'మధ' మూవీ రివ్యూ

Friday,March 13,2020 - 12:19 by Z_CLU

నటీ నటులు : త్రిష్నా ముఖర్జీ , రాహుల్ వెంకట్ , అనీష్ కురువిల్ల , బిక్రం జీత్, అప్పాజీ, రవి వర్మ తదితరులు

ర‌చ‌న‌: ప్ర‌శాంత్ సాగ‌ర్ అట్లూరి

ఎడిట‌ర్‌: ర‌ంజిత్ ట‌చ్‌రివ‌ర్‌

కెమెరా: అభిరాజ్ నాయ‌ర్‌

సంగీతం: న‌రేశ్ కుమ‌ర‌న్‌

నిర్మాత‌ :ఇందిరా బ‌స‌వ‌

ద‌ర్శ‌క‌త్వం: శ్రీవిద్య బ‌స‌వ‌

రన్ టైం : 105 నిమిషాలు

విడుదల తేది : 13 మార్చ్ 2020

రిలీజ్ కి ముందే 26 ఇంట‌ర్నేష‌నల్ ఫిలిం ఫెస్టివ‌ల్స్‌లో అవార్డ్స్ అందుకున్న ‘మధ’ సినిమా ఈ రోజే ప్రేక్షకుల ముందుకొచ్చింది. మరి శ్రీ విద్య డైరెక్ట్ చేసిన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుందా ? జీ సినిమాలు ఎక్స్ క్లూజీవ్ రివ్యూ.


కథ :

ఒక యాడ్ కంపెనీలో పనిచేసే నిషా (త్రిష్ణ ముఖర్జీ) ని ప్రేమలో పడేసేందుకు చూస్తాడు ఫోటోగ్రాఫర్ అర్జున్(రాహుల్ వెంకట్). ఆమెను నీడలా ఫాలో అవుతూ ఎట్టకేలకు ఆమెకు తన ప్రేమ విషయం చెప్పి ఒప్పిస్తాడు. కొన్ని రోజులకే ఇద్దరూ బాగా దగ్గరవుతారు. ఒక టైంలో సినిమా ఆఫర్ వచ్చిందని చెప్పి నిషాకు కొన్ని రోజులు దూరమవుతాడు. అయితే ఆ సమయంలో లోన్లీ గా ఉండే నిషా బిహేవియర్ లో మార్పు వచ్చేలా చేస్తాడు అర్జున్.

కొన్ని సంఘటనల తర్వాత నిషాను మెంటల్ అసేలియంలో చేరుస్తారు. అలా అసేలియంలో అడుగుపెట్టిన నిషాపై డ్రగ్ టెస్టులు చేస్తూ ఆమె శరీరంపై ప్రయోగాలు చేస్తారు. అసలు ఇదంతా ఎందుకు జరుగుతుందో తనకి ఏమైందో తెలియని పరిస్తితుల్లో ఉంటుంది నిషా. ఆ సమయంలో సెక్యురిటీ గోపాల్ సాయంతో బయటపడుతుంది. అలా బయటపడిన నిషాకి ఎలాంటి సంఘటనలు ఎదురయ్యాయి ? అసలింతకీ తనను అసేలియంలోకి పంపిందెవరు ? చివరికి డ్రగ్ టెస్ట్ వెనక ఉన్న రవి వర్మ ను నిషా పోలీసులకు ఎలా పట్టించిందనేది మిగతా కథ.

 

నటీ నటుల పనితీరు :

నిషా పాత్రలో త్రిష్నా ముఖర్జీ మంచి నటన కనబరిచింది. ముఖ్యంగా ప్రీ క్లైమాక్స్ , క్లైమాక్స్ లో ఆమె నటనకి మంచి మార్కులు పడ్డాయి. గతంలో హీరోగా కొన్ని సినిమాలు చేసిన రాహుల్ వెంకట్ తన క్యారెక్టర్ కి న్యాయం చేసాడు. తనకు పర్ఫెక్ట్ అనిపించే రోల్ ఎంచుకొని అనీష్ కురువిల్ల మరోసారి తన నటనతో ఆకట్టుకున్నాడు. అలాగే ప్రొఫెసర్ పాత్రలో బిక్రం జీత్ బాగా నటించాడు. డాక్టర్ పాత్రలో అప్పాజీ , పోలీస్ గా రవి వర్మ మిగతా నటీ నటులు తమ పాత్రలకు న్యాయం చేసారు.

సాంకేతిక వర్గం పనితీరు :

కొన్ని థ్రిల్లర్ సినిమాలకు సాంకేతికంగా బలం చేకూరుతుంది. ఈ సినిమా విషయంలో అదే జరిగింది. అభిరాజ్ నాయ‌ర్‌ విజువల్స్ ,న‌రేశ్ కుమ‌ర‌న్‌ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాకు హైలైట్ గా నిలిచాయి. ఆర్ట్ వర్క్ కూడా బాగుంది. ర‌ంజిత్ ట‌చ్‌రివ‌ర్‌ తన ఎడిటింగ్ ఇంకాస్త పదును పెట్టి సినిమాను వేగంగా నడిపించి ఉంటే బాగుండేది. అర‌వింద్ మీన‌న్‌ మిక్సింగ్ బాగుంది.

శ్రీ విద్య డైరెక్షన్ కొన్ని సార్లు పర్లేదు అనిపించి మరికొన్ని సార్లు బ్రిలియంట్ అనిపిస్తుంది. తను రాసుకున్న కథను మరీ స్లో గా కాకుండా సాధారణ ప్రేక్షకుడు కూడా కనెక్ట్ అయ్యేలా చెప్తే బాగుండేది. ప్రొడక్షన్ వాల్యూస్ కథకు తగ్గట్టుగా ఉన్నాయి.


జీ సినిమాలు సమీక్ష :

కొన్ని ట్రైలర్స్ సినిమాపై క్యూరియాసిటీ కలిగిస్తాయి. ‘మధ’ ఆ కోవలోకే వస్తుంది. అవును రిలీజ్ కి ముందే ఫిలిం ఫెసివల్స్ లో అవార్డ్స్ అందుకోవడం , ట్రైలర్ ను పర్ఫెక్ట్ గా కట్ చేయడం వల్ల సినిమాపై ఆసక్తి నెలకొంది. అయితే ఆ ఆసక్తి థియేటర్ లోకి వెళ్ళిన కాసేపటికే తగ్గుతూ వస్తూ విసుగు తెప్పించేలా ఉందీ సినిమా. చివరి వరకూ అర్థం కానీ ఓ కథ , ఏం జరుగుతుందో తెలియని సన్నివేశాలతో అసలీ డైరెక్టర్ ఏం చెప్పాలనుకుంటుంది అని ప్రేక్షకుడి మైండ్ లో ఆలోచనలు మొదలవుతాయి.

ఓ ప్రొఫెసర్ తన స్టూడెంట్స్ కి హ్యూమన్ మైండ్ మీద క్లాస్ చెప్పే సీన్ తో సినిమా మొదలు పెట్టిన డైరెక్టర్ శ్రీ విద్య అసలు కథను స్లోగా బోర్ కొట్టేలా చెప్తూ క్లైమాక్స్ వరకూ ఎదురుచూసేలా చేసింది. అదే సినిమాకు పెద్ద మైనస్. అయితే టెక్నికల్ గా మాత్రం శ్రీ విద్య కి మంచి సపోర్ట్ లభించింది. అందువల్ల సినిమా కంటెంట్ పరంగా సో సో అనిపించినా టెక్నికల్ గా మాత్రం బ్రిలియంట్ అనిపిస్తుంది.

ఊహించని సంఘటనలు , కొన్ని పాత్రలు , అర్థం కానీ స్క్రీన్ ప్లే ఫైనల్ గా అన్నిటికీ సమాధానం దొరికే క్లైమాక్స్ ఇదీ ‘మధ’ కథ. అయితే ఈ స్క్రీన్ ప్లేతో ఇప్పటికే చాలా థ్రిల్లర్ సినిమాలొచ్చాయి. పైగా దర్శకురాలు ఇందులో టచ్ చేసిన డ్రగ్ టెస్ట్ పాయింట్ కూడా కొత్తగా అనిపించదు. దీంతో క్లైమాక్స్ వచ్చే సరికి ఇది చెప్పడానికి దర్శకురాలు ఇంత సేపు విసిగించిందా అని ప్రేక్షకుడు ఫీలవుతాడు. కాకపోతే నిషా అనే అమ్మాయికి ఇమ్యునిటీ పవర్ ఉండటం అనే ఎలిమెంట్ కొత్తగా అనిపిస్తుంది. ఇదంతా పక్కన పెడితే దర్శకురాలిగా టెక్నీషియన్స్ నుండి బెస్ట్ అవుట్ పుట్ తీసుకోవడం , కొన్ని సన్నివేశాలను తెరకెక్కించిన విధానం మాత్రం శ్రీ విద్య గురించి మాట్లాడుకునేలా చేస్తాయి. అలాగే సినిమాకు ఎంతో కీలకమైన క్లైమాక్స్ ను కూడా అనుభవం ఉన్న దర్శకురాలిగా డీల్ చేసింది. ఇక అవార్డ్స్ దక్కించుకున్న సినిమాలు నత్త నడకన సాగుతూ టెక్నికల్ గా మెప్పిస్తాయి. ‘మధ’ కూడా అంతే. కమర్షియల్ హంగులు కోరుకునే ప్రేక్షకులను ఈ సినిమా ఏ మాత్రం ఆకట్టుకోదు. ఇక టెక్నికల్ మూవీస్ ను ఇష్టపడే వారికి మాత్రం డార్క్ థ్రిల్లర్ గా ‘మధ’ పరవాలేదనిపిస్తుంది.

రేటింగ్ : 2 .5/5