Movie Review - అమిగోస్

Friday,February 10,2023 - 01:17 by Z_CLU

Kalyan Ram’s ‘AMIGOS’ Review

న‌టీన‌టులు: నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్‌, ఆషికా రంగ‌నాథ్ , జయ ప్రకాష్ , బ్రహ్మాజీ, కళ్యాణి నటరాజన్,  ప్రణవి  మానుకొండ తదితరులు

సంగీతం:  జిబ్రాన్‌

సినిమాటోగ్ర‌ఫీ:  సౌంద‌ర్ రాజ‌న్‌.ఎస్‌

నిర్మాణ సంస్థ‌:  మైత్రీ మూవీ మేకర్స్‌

నిర్మాత‌లు:  న‌వీన్ ఎర్నేని, వై.ర‌వి శంక‌ర్‌

ర‌చ‌న‌, ద‌ర్శ‌క‌త్వం:  రాజేంద్ర రెడ్డి

నిడివి : 139 నిమిషాలు

సెన్సార్ : UA

విడుదల తేది : 10 ఫిబ్రవరి 2023 

కళ్యాణ్ రామ్ ఫస్ట్ టైమ్ ట్రిపుల్ రోల్ చేయడం , సినిమా కోసం దర్శకుడు డోపెల్‌ గ్యాంగర్  అనే కొత్త పాయింట్ తీసుకోవడం ‘అమిగోస్’ పై ప్రేక్షకుల్లో ఆసక్తి పెంచింది. మోస్తరు అంచనాలతో థియేటర్స్ లోకి వచ్చిన ఈ సినిమాతో కళ్యాణ్ రామ్ మరో హిట్ కొట్టాడా ? కొత్త దర్శకుడు మెప్పించడా ? జీ సినిమాలు ఎక్స్ క్లూసివ్ రివ్యూ.

 amigos

కథ : 

తండ్రి వ్యాపారం చూసుకుంటూ కూల్ గా జీవితాన్ని గడిపేసే సిద్దార్థ్ (కళ్యాణ్ రామ్) ఓ టైమ్ లో డోపెల్‌గ్యాంగర్ అనే వెబ్ సైట్ గురించి తెలుసుకొని అందులో రిజిస్టర్ అవుతాడు. ఆ వెబ్ సైట్ ద్వారా తన పోలికలతో ఉండే మంజనాథ్ , మైఖేల్ ను కనుగొంటాడు. గోవాలో ఈ ముగ్గురు కలుసుకుంటారు. తక్కువ రోజుల్లోనే క్లోజ్ అవుతారు. పెళ్లి చూపుల్లో ఇష్టపడిన ఇశికా(ఆషికా రంగ‌నాథ్) కి దగ్గరయ్యే క్రమంలో సిద్దార్థ కి మంజునాథ్ , మైఖేల్ హెల్ప్ చేస్తారు. ఆ తర్వాత ముగ్గురు ఎవరి దారిలో వారు వెళ్ళే క్రమంలో అనుకోకుండా ఎన్ ఐ ఏ ఆఫీసర్స్ ఎంట్రీ ఇస్తారు. ముగ్గురిలో ఒక వ్యక్తిను బిపిన్ రాయ్ గా గుర్తించి పట్టుకొని కాల్పులు జరుపుతారు.

ఇంతకీ  బిపిన్ రాయ్ ఎవరు ? అతని స్థానంలో ఆఫీసర్స్ పట్టుకుంది ఎవరిని ? తనలా ఉన్న డోపెల్ గ్యాంగర్స్  కనుక్కొని సిద్దార్థ ఎలాంటి పొరపాటు చేశాడు ? ఫైనల్ గా ఈ కథలో ట్విస్ట్ ఏంటి ? అనేది స్క్రీన్ పై చూడాల్సిందే.

నటీ నటులు పనితీరు : 

మూడు డిఫరెంట్ రోల్స్ తో కళ్యాణ్ రామ్ ఆకట్టుకున్నాడు. నటుడిగా త్రిపాత్రాభినయం చేసి సినిమా కోసం కష్టపడ్డాడు. ముఖ్యంగా మైఖేల్ పాత్రతో మంచి మార్కులు అందుకున్నాడు. ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన కన్నడ బ్యూటీ ఆషికా రంగనాథ్ తన నటనతో ఆకర్షించింది. ఇషికా పాత్రలో బాగానే నటించింది. తల్లిదండ్రుల పాత్రలతో జయ ప్రకాష్ , కళ్యాణి నటరాజన్ మెప్పించారు. హీరో సిస్టర్ కేరెక్టర్ లో ప్రణవి మానుకొండ మంచి నటన కనబరిచింది. సినిమా మొత్తం కనిపించే మావయ్య పాత్రలో బ్రహ్మాజీ అలరించాడు. కాకపోతే బ్రహ్మాజీ నుండి ఆశించే హిలేరియస్ కామెడీ ఇందులో లేదు.  సత్యం రాజేష్ , కృష్ణ చైతన్య ఒక్క సీన్ కే పరిమితమయ్యారు. మిగతా పాత్రలు చేసిన నటీ నటులంతా పరవాలేదనిపించారు.

సాంకేతిక వర్గం పనితీరు : 

యాక్షన్ థ్రిల్లర్ సినిమాలకు ఇంపాక్ట్ తీసుకొచ్చే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కీలకం. జీబ్రాన్ అందించిన నేపథ్య సంగీతం సినిమాకు ప్లస్ అయ్యింది. ఎన్నో రాత్రులొస్తాయి సాంగ్ ను రీ క్రియేట్ చేసిన విధానం బాగుంది. ఆ సాంగ్ సినిమాకు హైలైట్ గా నిలిచింది. విజువల్ గా కూడా సాంగ్ ఆకట్టుకుంది. ఆ సాంగ్ కి శోభి కొరియోగ్రఫీ బాగుంది.  సౌంద‌ర్ రాజ‌న్‌.ఎస్‌ కెమెరా వర్క్ బాగుంది. ట్రిపుల్ రోల్ తో వచ్చే సన్నివేశాలను బాగా చిత్రీకరించారు. వెంక‌ట్, రామ్ కిష‌న్‌ మాస్టర్స్ కంపోజ్ చేసిన సెకండాఫ్ యాక్షన్ ఎపిసోడ్స్ మాస్ ఆడియన్స్ ను ఎట్రాక్ట్ చేసేలా ఉన్నాయి. త‌మ్మిరాజు ఎడిటింగ్ పరవాలేదు. సినిమాను ఇంకొంత ట్రిమ్ చేసి స్పీడప్ చేసి ఉంటే బాగుండేది.

దర్శకుడు రాజేంద్రరెడ్డి తీసుకున్న డోపెల్ గ్యాంగర్స్ ప్లాట్ బాగుంది. కానీ కథనం కాస్త రొటీన్ అనిపిస్తుంది. మాటలు అంతగా ఆకట్టుకోలేదు.  మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణ విలువలు బాగున్నాయి.

amigos

జీ సినిమాలు సమీక్ష : 

మనిషిని పోలిన మనుషులు ఏడుగురుంటారని  చాలా సందర్భాల్లో వింటుంటాం. మనలా ఇంకోకరున్నారని, వారిని చూశామని ఎవరైనా చెప్తుంటే ఆశ్చర్యం వేస్తుంది. ఇలా ఒకే పోలికతో ఉండేవారిని డోపెల్ గ్యాంగర్ అంటుంటారు. తన మొదటి సినిమా కోసం డోపెల్ గ్యాంగర్ అనే ఇంట్రెస్టింగ్ పాయింట్ తీసుకున్నాడు దర్శకుడు రాజేంద్ర. మొదటి సినిమాకే కొత్త పాయింట్ తో రిస్క్ చేశాడు. నిజానికి మూడు పాత్రలను హ్యాండిల్ చేయడం అంటే ఇటు నటుడికి అలాగే వాటిని రాసుకున్న దర్శకుడికి ఇద్దరికీ ఛాలెంజే. కాకపోతే ఇద్దరికీ రెఫరెన్స్ లు ఉన్నాయి. ట్రిపుల్ రోల్స్ తో తెలుగులోనే చాలా సినిమాలున్నాయి. హాలీవుడ్ తో పాటు తెలుగులోనూ మూడు పాత్రల సినిమాలతో రెఫరెన్స్ లున్నాయి. దర్శకుడు ఏ సినిమాను ఇన్స్పిరేషన్ గా తీసుకున్నాడో తెలియదు కానీ ప్లాట్ తో మాత్రం అందరినీ ఆకట్టుకున్నాడు.

అయితే ఈ కొత్త ప్లాట్ కి తగ్గట్టు ,  కొత్తగా స్క్రీన్ ప్లే , మంచి  ట్విస్ట్ లు ,  సన్నివేశాలు రాసుకుంటే బాగుండేది. ఇలాంటి కొత్త ప్లాట్ తో యాక్షన్ థ్రిల్లర్ తీయాలనుకున్నప్పుడు స్క్రీన్ ప్లే గ్రిప్పింగ్ గా ఉండేలా చూసుకోవాలి. కొత్తగా అనిపించే సన్నివేశాలు. ప్రేక్షకులు ఊహించని ట్విస్టులు ప్లాన్ చేసుకోవాలి. దర్శకుడు రాజేంద్ర అలాంటివేం రాసుకోలేదు.

సిద్దార్థ్ , మైఖేల్ కన్ఫ్యూజన్ డ్రామా అంతా గతంలో చూసిన డబుల్ యాక్షన్ సినిమాలను గుర్తుచేస్తుంది. కళ్యాణ్ రామ్ కూడా అప్పట్లో ‘హరే రామ్’ అంటూ డబుల్ రోల్ తో ఓ సినిమా చేశాడు. అందులో కూడా ఒకటి పాజిటివ్ ఇంకొకటి నెగటివ్. ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ యాక్టింగ్ , సన్నివేశాలు చూస్తే అ సినిమా కొంత వరకు గుర్తొస్తుంది. ఒకడు అమాయకుడు, ఇంకొకరు తెలివైన బలం కలిగిన వాడు , మరొకడు విలన్ షేడ్స్ ఉన్న రాక్షసుడు ఇలా కళ్యాణ్ రామ్ చేసిన మూడు కేరెక్టర్స్ చూస్తే ఎన్టీఆర్ ‘జై లవ కుశ’ కూడా గుర్తురావడం ఖాయం. ఇక సినిమాలో లవ్ ట్రాక్ అంతగా మెప్పించలేదు. ఆ ట్రాక్ లో వాకింగ్ సీన్ ఒక్కటే బాగుందనిపిస్తుంది. దర్శకుడు లవ్ ట్రాక్ ను ఇంకాస్త ఎంగేజింగ్ గా రాసుకుంటే బాగుండేది. సినిమాలో కళ్యాణ్ రామ్ నటన బాగుంది. ముఖ్యంగా మైఖేల్ పాత్రలో నటనకి మంచి మార్కులే పడ్డాయి. మైఖేల్ గా మొదటి లుక్ కాకుండా ఫ్లాష్ బ్యాక్ లో కనిపించే లుక్ బాగుంది. కాకపోతే మూడు పాత్రల్లో మంజునాథ్ పాత్ర తేలిపోయింది. సిద్దార్థ పాత్ర కూడా రొటీనే, కొద్దిగా చెప్పుకునే పాత్ర అంటే మైఖేల్ మాత్రమే. ఆ పాత్ర సుల్తాన్ సినిమాలో బాలయ్యను గుర్తుచేస్తుంది.

అమిగోస్ కోసం మంచి పాయింట్ తీసుకున్న దర్శకుడు పూర్తిస్థాయిలో  మెప్పించలేకపోయాడు. కళ్యాణ్ రామ్ నటన , డోపెల్‌ గ్యాంగర్ ప్లాట్ , ‘ఎన్నో రాత్రులొస్తాయి కానీ’ సాంగ్ , అక్కడక్కడా వచ్చే జీబ్రాన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాకు ప్లస్ పాయింట్స్ కాగా , స్క్రీన్ ప్లే , ముందే ఊహించే ట్విస్టులు, నెమ్మదిగా సాగే సన్నివేశాలు, పేలవంగా అనిపించే సంభాషణలు,  ప్రీ క్లైమాక్స్ నుండి  క్లైమాక్స్ లెంత్ మైనస్ అనిపిస్తాయి. ఫైనల్ గా కొత్త పాయింట్ తో కళ్యాణ్ రామ్ కొంత వరకు మెప్పించాడు.

రేటింగ్ : 2 .5 /5