కేశవ రివ్యూ

Friday,May 19,2017 - 04:16 by Z_CLU

నటీనటులు : నిఖిల్, రీతూ వర్మ, ఇషా కొప్పికర్‌

సినిమాటోగ్రఫీ : దివాకర్‌ మణి

మ్యూజిక్ : సన్నీ యం.ఆర్‌.

సహ నిర్మాత : వివేక్‌ కూచిబొట్ల

సమర్పణ : దేవాన్ష్‌ నామా

నిర్మాత : అభిషేక్‌ నామా

కథ–స్క్రీన్‌ప్లే–దర్శకత్వం : సుధీర్‌వర్మ

రిలీజ్ డేట్ : మే 19 , 2017

 

నిఖిల్-సుధీర్ వర్మది సర్ ప్రైజ్ కాంబినేషన్. వీళ్లిద్దరి కాంబోలో వచ్చిన స్వామి రారా సినిమా చాపకింద నీరులా సెన్సేషనల్ హిట్ అయింది. ఆ మూవీ తర్వాత మళ్లీ కలిసి చేసిన సినిమా కేశవ. దీనికితోడు నిఖిల్ గత చిత్రం ఎక్కడికి పోతావ్ చిన్నవాడా కూడా పెద్ద హిట్. ఈ హీరో కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ అది. ఓ వైపు సుధీర్ వర్మతో సినిమా, మరోవైపు గత చిత్రం పెంచిన అంచనాలు.. మరి ఈ రెండింటినీ తన కొత్త సినిమాతో నిఖిల్ బ్యాలెన్స్ చేయగలిగాడా…


కథ :

చిన్నతనంలో ఓ రోడ్డు ప్రమాదంలో తల్లితండ్రులను పోగుట్టుకున్న కేశవ(నిఖిల్) ఆ ప్రమాదం నుంచి బయటపడి… వికలాంగురాలిగా మారిన తన చెల్లెలిని చూసుకుంటూ లాయర్ చదువుతూ జీవితాన్ని కొనసాగిస్తుంటాడు. ఈ క్రమంలో ఓ వైపు తన చదువుని కొనసాగిస్తూనే మరోవైపు తన కుటుంబానికి అన్యాయం చేసిన వ్యక్తులపై కేశవ ఎలా రివేంజ్ తీర్చుకున్నాడు. అసలింతకీ కేశవ కుటుంబానికి అన్యాయం చేసిందెవరు..? అనేది సినిమా కథాంశం….

నటీనటుల పనితీరు :

ఇప్పటికే సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలతో నటుడిగా పలు సూపర్ హిట్స్ అందుకున్న నిఖిల్.. మరో సారి అలాంటి విభిన్న కథను సెలెక్ట్ చేసుకొని కేశవ అనే క్యారెక్టర్ కు పూర్తి స్థాయిలో న్యాయం చేశాడు. కెరీర్ లో ఇప్పటివరకూ ఫుల్ లెంగ్త్ యాక్షన్ సినిమాలో నటించని నిఖిల్.. మొదటిసారిగా ఈ సినిమాతో తనలోని సరికొత్త కోణాన్ని ఆవిష్కరించి మెస్మరైజ్ చేశాడు. గతంలో సూర్య వెర్సెస్ సూర్య సినిమాలో నటించిన అనుభవం నిఖిల్ కు ఇక్కడ బాగా పనికొచ్చింది.
సత్యభామ అనే క్యారెక్టర్ లో రీతూ వర్మ తన పర్ఫార్మెన్స్ తో ఆకట్టుకుంది. ఇషా కొప్పికర్ తన సీరియస్ పెర్ఫార్మెన్స్ తో సినిమాకు మరో హైలైట్ గా నిలిచింది. వెన్నెల కిశోర్, సుదర్శన్, ప్రియదర్శి, సత్య తమ కామెడీ టైమింగ్ తో ఎంటర్టైన్ చేశారు. ఇక రావు రమేష్, అజయ్, జీవ, రవి వర్మ,బ్రహ్మాజీ, మధు నందన్ తదితరులు తమ క్యారెక్టర్స్ కి న్యాయం చేసి సినిమాకు ప్లస్ అయ్యారు.

టెక్నీషియన్స్ పనితీరు :

ఈ సినిమాకు పనిచేసిన టెక్నీషియన్స్ లో ముందుగా చెప్పుకోవాల్సింది సినిమాటోగ్రాఫర్, మ్యూజిక్ డైరెక్టర్స్ గురించే.. దివాకర్‌ మణి సినిమాటోగ్రఫీ సినిమాకు మేజర్ హైలైట్. సినిమా కథకు, మణి ఫోటోగ్రఫీకి హండ్రెడ్ పర్సెంట్ సింక్ అయింది. సినిమా చూస్తున్నంతసేపు కథలో లీనమైపోయామంటే అది సినిమాటోగ్రఫీ గొప్పదనమనే చెప్పాలి.
సన్నీ బ్యాగ్రౌండ్ స్కోర్ సినిమాకు మరో హైలైట్ గా నిలిచి సినిమాను ఎలివేట్ చేసింది. సన్నీ అందించిన పాటల్లో కాలభైరవ అష్టకం సాంగ్ బాగా ఆకట్టుకుంది. మిగతా పాటలు పరవాలేదు. ఎడిటింగ్ బాగుంది. సెకండాఫ్ లో వచ్చే డైలాగ్స్ ఆకట్టుకున్నాయి. ఇషా కొప్పికర్ కు అనసూయ డబ్బింగ్ బాగుంది. సుధీర్ వర్మ ఇంట్రెస్టింగ్ స్క్రీన్ ప్లే సినిమాకు మరో హైలైట్ గా నిలిచింది. అభిషేక్ పిక్చర్స్ ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి.


జీ సినిమాలు సమీక్ష :

గతంలో ‘స్వామి రారా’ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న నిఖిల్-సుధీర్ వర్మ కాంబినేషన్ లో వచ్చిన మూవీ కేశవ. అందుకే సినిమాపై ఓ మోస్తరు అంచనాలు నెలకొన్నాయి. దీనికి తోడు ట్రయిలర్ కూడా బాగా క్లిక్ అయింది. నాకు గుండె కుడివైపు ఉంది, మర్డర్ కూడా ప్రశాంతంగా చేయాలి లాంటి డైలాగులు సూపర్ గా క్లిక్ అయిపోవడంతో కేశవపై అంచనాలు పెరిగిపోయాయి. ఈ అంచనాల మధ్య కేశవ సినిమా కథ, స్క్రీన్ ప్లే పరంగా బాగానే ఆకట్టుకుంటుంది.
టైటిల్స్ నుంచే క్యూరియాసిటీ పెంచేలా సినిమాను నడిపించాడు దర్శకుడు సుధీర్ వర్మ. స్వామిరారా సినిమాలో ఫాలో అయిన స్క్రీన్ ప్లే టెక్నిక్స్ నే దాదాపు ఇక్కడ కూడా ఫాలో అయ్యాడు.
కథను ఛాప్టర్ వైజ్ ముందుకు నడిపించిన విధానం బాగుంది. ఎండింగ్ లో వచ్చే ట్విస్ట్ తో రివేంజ్ డ్రామాను బాగా ముగించాడు దర్శకుడు.
ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ లో కొని యాక్షన్ సీన్స్, మర్డర్ సీన్స్ అందరినీ థ్రిల్ చేస్తాయి. నిఖిల్ క్యారెక్టర్, ఇంట్రెస్టింగ్ స్క్రీన్ ప్లే, బ్యాగ్రౌండ్ స్కోర్, యాక్షన్ పార్ట్, సెకండ్ హాఫ్, నిఖిల్-ఇషా మధ్య వచ్చే సీన్స్ సినిమాకు హైలైట్ గా నిలిచాయి.
ఇక ట్రైలర్ లో చూపించిన హార్ట్ ప్రాబ్లమ్ ఎలిమెంట్ ను సినిమాలో పెద్దగా ఎస్టాబ్లిష్ చేయకుండా దాన్ని కేవలం కొన్ని సీన్లకే పరిమితం చేయడం, రొటీన్ స్టోరీ, ఊహించేలా ఉండే ట్విస్ట్ సినిమాకు మైనస్ అని చెప్పొచ్చు. ఫైనల్ గా సీరియస్ యాక్షన్ రివేంజ్ డ్రామా ను ఇష్టపడే ఆడియన్స్ ను కేశవ బాగానే ఎంటర్టైన్ చేస్తాడు.

 

రేటింగ్  : 3 /5