జోడి మూవీ రివ్యూ

Friday,September 06,2019 - 01:22 by Z_CLU

నటీనటులు : ఆది సాయికుమార్, శ్రద్ధా శ్రీనాథ్ , సీనియర్ నరేష్, సత్య, వెన్నెల కిశోర్, సిజ్జు, స్వప్నిక, సితార, మాధవి,
గొల్లపూడి మారుతిరావు, వర్షిణి సౌందరరాజన్, ప్రదీప్ తదితరులు
సంగీతం : ‘నీవే’ ఫణికళ్యాణ్
సినిమాటోగ్రఫీ : ఎస్.వి.విశ్వేశ్వర్
ఎడిటర్ : రవి మండ్ల
ఆర్ట్ డైరెక్టర్ : వినోద్ వర్మ
మాటలు : త్యాగరాజు(త్యాగు)
నిర్మాతలు : పద్మజ, సాయి వెంకటేష్ గుర్రం
దర్శకత్వం : విశ్వనాథ్ అరిగెల
రన్ టైమ్ : 139 నిమిషాలు
సెన్సార్ : U
రిలీజ్ డేట్: సెప్టెంబర్ 6, 2019

హీరో ఆది సాయికుమార్ మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. డిఫరెంట్ కథలు ట్రై చేస్తున్న ఈ హీరో ఈసారి ప్రేమకథతో థియేటర్లలోకి వచ్చాడు. ఇంతకీ సినిమా రిజల్ట్ ఏంటి? జీ సినిమాలు ఎక్స్ క్లూజివ్ రివ్యూ


కథ

కపిల్ (ఆది) మంచి మంచి లక్షణాలున్న అబ్బాయి. తండ్రి కమలాకర్ (నరేష్)కు మాత్రం క్రికెట్ అంటే పిచ్చి. అలాఅని క్రికెట్ చూస్తూ ఊరుకోడు. క్రికెట్ బెట్టింగ్ లు కడుతూ ఆస్తుల్ని అమ్మేస్తుంటాడు. ఊరిలో అందరి దగ్గర అప్పులు చేస్తుంటాడు. కపిల్ మాత్రం అప్పులు తీరుస్తూ, తండ్రిని కాపాడుకుంటూ వస్తాడు. ఓ కంపెనీలో సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తున్న కపిల్ జీవితంలోకి కాంచనమాల (శ్రద్ధా శ్రీనాధ్) ప్రవేశిస్తుంది. తొలిచూపులోనే కాంచనమాలను ప్రేమించిన కపిల్, ఆమెను పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అవుతాడు. కాంచనమాల కూడా ఓకే చేసి, ఇంట్లో పెద్దలకు చెబుతుంది.

కాంచనమాల బాబాయ్ (సిజ్జు) కూడా ఒప్పుకోవడంతో పెళ్లికి లైన్ క్లియర్ అవుతుంది. ఓ రెస్టారెంట్ లో కపిల్ ను కలవాలని ఫిక్స్ అవుతారు కాంచనమాల, అతడి బాబాయ్. అదే టైమ్ లో కపిల్ తండ్రిని చూస్తాడు కాంచనమాల బాబాయ్. వెంటనే కపిల్ తో పెళ్లి సంబంధాన్ని రద్దు చేసుకుంటాడు.

కపిల్ తండ్రితో కాంచనమాల కుటుంబానికి ఉన్న సంబంధం ఏంటి? కమలాకర్ కు ఉన్న వ్యసనం వల్ల కాంచనమాల కుటుంబం ఎలాంటి ఇబ్బందులు పడింది? ఈ సమస్యలన్నింటినీ పరిష్కరించి కాంచనమాలను కపిల్ ఎలా పెళ్లి చేసుకున్నాడనేది బ్యాలెన్స్ కథ.

 

నటీనటుల పనితీరు

ఆదికి ఇలాంటి పాత్రలు కొత్తకాదు. సుకుమారుడు, ప్రేమకావాలి లాంటి సినిమాల్లో ఫ్యామిలీ-లవ్ ఎమోషన్స్ పండించాడు. దీంతో కపిల్ పాత్ర పోషించడానికి ఎక్కడా ఇబ్బంది పడలేదు. అలాఅని కపిల్ లుక్ లో, యాక్టింగ్ లో కొత్తదనం ఎక్కడా కనిపించలేదు. శ్రద్ధాశ్రీనాధ్ కు తెలుగులో జెర్సీ తర్వాత ఇది రెండో సినిమా. మొదటి సినిమాతో పోలిస్తే, ఇందులో ఆమెకు నటించడానికి పెద్దగా స్కోప్ లేదు. కానీ ఉన్నంతలో యాక్టింగ్ పరంగా, లుక్స్ పరంగా ఆకట్టుకుంది.

ఇతర పాత్రల్లో కమెడియన్లు సత్య, వెన్నెల కిషోర్ ఆకట్టుకున్నారు. వీళ్ల కామెడీ సినిమాకు మంచి రిలీఫ్. సీనియర్ యాక్టర్ నరేష్ కు మరోసారి మంచి పాత్ర పడింది. బెట్టింగ్ అనే వ్యసనానికి లోనైన తండ్రి పాత్రలో నరేష్ నటన బాగుంది. గొల్లపూడి మారుతీరావు, సితార, మాధవి తమ పాత్రలకు న్యాయం చేశారు.

 

టెక్నీషియన్స్ పనితీరు

టెక్నీషియన్స్ లో ముందుగా చెప్పుకోవాల్సింది మ్యూజిక్ డైరక్టర్ ఫణి కల్యాణ్ గురించి. సినిమాలో 2 ట్యూన్స్ అదిరిపోయాయి. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో పెద్దగా ఆకట్టుకోలేకపోయిన ఈ సంగీత దర్శకుడు.. సాంగ్స్ లో మాత్రం తన మార్క్ చూపించాడు. విశ్వేశ్వర్ సినిమాటోగ్రఫీ బాగుంది. లవ్ సీన్స్ ను బాగా తీశాడు. ఎడిటర్ రవి, ఆర్ట్ డైరక్టర్ వినోద్ వర్మ తమ పరిథి మేరకు ఉన్నంతలో మంచి ఔట్ పుట్ ఇచ్చారు.

ఎడిటర్ కు కాస్త కాస్త ఫ్రీడమ్ ఇచ్చి ఉంటే రన్ టైమ్ మరో 15 నిమిషాలు తగ్గేది. ఆర్ట్ డైరక్టర్ కు ఇంకాస్త బడ్జెట్ ఇచ్చి ఉండే సినిమా మరింత రిచ్ గా వచ్చి ఉండేది. ఇక త్యాగు మాటలు అక్కడక్కడ మాత్రమే మెప్పిస్తాయి. దర్శకుడు విశ్వనాథ్ అరిగెల రొటీన్ కథను ఎంచుకున్నాడు. నిర్మతలు పద్మజ, సాయి వెంకటేష్ ఉన్నంతలో బాగానే ఖర్చుపెట్టి సినిమా తీశారు.

జీ సినిమాలు సమీక్ష

ప్రేమకథలకు సీజన్ లేదు. ఇలాంటి కథల్లో కొత్తదనం కూడా ఉండడం లేదు. మంచి సన్నివేశాలు పడితే సీజన్ తో సంబంధం లేకుండా లవ్ స్టోరీస్ క్లిక్ అవుతాయి. ఓవైపు టాలీవుడ్ కొత్తదనం, భారీతనం అంటూ పరుగులు పెడుతుంటే మరోవైపు జోడి లాంటి ప్రేమకథలు వస్తూనే ఉన్నాయి. ఇలాంటి టైమ్ లో ప్రేక్షకుల్ని ఆకట్టుకోవాలంటే మంచి కంటెంట్ ఉండాలి. జోడి సినిమా కంటెంట్ పరంగా జస్ట్ యావరేజ్ మార్కులు మాత్రమే తెచ్చుకుంటుంది.

ప్రేమికులు విడిపోవడానికి ఎన్నో కారణాలు ఉండొచ్చు. ఆ కారణం ఏంటనేది బలంగా ఉండాలి. ఇక్కడ తండ్రి వల్ల కొడుకు ప్రేమ ఫెయిల్ అవుతుంది. పైగా దీనికి బలమైన ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ కూడా యాడ్ అయింది. కానీ ఈ పాయింట్ ను గ్రిప్పింగ్ గా చెప్పడంలో దర్శకుడు ఫెయిల్ అయ్యాడు. తండ్రికొడుకుల మధ్య అనుబంధాన్ని చూపించిన దర్శకుడు, అదే టైమ్ లో ప్రియుడు-ప్రేయసి మధ్య ఎఫెక్షన్ ను కూడా అంతే బలంగా చూపించి ఆ తర్వాత కాన్ ఫ్లిక్ట్ పెట్టినట్టయితే బాగుండేది. కానీ హీరోహీరోయిన్ల చుట్టూ దర్శకుడు అల్లిన సన్నివేశాలు చప్పగా ఉంటాయి. అక్కడక్కడ కమెడియన్ సత్య ఉన్నాడు కాబట్టి సరిపోయింది కానీ లేదంటే ఆ సీన్స్ మరీ నాసిరకంగా తయారయ్యేవి.

హీరోహీరోయిన్ల తర్వాత ఇలాంటి కథలకు కీలకం ప్రతినాయకుడు. హీరో-విలన్ మధ్య ఘర్షణ సృష్టిస్తూ దర్శకుడు రాసుకున్న పాత్రలు బాగున్నాయి కానీ అవి హైలెట్ అవ్వలేదు. దీనికి కారణం ప్రదీప్ రాయన్. ఇతడి యాక్టింగ్ పూర్తిగా తేలిపోవడంతో విలనిజం పండలేదు. పైగా సెకెండాఫ్ లో హీరోయిన్ ను పెళ్లి చేసుకోవడం కోసం విలన్ ప్రయత్నించే ఎపిసోడ్ కూడా అంత కన్విన్సింగ్ గా అనిపించదు. దీనికి తోడు రియల్ ఎస్టేట్ వ్యాపారం అంటూ హీరోతో పెట్టిన ఎపిసోడ్ పూర్తిగా కథను పక్కదోవ పట్టించింది. క్లైమాక్స్ ను మళ్లీ కాస్త కామెడీ టచప్ తో ముగించడం ఉన్నంతలో కూసింత రిలీఫ్ ఇస్తుంది.

మొత్తంగా చూసుకుంటే ఇంట్రెస్టింగ్ పాయింట్ చుట్టూ, అంతే ఇంట్రెస్టింగ్ గా సన్నివేశాలు రాసుకోకపోవడం జోడి సినిమాకు అతి పెద్ద మైనస్ గా మారింది. ఆది సాయికుమార్ నటన, శ్రద్ధా శ్రీనాధ్ యాక్టింగ్ ఈ బలహీనతను కవర్ చేయలేకపోయాయి.

రేటింగ్2/5