'జంబలకిడిపంబ' మూవీ రివ్యూ

Friday,June 22,2018 - 05:06 by Z_CLU

నటీనటులు: శ్రీనివాస్ రెడ్డి,సిద్ధి ఇద్నాని క‌థానాయిక‌. పోసాని కృష్ణ‌ముర‌ళి, వెన్నెల కిశోర్ తదితరులు

సంగీతం: గోపీసుంద‌ర్‌

కెమెరా: స‌తీశ్ ముత్యాల‌

నిర్మాత‌లు: ర‌వి, జోజో జోస్‌, శ్రీనివాస‌రెడ్డి.ఎన్‌

స‌హ నిర్మాత‌: బి.సురేశ్ రెడ్డి

ర‌చ‌న‌- ద‌ర్శ‌క‌త్వం: జె.బి.ముర‌ళీకృష్ణ (మ‌ను)

నిడివి : 141 నిమిషాలు

సెన్సార్ : U / A

రిలీజ్ డేట్: జూన్ 22, 2018

 

‘జంబ‌ల‌కిడిపంబ‌’ సినిమాతో ఓ బెంచ్ మార్క్ క్రియేట్ చేశారు ఈవీవీ స‌త్య‌నారాయ‌ణ… అదే టైటిల్ తో ఈరోజు ప్రేక్షకుల ముందుకొచ్చాడు శ్రీనివాస్ రెడ్డి. మరి ‘జంబలకిడి పంబ’ టైటిల్ తో కామెడి ఎంటర్ టైనర్ గా రూపొందిన ఈ సినిమా ప్రేక్షకులను అలరించిందా… కామెడి హీరో శ్రీనివాస్ రెడ్డి మరో హిట్ సొంతం చేసుకున్నాడా… జీ సినిమాలు ఎక్స్ క్లూజీవ్ రివ్యూ.

కథ :

వరుణ్(శ్రీనివాస రెడ్డి), పల్లవి(సిద్ధి) భార్యాభర్తలు. ప్రేమించి పెళ్ళి చేసుకున్న ఈ ఇద్దరూ చిన్న చిన్న మనస్పర్థలతో విడాకులు తీసుకోవాలని లాయర్ హరిశ్చంద్ర (పోసాని)ని కలుస్తారు. లాయర్ గా 99 విడాకుల కేసులు గెలిచి వరుణ్ – పల్లవి ల కేసును 100 వ కేసుగా టేకప్ చేస్తాడు. అయితే ఊహించని సంఘటన వల్ల అనుకోకుండా హరిశ్చంద్ర ప్రసాద్ మరణిస్తాడు. అయితే తను 99 జంటలకు విడాకులు ఇప్పించిన కారణంగా అతని ఆత్మను భూలోకానికి పంపి వరుణ్, పల్లవిలను కలిపే బాధ్యత అప్పగిస్తాడు దేవుడు(సుమన్). వారిని కలపడం కోసం తర్జన భర్జన పడిన హరి చివరికి తన శక్తితో వరుణ్ ఆత్మను పల్లవిలోకి , పల్లవి ఆత్మను వరుణ్ లోకి పంపి జంబలకిడిపంబగా మారుస్తాడు. అలా హీరో శరీరం హీరోయిన్ గా, హీరోయిన్ హీరోగా మారతారు. ఆ తర్వాత వారిద్దరూ ఎలాంటి సంఘటనలు ఎదుర్కున్నారు..? చివరికి ఒకరి భాదను మరొకరు అర్ధం చేసుకొని ఎలా ఒక్కటయ్యారు..అనేది మిగతా కథ.

 

నటీనటుల పనితీరు :

కామెడి హీరోగా ఇప్పటికే కొన్ని సినిమాలు చేసి ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసిన శ్రీనివాస్ రెడ్డి మరోసారి కామెడి హీరోగా అలరించాడు. అయితే గత సినిమాలతో పోలిస్తే ఇది కాస్త బరువైన పాత్ర కావడంతో కామెడీకి స్కోప్ తగ్గింది. కొన్ని సందర్భాల్లో హీరోగా సెటిల్ పెర్ఫార్మెన్స్ ఇచ్చి పెద్దగా కామెడి పండించలేకపోయాడు. సిద్ది ఇద్నాని తన మెచ్యూర్డ్ పెర్ఫార్మెన్స్ తో సినిమాకు హైలైట్ గా నిలిచింది. పోసాని , వెన్నెల కిషోర్ కామెడి పెద్దగా పండకపోగా చిరాకు తెప్పించేలా ఉంది. హరితేజ మోడరన్ పనిమనిషిగా ఎంటర్టైన్ చేయలేకపోయింది. స‌త్యం రాజేశ్‌, ధ‌న్‌రాజ్‌, ష‌క‌ల‌క శంక‌ర్‌, రాజ్య‌ల‌క్ష్మి, హిమ‌జ‌, కేదారి శంక‌ర్‌, మ‌ధుమ‌ణి, మిర్చి కిర‌ణ్‌, జ‌బ‌ర్ద‌స్త్ అప్పారావు, స‌న‌, సంతోష్‌, గుండు సుద‌ర్శ‌న్‌, జ‌బ‌ర్ద‌స్త్ ఫ‌ణి త‌దిత‌రులు తమ పరిధిలో నటించారు కానీ పెద్దగా ఎస్టాబిలేష్ అయ్యే క్యారెక్టర్ ఒకటీ లేదు.

 

టెక్నిషియన్స్ పనితీరు :

టెక్నికల్ గా ప్రతీ ఒక్కరూ సినిమాకు ప్లస్ అయ్యారు. ముఖ్యంగా గోపి సుందర్ మ్యూజిక్… సతీష్ ముత్యాల సినిమాటోగ్రఫీ సినిమాకు హైలైట్స్. ‘మదిలో ఉన్న మాట’ పాట అందరినీ ఆకట్టుకునేలా ఉంది. ఎడిటింగ్ పరవాలేదు. జె.బి. ముర‌ళీకృష్ణ (మ‌ను) ఎంచుకున్న పాయింట్ బాగుంది కానీ స్క్రీన్ ప్లే కుదరలేదు. డైలాగ్స్ కూడా పేలలేదు. శివం సెల్యులాయిడ్స్ ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. చిన్న సినిమా అయినప్పటికీ బాగా ఖర్చు పెట్టారు.

జీసినిమాలు ఎక్స్ క్లూజీవ్ రివ్యూ :

‘జంబలకిడిపంబ’ టైటిల్ తో శ్రీనివాస్ రెడ్డి సినిమా చేస్తున్నాడనగానే ఈ సినిమాపై కాస్త బజ్ క్రియేట్ అయింది. రిలీజ్ కి ముందు రవితేజ, నాని, రకుల్, అల్లరి నరేష్ ప్రమోట్ చేయడంతో సినిమాపై క్యూరియాసిటీ నెలకొంది. ఆ అంచనాలకు తగ్గట్టే ‘జంబలకిడిపంబ’ ఉన్నంతలో కాస్త భారీగానే రిలీజ్ అయింది.

గతంలో ‘జంబలకిడిపంబ’ అనే టైటిల్ ను సృష్టించి ఈ కాన్సెప్ట్ తో కడుపుబ్బా నవ్వించారు ఈ.వీ.వీ. సత్యనారాయణ. ఈ సినిమా కోసం అందులో నుండి మెయిన్ థీం తీసుకున్న దర్శకుడు దానికి ప్రస్తుతం భార్యభర్తల మధ్య ఉండే సమస్యలను అలాగే వాటికి పరిష్కారం చూపే దిశగా వాడుకున్నాడు. ముఖ్యంగా భార్యభర్తల మధ్య గొడవలు వాటికి పరిష్కారాల గురించి ఫోకస్ పెట్టిన దర్శకుడు కామెడీ పై ఫోకస్ పెట్టలేదనిపిస్తుంది. అదే సినిమాకు మెయిన్ మైనస్ అయింది.

కమెడియన్ హీరో ను అలాగే ఇంకెంతో మంది కమెడియన్లలు పెట్టుకొని వారిని పర్ఫెక్ట్ గా వాడుకోలేకపోయాడు దర్శకుడు. ‘జంబలకిడిపంబ’ సినిమాకు ఈ సినిమాకు ఎలాంటి సంబంధం లేదని యూనిట్ చెప్తూ వచ్చినప్పటికీ టైటిల్ చూసి కామెడి మాత్రమే ఆశించి థియేటర్స్ కి వెళ్లే ప్రేక్షకులకు కాస్త నిరాశ తప్పదు. అందుకే గతంలో ఇదే టైటిల్ తో అప్పట్లో సినిమా చేద్దామనుకొని విరమించుకున్నాడు.

సినిమా ప్రారంభం నుండి ఇంటర్వెల్ వరకూ పెద్దగా బలమైన సన్నివేశాలు లేకపోవడం, కామెడి పండకపోవడంతో కొంతవరకూ సినిమా నిరాశ పరుస్తుంది. మరీ ముఖ్యంగా ఫస్టాఫ్ అంతా చాలా ఇబ్బంది పెడుతుంది. సెకండ్ హాఫ్ మాత్రం పరవాలేదనిపిస్తుంది. ముఖ్యంగా ప్రీ క్లైమాక్స్ ఎపిసోడ్ లో వచ్చే కామెడి సినిమాకు హైలైట్ అని చెప్పొచ్చు.

 

రేటింగ్ : 2 .5 /5