'కాటమరాయుడు' రివ్యూ

Friday,March 24,2017 - 01:43 by Z_CLU

విడుదల : మార్చ్ 24, 2017

నటీనటులు : పవన్ కళ్యాణ్ , శృతిహాసన్

ఇతర నటీనటులు : అలీ, అజయ్, కృష్ణ చైతన్య, కమల్ కామరాజు, శివ బాలాజీ, నాజర్, తరుణ్ అరోరా, రావు రమేష్, పృథ్వి తదితరులు

సంగీతం : అనూప్ రెబెన్స్

సినిమాటోగ్రఫీ : ప్రసాద్ మూరెళ్ళ

ఎడిటింగ్ : గౌతంరాజు

నిర్మాణం : నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్

నిర్మాత : శరత్ మరార్

కథ : భూపతి రాజా  –  శివ

రచన : ఆకుల శివ

స్క్రీన్ ప్లే : వాసు వర్మ, దీపక్ రాజ్

స్క్రీన్ ప్లే, దర్శకత్వం : కిషోర్ కుమార్ పార్ధసాని (డాలీ)

 

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తమిళంలో సూపర్ హిట్ సాధించిన ‘వీరం’ సినిమాకు అన్-అఫీషియల్ రీమేక్ గా తెరకెక్కిన ‘కాటమరాయుడు’ థియేటర్స్ లోకి వచ్చింది. డాలీ డైరెక్షన్ లో భారీ అంచనాల మధ్య రిలీజైన ఈ సినిమాతో పవన్ ఎలా ఎంటర్టైన్ చేశాడో..చూద్దాం..

 

కథ :

తన నలుగురు తమ్ముళ్లే ప్రపంచంగా భావిస్తూ ఓ పల్లెటూరిలో పెద్ద మనిషిగా జీవించే వ్యక్తి కాటమరాయుడు (పవన్ కళ్యాణ్). తమ ప్రేమకి అడ్డుగా నిలవడంతో అవంతి(శృతి హాసన్) అనే క్లాసికల్ డాన్సర్ ను కాటమరాయుడు జీవితంలోకి ఎంటర్ అయ్యేలా చేస్తారు రాయుడు తమ్ముళ్లు. ఆడదంటే ఆమడ దూరం పారిపోయే కాటమరాయుడు చివరికి అవంతి ప్రేమలో ఎలా పడ్డాడు.. తను ప్రేమించిన అమ్మాయి కుటుంబానికి ఆపద పొంచి ఉందని తెలుసుకొని వారికి ఎలా అండగా నిలిచాడు.. అనేది సినిమా కథాంశం.

 

నటీనటుల పనితీరు:

పవన్ కళ్యాణ్ మరోసారి తన మేనరిజమ్స్, డిఫరెంట్ స్టైల్ ఆఫ్ యాక్టింగ్ తో మెస్మరైజ్ చేశాడు. ముఖ్యంగా రాయలసీమ యాస, కట్టు బొట్టుతో కాటమరాయుడు గా ఫాన్స్ ను బాగా ఆకట్టుకున్నాడు. సినిమాలో పవన్ తర్వాత చెప్పుకోవాల్సింది రావు రమేష్ గురించి. ఇప్పటికే ఎన్నో యాసలతో డిఫరెంట్ క్యారెక్టర్స్ తో ఎంటర్టైన్ చేసిన రావు రమేష్ ఈ సినిమాలో పగతో రగిలిపోయే కామెడీ విలన్ గా రాయలసీమ యాసతో బాగా ఎంటరైన్ చేశాడు. శృతి హాసన్ నటనతో ఆకట్టుకుంది కానీ గ్లామర్ పరంగా ఎట్రాక్ట్ చేయలేకపోయింది. పవన్ తమ్ముళ్లుగా నటించిన అజయ్, శివబాలాజీ, కమల్ కామరాజు, కృష్ణ చైతన్య వారి క్యారెక్టర్స్ తో ఆకట్టుకున్నారు. అలీ తనదైన కామెడీ పంచులతో కాస్త ఎంటర్టైన్ చేశాడు. సెకండాఫ్ లో పృథ్వి తన కామెడీ టైమింగ్ తో ఎంటర్టైన్ చేశాడు. ఇక విలన్ గా తరుణ్ అరోరా, జడ్జ్ గా నాజర్, ప్రదీప్ రావత్, మానస, యామిని, అయ్యప్ప శర్మ తదితరులు తమ క్యారెక్టర్స్ కి న్యాయం చేశారు.

 

టెక్నీషియన్స్ పనితీరు :

కమర్షియల్ సినిమాకు యాక్షన్ పార్ట్ ఎంత ముఖ్యమో తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించి యాక్షన్ పార్ట్ మేజర్ హైలైట్ గా నిలిచింది. రామ్ లక్ష్మణ్ మాస్టర్ ఫైట్స్ సినిమాకు హైలైట్ గా నిలిచాయి. అనూప్ పాటలు పరవాలేదు. కొన్ని సన్నివేశాలకు ఆర్.ఆర్ బాగుంది. సినిమాటోగ్రఫీ బాగుంది. ముఖ్యంగా పాటల పిక్చరైజేషన్ లో కెమెరామెన్ గా తన ప్రతిభ చూపించాడు ప్రసాద్ మూరెళ్ళ. గౌతమ్ రాజు ఎడిటింగ్ బాగుంది. వాసు వర్మ-దీపక్ రాజ్ స్క్రీన్ ప్లే పరవాలేదు. కొన్ని సందర్భాల్లో వచ్చే డైలాగ్స్ ఆకట్టుకున్నాయి. సి.జీ వర్క్ కుదరలేదు. ప్రొడక్షన్ వాల్యూస్ రిచ్ గా ఉన్నాయి.

 

జీ సినిమాలు సమీక్ష :

పంచెకట్టుతో రాయలసీమ వ్యక్తి గా పవన్ ‘కాటమరాయుడు’ సినిమా చేస్తున్నాడనగానే సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. తమిళ్ లో అజిత్ నటించిన ‘వీరం’ సినిమాకు రీమేక్ అయినప్పటికీ తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా చేసిన కొన్ని మార్పులు ఆకట్టుకున్నాయి. ఫస్టాఫ్ తో పాటు సెకండాఫ్ లో కూడా కొన్ని సన్నివేశాలను మార్చి ఎంటర్టైన్ చేసారు యూనిట్. పవన్ కళ్యాణ్ క్యారెక్టర్ సినిమాకు మెయిన్ ఎస్సెట్ గా నిలిచింది. సినిమా స్టార్టింగ్ లో పవన్ ఎంట్రీ సీన్, హై వోల్టేజ్ యాక్షన్, కాటమరాయుడుని ప్రేమలో పడేయడానికి తమ్ముళ్లు చేసే ప్రయత్నాలు, పవన్ కళ్యాణ్-శృతి హాసన్ మధ్య వచ్చే రొమాంటిక్ సీన్స్, రావు రమేష్ క్యారెక్టర్, సినిమాటోగ్రఫీ, సాంగ్స్ పిక్చరైజేషన్, కొన్ని కామెడీ సీన్స్, క్లైమాక్స్ సినిమాకు హైలైట్ గా నిలిచాయి. ఓవరాల్ గా పవన్ కల్యాణ్ కోసం కాటమరాయుడు సినిమాను చూడొచ్చు.

 

రేటింగ్ : 3 /5