Movie Review - మాస్ట్రో

Friday,September 17,2021 - 08:28 by Z_CLU

నటీనటులు : నితిన్ , తమన్నా , నభా నటేష్ , నరేష్, జిషుసేన్ గుప్తా, రచ్చ రవి తది తరులు

సంగీతం : మహతి సాగర్

కెమెరామెన్ : యువరాజ్

నిర్మాణం : శ్రేష్ట్ మూవీస్

నిర్మాతలు : సుధాకర్ రెడ్డి , నిఖితా రెడ్డి

కథ : శ్రీరామ్ రాఘవన్

దర్శకత్వం : మేర్లపాక గాంధి

విడుదల తేది : 17 సెప్టెంబర్ 2021

బాలీవుడ్ బ్లాక్ బ్లాక్ బస్టర్ హిట్ ‘అంధాదున్’ ని తెలుగులో మాస్ట్రో టైటిల్ తో రిమేక్ చేశాడు హీరో నితిన్. మేర్లపాక గాంధి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా OTT ద్వారా ఈరోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది? మరి ఈ రీమేక్ ఒరిజినల్ ఇంపాక్ట్ తీసుకొచ్చిందా? తన నటనతో నేషనల్ అవార్డ్ అందుకున్న ఆయుష్మాన్ ఖురానాని నితిన్ మ్యాచ్ చేశాడా? జీ సినిమాలు ఎక్స్ క్లూజీవ్ రివ్యూ.

maestro movie telugu review zeecinemalu
కథ :

గోవాలో పియానో ప్లేయర్ గా ఉంటూ అందరినీ అంధుడిగా నమ్మించే అరుణ్ (నితిన్) కి ఓ సందర్భంలో రోడ్డు దాటిస్తూ సోఫి(నభా) పరిచయమవుతుంది. మొదటి చూపులోనే ఆమెతో ప్రేమలో పడతాడు అరుణ్. అంధుడు అయినప్పటికీ అతని టాలెంట్ చూసి అరుణ్ ప్రేమలో పడుతుంది సోఫీ.

అయితే సోఫీ ప్రేమతో సాఫీగా సాగిపోయే అరుణ్ జీవితంలో ఓ అనుకోని సంఘటన జరుగుతుంది. ప్రియుడు SI బాబీ (జిషు సేన్ గుప్తా)తో కలిసి తన భర్త మోహన్(VK నరేష్)ను హతమారుస్తుంది సిమ్రన్ (తమన్న). ఆ సంఘటన చూసిన అరుణ్ అది ఎవరికీ చెప్పలేని పరిస్థితుల్లో చిక్కుకుంటాడు. ఇక అరుణ్ కు కళ్లు ఉన్నాయని, అతడు మర్డర్ చూశాడని తెలుసుకున్న సిమ్రన్-బాబీ అతన్ని చంపాలని చూస్తారు. ఈ క్రమంలో సిమ్రాన్, అరుణ్ కి నిజంగానే కంటిచూపు పోయేలా చేస్తుంది. ఫైనల్ గా వారిద్దరి నుండి అరుణ్ ఎలా తప్పించుకున్నాడనేది ? మిగతా కథ.

నటీనటుల పనితీరు :

అరుణ్ గా అంధుడి పాత్రలో నితిన్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. కానీ ఆయుష్మాన్ ఖురానా యాక్టింగ్ ని పూర్తి స్థాయిలో మ్యాచ్ చేయలేకపోయాడు.  ఆయుష్మాన్ ఖురానా కి నటుడిగా నేషనల్ అవార్డు తెచ్చిపెట్టిన ఇలాంటి చాలెంజింగ్ క్యారెక్టర్ చేయడం నితిన్ చేసిన పెద్ద సాహసం అని చెప్పొచ్చు. ఆ సాహసానికి కచ్చితంగా నితిన్ ని మెచ్చుకోవాలి. నితిన్ కాస్త హోమ్ వర్క్ చేసినట్టయితే, ఈ పాత్ర ఇంకా బాగా పండేది. అయితే ఎలాంటి హోమ్ వర్క్ చేయకుండానే ఇలా నటించాడంటే చెప్పుకోదగ్గ విశేషమే.

ఇక ఇప్పటివరకు చూడని ఓ బోల్డ్ క్యారెక్టర్ చేసిన తమన్నా ఆ క్యారెక్టర్ కి నటిగా పర్ఫెక్ట్ అనిపించుకుంది. హిందీలో టబు చేసిన క్యారెక్టర్ ని ఉన్నంతలో బాగానే చేసింది. కానీ సొంత డబ్బింగ్ చెప్పుకోవడం తేడా కొట్టింది. నభా తన నటనతో ఆకట్టుకుంది. మోహన్ పాత్రలో నరేష్ ఫరవాలేదనిపించుకున్నాడు. విలన్ గా జిషు సేన్ గుప్తా సరిగ్గా కుదిరాడు. అనన్య, హర్ష వర్ధన్, శ్రీనివాస రెడ్డి, మంగ్లీ, రచ్చరవి వారి పాత్రలకు బెస్ట్ అనిపించుకున్నారు.

సాంకేతిక వర్గం పనితీరు :

ఇలాంటి డార్క్ కామెడీ క్రైం థ్రిల్లర్ సినిమాలకు అదిరిపోయే బ్యాక్ గ్రౌండ్ స్కోర్, మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేసే సినిమాటోగ్రఫీ చాలా ఇంపార్టెంట్. సాగర్ మహతి బెస్ట్ స్కోర్ అందించి సన్నివేశాలకు మంచి ఇంపాక్ట్ తీసుకొచ్చాడు. అలాగే యువరాజ్ విజువల్స్ కూడా కలిసొచ్చాయి. SR శేఖర్ ఎడిటింగ్ పరవాలేదు. అక్కడక్కడా డ్రాగ్ అనిపించే కొన్ని షాట్స్ తీసేసి ట్రిమ్ చేసి ఉంటే బాగుండేది. సాహి సురేష్ ఆర్ట్ వర్క్ బాగుంది.

శ్రీరామ్ రాఘవన్ రాసిన ఒరిజినల్ కథ-స్క్రీన్ ప్లే ను యాజ్ ఇటీజ్ గా మాస్ట్రోలో కూడా వాడారు. ఆ ఎత్తుగడ పనిచేసింది. దర్శకుడు మేర్లపాక గాంధీ కొన్ని సన్నివేశాలను బాగా డీల్ చేసి కొంతవరకు ఒరిజినల్ ఇంపాక్ట్ తీసుకు రాగలిగాడు. ఒరిజినల్ వెర్షన్ కు అతడు చేసిన మార్పులు కూడా బాగున్నాయి. శ్రేష్ఠ్ మూవీస్ ప్రొడక్షన్ వాల్యూస్ కథకి తగ్గట్టుగా ఉన్నాయి.

maestro movie telugu review zeecinemalu
జీ సినిమాలు సమీక్ష :

కొన్ని సినిమాలు కొన్ని భాషల్లో బాగా వర్కౌట్ అవుతాయి. కానీ ఆ సోల్ మిస్ అవ్వకుండా వేరే నటీనటులతో అదే ఇంపాక్ట్ తీసుకురావడం అంటే కొంచెం కష్టమే. అయితే ఈ విషయంలో దర్శకుడు మేర్లపాక చాలా వరకు సక్సెస్ అయ్యాడు. ముఖ్యంగా పెద్దగా మార్పులు లేకుండా కేవలం కొన్ని మార్పులు మాత్రమే చేసి మక్కికిమక్కీ దించేశాడు. ఇక హిందీలో ఆయుష్మాన్ ఖురానా చేసిన పెర్ఫార్మెన్స్ ని మ్యాచ్ చేయడం ఇంపాసిబుల్ అనే చెప్పాలి. ఎందుకంటే అతనికి ఆ సినిమాలో నటనకు గానూ బెస్ట్ యాక్టర్ గా నేషనల్ అవార్డు తెచ్చి పెట్టింది. కానీ నితిన్ ఆ సాహసం చేసి మెప్పించాడు. ఒరిజినల్ చూసిన వారికి అయుష్మాక్ ఖురానా ని మ్యాచ్ చేయలేకపోయాడు అనిపించొచ్చు కానీ చూడని వారు మాత్రం అరుణ్ పాత్రలో నితిన్ నటనకి ఇంప్రెస్ అవుతారు. ఇకపై నితిన్ ఈ జానర్ సినిమాలకు కూడా సూటవుతాడనే ఒపినియన్ కలుగుతుంది.

ఇక టబు చేసిన పాత్రను తమన్నా చేయబోతుంది అని ఎనౌన్స్ చేసినప్పుడు సోషల్ మీడియాలో కొన్ని కామెంట్స్ వచ్చాయి. కానీ సినిమా చూశాక తన నటనతో తమన్నా ఆ రోల్ కి పర్ఫెక్ట్ అనిపిస్తుంది. క్యారెక్టర్స్ కి పర్ఫెక్ట్ అనిపించే నటీనటులను ఎంచుకోవడంలో దర్శకుడు మేర్లపాక మంచి మార్కులు అందుకున్నాడు. అలాగే ఈ రీమేక్ ని ఫెయిత్ ఫుల్ గా తీసి బాగానే హ్యాండిల్ చేశాడు. ముఖ్యంగా డార్క్ కామెడీ క్రైం థ్రిల్లర్ జానర్ తనకి కొత్త అయినప్పటికీ రీమేక్ కావడంతో చాలా ఈజీగా తీసేశాడు.

సినిమాకు ఆర్టిస్ట్ ల నుండే కాదు టెక్నీషియన్స్ నుండి కూడా మంచి సపోర్ట్ అందింది. ముఖ్యంగా సాగర్ మహతి మ్యూజిక్, యువరాజ్ విజువల్స్ సినిమాకు ప్లస్ అయ్యాయి. ముఖ్యంగా అరుణ్ మోహన్ మర్డర్ చూసే సన్నివేశంతో పాటు రెండో మర్డర్ కూడా చూసే సన్నివేశాలు అలరించాయి. ఇక అంధాదున్ అదిరిపోయే స్క్రీన్ ప్లే బేస్డ్ ఫిలిం. ముఖ్యంగా సెకండ్ హాఫ్ స్క్రీన్ ప్లే సినిమాకు ఆయువుపట్టులా నిలిచాయి. ఇందులో కూడా ఫ్రేమ్ టు ఫ్రేమ్ దించేసారు కాబట్టి మాస్ట్రో కి కూడా కథ -స్క్రీన్ ప్లే ప్రధాన బలం అని చెప్పొచ్చు. కానీ కథ జరిగే నేపథ్యం మన నేటివిటీకి దగ్గరగా ఉండదు. కథ అంతా గోవాలో జరుగుతుంది కాబట్టి తెలుగు ఆడియన్స్ కి ఆ నేపథ్యం కనెక్ట్ అవ్వదు. కేవలం నటీనటులు మాత్రమే మన నేటివిటీ ని గుర్తుచేస్తారు.

ఫైనల్ గా అంధాదున్ చూడని వారికి మాస్ట్రో నచ్చుతుంది. ముఖ్యంగా డార్క్ థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడే వారికి ఇంకాస్త ఎక్కువగా నచ్చుతుంది. కానీ ఒరిజినల్ చూసిన వారికి మాత్రం ఫరవాలేదనిపిస్తుంది. అక్కడ నటీనటుల ఇంపాక్ట్ కావొచ్చు లేదా చూసిన కథే కదా అనిపించొచ్చు వీటి వల్ల ఒరిజినల్ ఒరిజినలే అనిపిస్తుంది.

ప్లస్ పాయింట్స్

నితిన్ , తమన్నా నటన

కథ -స్క్రీన్ ప్లే

కొన్ని థ్రిల్ చేసే సన్నివేశాలు

బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్

సినిమాటోగ్రఫీ

ప్రీ క్లయిమాక్స్ – క్లయిమాక్స్

మైనస్ పాయింట్స్

స్లోగా సాగే డ్రామా

ఫస్ట్ హాఫ్ లో కొన్ని బోర్ కొట్టే సన్నివేశాలు

కొన్ని సందర్భాల్లో డ్రాగ్ అనిపించడం

రేటింగ్   2.75/5