'కల్కి' మూవీ రివ్యూ

Friday,June 28,2019 - 02:09 by Z_CLU

నటీ నటులు : డా. రాజశేఖర్ , ఆదాశ‌ర్మ‌, నందితాశ్వేత‌, స్కార్లెట్ విల్సన్ , అశుతోష్ రానా, నాజర్, రాహుల్ రామకృష్ణ,శత్రు, మహేష్ ఆచంట తదితరులు.

సంగీతం : శ్రవణ్ భరద్వాజ్

ఛాయాగ్రహణం: దాశరథి శివేంద్ర

నిర్మాణం : హ్యాపీ మూవీస్ , శివానీ శివాత్మిక మూవీస్

నిర్మాతలు : సి.క‌ల్యాణ్‌, శివానీ రాజ‌శేఖ‌ర్‌, శివాత్మిక రాజ‌శేఖ‌ర్

స్క్రీన్ ప్లే : స్క్రిప్ట్స్ విల్

దర్శకత్వం : ప్రశాంత్ వర్మ

నిడివి : 142 నిమిషాలు

విడుదల తేది : 28 జూన్ 2019

 

‘PSVగరుడవేగ’తో ఐయాం బ్యాక్ అనిపించుకున్న యాంగ్రీ స్టార్ రాజశేఖర్ ‘కల్కి’ తో థియేటర్స్ లోకొచ్చాడు. ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లో పీరియాడిక్ ఇన్వెస్టిగేషన్‌ థ్రిల్లర్‌ గా తెరకెక్కిన ఈ సినిమాతో మళ్ళీ రాజశేఖర్ హిట్టు కొట్టాడా..? జీ సినిమాలు ఎక్స్ క్లూజీవ్ రివ్యూ.


కథ :

1980లో జరిగే కథతో తెరకెక్కింది కల్కి. రజాకార్ల దాడుల్లో రాజు చనిపోవటంతో కొల్లాపూర్‌ సంస్థానం భాద్యతలు రాణీ రామచంద్రమ్మ తీసుకుంటారు. ఆ సంస్థానం మీద కన్నేసిన నర్సప్ప (అశుతోష్ రాణా), పెరుమాండ్లు (శత్రు) రాణీని చంపి సంస్థానాన్ని సొంతం చేసుకొని కొల్లాపూర్ లో ప్రజలను హింసిస్తూ పరిపాలిస్తుంటారు. తరువాత నర్సప్ప, పెరుమాండ్లు ఓ గొడవ కారణంగా విడిపోతారు. ఇక నర్సప్ప అరాచకాల్ని భరించలేక అతనిపై ఎదురుతిరగలేక ఏమిచేయలేని ప్రరిస్థితుల్లో జీవిస్తుంటారు.

అదే సమయంలో పట్నం నుంచి వచ్చిన నర్సప్ప తమ్ముడు శేఖర్‌ బాబు(సిద్దు జొన్నలగడ్డ) దారుణంగా హత్య చేయబడతాడు. శేఖర్ బాబు హత్య చేసింది పెరుమాండ్లు అని కొందరు, కాదూ రాణీ రామచంద్రమ్మ దెయ్యం అయి వచ్చి చంపిందని మరికొందరు అనుకుంటుంటారు. ఈ హత్య కేసు ఇన్వెస్టిగేట్ చేయడానికి ప్రభుత్వం కల్కి(రాజశేఖర్‌)ని ప్రత్యేకంగా నియమిస్తుంది. అలా శేఖర్ బాబు హత్య కేసు ఇన్వెస్టిగేషన్ కోసం కొల్లాపూర్‌ వచ్చిన కల్కి, జర్నలిస్ట్ దేవదత్తా (రాహుల్ రామకృష్ణ) సాయంతో ఇన్వెస్టిగేషన్‌ మొదలుపెడతాడు. ఇంతకీ శేఖర్ బాబును చంపిందెవరు…? శేఖర్ బాబు కి ఆసిమా(నందితా శ్వేత)కు సంబంధం ఏంటి.? అనేది మిగతా కథ.

 

నటీ నటుల పనితీరు :

యాంగ్రీ స్టార్ రాజశేఖర్ మరోసారి తన నటనతో మెప్పించాడు. ఇన్వెస్టిగేషన్ సన్నివేశాలు, యాక్షన్ సన్నివేశాల్లో రాజశేఖర్ నటన సినిమాకు హైలైట్ గా నిలిచింది. ఆదాశ‌ర్మ‌ కి స్కోప్ లేని క్యారెక్టర్ లభించడంతో పరవాలేదు అనిపించుకుంది. నందితాశ్వేత‌ అసిమా క్యారెక్టర్ లో నటనతో ఆకట్టుకుంది. రాహుల్ రామకృష్ణ కి మంచి క్యారెక్టర్ దొరికింది. దేవదత్తా అనే జర్నలిస్ట్ క్యారెక్టర్ తో అక్కడక్కడా నవ్విస్తూ అలరించాడు. అశుతోష్ రానా విలనిజంతో మెప్పించాడు. శత్రు ఎప్పటిలాగే క్యారెక్టర్ కి బెస్ట్ అనిపించుకున్నాడు.

స్వామీజీ పాత్రలో నాజర్ మంచి నటన కనబరిచాడు. పూజిత పొన్నాడ, చరణ్ దీప ,మహేష్ ఆచంట,వెన్నెల రామారావు మిగతా నటీనటులు తమ క్యారెక్టర్స్ తో పరవాలేదు అనిపించుకున్నారు.

 

సాంకేతిక వర్గం పనితీరు :

సినిమాకు సంబంధించి నేపథ్య సంగీతం చాలా కీలకపాత్ర పోషించింది. ఇప్పటి వరకూ సాఫ్ట్ మ్యూజిక్ తో ఓ మోస్తరు గుర్తింపు తెచ్చుకున్న శ్రవణ్ భరద్వాజ్ కల్కి కి అదిరిపోయే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించి తన వర్క్ తో హైలైట్ గా నిలిచాడు. పాటలు జస్ట్ పరవాలేదు అనిపించాయి. నేపథ్య సంగీతం తర్వాత సినిమాకు మరో హైలైట్ సినిమాటోగ్రఫీ. దాశరథి శివేంద్ర కెమెరా సినిమాకు వర్క్ ప్లస్ అయ్యింది. కొన్ని సన్నివేశాలను చిత్రీకరించిన విధానం ఆకట్టుకుంటుంది. ఎడిటింగ్ పరవాలేదు. కాకపోతే కొన్ని సన్నివేశాలు ట్రిమ్ చేయొచ్చు. పాటలకు కృష్ణకాంత్ (కె.కె) సాహిత్యం బాగుంది.

నాగేంద్ర ఆర్ట్ వర్క్ బాగుంది. కథ రొటీన్ అయినప్పటికీ కథనం ఆకట్టుకుంది. దర్శకుడు ప్రశాంత్ వర్మ అక్కడక్కడా తడబడినా తన మేకింగ్ స్టైల్ తో కథను కొంత వరకూ ఎంగేజింగ్ గా చెప్పగలిగాడు. కొన్ని సన్నివేశాలను అనుభవం ఉన్న దర్శకుడిగా డీల్ చేసాడు. ప్రొడక్షన్ వాల్యూస్ రిచ్ గా ఉన్నాయి.

జీ సినిమాలు సమీక్ష :

‘అ!’ తో ప్రశంసలు అందుకున్న ప్రశాంత్ రెండో సినిమాకు పీరియాడిక్ థ్రిల్లర్ ను ఎంచుకొని మోస్తరుగా మెప్పించాడు. పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ లో ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ కథను రాసుకొని దర్శకుడిగా సక్సెస్ అయ్యాడు. అక్కడక్కడా తడబడినప్పటికీ తన మేకింగ్ స్టైల్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో మేజిక్ చేసాడు ప్రశాంత్ వర్మ. కొన్ని సందర్భాల్లో కథ కంటే రాజశేఖర్ హీరోయిజం మీదే ఎక్కువ ఫోకస్ పెట్టినట్టు అనిపించింది. బిల్డప్ షాట్స్ , ఎలివేషన్ సన్నివేశాలు కాస్త ఓవర్ అనిపించాయి.

కొల్లాపూర్ లో ఓ మర్డర్ మిస్టరీతో సినిమాను ప్రారంభించి పర్ఫెక్ట్ క్లైమాక్స్ తో సినిమాను ఎండ్ చేసాడు ప్రశాంత్ వర్మ. స్క్రీన్ ప్లే నెమ్మదిగా సాగడం, కొన్ని సన్నివేశాలు ప్రేక్షకుడికి బోర్ కొట్టించడం సినిమాకు మైనస్. ముఖ్యంగా ఇన్వెస్టిగేషన్ సన్నివేశాలు మరింత వేగంగా ఉండేలా ప్లాన్ చేసుకొని ఉండాల్సింది. మొదటి భాగంలో కొన్ని సన్నివేశాలు అనవసరం అనిపిస్తాయి. కానీ వాటన్నిటికీ ఎండ్ లో సమాధానం ఇచ్చాడు దర్శకుడు. హీరో హీరోయిన్ల ప్రేమకథ, అలాగే పాటలు… కమర్షియల్‌ ఫార్మాట్‌ కోసం కావాలని ఇరికించినట్టుగా అనిపిస్తాయి. సినిమాలో ప్రతీ పాత్రకు ఇంపార్టెన్స్ ఉండేలా ప్లాన్ చేసుకున్న దర్శకుడు హీరోయిన్ అదా శర్మ క్యారెక్టర్ ను మాత్రం ఏదో నామ మాత్రంగా రాసుకున్నట్లు అనిపిస్తుంది.

రాజశేఖర్ -అదా శర్మ ప్రేమకథలో బలం లేదు. అందువల్ల ఆ సన్నివేశాలు ప్రేక్షకుడిని ఆకట్టుకొకపోగా విసుగు తెప్పిస్తాయి. చాలా సందర్భాల్లో నేపథ్య సంగీతం సినిమాకు కలిసొచ్చింది. కాకపోతే హీరో క్యారెక్టర్ ఎలివేషన్ కోసం కొట్టిన ర్యాప్ మ్యూజిక్ మాత్రం అనవసరం అనిపిస్తుంది. ఓవర్ ఆల్ గా ‘కల్కి’ ప్రేక్షకులను మోస్తరుగా మెప్పిస్తుంది.

రేటింగ్ : 2.75 /5