'లవర్' మూవీ రివ్యూ

Friday,July 20,2018 - 05:17 by Z_CLU

నటీనటులు : రాజ్ తరుణ్, రిద్ది కుమార్

సినిమాటోగ్రఫీ : సమీర్ రెడ్డి

నిర్మాణం : శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్

నిర్మాత : దిల్ రాజు

కథ -స్క్రీన్ ప్లే -దర్శకత్వం : అనీష్ కృష్ణ

విడుదల తేది : 20 జూలై 2017

 

లవ్ సినిమాలు చేసే రాజ్ తరుణ్ ఈసారి ఏకంగా లవర్ అనే టైటిల్ తోనే సినిమా చేశాడు. సో.. ఇదొక ప్రేమకథ అనేది పక్కా. సో.. ఇలాంటి ప్రేమకథలో కొత్తదనం ఏముంది..? రాజ్ తరుణ్ ఈసారి ఆడియన్స్ కు కొత్తగా ఏం చూపించాడు..? దిల్ రాజు బ్యానర్ నుంచి వచ్చిన ఈ సినిమా ఆ స్థాయిలో ఉందా లేదా..? జీ సినిమాలు ఎక్స్ క్లూజివ్ రివ్యూ

కథ :

రాజ్ (రాజ్‌ తరుణ్‌) ఓ అనాథ. అనంతపురంలో కస్టమైజ్డ్‌ బైక్‌ బిల్డర్‌గా ఓ గ్యారేజ్ నడుపుతుంటాడు. చిన్నతనం నుండి జగ్గు (రాజీవ్‌ కనకాల) దగ్గరే పెరిగి పెద్దవుతాడు. అందువల్ల జగ్గు ను తన సొంత అన్న గా భావించి వారి కుటుంబంలో ఒకడిగా ఉంటుంటాడు. జీవితాన్ని తనకు నచ్చేట్టుగా తయరుచేసుకోవాలనే భావంతో ఫ్రెండ్స్ తో కలిసి ఎంజాయ్‌ చేస్తూ గడిపే రాజు ఓ గొడవలో గాయపడి గవర్నమెంట్‌ హాస్పిటల్‌లో చేరతాడు. అక్కడ నర్సుగా పనిచేసే చరిత (రిద్ధి కుమార్‌)ను తొలిచూపులోనే చూసి ఇష్టపడతాడు. అలా హాస్పిటల్ లో నర్సు పేషెంట్ గా పరిచయమై ఇద్దరు ప్రేమించుకుంటారు. హాస్పిటల్‌ లో జరిగే ప్రతీ అన్యాయంపై ఎదురుతిరుగుతుంటుంది చరిత… ఈ క్రమంలో లక్ష్మీ అనే అమ్మాయి ప్రాణం కాపాడే దిశగా తన ప్రాణం మీదకు తెచ్చుకుంటుంది. ఇంతకీ చరిత కాపాడాలనుకున్న లక్ష్మీ ఎవరు..? ఆమెకు సౌత్ ఇండియా మొత్తాన్ని గడగడలాడించే వరదరాజులు (శరత్‌ కేడ్కర్‌)కు సంబంధం ఏంటి..? చివరికి  లక్ష్మీ , చరితలను రాజ్ ఎలా కాపాడాడు.. అనేది బ్యాలెన్స్ కథ.

 

నటీనటుల పనితీరు :

రాజ్ తరుణ్ ఎప్పటిలాగే తన క్యారెక్టర్ కి పర్ఫెక్ట్ అనిపించుకున్నాడు. పోనీ టెయిల్ తో ఇందులో కాస్త మేకోవర్ కూడా చూపించాడు. ఈ సినిమాతో టాలీవుడ్ కి పరిచయం అయిన రిద్ధి కుమార్ చరిత క్యారెక్టర్ తో పరవాలేదనిపించుకుంది… కానీ హీరోయిన్ గా పర్ఫెక్ట్ అనిపించుకోలేకపోయింది. రాజీవ్ కనకాల తన ఎమోషనల్ పెర్ఫార్మెన్స్ తో సినిమాకు ప్లస్ అనిపించుకున్నాడు. ముఖ్యంగా సెకండ్ హాఫ్ లో వచ్చే యాక్షన్ ఎపిసోడ్ లో ప్రేక్షకులచే విజిల్స్ వేయించాడు.

ఇప్పటికే చాలా సినిమాలో చేసిన క్యారెక్టర్సే కావడంతో అజయ్, సుబ్బరాజు తమకిచ్చిన క్యారెక్టర్స్ ఈజీగానే చేసేసారు. సత్యం రాజేష్- సత్య తమ కామెడితో అలరించాడు. సీనియర్ నటుడు సచిన్ ఖేదేఖర్ కూర్చికే పరిమతం అయిన పాత్రలో కనిపించాడు. ఇక జయ ప్రకాష్ రెడ్డి, రాజా రవీంద్ర, జీవ, రోహిణి, ప్రవీణ్, గాయత్రీ భార్గవి తదితరులు తమ క్యారెక్టర్స్ తో జస్ట్ పరవాలేదనిపించారు.

 

సాంకేతికవర్గం పనితీరు :

సినిమాకు పనిచేసిన టెక్నిషియన్స్ లో సమీర్ రెడ్డి, సంగీత దర్శకులు సాయి కార్తీక్, అంకిత్ తివారి అర్కో, రిషి -అజయ్,తనిష్క్ బాగ్చి తమ వర్క్ తో బెస్ట్ అనిపించుకున్నారు. ముఖ్యంగా సమీర్ రెడ్డి సినిమాటోగ్రఫీ సినిమాకు హైలైట్ గా నిలిచింది. ప్రతీ ఫ్రేం లో సమీర్ రెడ్డి కష్టం కనబడింది. జే.బి మంచి బ్యాగ్రౌండ్ స్కోర్ అందించాడు. సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు, శ్రీమణి అందించిన సాహిత్యం పాటలకు ప్రాణం పోశాయి. ప్రవీణ్ పూడి ఎడిటింగ్ బాగుంది. ఏ.ఎస్.ప్రకాష్ ఆర్ట్ వర్క్ బాగుంది. అనీష్ కృష్ణ స్క్రీన్ ప్లే ఆసక్తిగా లేదు. ఎస్.వి.సి ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి.

జీ సినిమాలు సమీక్ష :

కెరీర్ స్టార్టింగ్ లో వరుస హిట్స్ తో దూసుకెళ్లిన రాజ్ తరుణ్ ప్రస్తుతం వరుస ఫ్లాపులతో సతమవుతున్నాడు.. ఈ సమయంలో దిల్ రాజు బ్యానర్ లో రాజ్ తరుణ్ సినిమా అనగానే ఈసారి ఈ యంగ్ హీరో హిట్ కొట్టడం ఖాయమనే టాక్ వినిపించింది.. ప్రారంభం రోజే అనౌన్స్ చేసిన టైటిల్, తర్వాత విడుదల చేసిన ఫస్ట్ లుక్, సాంగ్స్, ట్రైలర్ అన్నీ సినిమాపై క్యూరియాసిటీ పెంచేశాయి. ముఖ్యంగా ఈ సినిమా కోసం ఏకంగా ఆరుగురు మ్యూజిక్ డైరెక్టర్స్ పనిచేయడంతో సినిమాపై బజ్ క్రియేట్ అయింది.

ఇక ఈ సినిమాతో తన అన్నయ్య కొడుకు హర్షిత్ ను నిర్మాతగా పరిచయం చేస్తుండడంతో మొదటి నుండి ఈ సినిమాపై స్పెషల్ కేర్ తీసుకున్నాడు దిల్ రాజు.. కానీ రిలీజ్ కి ముందు సినిమాపై ఎలాంటి క్రేజ్ పెంచకుండా ఇదొక సాదారణమైన సినిమానే అంటూ క్లారిటీ ఇచ్చేసాడు. కానీ దిల్ రాజు బ్యానర్ నుండి ఓ సినిమా వస్తుందంటే ప్రేక్షకుల్లో భారీ అంచనాలుంటాయి. ఆ బ్యానర్ కున్న వేల్యూ అలాంటిది. అయితే ఆ అంచనాలతో వెళ్ళిన ప్రేక్షకులను ‘లవర్’ కాస్త ఇబ్బంది పెడతాడు. ఇప్పటికే చాలా సినిమాల్లో చూసేసిన కథ కావడంతో పెద్దగా ఆసక్తి కలగదు.

మొదటి సినిమాతోనే దర్శకుడిగా తన టాలెంట్ చూపించిన అనీష్ కాస్త గ్యాప్ తీసుకొని ఈ సినిమా చేసాడంటే ఎంతో కొంత కొత్తదనం ఉంటుందని ఆశిస్తాం.. కానీ ఈ సినిమా కోసం ఒక రొటీన్ కథనే ఎంచుకున్నాడు అనీష్… కథ రొటీన్ అయినప్పటికీ స్క్రీన్ ప్లే తో అయినా వర్కౌట్ చేసి ఉంటే బాగుండేది. కానీ తన స్క్రీన్ ప్లే కొంత వరకూ మాత్రమే పనిచేసింది. ముఖ్యంగా సినిమా ప్రారంభంలోనే కథ మొత్తం తెలిసిపోవడంతో.. పెద్దగా ఆసక్తి కలగదు. ఇక ట్విస్టులు కూడా ఊహించగలిగేలా ఉన్నాయి. అదే సినిమాకు పెద్ద మైనస్..

ఫస్ట్ హాఫ్ లో రాజ్ తరుణ్ – రిద్ధి లపై వచ్చే లవ్ ట్రాక్ పై అలాగే సెకండ్ హాఫ్ లో వచ్చే సీన్స్ పై దర్శకుడు మరింత దృష్టి పెట్టి ఉండాల్సింది. అలాగే హీరోయిన్ రిద్ధి కుమార్ కూడా కొన్ని ఫ్రేముల్లో మినహా ఎక్కడా హీరోయిన్ అనే ఫీలింగ్ కలిగించలేకపోయింది. ఇకపోతే సెకండ్ హాఫ్ లో రాజీవ్ కనకాలను సరిగ్గా వాడుకున్న దర్శకుడు సచిన్ ఖేడేకర్ లాంటి గొప్ప నటుడ్ని మాత్రం కుర్చీకే పరిమితం చేయడం బాలేదు.

ఫస్ట్ హాఫ్ అంతా లవ్ ట్రాక్ తో సినిమాను ముందుకు నడిపించిన దర్శకుడు సెకండ్ హాఫ్ లో అందరూ ఈజీగా ఊహించగలిగే సన్నివేశాలతో బోర్ కొట్టించాడు. కాకపోతే సమీర్ రెడ్డి సినిమాటోగ్రఫీ, సాంగ్స్ ప్రేక్షకుడిని అలరిస్తాయి. ఫైనల్ గా లవర్ జస్ట్ టైం పాస్ ఎంటర్ టైనర్ అనిపిస్తుంది.

రేటింగ్ : 2.5 / 5