'లవర్స్ డే' మూవీ రివ్యూ

Thursday,February 14,2019 - 01:42 by Z_CLU

న‌టీన‌టులు : రోష‌న్‌, ప్రియా ప్రకాష్ వారియర్ , నూరిన్ షెరిఫ్‌, మాథ్యూ జోస‌ఫ్‌, వైశాఖ్ ప‌వ‌న‌న్‌, మైఖేల్ యాన్ డేనియ‌ల్‌, దిల్‌రూపా, హ‌రీష్ పెరుమ‌న్న‌, అనీష్ జి మీన‌న్‌, షాన్ సాయి, అర్జున్ హ‌రికుమార్‌, అతుల్ గోపాల్‌, రోష్న అన్‌రాయ్ త‌దిత‌రులు.

కెమెరా : శీను సిద్ధార్థ్‌

ఎడిటింగ్‌: అచ్చు విజ‌య‌న్‌

సంగీతం : షాన్ రెహ‌మాన్‌

స్క్రీన్‌ప్లే : సారంగ్ జ‌య‌ప్ర‌కాష్‌, లిజో ప‌నాడా

నిర్మాత‌లు: ఎ. గురురాజ్‌, సి.హెచ్‌.వినోద్‌రెడ్డి

క‌థ‌, ద‌ర్శ‌క‌త్వం: ఒమ‌ర్ లులు

విడుదల తేది : 14 ఫిబ్రవరి 2019

కన్ను గీటి దేశ వ్యాప్తంగా సెన్సేషన్ క్రియేట్ చేసిన ప్రియా ప్రకాష్ వారియర్ ‘ఒరు ఆదార్ లవ్’ సినిమా ‘లవర్స్ డే’ అనే టైటిల్ తో తెలుగులో విడుదలైంది. వాలెంటైన్స్ డే స్పెషల్ గా థియేటర్స్ లోకి వచ్చిన ‘లవర్స్ డే’ హిట్ సినిమా అనిపించుకుందా ..? సినిమాలో సాంగ్ తో విన్కింగ్ స్టార్ గా మారిన ప్రియా వారియర్ తన యాక్టింగ్ తో తెలుగు ప్రేక్షకులను మెప్పించిందా ? జీ సినిమాలు ఎక్స్ క్లూజీవ్ రివ్యూ.

కథ :

ఇంటర్మీడియట్ స్కూల్ లో మొదటి సంవత్సరం చదివే రోషన్ (రోషన్ రావూఫ్) తొలి చూపులోనే ప్రియా వారియర్(ప్రియా ప్రకాష్ వారియర్) ని చూసి ప్రేమలో పడతాడు. ఇంటర్ మీడియట్ మొదటి సంవత్సరం కావడంతో ఎవరికీ వారు ప్రేమలో పడేందుకు అమ్మాయిలకు ప్రపోజ్ చేస్తూ వాళ్ళ వెంటే తిరుగుతుంటారు. ఇక పరిచయమైన కొన్ని రోజులకే రోషన్- ప్రియా ప్రేమలో పడతారు. అలా హాయిగా సాగుతున్న వీళ్ళ టీనేజ్ లవ్ స్టోరీ కి అనుకోకుండా బ్రేక్ పడుతుంది. ఓ సందర్భంలో ఓ తప్పు చేసాడన్న నింద వల్ల స్కూల్ నుండి సస్పెండ్ అవుతాడు రోషన్.

ఆ సమయంలో రోషన్ పై ఉన్న నిందను తొలగించి అండగా నిలుస్తుంది రోషన్ స్నేహితురాలు గాధ(నూరిన్ షెరిఫ్‌). అదే సమయంలో రోషన్ కి బ్రేకప్ చెప్తుంది ప్రియ. ప్రియా బ్రేకప్ చెప్పడంతో గాధ కు దగ్గరవుతాడు రోషన్. ఇద్దరూ ఒకరికి తెలియకుండా ఒకరు ప్రేమలో పడతారు. లవర్స్ డే రోజు గాధని తనకు నచ్చిన లొకేషన్ కి తీసుకెళ్ళి ప్రపోజ్ చేయడానికి ప్లాన్ వేస్తాడు రోషన్. అలా తన ప్రేమను తెలియజేయడానికి వెళ్ళిన రోషన్ గాధ కు ప్రపోజ్ చేసాడా..? వీరిద్దరూ ఒక్కటయ్యారా.. లేదా అనేది లవర్స్ డే కథ.

నటీ నటుల పనితీరు :

సినిమాలో అందరూ కొత్త వాళ్ళే అయినప్పటికీ బాగా నటించారు. కొన్నిసందర్భాల్లో దర్శకుడు చెప్పింది చేసుకుంటూ వెళ్లారు. ఇక సాంగ్ తో విన్కింగ్ స్టార్ గా సెన్సేషన్ క్రియేట్ చేసిన ప్రియా వారియర్ నటనతో జస్ట్ పరవాలేదనిపించుకుంది. రోషన్ స్క్రీన్ ప్రెజెన్స్ బాగుంది. నూరిన్ షెరిఫ్‌ నటనతో ఆకట్టుకుంది. చాలా సన్నివేశాల్లో బెస్ట్ అనిపించుకుంది. ఫ్రెండ్స్ క్యారెక్టర్స్ లో మాథ్యూ జోస‌ఫ్‌, వైశాఖ్ ప‌వ‌న‌న్‌, మైఖేల్ యాన్ డేనియ‌ల్‌, దిల్‌రూపా, హ‌రీష్ పెరుమ‌న్న‌ బాగానే నటించారు. కాకపోతే సినిమాలో ఎమోషనల్ సీన్స్ లేకపోవడంతో డైలాగ్ కామెడీ తో ఎంటర్టైన్ చేసే ప్రయత్నం చేసారు. అనీష్ , ప్రదీప్ మిగతా నటీ నటులు వారి పరిధిలో నటించారు.

సాంకేతిక వర్గం పనితీరు :

శీను సిద్ధార్థ్‌ సినిమాటోగ్రఫీ బాగుంది. ఉన్నంతలో సినిమాకు రిచ్ లుక్ తీసుకొచ్చాడు. షాన్ రెహ‌మాన్‌ మ్యూజిక్ బాగుంది. ఫ్రీక్ పిల్లా ,పిల్ల నీ వెనకాలే పాటలు ఆకట్టుకున్నాయి. కొన్ని సందర్భాల్లో నేపథ్య సంగీతం బాగుంది. అచ్చు విజ‌య‌న్‌ ఎడిటింగ్ పరవాలేదు. సారంగ్ జ‌య‌ప్ర‌కాష్‌, లిజో ప‌నాడా స్క్రీన్ ప్లే ఆకట్టుకోలేకపోయింది. ఒమర్ లులు స్టోరీతో పాటు డైరెక్షన్ కూడా వీక్ అనిపించింది. ప్రొడక్షన్ వాల్యూస్ సినిమాకు తగినట్టుగా ఉన్నాయి.

జీ సినిమాలు సమీక్ష :

కొన్ని సినిమాలు విడుదలకి ముందే సెన్సేషన్ క్రియేట్ చేసి ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొల్పుతాయి. ‘లవర్స్ డే’ ఆ కోవలోకే వస్తుంది. సినిమా నుండి విడుదలైన మొదటి సాంగ్ పాపులర్ అవ్వడం సాంగ్ లో ప్రియా వారియర్ కన్ను కొట్టే ఎలిమెంట్ వైరల్ అవ్వడంతో ఈ సినిమాపై అన్ని భాషల్లో ఆసక్తి నెలకొలిపింది. అయితే కంటెంట్ లేని సినిమాలే ఒక్కో సారి ఈ రేంజ్ లో హైప్ క్రియేట్ చేసి థియేటర్స్ లో డీలా పడుతుంటాయి. ప్రారంభమైన కాసేపటికే ప్రేక్షకుడికి చిరాకు తెప్పించి చివరి వరకూ వారి ఓపికకు పరీక్ష పెట్టే సినిమా ఇది.

నిజానికి మలయాళంలో ఎన్నో మంచి ప్రేమ కథలొచ్చాయి సూపర్ హిట్స్ గా నిలిచాయి. కానీ ఈ సినిమా చూస్తే ఎక్కడా మలయాళ సినిమా  చూస్తున్నామనే ఫీల్ కలిగదు. నిజానికి  ఈ సినిమా అసలు కథ వేరు… సినిమాను నుండి విడుదల చేసిన సాంగ్ వైరల్ అవ్వడం , ప్రియా వారియర్ సెన్సేషన్ స్టార్ గా మారడంతో రచయితలు , దర్శకుడు కథను మార్చి ప్రియా వారియర్ క్యారెక్టర్ తాలుకు సన్నివేశాలు పెంచి కథను మార్చారు. అక్కడే సినిమా కథనం దెబ్బ కొట్టింది. నిజానికి అంతకు ముందు కథ ఏమో కానీ ఇప్పుడు తీసిన కథలో ఏ మాత్రం కొత్తదనం లేదు. ఎప్పటికప్పుడు అప్ డేట్ అవుతున్న ట్రెండ్ ని పట్టించుకోకుండా కథను సిద్దం చేసుకున్నాడు దర్శకుడు. ఇక సారంగ్ జ‌య‌ప్ర‌కాష్‌, లిజో ప‌నాడా అందించిన స్క్రీన్ ప్లే కూడా అంతంత మాత్రంగా ఉండటం, లవ్ ఫీల్ తీసుకొచ్చే సీన్స్ లేకపోవడం సినిమాకు పెద్ద మైనస్.

సినిమా ప్రారంభంలో ఇంటర్మీడియట్ స్కూలింగ్ , వాళ్ళ ఆలోచనలు , అమ్మాయిల మీద వారి కుండే ఫీలింగ్స్ తాలుకు సన్నివేశాలతో ఇంటర్వెల్ వరకూ నెట్టుకొచ్చిన దర్శకుడు రెండో భాగంలో మరీ బోర్ కొట్టించాడు. కథలో ఎమోషన్ లేక పోవడం , బోర్ కొట్టించే సన్నివేశాలు కోకొల్లలుగా ఉండటం , అర్థం పర్థం లేని క్లైమాక్స్ ఇలా అన్నీ కలిసి ‘లవర్స్ డే’ ను బెస్ట్ రొమాంటిక్ ఎంటర్టైనర్ ప్లేస్ ను అందుకోకుండా చేసాయి.

బాటమ్ లైన్ : బోరింగ్ ‘డే’

రేటింగ్ : 1 /5