'లై' రివ్యూ

Friday,August 11,2017 - 03:11 by Z_CLU

నటీనటులు : నితిన్‌, మేఘా ఆకాష్‌, యాక్షన్‌ కింగ్‌ అర్జున్‌

సినిమాటోగ్రఫీ : యువరాజ్‌

సంగీతం : మణిశర్మ

సమర్పణ : వెంకట్‌ బోయనపల్లి

నిర్మాతలు : రామ్‌ ఆచంట, గోపీ ఆచంట, అనీల్‌ సుంకర

బ్యానర్ : 14 రీల్స్ ఎఁటర్ టైన్ మెంట్

కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం : హను రాఘవపూడి

విడుదల తేదీ : ఆగస్ట్ 11

అ..ఆ తర్వాత లాంగ్ గ్యాప్ తీసుకొని ఓ సరికొత్త కథతో సినిమా చేశానంటున్నాడు నితిన్. అర్జున్ లేకపోతే ఈ సినిమానే లేదంటున్నాడు దర్శకుడు హను. మరి వీళ్లిద్దరూ చెప్పిన మాటలు నిజమేనా..? నిజంగా ‘లై’ సినిమాలో అంత స్పెషాలిటీ ఏముంది..? ఈరోజు థియేటర్లలోకొచ్చిన ఈ సినిమా ఎలా ఉంది? హేవే లుక్..


కథ :

లై సినిమా స్టోరీ అంతా టైటిల్ కు తగ్గట్టు అబద్ధాలు, తెలివితేటల మీదే నడుస్తుంది. ఓ సూటు చుట్టూ అల్లుకున్న ఇంటలిజెంట్ స్టోరీలైన్ ఇది. పాతబస్తీ కుర్రాడికి, లాస్ వెగాస్ లో ఉన్న విలన్ ఎలా కనెక్ట్ అవుతాడు, వీళ్లిద్దరి మధ్య ఉన్న దోబూచులాడిన సూటు చివరికి ఏమైంది.. హీరో-విలన్ మధ్య హీరోయిన్ పరిస్థితేంటనేది బేసిగ్గా స్టోరీ లైన్. సస్పెన్స్ థ్రిల్లర్ ఎలిమెంట్స్ తో తెరకెక్కిన ఈ సినిమా కథను ఇంతకంటే ఎక్కువ చెబితే బాగోదు.

నటీనటుల పనితీరు :

ఫర్ ఎ ఛేంజ్ ఈ సినిమాకు సంబంధించి మొదట విలన్ గురించే మాట్లాడుకోవాలి. అవును.. సీనియర్ నటుడు, యాక్షన్ కింగ్ అర్జున్ ఇరగదీశాడు. అర్జున్ లేకపోతే ఈ సినిమా లేదని దర్శకుడు, హీరో, నిర్మాత అన్నిసార్లు పదేపదే ఎందుకు చెప్పారో సినిమా చూస్తే అర్థమౌతుంది. కెరీర్ లో ఇప్పటివరకు 150 సినిమాలు చేసిన అర్జున్.. తను చేసిన బెస్ట్ మూవీస్ లిస్ట్ లో ‘లై’ సినిమాను కూడా చేర్చుకోవచ్చు. చేసింది విలన్ పాత్రే అయినా థియేటర్ల నుంచి బయటకొచ్చిన ప్రేక్షకుడికి అర్జునే ఎక్కువగా గుర్తుంటాడు.
ఇక హీరో నితిన్ మరోసారి తన మార్క్ యాక్షన్ చూపించాడు. అ..ఆలో సాఫ్ట్ గా కనిపించిన యూత్ స్టార్.. ‘లై’ లోప పక్కా యాక్షన్ లుక్ లో కనిపించాడు. అర్జున్ ఉండడం సినిమాకు ఎంత న్యూ లుక్ తీసుకొచ్చిందో.. నితిన్ మేకోవర్ కూడా ‘లై’కు అంత కొత్తదనం తెచ్చిపెట్టింది. యాక్షన్ సీన్స్ లో ఎప్పట్లానే నితిన్ మెరిశాడు. పాతబస్తీ కుర్రాడి గెటప్ నుంచి లాస్ వెగాస్ లో విలన్ ను ఛేజ్ చేసే హీరో లుక్ వరకు ప్రతి షేడ్ లో నితిన్ పర్ ఫెక్ట్ గా ఉన్నాడు.
కొత్తమ్మాయి మేఘా ఆకాష్ లుక్స్ పరంగా చాలా బాగుంది. యాక్టింగ్ లో మాత్రం నేర్చుకోవాల్సింది చాలా ఉంది. మెయిన్ స్టోరీతో హీరోయిన్ కు కనెక్షన్ లేకపోయినప్పటికీ ఓవరాల్ మేఘా ఆకాష్ కు ఇది మంచి డెబ్యూనే. ఇతర నటీనటుల విషయానికొస్తే కీలక పాత్రలు పోషించిన రవికిషన్, శ్రీరామ్ తమ యాక్టింగ్ తో ఆకట్టుకున్నారు.

టెక్నీషియన్ల పనితీరు :

లై సినిమాకు మణిశర్మ పెద్ద ప్లస్ పాయింట్. మెలొడీ బ్రహ్మగా గుర్తింపు తెచ్చుకున్న మణిశర్మ ఇప్పటికే చాలా సినిమాలతో రీ-రికార్డింగ్ బ్రహ్మ అనిపించుకున్నాడు. ‘లై’ సినిమాకు మణిశర్మ ఇచ్చిన రీ-రికార్డింగ్ అదిరిపోయింది. ఇలాంటి కథలకు రీ-రికార్డింగే ప్రాణం. ఆ జాబ్ ను మణిశర్మ వందకు రెండొందల శాతం పక్కాగా పూర్తిచేశాడు. ఇక యువరాజ్ సినిమాటోగ్రాఫీ కూడా బాగుంది. అమెరికా లొకేషన్లను చక్కగా చూపించాడు. ఎడిటింగ్, స్క్రీన్ ప్లే బాగున్నాయి. ఇక దర్శకుడిగా హను రాఘవపూడి మరోసారి తమ మార్క్ చూపించాడు. కృష్ణగాడి వీరప్రేమకగాథ తర్వాత మరో థ్రిల్లింగ్ మూవీతో ఆకట్టుకున్నాడు. 14 రీల్స్ ప్రొడక్షన్స్ వాల్యూస్ చాలా బాగున్నాయి. మేకింగ్ లో ఎక్కడా కాంప్రమైజ్ కాలేదు.

జీ సినిమాలు సమీక్ష :

చెప్పాల్సిన పాయింట్ కు లవ్, కామెడీ, రొమాన్స్, ఫ్యామిలీ ఎమోషన్స్ లాంటి అంశాల్ని తెలివిగా జోడించడం హను రాఘవపూడి ప్రత్యేకత. అతడిలోని ఈ ప్రత్యేకతను కృష్ణగాడి వీరప్రేమగాథ సినిమాలోనే చూశాం. ‘లై’ సినిమాలో కూడా ఆ స్పెషాలిటీ కనిపిస్తుంది. ఈ సినిమాలో అన్నీ ఉన్నాయి. హీరోహీరోయిన్ల మధ్య రొమాన్స్, హీరో-విలన్ మధ్య కాన్ ఫ్లిక్ట్, హీరో-కమెడియన్ మధ్య కామెడీ.. ఇలా చాలా ఎలిమెంట్స్ ను టచ్ చేశాడు హను.
ఓ సూటు చుట్టూ హను కథను తిప్పిన విధానం బాగుంది. అసలు ఆ సూట్ ఏంటి, దాని వెనక కథేంటి లాంటి అంశాల్ని ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా వన్ బై వన్ చక్కగా చెప్పుకొచ్చాడు. తన సినిమాకు క్యారెక్టర్స్ ను సెలక్ట్ చేసుకునే పాయింట్ దగ్గరే సగం హిట్ కొట్టేశాడు. ప్రతి పాత్రను ఒక్కో నటుడ్ని పర్ ఫెక్ట్ గా ఎంపిక చేసుకున్నాడు. మరీ ముఖ్యంగా విలన్ పాత్రకు అర్జున్ ను తీసుకోవడం హండ్రెడ్ పర్సెంట్ రైట్ ఛాయిస్. సినిమాలో ట్విస్టుల్ని ఎంజాయ్ చేస్తూనే, మరోవైపు అమెరికాలోని అందమైన నగరాలు, లొకేషన్లను చూడొచ్చు.
అర్జున్ ఒప్పుకోవడంతోనే సినిమా సగం హిట్ అయిందని హను చెప్పిన మాట, అ..ఆ తర్వాత ఓ డిఫరెంట్ స్టోరీ చేసే ఉద్దేశంతోనే ‘లై’ చేశానంటూ నితిన్ ఇచ్చిన స్టేట్ మెంట్ రెండూ కరెక్ట్. అర్జున్ ఈ సినిమాను నెక్ట్స్ లెవెల్ కు తీసుకెళ్లారు. ఇక నితిన్ కెరీర్ లో ఇదొక డిఫరెంట్ మూవీగా నిలిచిపోతుంది. చాలా రోజుల తర్వాత నటుడు శ్రీరామ్ కు తెలుగులో మంచి క్యారెక్టర్ దొరికింది. ఇంటర్వెల్ బ్యాంగ్, క్లైమాక్స్, రీ-రికార్డింగ్, అర్జున్ ఈ సినిమాకు ప్లస్ పాయింట్స్ కాగా.. స్క్రీన్ ప్లే, పాత్రల్ని పరిచయం చేసే విధానం,  అక్కడక్కడ బోర్ కొట్టించే సన్నివేశాలు మైనస్ పాయింట్స్.

ఫైనల్ గా  ‘లై’ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చుతుంది ఇట్స్ నాట్ ఎ లై.

రేటింగ్ : 3 .25/5