Movie Review - జాతిరత్నాలు

Thursday,March 11,2021 - 03:41 by Z_CLU

నటీనటులు – న‌వీన్‌ పొలిశెట్టి, ప్రియ‌దర్శి, రాహుల్ రామ‌కృష్ణ, ఫరియా అబ్దుల్లా, ముర‌ళిశ‌ర్మ‌, న‌రేష్ వి.కె, బ్ర‌హ్మాజీ, త‌నికెళ్ల భ‌ర‌ణి, వెన్నెల కిషోర్ త‌దిత‌రులు
ర‌చ‌న‌, ద‌ర్శ‌క‌త్వం: అనుదీప్ కేవి
నిర్మాత‌: నాగ్ అశ్విన్
బేన‌ర్‌: స‌్వ‌ప్న సినిమా
సంగీతం: ర‌థ‌న్‌
ఎడిటింగ్‌: అభినవ్ రెడ్డి దండా
రన్ టైమ్: 2 గంటల 28 నిమిషాలు
సెన్సార్: U
రిలీజ్ డేట్: మార్చి 11, 2012

Jathi Ratnalu movie telugu review zeecinemalu
కథ

సంగారెడ్డి జిల్లా జోగిపేటలో ఉంటున్న శ్రీకాంత్ (నవీన్ పొలిశెట్టి), రవి (రాహుల్ రామకృష్ణ), శేఖర్ (ప్రియదర్శి) బెస్ట్ ఫ్రెండ్స్. కాకపోతే ముగ్గురూ ఆవారాలే. ఊళ్లో వాళ్లంతా వీళ్లను అసహ్యించుకుంటారు. దీంతో హైదరాబాద్ వెళ్లి 2 నెలల్లో ఉద్యోగం సంపాదిస్తానని తన తండ్రితో ఛాలెంజ్ చేస్తాడు శ్రీకాంత్. అతడితో పాటు రవి, శేఖర్ కూడా హైదరాబాద్ వెళ్తారు.

ఎలాగోలా మాయమాటలు చెప్పి ఓ ఖరీదైన అపార్ట్ మెంట్ లో దిగుతారు. అక్కడే చిట్టి (ఫరియా అబ్దుల్లా)తో ప్రేమలో పడతాడు శ్రీకాంత్. అంతా సజావుగా సాగుతుందనుకున్న టైమ్ లో మంత్రి చాణక్య (మురళీ శర్మ) పుట్టినరోజు పార్టీకి వెళ్తారు వీళ్లు ముగ్గురు. అక్కడ అనుకోకుండా చాణక్యపై మర్డర్ ఎటెంప్ట్ జరుగుతుంది. ఆ కేసు వీళ్ల ముగ్గురిపై పడుతుంది.

ఈ కేసు నుంచి ఈ ముగ్గురు ఎలా బయటపడ్డారు. ఫైనల్ గా మంత్రిపై హత్యాయత్నానికి పాల్పడింది ఎవరు అనేది జాతిరత్నాలు స్టోరీ.

నటీనటుల పనితీరు

ఇలా కథగా చెప్పుకుంటే ఇది చాలా సీరియస్ సబ్జెక్ట్ అనిపిస్తుంది. కానీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మొత్తం కామెడీ. ఆ కామెడీని ఎక్కువ శాతం మోసే బాధ్యతను నవీన్ పొలిశెట్టి తీసుకున్నాడు. అతడి కామెడీ టైమింగ్, డైలాగ్ డెలివరీ సూపర్. ఏజెంట్ సాయిశ్రీనివాస్ ఆత్రేయతో తానేంటో ప్రూవ్ చేసుకున్న నవీన్, ఈ సినిమాతో నటుడిగా మరోసారి తన టాలెంట్ చూపించాడు.

నవీన్ ఫ్రెండ్స్ గా నటించిన రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి కూడా ఏమాత్రం తీసిపోలేదు. తమ టైమ్ వచ్చినప్పుడల్లా కామెడీ ఇరగదీశారు. పంచ్ లతో తెగ నవ్వించారు. ఇలా ఒకరిద్దరు కాదు.. నరేష్ మినహా దాదాపు మిగతా పాత్రలన్నీ కామెడీ పండించాయంటే సినిమా ఎంత హిలేరియస్ గా ఉందో అర్థం చేసుకోవచ్చు. చివరికి గెస్ట్ రోల్ లో ఇలా వచ్చి అలా వెళ్లిన కీర్తిసురేష్ కూడా తన వంతుగా 2-3 పంచ్ లు
వేసి వెళ్లిపోతుంది.

 

టెక్నీషియన్స్ పనితీరు

ముందుగా దర్శకుడు అనుదీప్ గురించే మాట్లాడుకోవాలి. ఓ కామెడీ స్క్రిప్ట్ రాయాలని కంకణం కట్టుకొని మరీ రంగం దిగిన ఈ దర్శకుడు.. ఎక్కడా లైన్ తప్పలేదు. కామెడీ డోస్ తగ్గించలేదు. లాజిక్స్ ను పక్కనపెట్టి మరీ సీన్లు మీద సీన్లు అల్లేశాడు. సంచుల కొద్దీ పంచులు కుమ్మరించాడు. రైటర్ గా అనుదీప్ కు నూటికి నూరు మార్కులు గ్యారెంటీ. దర్శకుడిగా మాత్రం అతడు ఇంకా చాలా సాధించాల్సింది ఉంది.

ఇతర టెక్నీషియన్స్ విషయానికొస్తే.. సినిమాలో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. కానీ కొన్ని చోట్ల మిక్సింగ్ బాగాలేదు. ఎడిటింగ్ కూడా అంతే. కొన్ని చోట్ల బాగా కుదిరింది. మరికొన్ని సందర్భాల్లో అతికీఅతకనట్టు ఉంది. సినిమాటోగ్రఫీ బాగుంది. స్వప్న సినిమాస్ బ్యానర్ పై నిర్మాత నాగ్ అశ్విన్.. కథకు తగ్గట్టు క్వాలిటీగా సినిమాను నిర్మించాడు.

Jathi ratnalu

జీ సినిమాలు రివ్యూ

ఆడియన్స్ టేస్ట్ మారిపోయింది. ఒకే సినిమాలో నవరసాలు ఇచ్చేస్తే పనైపోతుందనుకునే రోజులు పోయాయి. మనం ఏ జానర్ లో కథ చెప్పాలనుకుంటున్నామో దానికి స్టిక్ అవ్వాలి. ఈ సీక్రెట్ పట్టాడు దర్శకుడు అనుదీప్. అందుకే తన జాతిరత్నాలతో క్రైమ్, సస్పెన్స్, థ్రిల్ పండించే అవకాశం వచ్చినా వదిలేశాడు. కూసింత రొమాన్స్ చేసే స్కోప్ ఉన్నప్పటికీ పట్టించుకోలేదు. పూర్తిగా కామెడీ అందించాలని
ఫిక్స్ అయ్యాడు. అదే పని చేశాడు. అందుకే ఈ జాతిరత్నాలు కడుపుబ్బా నవ్వించారు.

దర్శకుడు కామెడీకి ఎంత బలంగా ఫిక్స్ అయ్యాడో చెప్పడానికి సినిమాలో కొన్ని సీన్స్ చెప్పుకుందాం. పోలీస్ స్టేషన్ లో ఉన్న రాహుల్ రామకృష్ణను చూసేందుకు అతడి తల్లి వస్తుంది. అక్కడ సెంటిమెంట్ పండిచ్చొచ్చు, కానీ ఆ స్థానంలో హిలేరియస్ కామెడీ పండించాడు. విలన్ నుంచి ముగ్గురు హీరోలు తప్పించుకునే క్రమంలో చిన్న యాక్షన్ లేదా ట్రికీ స్క్రీన్ ప్లే వాడుకోవచ్చు. కానీ అక్కడ కూడా పొట్ట
చెక్కలయ్యే కామెడీకే ప్రాధాన్యం ఇచ్చాడు డైరక్టర్.

ఇలా చెప్పుకుంటూ పోతే జాతిరత్నాలు సినిమాలో ఎన్నో సీన్లు. సీరియస్ సీన్స్ ను కూడా కామెడీగా ఎలా తీయొచ్చో ఈ సినిమా చూసి నేర్చుకోవచ్చు. ఒకప్పుడు ఈవీవీ సినిమాల్లో ఆ మార్క్ ఫన్ ఉండేది, మళ్లీ ఇన్నాళ్లకు కనిపించింది. చివరికి సీరియస్ గా సాగుతుందని, చిన్న మెసేజ్ ఇస్తారని భావించిన క్లైమాక్స్ లో కూడా పంచ్ లు వేసి, దర్శకుడు తన మార్క్ చూపించుకున్నాడు.

కథగా చెప్పడానికి ఇందులో ఏం లేకపోవచ్చు. స్క్రీన్ ప్లే, లాజిక్స్ పరంగా లోటుపాట్లు ఎంచడానికి ఎన్నో అవకాశాలున్నాయి. కానీ అవేవీ ఇక్కడ అప్రస్తుతం. ఎందుకంటే ఈ జాతిరత్నాలు నవ్విస్తామని ప్రామిస్ చేశారు. చెప్పినట్టే మాట నిలబెట్టుకున్నారు. కాబట్టి మిగతావన్నీ ఆటోమేటిగ్గా పాస్ అయిపోయినట్టే.

తనలో బలమేంటో నవీన్ పొలిశెట్టి మరోసారి చాటుకున్నాడు. సినిమాను అతడు సింగిల్ హ్యాండ్ తో నడిపించాడు. నవీన్ కు ఏమాత్రం తీసిపోని విధంగా రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి పంచ్ ల మీద పంచ్ లతో నవ్వుల వర్షం కురిపించారు. చాన్నాళ్ల తర్వాత థియేటర్లలో ప్రేక్షకులంతా ఘొల్లుమని నవ్వారంటే దానర్థం జాతిరత్నాలు సూపర్ హిట్ మార్కులతో పాస్ అయిపోయినట్టే.

బాటమ్ లైన్ – హాస్య రత్నాలు
రేటింగ్3/5