'జై లవకుశ' రివ్యూ

Thursday,September 21,2017 - 03:14 by Z_CLU

నటీనటులు : ఎన్టీఆర్, రాశి ఖన్నా, నివేత థామస్, సాయి కుమార్, పోసాని తదితరులు

సంగీతం : దేవిశ్రీ ప్రసాద్

సినిమాటోగ్రాఫర్ : ఛోటా కె నాయుడు

ఆర్ట్ డైరెక్టర్ : ఏ.ఎస్.ప్రకాష్

నిర్మాణం : ఎన్.టి.ఆర్ ఆర్ట్స్

నిర్మాతలు : కళ్యాణ్ రామ్

స్క్రీన్ ప్లే : కోన వెంకట్, చక్రవర్తి, బాబీ

కథ-మాటలు-దర్శకత్వం :కె.ఎస్. రవీంద్ర (బాబీ)

రిలీజ్ డేట్ : 21 సెప్టెంబర్ 2017

 

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న సినిమా అంటేనే ప్రేక్షకుల్లో బోలెడంత క్రేజ్. అలాంటిది జనతా గ్యారేజ్ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత యంగ్ టైగర్ చేసిన సినిమా. మరీ ముఖ్యంగా తొలిసారి ఎన్టీఆర్ 3 గెటప్పుల్లో కనిపించిన సినిమా. అందుకే జై లవకుశపై ఆకాశమే హద్దుగా అంచనాలు పెరిగిపోయాయి. మరి ఈరోజు థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా అంచనాల్ని అందుకుందా…

కథ :

చిన్నతనం నుంచే మావయ్య(పోసాని) తో కలిసి ఊరూరు తిరుగుతూ నాటకాలు వేస్తుంటారు జై(ఎన్టీఆర్), లవ(ఎన్టీఆర్),కుశ (ఎన్టీఆర్). అయితే నత్తి వల్ల డైలాగులు పలకడం రాకపోవడంతో జై ను నాటకాల్లో పాత్రలకు దూరంగా పెడుతుంటారు. ఈ క్రమంలో రాముడిలా ఉంటే బ్రతకడం కష్టమని, రావణుడిలా ఉంటేనే జయించగలమని భావించిన జై… ఓ ప్రమాదం సృష్టించి తన తమ్ముళ్లు లవ, కుశ ను అక్కడే వదిలేసి ఒరిస్సా  వెళ్లి అక్కడ రావణుడి అవతారమెత్తుతాడు. అలా భైరంపూర్ లో రావణ్ గా ఊరుని శాసిస్తూ జీవితాన్ని గడిపే జై మళ్ళీ లవ కుశ ను ఎలా కలిశాడు..? ఎందుకు కలిశాడు.. చివరికీ తన తమ్ముళ్ల పై తనకున్న ప్రేమను ఎలా చాటుకున్నాడు..అనేది సినిమా కథాంశం.

 

నటీనటుల పనితీరు :

ఒక్కో సినిమాకు నటుడిగా ఎదుగుతూ వస్తున్నఎన్టీఆర్.. జై లవకుశతో నటుడిగా మరో మెట్టు పైకి ఎక్కాడు. లవ , కుశ , జై అనే మూడు విభిన్న పాత్రలతో వన్ మాన్ షో చూపించాడు. ముఖ్యంగా జై అనే రౌద్రం గల పాత్రలో ఫస్ట్ టైం నెగెటివ్ షేడ్స్ లో ఎన్టీఆర్ యాక్టింగ్ ను అద్భుతం అనక తప్పదు. ఇక కామెడీ పంచ్ లు, డాన్స్ లు అందించే బాధ్యతల్ని లవ, కుశ పంచుకున్నారు.
రాశి ఖన్నా , నివేత తమ గ్లామరస్ రోల్స్ తో పరవాలేదనిపించుకున్నారు. నివేతతో పోలిస్తే రాశిఖన్నాకే సినిమాలో ఎక్కువ స్కోప్ దక్కింది. ఇక నందిత క్యారెక్టర్ ఎంత చిన్నదంటే, సినిమాతో దాదాపు సంబంధం లేనట్టే ఉంటుంది. వీళ్లతో పాటు మరో హీరోయిన్ తమన్న కూడా ఉంది. కాకపోతే ఆమె ఐటెంసాంగ్ చేసింది. ఆ ఒక్క పాటతో బాగానే ఎట్రాక్ట్ చేసింది.
బ్రహ్మాజీ-ప్రవీణ్-ప్రియదర్శి తమ కామెడీ టైమింగ్ తో ఎంటర్టైన్ చేశారు. ఇక సాయి కుమార్, పోసాని, ప్రదీప్ రావత్, సత్య, హంసా నందిని, రోహిత్ రాయ్, అభిమన్యు సింగ్ తమ క్యారెక్టర్స్ కి న్యాయం చేశారు. క్లయిమాక్స్ సన్నివేశాల్లో సాయికుమార్ ను ఇంకాస్త ఎక్కువగా ఉపయోగించుకుంటే బాగుండేది.

 

టెక్నీషియన్స్ పనితీరు :

ఈ సినిమా విషయానికొస్తే ముందుగా చెప్పుకోవాల్సింది దేవి శ్రీ ప్రసాద్ గురించే. సాంగ్స్ తో రిలీజ్ కి ముందే హైప్ తీసుకొచ్చిన దేవి సినిమాకు బలమైన బ్యాగ్రౌండ్ స్కోర్ అందించి హైలైట్ గా నిలిచాడు. ముఖ్యంగా ‘ట్రింగ్ ట్రింగ్’, ‘నీ కళ్ళలోన కాటుక’, ‘స్వింగ్ జరా’.. సాంగ్స్ ఆకట్టుకున్నాయి. ఇక దేవి తర్వాత మాట్లాడుకోవాల్సింది ఛోటా కే నాయుడు గురించే.. తన సినిమాటోగ్రఫీ తో సినిమాను మరింత కలర్ ఫుల్ గా తీర్చిదిద్ది సినిమాకు మరో హైలైట్ గా నిలిచాడు చోటా. ముఖ్యంగా సాంగ్స్ పిక్చరైజేషన్ అందరినీ ఆకట్టుకునేలా ఉంది.
బాబీ రాసుకున్న కథ రొటీన్ గానే ఉన్నప్పటికీ కోన వెంకట్ – చక్రవర్తి అందించిన స్క్రీన్ ప్లే ఆకట్టుకుంది. ఎన్టీఆర్ నుంచి ఆశించే పవర్ ఫుల్ డైలాగ్స్ లేకపోవడం అభిమానులను నిరుత్సాహపరిచింది. ఇక ‘మనం అనేది అబద్దం నేను అనేదే నిజం’, ఘట్టం ఏదైనా.. పాత్ర ఏదైనా నేను రె.రె.రెడీ అంటూ ఎన్టీఆర్ చెప్పిన కొన్ని డైలాగ్స్ మాత్రం ఓ మోస్తరుగా ఎంటర్టైన్ చేశాయి. ఏ.ఎస్.ప్రకాష్ ఆర్ట్ వర్క్, కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటింగ్ బాగున్నాయి. ఎన్టీఆర్ ఆర్ట్స్ ప్రొడక్షన్ వాల్యూస్ రిచ్ గా అన్నాయి.


జీ సినిమాలు సమీక్ష :

జనతా గ్యారేజ్ తర్వాత నెక్స్ట్ సినిమా ఏమిటనే విషయం పై చాలా టైం తీసుకున్న తారక్ ఫైనల్ గా.. బాబీ చెప్పిన ఓ కథకు ఫిదా అయి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడనే వార్త వినిపించడం, దీనికితోడు యూనిట్ కూడా కథపై ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉండటంతో ఈ సినిమాకు కథే బలం అనే కానుందనే నమ్మకం అందరిలో కలిగింది. ఎన్టీఆర్ తో సినిమా చేయడానికి బాబీ సెలెక్ట్ చేసుకున్న పవర్ ఫుల్ పాయింట్ అందరినీ ఆకట్టుకుంది.

చిన్నతనంలో నత్తి అనే లోపంతో ముందు నుంచి వెనక్కి వెళ్లి రాముడిలా కాదు రావణుడిలా క్రూరత్వంగానే జీవితంలో ముందుకు సాగాలి అనుకుని బంధాలకు-బంధుత్వాలకు దూరంగా వెళ్లిపోయిన ఓ కుర్రాడి కథకు అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ యాడ్ చేసి ఎంటర్టైన్ చేసినందుకు దర్శకుడిగా బాబీను అభినందించాల్సిందే.

ఇక టెంపర్ నుంచి ప్రతీ సినిమాకు ఓ డిఫరెంట్ స్క్రిప్ట్ ను సెలెక్ట్ చేసుకుంటూ ప్రయోగాలతో వరుస బ్లాక్ బస్టర్స్ అందుకుంటున్న ఎన్టీఆర్ మరోసారి ఇలాంటి స్క్రిప్ట్ సెలెక్ట్ చేసుకొని నటుడిగా శెభాష్ అనిపించుకున్నాడు. ముఖ్యంగా జై నెగిటీవ్ షేడ్స్ ఉండే క్యారెక్టర్ తో అటు ఫాన్స్ ను ఇటు ఆడియన్స్ ను మెస్మరైజ్ చేయడం అంటే అది మామూలు విషయం కాదు.. అందులో తారక్ పూర్తిగా సక్సెస్ అయ్యాడనే చెప్పాలి.

ఎన్టీఆర్ హై వోల్టేజ్ యాక్షన్, రాశి ఖన్నా- నివేత గ్లామర్, ఫైట్స్, ఎమోషనల్ సీన్స్, ఇంటర్వెల్ బాంగ్, స్క్రీన్ ప్లే, తమన్నాస్పెషల్ సాంగ్, దేవి బ్యాగ్రౌండ్ స్కోర్, సినిమాటోగ్రఫీ, ప్రీ క్లైమాక్స్ సీన్, క్లైమాక్స్ ఫైట్ సినిమాకు హైలైట్ గా నిలవగా… కథనంలో వేగం లోపించడం, సెకెండాఫ్ లో ఎంటర్ టైన్ మెంట్ లేకపోవడం మైనస్.

ఫైనల్ గా.. ఎన్టీఆర్ నటవిశ్వరూపం చూడాలనుకునేవాళ్లకు, 3 గెటప్పుల్లో సింగిల్ స్క్రీన్ పై ముగ్గురు ఎన్టీఆర్ లను చూడాలనుకునేవాళ్లకు జైలవకుశ బాగా నచ్చుతాడు.

 

రేటింగ్ : 3/5