'కిరాక్ పార్టీ' రివ్యూ

Friday,March 16,2018 - 03:59 by Z_CLU

నటీనటులు: నిఖిల్, సంయుక్త హెగ్డే, సిమ్రాన్ పరాన్జీ, సిజ్జు, సాయాజీ షిండే, బ్రహ్మాజీ, రఘు కారుమంచు, రాకేందు మౌళి, హేమంత్ తదితరులు

సంగీతం : అజనీష్ లోకనాథ్

ఛాయాగ్రహణం : అద్వైత గురుమూర్తి

మాటలు : చందూ మొండేటి

స్క్రీన్ ప్లే : సుధీర్ వర్మ

నిర్మాత : రామబ్రహ్మం సుంకర

దర్శకత్వం : శరణ్ కొప్పిశెట్టి

రిలీజ్ డేట్ : 16 మార్చ్ 2018

 

అప్పుడెప్పుడో చేసిన హ్యాపీ డేస్ తర్వాత మళ్లీ ఫుల్ లెంగ్త్ కాలేజ్ కాన్సెప్ట్ మూవీ చేయలేదు నిఖిల్. ఎట్టకేలకు పదేళ్ల గ్యాప్ తర్వాత ‘కిరాక్ పార్టీ’తో మరోసారి కాలేజ్ స్టూడెంట్ గా మనముందుకొచ్చాడు. మరి నిఖిల్ క్రియేట్ చేసిన ఈ కిరాక్ పార్టీ ఎలా ఉంది..? జీ సినిమాలు ఎక్స్ క్లూజివ్ రివ్యూ.

కథ:

కృష్ణ(నిఖిల్) అనే కుర్రాడు ఇంజినీరింగ్ కాలేజీలో మొదటి సంవత్సరం చదువుతుంటాడు. ఆ కాలేజిలో తన సీనియర్ అయిన మీరా(సిమ్రన్)ను తొలి చూపులోనే చూసి ప్రేమలో పడతాడు. అయితే అనుకోకుండా మీరా చనిపోతుంది. అలా మీరా హఠాన్మరణం తర్వాత అప్పటి వరకూ సాఫ్ట్ గా ఉండే కృష్ణ రఫ్ గా, రెబల్ గా మారతాడు. అలా రఫ్ గా మారిన కృష్ణ మూడేళ్ళ తర్వాత కాలేజి ప్రెసిడెంట్ ఎన్నికల్లో పోటీ చేసి గెలుస్తాడు. అదే టైమ్ కృష్ణకు జూనియర్ గా కాలేజీలో చేరుతుంది సత్య. సీరియస్ గా ఉండే కృష్ణను సత్య ఎలా మార్చింది? కృష్ణ మళ్ళీ తన పాత రోజుల్లోకి వెళ్ళడానికి ఎదురైన సందర్భాలేంటి..? చివరికి తనను అమితంగా ప్రేమించే సత్య(సంయుక్త హెగ్డే)ని కృష్ణ పెళ్లి చేసుకున్నాడా..? లేదా అనేది మిగతా కథ.

 

నటీనటుల పనితీరు:

మొదటి సినిమాతోనే కాలేజి స్టూడెంట్ గా ఆకట్టుకున్న నిఖిల్ మరోసారి ఇంజినీరింగ్ స్టూడెంట్ గా మెస్మరైజ్ చేసి సినిమాకు హైలైట్ గా నిలిచాడు. తనకి తెలిసిన క్యారెక్టరే కావడంతో కృష్ణ క్యారెక్టర్ ను ఓన్ చేసుకున్నాడు. సిమ్రన్ తన పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకుని సినిమాకు ప్లస్ అయ్యింది. అయితే ఒరిజినల్ కన్నడ సినిమాలో ఈ క్యారెక్టర్ ను పోషించిన రష్మికను మాత్రం మరిపించలేకపోయింది. హేమంత్ తోపాటు రాకేందు మౌళి అలాగే మిగతా ఫ్రెండ్ క్యారెక్టర్స్ చేసిన వారు పరవాలేదనిపించుకున్నారు. ఇక సిజ్జు, బ్రహ్మాజీ, సయాజీ షిండే తదితరులు తమ పాత్రలకు న్యాయం చేశారు.

 

సాంకేతిక నిపుణుల పనితీరు:

సినిమాకు పనిచేసిన టెక్నిషియన్స్ లో ముందుగా మాట్లాడుకోవాల్సింది మ్యూజిక్ డైరెక్టర్ అజనీష్ లోక్ నాథ్ గురించే. సాంగ్స్ తో పాటు తన బాగ్రౌండ్ స్కోర్ తో సినిమాకు మెయిన్ ఎస్సెట్ గా నిలిచాడు. ముఖ్యంగా ‘గురువారం’, ‘లాస్టు బెంచిరో’, ‘దం దారే దం ధరే’ సాంగ్స్ ఆకట్టుకున్నాయి. రామజోగయ్య శాస్త్రి, వనమాలి, రాకేందు మౌళి అందించిన సాహిత్యం బాగుంది. అద్వైత గురుమూర్తి సినిమాటోగ్రఫీ బాగుంది. పాటల చిత్రీకరణ బాగుంది. ఎడిటింగ్ పరవాలేదు. సెకండ్ హాఫ్ లో ఇంకాస్త ట్రిమ్ చేయొచ్చు. కొన్ని సందర్భాలలో చందూ మొండేటి అందించిన మాటలు బాగున్నాయి. సుదీర్ వర్మ స్క్రీన్ ప్లే పరవాలేదనిపిస్తుంది. కొన్ని సన్నివేశాల్లో శరణ్ కొప్పిశెట్టి దర్శకత్వ ప్రతిభ కనిపిస్తుంది. ఏకే ఎంటర్టైన్మెంట్ ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి.

 

జీ సినిమాలు సమీక్ష:

తెలుగులో ఓ రీమేక్ సినిమా వస్తుందంటే అంచనాలు ఏర్పడటం సహజమే. కన్నడలో సూపర్ హిట్ సినిమా కిర్రిక్ పార్టీ ను నిఖిల్ తెలుగులో రీమేక్ చేస్తున్నాడనగానే ఈ సినిమాపై అంచనాలు నెలకొన్నాయి. దానికి తోడు ఈ సినిమాకు సుదీర్ వర్మ స్క్రీన్ ప్లే ,చందూ మొండేటి మాటలు అందిస్తుండడంతో హైప్ వచ్చింది.

నిజానికి దర్శకుడిగా ఓ రీమేక్ సినిమాను హ్యాండిల్ చేయడమనేది కత్తి మీద సాము లాంటి పని. అందులోకి మొదటి సినిమాకు ఓ రీమేక్ సినిమా సెలెక్ట్ చేసుకోవడం మరీ కష్టం. ఈ రీమేక్ సినిమాతో దర్శకుడిగా పరిచయమైన శరణ్ పరవాలేదనిపించాడు. కానీ పూర్తిస్థాయిలో ఎంటర్ టైన్ చేయలేకపోయాడు. గతంలో రచయితగా- దర్శకుడిగా పనిచేసిన అనుభవంతో కొన్ని సన్నివేశాలను బాగానే డీల్ చేశాడు. ఫస్ట్ హాఫ్ లో ఎంటర్ టైన్ మెంట్ తో పరవాలేదనిపించిన దర్శకుడు సెకండ్ హాఫ్ లో మాత్రం కాస్త బోర్ కొట్టించాడు.  సెకండ్ హాఫ్ లో కొన్ని సన్నివేశాలపై మరింత ఫోకస్ పెడితే బాగుండేది. ఒరిజినల్ తో పోలిస్తే తెలుగు వెర్షన్ కోసం చేసిన మార్పులు సినిమాకు ప్లస్ అవ్వలేదు.

ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ సన్నివేశాల్లో లో నిఖిల్ తన ఎమోషనల్ యాక్టింగ్ తో అదరగొట్టేశాడు. నిఖిల్ పెర్ఫార్మెన్స్, సిమ్రాన్ క్యారెక్టర్ , సంయుక్త ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్, కొన్ని కామెడీ సీన్స్, సాంగ్స్, ఇంటర్వెల్ ఎపిసోడ్, ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ సినిమాకు హైలైట్ గా నిలవగా.. సినిమాకు బలం అనిపించే సన్నివేశాలు పెద్దగా లేకపోవడం.. మరీ ఫ్లాట్ గా ఉండటం సినిమాకు మైనస్, నెరేషన్, సెకండ్ హాఫ్ లో కొన్ని సన్నివేశాలు, కామెడీకి పెద్దగా లేకపోవడం సినిమాకు మైనస్.

ఫైనల్ గా ‘కిరాక్ పార్టీ’ కిర్రాక్ అనిపించదు కాని యువతకి కనెక్ట్ అయ్యే సినిమా.

రేటింగ్ : 2.75/5