎవరు..? పూర్ణ, మీరాని ఎందుకు క్రికెటర్ గా తీర్చిదిద్దాలనుకున్నాడు.. అనేవి తెలియాలంటే మజిలీ చూడాల్సిందే.

 

నటీనటుల పనితీరు :

మజిలీతో చైతు నటుడిగా మరో మెట్టెక్కాడు. పూర్ణ క్యారెక్టర్ తో కొన్ని ఎమోషనల్ సన్నివేశాల్లో బెస్ట్ అనిపించుకున్నాడు. శ్రావణి క్యారెక్టర్ లో సమంత సినిమాకు ప్లస్ అయ్యింది. సెకండ్ హాఫ్ లో వచ్చే సమంత క్యారెక్టర్ కి అందరూ కనెక్ట్ అవ్వాల్సిందే. మనసు గాయపడిన భర్తకి గొప్ప భార్యగా మంచి నటన కనబరిచింది సామ్. దివ్యాంశ కౌశిక్ కి డెబ్యూ సినిమాకే మంచి క్యారెక్టర్ దొరికింది. అన్షు క్యారెక్టర్ లో బెస్ట్ అనిపించుకుంది. రావు రమేష్ మరో బెస్ట్ క్యారెక్టర్ లో కనిపించాడు. పోసాని తన కామెడీ టైమింగ్ తో ఎంటర్ టైన్ చేసాడు. స్నేహితుడి క్యారెక్టర్స్ లో సుహాస్, సుదర్శన్ ఆకట్టుకున్నారు. మిగతా నటీ నటులంతా తమ నటనతో పరవాలేదనిపించుకున్నారు.

 

సాంకేతిక వర్గం పనితీరు :

సినిమాకు గోపీసుందర్ అందించిన మ్యూజిక్ పరవాలేదు. ‘ప్రియతమా’ పాట బాగుంది. కొన్ని సందర్భాల్లో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ లా వచ్చే ‘ఏడేత్తు మల్లెలే’ పాట కూడా ఆకట్టుకుంది. కాని అక్కడక్కడ కాకుండా పూర్తి పాటగా ఎక్కడైన ప్లేస్ చేసి ఉంటే ఇంకా బాగుండేది. కొన్ని ఎమోషనల్ సన్నివేశాలకు తమన్ అందించిన నేపథ్య సంగీతం చక్కగా కుదిరింది. భాస్కరభట్ల , రాంబాబు గోసాల, చైతన్య ప్రసాద్ సాహిత్యంతో పాటు శివ నిర్వాణ సాహిత్యం శ్రోతలను ఆకట్టుకుంది.

విష్ణు వ‌ర్మ‌ సినిమాటోగ్రఫీ బాగుంది. ప‌్ర‌వీణ్ పూడి ఎడిటింగ్ బాగుంది కానీ రెండో భాగంలో ఇంకొంత ట్రిమ్ చేసి నిడివి తగ్గించి ఉంటే బెటర్ గా ఉండేది. వెంక‌ట్ కంపోజ్ చేసిన ఫైట్స్ పెద్దగా ఇంపాక్ట్ క్రియేట్ చేయలేదు. శివ నిర్వాణ స్క్రీన్ ప్లే ఆకట్టుకుంది. ఎమోషనల్ సన్నివేశాలను అనుభవం ఉన్న దర్శకుడిగా డీల్ చేశాడు. షైన్ స్క్రీన్స్ ప్రొడక్షన్ వేల్యూస్ బాగున్నాయి.

జీ సినిమాలు సమీక్ష :

ఫెయిల్యూర్ లవ్ స్టోరీతో ఒక ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామాను క్రియేట్ చేయడం చాలా సులువు. ఆ ఫెయిల్యూర్ వ్యక్తి తాలూకు స్టోరీ ని పర్ఫెక్ట్ గా చూపించగలిగితే ప్రేక్షకులు సినిమాకు ఇట్టే కనెక్ట్ అవుతారు. మొదటి సినిమా ‘నిన్నుకోరి’ను అదే ఫార్ములాతో సూపర్ హిట్ సినిమా చేయగలిగాడు దర్శకుడు శివ. అందుకే ఈసారి కూడా అదే ఫార్ములాని నమ్ముకొని ‘మజిలీ’ను తెరకెక్కించాడు. కాకపోతే ఈసారి రెండు అంశాలపై దృష్టి పెట్టి కథ రాసుకున్నాడు.

ప్రస్తుత కథతో సినిమాను మొదలుపెట్టిన దర్శకుడు పది నిమిషాల్లోనే ఫ్లాష్ బ్యాక్ ను ఓపెన్ చేస్తాడు. ఇక స్లోగా ఉంటుందనుకునే ఫ్లాష్ బ్యాక్ ను స్పీడ్ గా చూపించి, సెకండ్ హాఫ్ ని మాత్రం స్లో నెరేషన్ తో చూపించాడు. అదే సినిమాకు మైనస్. సమంతా క్యారెక్టర్ సెకండ్ హాఫ్ ని కొంత వరకూ సేవ్ చేసింది. రియల్ లైఫ్ భార్యాభర్తలు రీల్ లైఫ్ లోనూ అదరగొట్టేసారు. చైతూ-సమంత మధ్య వచ్చే సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. లవ్ స్టోరీకి బెస్ట్ మ్యూజిక్ అందించే గోపి ఈసారి తన మేజిక్ క్రియేట్ చేయలేకపోయాడు. ప్రియతమా, ఎడేత్తు మల్లెలే పాటలు మినహా మిగతా పాటలు ప్రేక్షకుడిని ఆకట్టుకోలేదు. ఇలాంటి సినిమాలకు మంచి పాటలు కుదిరితే ప్రేక్షకుడికి మంచి ఫీల్ ఉంటుంది. అది మజిలీలో మిస్ అయ్యింది. థమన్ నేపథ్య సంగీతం మాత్రం కొన్ని సన్నివేశాలను ఎలివేట్ చేసింది.

ఫెయిల్యూర్ లవ్ స్టోరీ అంటే యూత్ కి కనెక్ట్ అయ్యే డైలాగ్స్ సంచుల కొద్ది ఉండాలి. అయితే హీరో క్యారెక్టర్ ని దృష్టిలో పెట్టుకుని అలాంటివి పెద్దగా రాసుకోలేదు దర్శకుడు. ట్రైలర్ లో పేలిన ఒకే ఒక్క డైలాగ్ మాత్రమే సినిమాలో ఉంది. అది యూత్ కి బాగా కనెక్ట్ అయ్యింది. అది మినహా సినిమాలో చెప్పుదగిన డైలాగ్స్ పెద్దగా లేవు. సినిమాలో హైలైట్ అవుతుందనుకునే క్రికెట్ నేపథ్యంలో వచ్చే సన్నివేశాలు ఆకట్టుకోలేదు. సెకండ్ హాఫ్ లో భార్యాభర్తల మధ్య వచ్చే ట్రాక్ ని మాత్రం బాగా తెరకెక్కించాడు శివ. పూర్ణ తాలూకు బాధ ని పర్ఫెక్ట్ గా చూపించాడు. డెహ్రాడూన్ ఎపిసోడ్ అంత కన్విన్సింగ్ గా లేదు. సెకండ్ హాఫ్ ని మరీ స్లో గా తెరకెక్కించిన దర్శకుడు ఫస్ట్ హాఫ్ కి కూడా చాలా టైం తీసుకున్నాడు. కొన్ని సన్నివేశాలు గతంలో చూసిన ఫెయిల్యూర్ లవ్ స్టోరీస్ సినిమాలను గుర్తుచేస్తాయి.

క్యారెక్టర్స్, స్క్రీన్ ప్లే, కొన్ని ఎమోషనల్ సన్నివేశాలు సినిమాకు ప్లస్ పాయింట్స్ అనిపించగా, సెకండ్ హాఫ్ లో సినిమా మరీ నెమ్మదిగా సాగడం, చూసిన కథే అనిపించడం, ప్రీ క్లైమాక్స్ ఎపిసోడ్స్, ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే లవ్ ట్రాక్ మైనస్.

ఫైనల్ గా ‘మజిలీ’ ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామాగా అందర్నీ మెప్పిస్తుంది.

రేటింగ్ : 3 / 5