'కిట్టు ఉన్నాడు జాగ్రత్త' రివ్యూ

Friday,March 03,2017 - 06:40 by Z_CLU

విడుదల : మార్చి 3 , 2017

నటీ నటులు : రాజ్‌త‌రుణ్‌, అను ఇమ్మాన్యుయ‌ల్‌

మ్యూజిక్ : అనూప్ రూబెన్స్‌

సినిమాటోగ్రఫీ : బి.రాజ‌శేఖ‌ర్

డైలాగ్స్ : సాయిమాధ‌వ్ బుర్రా

క‌థ : శ్రీకాంత్ విస్సా

నిర్మాణం : ఎ కె ఎంటర్టైన్మెంట్స్

నిర్మాత :రామ‌బ్ర‌హ్మం సుంక‌ర‌

స్క్రీన్ ప్లే – దర్శకత్వం : వంశీకృష్ణ‌

ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్ తో వరుస విజయాలు అందుకుంటూ దూసుకుపోతున్న రాజ్ తరుణ్ ‘కిట్టు ఉన్నాడు జాగ్రత్త’ సినిమాతో ఈరోజు థియేటర్స్ లో కొచ్చాడు..  కుక్కల కిడ్నాపర్ గా కిట్టు క్యారెక్టర్ తో రాజ్ తరుణ్ ఎలా ఎంటర్టైన్ చేసాడో..చూద్దాం..

 

కథ :

హాస్టల్ లో అనాధగా పెరిగి ఇంజనీరింగ్ పూర్తిచేసి తన స్నేహితులతో కలిసి సొంతంగా కార్ కేర్ పెట్టుకొని మెకానిక్ గా జీవితాన్ని కొనసాగించే కిట్టు(రాజ్ తరుణ్) ఒక సందర్భంలో జానకి(అను ఇమ్మానుయేల్) అనే అమ్మాయిను చూసి ప్రేమలో పడతాడు. అలా జానకి ప్రేమలో పడిన కిట్టు అనుకోకుండా తన జీవితంలో వచ్చిన ట్విస్ట్ వల్ల డబ్బు కోసం కుక్కల కిడ్నాపర్ గా మారతాడు.. అసలింతకీ కిట్టు కుక్కల కిడ్నపర్ గా ఎందుకు మారాల్సి వచ్చింది.. కిట్టు కథలో వచ్చిన ఆ అనుకోని ట్విస్ట్ ఏంటి.. చివరికి కిట్టు తన ప్రేమను ఎలా దక్కించుకున్నాడు…అనేది సినిమా కథ.

 

నటీనటుల పనితీరు :

కిట్టు అనే క్యారెక్టర్ తో ఫుల్లుగా ఎంటర్టైన్ చేశాడు రాజ్ తరుణ్. ముఖ్యంగా తన ఎనర్జిటిక్ యాక్టింగ్, యాస డైలాగ్స్ తో సినిమాకే హైలెట్ గా నిలిచాడు. అను ఇమ్మానుయేల్ తన పర్ ఫార్మెన్స్ తో ఆకట్టుకుంది. ఈ మధ్య తన కామెడీ తో కాస్త రొటీన్ అనిపించుకుంటున్న 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వి, రేచీకటి ఉన్న క్యారెక్టర్ తో తనదైన కామెడీతో మళ్లీ స్వింగ్ లోకి వచ్చేశాడు. కమిషనర్ ఆఫ్ ఇన్కమ్ టాక్స్ ఆఫీసర్ గా నాగబాబు, దొంగ బాబాగా రఘుబాబు, విలన్ గా అర్భాజ్ ఖాన్, కాలకేయ ప్రభాకర్, వెన్నెల కిశోర్, రాజా రవీంద్ర, నల్ల వేణు, రఘుబాబు, ఫిష్ వెంకట్, సుదర్శన్, ప్రవీణ్, విజయ్ అంతా తమ క్యారెక్టర్స్ కి పూర్తి న్యాయం చేసి ఎంటర్టైన్ చేశారు..

 

టెక్నీషియన్స్ పనితీరు:

సినిమాకు పనిచేసిన టెక్నీషియన్స్ లో ముందుగా సాయి మాధవ్ బుర్ర గురించే మాట్లాడుకోవాలి. ప్రస్తుతం భారీ సినిమాలకు తన పదునైన డైలాగ్స్ అందిస్తూ టాప్ రైటర్ గా కొనసాగుతున్న సాయి మాధవ్… ఈ సినిమాకు ఫన్నీ డైలాగ్స్ అందించి హైలైట్ గా నిలిచాడు. బి.రాజశేఖర్ సినిమాటోగ్రఫీ సినిమాకు ప్లస్ అయింది. అనూప్ మ్యూజిక్ బాగుంది. ముఖ్యంగా ‘అర్థమైందా’ సాంగ్ అందరినీ ఆకట్టుకుంటుంది. ఎం.ఆర్ వర్మ ఎడిటింగ్ బాగుంది.. శ్రీకాంత్ విస్సా అందించిన కథ, దర్శకుడు వంశీకృష్ణ స్క్రీన్ ప్లే బాగున్నాయి. ప్రొడక్షన్ వాల్యూస్ పరవాలేదు.

 

జీ సినిమాలు సమీక్ష :

‘కుమారి 21’ , ‘ఈడో రకం ఆడో రకం’ వంటి సూపర్ హిట్స్ తో జోరు మీదున్న రాజ్ తరుణ్ మరోసారి అలాంటి ఎంటర్టైనింగ్ కథనే సెలెక్ట్ చేసుకున్నాడు. కిట్టూగా బాాగా ఎంటర్టైన్ చేశాడు. ‘దొంగాట’ సినిమాతో దర్శకుడిగా పరిచయం అయిన వంశీకృష్ణ.. డైరక్టర్ గానే కాకుండా, స్క్రీన్ ప్లే రైటర్ గా కూడా సక్సెస్ అయ్యాడు. ఫస్ట్ హాఫ్ లో ఎంటర్టైనింగ్ స్క్రీన్ ప్లేతో అలరించి, ఇంటర్వెల్ నుంచి ట్విస్టులతో కథను మరింత ఇంట్రెస్టింగ్ గా కొనసాగించిన విధానం బాగుంది. ముఖ్యంగా హీరో నుంచి ప్రతీ క్యారెక్టర్ కి సూట్ అయ్యే నటీనటుల్ని సెలెక్ట్ చేసుకోవడంలోనే దర్శకుడు మొదటి విజయం అందుకున్నాడు. రాజ్ తరుణ్ క్యారెక్టర్, అను ఇమ్మానుయేల్ గ్లామర్, రేచీకటితో పృథ్వి పండించిన కామెడీ, రఘుబాబు-సుదర్శన్ కామెడీ, కుక్కల్ని దొంగతనం చేసే సీన్స్, రాజ్ తరుణ్, అను మధ్య వచ్చే లవ్ సీన్స్, డైలాగ్స్, హంసా నందిని ఐటెం సాంగ్, ఇంటర్వెల్ ట్విస్ట్, ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ సీన్స్ సినిమాకు హైలైట్స్. ఫస్ట్ నుంచి లాస్ట్  వరకు ఫుల్ ఎంటర్టైన్మెంట్ కోరుకునే ప్రేక్షకులకు కిట్టు తెగ నచ్చేస్తాడు. ఈ వీకెండ్ ఎంటర్ టైన్ మెంట్ కు ఈ సినిమా పర్ ఫెక్ట్ ఛాయిస్.

రేటింగ్ : 3 /5