'ఖైదీ' మూవీ రివ్యూ

Friday,October 25,2019 - 03:07 by Z_CLU

నటీ నటులు : కార్తీ, నరైన్, జార్జ్ మర్యాన్, రమణ , దీనా తదితరులు

సంగీతం : సామ్‌ సి.ఎస్‌

సినిమాటోగ్రఫీ : సత్యన్‌ సూర్యన్‌

ఎడిటింగ్‌ : ఫిలోమిన్‌ రాజ్‌

రిలీజ్‌ :  అధినేత కె.కె.రాధామోహన్‌

నిర్మాతలు: ఎస్‌.ఆర్‌.ప్రకాష్‌బాబు, ఎస్‌.ఆర్‌.ప్రభు, తిరుప్పూర్‌ వివేక్‌

రచన – దర్శకత్వం: లోకేష్‌ కనకరాజ్

సెన్సార్ :  U/A

నిడివి :  146 నిమిషాలు

విడుదల తేది : 25 అక్టోబర్ 2019

 

ఇటివలే ‘దేవ్’ సినిమాతో నిరాశపరిచిన కార్తి ఇప్పుడు ‘ఖైదీ’ గా ప్రేక్షకుల ముందుకొచ్చాడు. మరి ఈ సినిమాతో కార్తి సూపర్ కొట్టాడా ..? జీ సినిమాలు ఎక్స్ క్లూజీవ్ రివ్యూ.


కథ :

860 కోట్ల రూపాయల డ్రగ్స్ ను పోలీసులు సీజ్ చేస్తారు. కేవలం నలుగురు పోలీసు అధికారులతో కలిసి మరో సీనియర్ ఆఫీసర్ బిజోయ్ (నారాయణ) ఈ ఆపరేషన్ ను సక్సెస్ చేస్తాడు. పట్టుకున్న వెయ్యి కిలోల కొకైన్ ను పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో అతి తక్కువమందికి మాత్రమే తెలిసిన అండర్ గ్రౌండ్ లో ఉంచుతారు. ఓ అవినీతి పోలీస్ అధికారి వల్ల ఈ విషయం డ్రగ్స్ మాఫియాకు తెలిసిపోతుంది. దీంతో వాళ్లు ఏకంగా పోలీస్ స్టేషన్ ను లేపేయాలని నిర్ణయించుకుంటారు. మరోవైపు డ్రగ్స్ సీజ్ చేసిన ఐదుగురు పోలీసుల్ని కూడా చంపాలనుకుంటారు. రెండు గ్రూపులుగా విడిపోయి ఈ మిషన్ స్టార్ట్ చేస్తారు.

మరోవైపు పదేళ్లు జైలులో ఉండి, ప్రత్యేక అనుమతి మీద అప్పుడే రిలీజ్ అవుతాడు డిల్లీ (కార్తి). కూతుర్ని చూద్దామనుకున్న అతడు ఓ చిన్న గొడవ కారణంగా తిరిగి పోలీస్ స్టేషన్ కు వస్తాడు. అదే సమయంలో ఐదుగురు పోలీసుల్ని చంపాలనుకున్న డ్రగ్స్ మాఫియా, దాదాపు 12 మంది పోలీసులకు డ్రగ్స్ పెట్టి వాళ్లను అపస్మారక స్థితిలో పడిపోయేలా చేస్తారు. ఆ 12 మందిని హాస్పిటల్ కు చేర్చే బాధ్యతను తప్పనిసరి పరిస్థితుల మధ్య తీసుకుంటాడు ఢిల్లీ. ఇంతకీ ఆ పోలీసుల్ని ఓ ఖైదీ కాపాడగలిగాడా? పోలీస్ స్టేషన్ ను ముట్టడించిన మాఫియాను అడ్డుకోగలిగాడా? చివరికి కన్నకూతుర్ని కలుసుకున్నాడా అనేది బ్యాలెన్స్ స్టోరీ.

 

నటీనటుల పనితీరు :

రీసెంట్ గా సరైన సక్సెస్ అందుకోలేకపోయిన కార్తి ఈసారి కమర్షియల్ ఎలిమెంట్స్ కంటే కథనే నమ్ముకున్నాడు. నిజానికి సక్సెస్ లేని టైమ్ లో ఇలాంటి సినిమా చేయడం ఒక రకంగా రిస్కే అయినప్పటికీ, సినిమా చూస్తే కార్తి ఈ స్టోరీ ఎందుకు ఒప్పుకున్నాడో ఈజీగా అర్థమైపోతుంది. ఓ ఖైదీగా రఫ్ లుక్ లో కనిపిస్తూనే.. పదేళ్లుగా చూడని పాప కోసం పరితపించే పాత్రలో కార్తి అద్భుతంగా నటించాడు. మరీ ముఖ్యంగా కథకు తగ్గట్టు.. తనకు బలమైన ఫ్లాష్ బ్యాక్ ఉందనే విషయాన్ని లుక్స్, మేనరిజమ్స్ లో తెలిపేలా చేయడంలో కార్తి సక్సెస్ అయ్యాడు. అతడి కెరీర్ లో ఖైదీ వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీస్ గా నిలుస్తుంది.

అవినీతి పోలీస్ అధికారిగా హరీష్ పేరాడి, సిన్సియర్ పోలీస్ గా నారాయణ్ కుమార్, హెడ్ కానిస్టేబుల్ గా మహానది శంకర్ తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు.

 

సాంకేతిక వర్గం పనితీరు :

నైట్ ఎఫెక్ట్ లో సినిమా షూట్ చేయడం సినిమాటోగ్రాఫర్ కు పెద్ద సవాల్. దీన్ని ఛాలెంజింగ్ తీసుకున్న సత్యన్ సూర్యన్.. తన వర్క్ తో టోటల్ సినిమాకు హైలెట్ గా నిలిచాడు. కార్తి యాక్టింగ్ తర్వాత అందరికీ గుర్తుండిపోయేది ఇతడి సినిమాటోగ్రఫీనే. దీని తర్వాత అందర్నీ ఎట్రాక్ట్ చేసేది శామ్ సీకే బ్యాక్ గ్రౌండ్ స్కోర్. సతీష్ కుమార్ ఆర్ట్ వర్క్ కూడా బాగుంది. కీలకమైన ఎస్పీ ఆఫీస్ సెట్ విషయంలో సతీష్ టాలెంట్ కనిపిస్తుంది. ఎడిటింగ్, స్క్రీన్ ప్లే కూడా ఆకట్టుకుంటాయి. ఈ విషయంలో టోటల్ క్రెడిట్ దర్శకుడు లోకేష్ కనకరాజ్ కే ఇవ్వాలి. అతడు రాసుకున్న డైలాగ్స్, సీన్స్ అన్నీ బాగా కుదిరాయి. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ నిర్మాణ విలువలు బాగున్నాయి.

జీ సినిమాలు సమీక్ష

కథ బాగుంటే కమర్షియల్ ఎలిమెంట్స్ చూడడు కార్తి. అతడు గతంలో నటించిన ఎన్నో సినిమాలు ఈ విషయాన్ని ప్రూవ్ చేశాయి. ఇప్పుడు మరోసారి అది ప్రూవ్ అయింది.  కార్తి మాత్రమే చేయగలడు అనిపించేలా ఉంది ‘ఖైదీ’ . ఇందులో ఒక్క పాట లేదు. హీరోయిన్ లేదు. సినిమా స్టార్ట్ అయిన అరగంటకు గాని హీరో రాడు. అతడ్ని మిగతా పాత్రలు డామినేట్ చేస్తుంటాయి. అయినప్పటికీ ‘ఖైదీ’ నచ్చుతుంది. అందరికీ ఎక్కేస్తుంది. యూత్ కే కాదు, ఫ్యామిలీస్ కు కూడా కనెక్ట్ అవుతుంది. కథ అలాంటిది.

డ్రగ్ మాఫియా సినిమాలు చాలానే చూశాం. ఫాదర్-డాటర్ సెంటిమెంట్ కథలు బోలెడన్ని వచ్చాయి. మరి ఈ రెండింటినీ మిక్స్ చేస్తే ఎలా ఉంటుంది? పదేళ్లుగా కన్నకూతుర్ని చూడని తండ్రికి, జైలు నుంచి బయటకొచ్చే ఛాన్స్ వస్తుంది. కూతురు కోసం ప్రయాణం సాగిస్తాడు. పోలీసుల వల్ల డ్రగ్స్ మాఫియాలో ఇరుక్కుంటాడు. ఓవైపు అదిరిపోయే యాక్షన్.. మరోవైపు కూతురు కోసం పరితపించే తండ్రి మనసు.. ఇక చూస్కోండి సినిమా ఎలా ఉంటుందో!

ఓపెనింగ్ షాట్ నుంచి క్లైమాక్స్ కార్డ్ వరకు కథ ఎక్కడా బోర్ కొట్టదు. కమర్షియల్ ఎలిమెంట్స్ జోలికి వెళ్లకుండా కథ మాత్రమే చెప్పడం, స్క్రీన్ ప్లే పకడ్బందీగా రాసుకోవడం వల్ల ప్రేక్షకుడు కథలో లీనమైపోతాడు. మధ్యలో కాలేజ్ స్టూడెంట్స్ మధ్య వచ్చే 2-3 సీన్లు పంటి కింద రాయిలా అడ్డుపడినప్పటికీ.. ఓవరాల్ గా ఫుల్ మీల్స్ అందించాడు ఖైదీ. సినిమా చూస్తున్నంతసేపు ఎక్కడా డబ్బింగ్ మూవీ అనే ఫీలింగ్ రాలేదంటేనే ఖైదీ సక్సెస్ అయ్యాడన్నమాట.

ఇంతకుముందే చెప్పుకున్నట్టు ఈ సినిమాలో కథకు అడ్డొచ్చేలా ఒక్క పాట కూడా లేదు. కమర్షియల్ ఎలిమెంట్స్ ఇరికించడం కోసమన్నట్టు ఒక్క సీన్ కూడా కనిపించదు. అక్కడక్కడ సినిమాటిక్ లిబర్టీ తీసుకున్నప్పటికీ అదేమంత ఎబ్బెట్టుగా అనిపించదు. కథలో లీనమైన ప్రేక్షకుడికి అసలది గుర్తుకురాదు కూడా. ఇక కార్తి పెర్ఫార్మెన్స్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఇతడిలో మంచి నటుడు ఉన్నాడనే విషయం గతంలోనే ఎన్నోసార్లు ప్రూవ్ అయింది. ఈ సినిమాతో నటుడిగా కార్తి మరో మెట్టు పైకెక్కాడు.

సినిమా రైటింగ్ ఎంత బాగుందో, టెక్నికల్ గా కూడా మూవీ అంతే బాగుంది. కథ ప్రకారం సినిమా అంతా నైట్ ఎఫెక్ట్ లో జరుగుతుంది. విజువల్స్ అన్నీ రియలిస్టిక్ గా తీశాడు సినిమాటోగ్రాఫర్. సినిమాలో అన్ని విభాగాల్ని సినిమాటోగ్రఫీ, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ డామినేట్ చేస్తాయి. అంత బాగున్నాయి ఈ రెండు ఎలిమెంట్స్. ఇక ఎస్పీ ఆఫీస్ కోసం వేసిన సెట్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఇంటర్వెల్ తర్వాత సినిమా మొత్తం ఈ సెట్ లోనే నడుస్తుంది. దర్శకుడిగా లోకేష్ కనకరాజ్ కు ఫుల్ మార్కులు పడతాయి. అతడు ఎంచుకున్న స్టోరీలైన్, రాసుకున్న సన్నివేశాలు, స్క్రీన్ ప్లే అన్నీ పెర్ ఫెక్ట్ గా సింక్ అయ్యాయి.

ఓవరాల్ గా ‘ఖైదీ’ సినిమా ప్రతి ఒక్కర్ని ఆకట్టుకుంటుంది. పాటలు లేవని నిరుత్సాహపడనక్కర్లేదు, కామెడీ లేదని ఫీల్ అవ్వక్కర్లేదు. పైసా వసూల్ మాత్రం గ్యారెంటీ.

రేటింగ్3/5