'మహానటి' మూవీ రివ్యూ

Wednesday,May 09,2018 - 01:41 by Z_CLU

నటీనటులు : కీర్తిసురేష్, దుల్కర్ సల్మాన్, సమంత, విజయ్ దేవరకొండ, డా. మోహన్ బాబు, డా.రాజేంద్ర ప్రసాద్, ప్రకాష్ రాజ్,మాళవిక నాయర్,భాను ప్రియ,షాలిని పాండే, దివ్య వాణి, క్రిష్, తరుణ్ భాస్కర్, సందీప్ రెడ్డి వంగ, శ్రీనివాస్ అవసరాల, మహేష్ ఆచంట తదితరులు..

సంగీతం : మిక్కీ జె.మేయర్

ప్రొడక్షన్ డిజైన్ : శివం

ఆర్ట్ : అవినాష్

కాస్ట్యూమ్స్ : గౌరాంగ్, అర్చన

స్టైలిస్ట్: ఇంద్రాక్షి

కెమెరా: డాని

ఎడిటర్: కోటగిరి వెంకటేశ్వర్రావు

దర్శకత్వం: నాగ అశ్విన్

నిర్మాత : ప్రియాంక దత్

నిర్మాణం : వైజయంతీ మూవీస్, స్వప్న సినిమాస్

నిడివి : 2 గంటల 56 నిమిషాలు

సెన్సార్ : U

 

కొన్ని సినిమాలు తీయాలంటే ఎంతో ధైర్యం కావాలి. అంతకుమించి మరెంతో రీసెర్చ్ చేయాలి. ఈ రెండింటితో పాటు భారీగా ఖర్చు పెట్టాలి. ‘మహానటి’ సినిమాకు ఇవన్నీ చక్కగా సెట్ అయ్యాయి. అలనాటి మేటి నటి సావిత్రి బయోపిక్ గా ఈరోజు థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా అంచనాల్ని అందుకుందా..? అందర్నీ మెప్పించిందా..? జీ సినిమాలు ఎక్స్ క్లూజివ్ రివ్యూ.

కథ :

ప్రజావాణి పత్రికలో జూనియర్ రిపోర్టర్ గా పనిచేసే మధురవాణి(సమంత) కి మహానటి సావిత్రి(కీర్తి సురేష్) కోమాలో ఉందని ఆ వార్తను ప్రత్యేకంగా కవర్ చేయమని తమ పత్రిక అధినేత పురమాయిస్తారు. అయితే సావిత్రి జీవితానికి సంబంధించి అప్పటికే చాలా వార్తలు రావాడంతో మధురవాణి కి ఆ వార్త పెద్ద ఆసక్తి గా అనిపించదు. అలా అయిష్టంగానే ఆ వార్తను కవర్ చేసే భాద్యతను స్వీకరించిన మధురవాణి పత్రిక ఫోటో జర్నలిస్ట్ విజయ్ అంటోనీ (విజయ్ దేవరకొండ) తో కలిసి సావిత్రి జీవితాన్ని ప్రజలకు తెలిపే ప్రయత్నం చేస్తుంది. ఈ క్రమంలో సావిత్రి నటిగా ఎలా మారింది.. అలా సినీ నటిగా మారే క్రమంలో జెమినీ గణేషన్(దుల్కర్ సల్మాన్) ఎలా దగ్గరైంది.. మహానటి గా ఎవరికీ సాధ్యపడని  వైభవం అందుకున్నాక ఆమె జీవితంలో ఎలాంటి విషాదఛాయలు అల్లుకున్నాయి. చివరికి సావిత్రి జీవితం ఎలా ముగిసింది.. అనేది మిగతా కథ.

 

 

నటీనటుల పనితీరు :

మహానటిలో భారీ స్టార్ కాస్ట్ ఉంది. మోహన్ బాబు, రాజేంద్రప్రసాద్ లాంటి మహామహుల నుంచి షాలినీపాండే, విజయ్ దేవరకొండ లాంటి యూత్ స్టార్స్ వరకు చాలామంది ఉన్నారు ఈ సినిమాలో. కానీ ఎవరూ ఎక్కువ కాదు. ఎవరూ తక్కువ కాదు. అంతా మహానటి మూవీలో అలా ఒదిగిపోయారు. ముందుగా చెప్పుకోవాల్సింది కీర్తిసురేష్ గురించే. సావిత్రి పాత్రకు జీవంపోసింది కీర్తిసురేష్. ఇకపై ఈమెను చూస్తే సావిత్రి గుర్తుకొచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు. కేవలం లుక్ లోనే కాకుండా.. సావిత్రిలా ఎక్స్ ప్రెషన్స్ ఇవ్వడం, ఆ కళ్లు తిప్పడం, మూతి ముడవడం, వయ్యారంగా నడవడం, చీర చెంగు చుట్టుకోవడం.. ఇలా ఒకటేంటి.. అచ్చుగుద్దినట్టు సావిత్రిలా మారిపోయింది కీర్తిసురేష్.

జెమినీ గణేశన్ పాత్రలో దుల్కర్ సల్మాన్ యాప్ట్ అనిపించుకున్నాడు. ఫస్టాఫ్ లో కీర్తి-దుల్కర్ మధ్య కెమిస్ట్రీ అద్భుతంగా పండింది. సెకెండాఫ్ లో వీళ్లిద్దరి మధ్య ఎమోషన్స్ కూడా అదే రేంజ్ లో ఉన్నాయి.

ఇక మాయాబజార్ ఎపిసోడ్ లో ఎస్వీఆర్ పాత్రలో మోహన్ బాబు నటవిశ్వరూపాన్ని చూడొచ్చు. కేవీ రెడ్డిలా క్రిష్, ఎల్వీప్రసాద్ గా అవసరాల, కేవీ చౌదరిగా రాజేంద్రప్రసాద్, చక్రపాణిగా ప్రకాష్ రాష్, సుశీలగా షాలినీ పాండే.. సింగీతం శ్రీనివాస్ గా తరుణ్ భాస్కర్, సత్యం గా మహేష్  చేసినవి చిన్నచిన్న పాత్రలే అయినప్పటికీ.. మరపురాని పాత్రల్లో మనకు తెలిసిన స్టార్లు అలా కనిపిస్తుంటే ఆ కిక్కే వేరు.

ఈ మొత్తం ఎపిసోడ్ లో సమంత, విజయ్ దేవరకొండ గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి. సావిత్రి బయోపిక్ తో ఎలాంటి సంబంధం లేనప్పటికీ.. కథను నడిపించింది వీళ్లిద్దరే. ఇంతమంది నటీనటుల మధ్య నాగచైతన్య భలే హైలెట్ అయ్యాడు. యంగ్ ఏఎన్నార్ లా మెస్మరైజ్ చేశాడు. 2 రోజుల కాల్షీట్లలోనే కీర్తి-చైతూ మధ్య అన్ని సీన్లు ఎలా తీశారో అనిపిస్తుంది.

 

టెక్నీషియన్స్ పనితీరు :

టెక్నికల్ గా ఈ సినిమాను టాప్ క్లాస్ గా చెప్పుకోవాలి. పద్మశ్రీ తోట తరణి పర్యవేక్షణలో అదిరిపోయే సెట్స్ తో అవినాష్ ఇరగదీస్తే, డానీ తన సినిమాటోగ్రఫీతో 60, 70ల నాటి ఫీల్ తీసుకొచ్చాడు. ఇక గౌరంగ్, అర్చన తమ కాస్ట్యూమ్ డిజైనింగ్ తో సినిమా మొత్తం తమ మార్క్ చూపించారు.

ఇవన్నీ ఒకెత్తయితే మిక్కీ జే మేయర్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మరో ఎత్తు. కొన్ని సందర్భాల్లో ఈ సంగీత దర్శకుడు సినిమాటిక్ ఫ్రీడమ్ తీసుకున్నప్పటికీ ఎక్కడా ఫీల్ చెడకుండా బ్రహ్మాండమైన ఔట్ పుట్ ఇచ్చాడు. కొన్ని సందర్భాల్లో సాయి మాధవ్ బుర్రా అందించిన మాటలు సన్నివేశాలకు ప్రాణం పోశాయి. ఇలాంటి బయోపిక్ ను వెండి తెరపై తీసుకొచ్చే ప్రయత్నమే ఎంతో గొప్పది. ఇక వైజయంతీ మూవీస్, స్వప్న సినిమాస్ ప్రొడక్షన్ వాల్యూస్ రిచ్ గా ఉన్నాయి. సెట్స్, మేకింగ్ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా నిర్మించారు. ఈ సినిమాకు అవార్డులు వస్తే అందులో కచ్చితంగా ఎక్కువ అవార్డులు టెక్నికల్ టీమ్ కే వస్తాయి.

జీ సినిమాలు రివ్యూ :

కొన్ని సినిమా ఆలోచనలు ఎందుకు, ఎలా పుడతాయో తెలీదు. సావిత్రి జీవితాన్ని సినిమాగా తీయాలనే ఆలోచన రావడమే గొప్ప. అలాంటి ఆలోచనను నిజాయితీగా తెరపైకి తీసుకురావడం మరో పెద్ద విశేషం. అలాంటి సినిమాలో భారీ స్టార్ కాస్ట్ ను పెట్టడం, ఖర్చుకు వెనకాడకుండా తీయడం మరో పెద్ద సాహసం. అందుకే మహానటి అందరికీ నచ్చింది. ఓ అద్భుత దృశ్యకావ్యంగా, మేటనటి సావిత్రికి సిసలైన ట్రిబ్యూట్ మూవీగా నిలిచింది.

ఈ బయోపిక్ ఆలోచన నాగ్ అశ్విన్ దే అయినప్పటికీ.. కీర్తిసురేష్ ఆ ఆలోచనకు ప్రాణం పోసింది. వెండితెరపై నిండైన కీర్తిని చూస్తుంటే, సావిత్రి మళ్లీ పుట్టిందా అనే ఫీలింగ్ కలుగుతుంది. టెక్నికల్ గా చేసిన కలర్ కరెక్షన్లు, కెమెరా యాంగిల్స్, వేసిన సెట్స్, వాడిన కాస్ట్యూమ్స్, మేకప్ ఇవన్నీ మనకు సావిత్రిని కళ్లముందు కనిపించేలా చేశాయి. ఒక్క ముక్కలో చెప్పాలంటే సినిమా సక్సెస్ లో 50 శాతం వాటా దర్శకుడిదైతే, మిగతా క్రెడిట్ అంతా కీర్తిదే.

పేరుకు ఇది బయోపిక్ అయినప్పటికీ… సినిమా ఫస్టాఫ్ మొత్తం కమర్షియల్ ఫార్మాట్ లోనే సాగుతుంది. సావిత్రి, జెమినీ గణేశన్ మధ్య లవ్ లైఫ్ ను చక్కగా చూపించారు. ఇక సెకెండాఫ్ కు వచ్చేసరికి సావిత్రి జీవితంలోని విషాదకరమైన ఘటనల్ని చెప్పాల్సి రావడంతో ఫ్లో కాస్త నెమ్మదిస్తుంది. కానీ ఇది కంప్లయింట్ కాదు. ఓ మహానటి జీవితాన్ని నిజాయితీగా తెరకెక్కించే క్రమంలో ఇలాంటివి తప్పదు. ఈ విషయంలో తప్పు పట్టాల్సిన అవసరమే లేదు.

సినిమాలో నటీనటులంతా దాదాపు తమ సొంత గొంతునే వినిపించారు. మైనస్ అవుతుందేమో అని చాలామంది భయపడినప్పటికీ, మూవీకి అది కూడా ప్లస్ అయింది. యంగ్ ఏఎన్నార్ లా నాగచైతన్య, డిజిటల్ రూపంలో వచ్చిన ఎన్టీఆర్ మహానటికి స్పెషల్ ఎట్రాక్షన్స్ గా నిలిచారు. ఏఎన్నార్ లా చైతూ తెరపైకి రాగానే థియేటర్లు ఈలలు, చప్పట్లతో మారుమోగిపోయాయి.

దర్శకుడిగా నాగ్ అశ్విన్ కిది రెండో సినిమా…అనే సందేహం అందరికీ కలుగుతుంది. అంతలా ఒక అనుభవం ఉన్న దర్శకుడిగా ఈ సినిమాను డీల్ చేశాడు నాగ్ అశ్విన్. ముఖ్యంగా క్యారెక్టర్స్ కు తగ్గ నటీనటులు, మంచి సాంకేతిక నిపుణులను ఎంచుకొని అక్కడే విజయం సాదించాడు. నాగ్ అశ్విన్ క్లైమాక్స్ ఎలా డీల్ చేస్తాడా..అనే ప్రశ్నకి పర్ఫెక్ట్ క్లైమాక్స్ తో సమాధానం చెప్పాడు.

ఓవరాల్ గా ‘మహానటి’ సినిమా ఓ సరికొత్త అనుభూతిని ప్రేక్షకులకు అందిస్తుంది. ఈ తరం ఓ మహానటి జీవితాన్ని తెలుసుకోవడంతో పాటు.. 60ల నాటి సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ ను ఎంజాయ్ చేస్తుంది.

బాటమ్ లైన్ – సావిత్రి మళ్లీ పుట్టింది

రేటింగ్ 3.5 /5