'ఖాకి' రివ్యూ

Friday,November 17,2017 - 04:05 by Z_CLU

నటీ నటులు : కార్తి, ర‌కుల్ ప్రీత్ సింగ్ అభిమన్యు సింగ్, బోస్‌ వెంకట్, స్కార్లెట్‌ మెల్లిష్‌ విల్సన్‌ తదితరులు

కెమెరా: సత్యన్‌ సూరన్

సంగీతం: జిబ్రాన్

ఎగ్జిక్యూటివ్ నిర్మాత‌: కె.వి. శ్రీధ‌ర్ రెడ్డి

నిర్మాతలు: ఉమేశ్‌ గుప్తా, సుభాష్‌ గుప్తా

కథ : స్క్రీన్ ప్లే – దర్శకత్వం : వినోద్

 

కార్తి ఓ పవర్ పోలీస్ గా నటించిన ఖాకి ఈరోజే థియేటర్స్ లోకి ఎంట్రీ ఇచ్చింది. వినోద్ డైరెక్షన్ లో కాప్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమాతో కార్తీ ఎలా ఎంటర్టైన్ చేసాడో..చూద్దాం.

కథ :

పోలీస్ ట్రైనింగ్ లో బెస్ట్ అనిపించుకొన్న ధీరజ్(కార్తి) ట్రైనింగ్ పూర్తి చేసుకొని తన సొంత ఊరికి బయలుదేరతాడు…అలా తన వాళ్ళను చూడటానికి ఇంటికెళ్లిన ధీరజ్ ఇంటి ఎదురుగా ఉండే ప్రియ(రకుల్ ప్రీత్ సింగ్) తో ప్రేమలో పడి కుటుంబాన్ని ఒప్పించి పెళ్లి చేసుకుంటాడు. ఇక ట్రైనింగ్ పూర్తవడంతో డి.ఎస్.పి గా బాధ్యతలను స్వీకరిస్తాడు ధీరజ్. ఈ క్రమంలో తన సిన్సియారిటీ తో కొద్ది రోజులకే చాలా ఊర్లు ట్రాన్స్ఫర్ అవుతూ వస్తున్న ధీరజ్ కి హైవే పక్కన ఉండే ఇళ్ళల్లో చొరబడి వరుసగా హత్యలు చేస్తూ తమిళ్ నాడుని అల్లాడించే హావరా గ్యాంగ్ ను పట్టుకునే బాధ్యతను అప్పగిస్తుంది తమిళ్ నాడు పోలీస్ డిపార్ట్మెంట్. ఈ క్రమంలో తన కుటుంబాన్ని వదిలి  రాజస్థాన్ వెళ్లి డి.ఎస్.పి ధీరజ్ ఆ హావరా గ్యాంగ్ ను ఎలా పట్టుకున్నాడు.. చివరికీ వాళ్ళని ఎలా అంతమొందించాడు. అనేది సినిమా కథాంశం.

 

నటీనటుల పనితీరు :

ఇప్పటికే ‘శిరుతై’ సినిమాలో పోలీస్ గా నటించి మెస్మరైజ్ చేసిన కార్తి మరోసారి ఓ సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ గా అదరగొట్టేశాడు. ఇలాంటి యాక్షన్ థ్రిల్లర్ సినిమాలకు హీరో క్యారెక్టర్ లో ఎంత  దమ్ముంటే అంత ఇంపాక్ట్ ఉంటుందనీ మరోసారి రుజువు చేసి సినిమాకు హైలైట్ గా నిలిచాడు కార్తి. ప్రియ అనే గ్లామరస్ క్యారెక్టర్ తో రకుల్ ప్రీత్ సింగ్ ఆకట్టుకుంది. తన విలనిజంతో సినిమాకు మరో హైలైట్ గా నిలిచాడు అభిమన్యు సింగ్. మెల్లిష్ విల్సన్ ఐటెం సాంగ్ తో ఆకట్టుకుంది. ఇక బోస్ వెంకట్, మ్యాచు, రోహిత్ పట్నాయక్, జమీల్ ఖాన్, కిశోర్, సురేంద్ర ఠాకూర్ తమ క్యారెక్టర్స్ కి బెస్ట్ అనిపించుకున్నారు.

 

టెక్నీషియన్స్ పనితీరు :

సత్యన్ సినిమాటోగ్రఫీ సినిమాకు హైలైట్ అని చెప్పొచ్చు. ముఖ్యంగా రాజస్థాన్ లొకేషన్స్ లో కెమెరామెన్ గా తన పనితనం చూపించాడు. జిబ్రాన్ అందించిన పాటలు పరవాలేదనిపించినా, సినిమాకు తగినట్లు గా బ్యాగ్రౌండ్ స్కోర్ అందించి సినిమాకు మరో హైలెట్ గా నిలిచాడు. దిలీప్‌ సుబ్బరాయన్ కంపోజ్ చేసిన యాక్షన్ సీన్స్ సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచాయి. ఎడిటింగ్ – ఆర్ట్ వర్క్ బాగుంది. క్లాప్స్ కొట్టేంతగా డైలాగ్స్ లేకపోయినా కొన్ని సందర్భాలలో వచ్చే మాటలు ఆకట్టుకున్నాయి. వినోత్ స్టోరీ – స్క్రీన్ ప్లే సినిమాకు హైలైట్. ప్రొడక్షన్ వాల్యూస్ రిచ్ గా ఉన్నాయి.


జీ సినిమాలు సమీక్ష :

తెలుగు, తమిళ్, హిందీ ల్లో ఇప్పటికే ఎన్నో కాప్ థ్రిల్లర్ సినిమాలొచ్చినా మరో కాప్ థ్రిల్లర్ సినిమా వస్తుందంటే చాలు యాక్షన్ థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడే వారు అది డబ్బింగ్ సినిమానా.. స్ట్రైట్ సినిమానా.. అనే ఆలోచన లేకుండా థియేటర్స్ లో వాలిపోతారు. సూర్య నటించిన సింగం సిరీస్ తెలుగులో సూపర్ హిట్స్ సాధించడమే దీనికి ఉదాహహరణ. అయితే విక్రమార్కుడు తమిళ్ రీమేక్ తో పోలీస్ గా నటించిన కార్తీ తెలుగులో పోలీస్ గా కనిపించడం ఇదే మొదటి సారి. అన్నయ్య సూర్య బాటలోనే తమిళ్ తో పాటు తెలుగు ప్రేక్షకులను కూడా ఎంటర్టైన్ చేస్తూ వస్తున్న కార్తి ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు తనలోకి మరో కోణాన్ని చూపించి పవర్ ఫుల్ పోలీస్ గా ఎంటర్టైన్ చేశాడు.

దర్శకుడి విషయానికొస్తే మొదటి సినిమా ‘సతురంగ వెట్టై’ తోనే తానేంటో నిరూపించుకున్న వినోథ్ ఈ సినిమాకి మరో ఇంట్రెస్టింగ్ స్టోరీ సెలెక్ట్ చేసుకొని దాని కోసం రీసెర్చ్ చేసి తన థ్రిల్లింగ్ స్క్రీన్ ప్లే తో ఎంటర్టైన్ చేశాడు. ముఖ్యంగా హావరా దోపిడీలను బేస్ చేసుకొని తన స్క్రీన్ ప్లే తో చివరి వరకూ సినిమాను నడిపించిన విధానం అందరినీ ఆకట్టుకుంటుంది. అన్నిటికీ తెగించి రాష్ట్రాలు మారుస్తూ దోపిడీలకు పాల్పడే హావరాల గురించి దర్శకుడు చేసిన రీసెర్చ్ కి అభినందించాల్సిందే. అదే విధంగా ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ ప్రజలకోసం తన కుటుంబాన్ని వదిలి ఎన్నో ఇబ్బందులు పడుతూ విధిని నిర్వహించే విధానాన్ని చూపించిన తీరు బాగుంది.

స్టార్టింగ్ లో సినిమా నత్త నడకన సాగుతున్నట్టుగా అనిపించినప్పటికీ ప్రీ ఇంటర్వెల్ నుంచి ప్రేక్షకుడిని కథలో ఇన్వాల్వ్ చేసి తన స్క్రీన్ ప్లే తో మేజిక్ చేశాడు వినోథ్. కార్తి క్యారెక్టర్, కార్తీ -రకుల్ మధ్య వచ్చే రొమాంటిక్ సీన్స్, ప్రీ ఇంటర్వెల్ ఎపిసోడ్, హావరాల గురించి తెలియజేస్తూ వచ్చే యానిమేషన్ సీన్స్, యాక్షన్ పార్ట్, సెకండ్ హాఫ్ లో మట్టిలో నుంచి కార్తీ బయటికొచ్చే సీన్, ఇంట్రెస్టింగ్ గా సాగే ప్రీ క్లైమాక్స్ ఎపిసోడ్, రాజస్థాన్ లోని కుల్దార లో జరిగే క్లైమాక్స్ ఎపిసోడ్ సినిమాకు హైలైట్స్ గా నిలవగా… ఫస్ట్ హాఫ్ స్టార్టింగ్ లో ఓ పదిహేను నిమిషాల పాటు బోర్ కొట్టించే సీన్స్, లవ్ ట్రాక్  సినిమాకు మైనస్. చివరికీ నిజాయితీగా ఉండే పోలీస్ అధికారులకు మా సెల్యూట్ అంటూ.. వారందరికీ ఈ సినిమా అంకితం అంటూ ఎండింగ్ ఇచ్చాడు దర్శకుడు. ఫైనల్ గా కాప్ యాక్షన్ థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడే వారిని ‘ఖాకి’ బాగా ఎంటర్టైన్ చేస్తుంది.

 

రేటింగ్ : 3.25/5