'జాను' మూవీ రివ్యూ

Friday,February 07,2020 - 02:11 by Z_CLU

నటీ నటులు : శర్వానంద్ , సమంత, వెన్నల కిషోర్ , శరణ్య ప్రదీప్, తాగుబోతు రమేష్, సాయి కిరణ్, గౌరీ తదితరులు

ఛాయాగ్రహణం : మహీంద్రన్ జయరాజు

సంగీతం : గోవింద్ వసంత

నిర్మాత : దిల్ రాజు

రచన -దర్శకత్వం : ప్రేమ్ కుమార్

సెన్సార్ : U

నిడివి : 150 నిమిషాలు

విడుదల తేది : 7 ఫిబ్రవరి 2020

కొన్ని క్లాసిక్ లవ్ స్టోరీస్ ను రీమేక్ చేయకూడదనేది అందరి మాట. కానీ ’96’ సినిమా చూసాక ఎంత మంది వద్దని చెప్పినా ఎవ్వరి మాట వినకుండా తను కనెక్ట్ అయిన ప్రేమకథను రీమేక్ చేసి తెలుగు ప్రేక్షకులకు చూపించాలనుకున్నారు దిల్ రాజు. మరి ’96’ కు రీమేక్ గా తెరకెక్కిన ‘జాను‘ ఆ మేజిక్ ను రీ క్రియేట్ చేయగలిగిందా ? దిల్ రాజు నిర్మాతగా సక్సెస్ అయ్యాడా ? జీ సినిమాలు ఎక్స్ క్లూజీవ్ రివ్యూ.

కథ :

ట్రావెల్ ఫోటోగ్రఫర్ గా టూర్లు తిరిగే కే.రామ చంద్ర ఉన్నపళంగా తన ప్రొఫెషన్ ను పక్కన పెట్టి విశాఖపట్నం వెళ్లి తను చదువుకున్న స్కూల్ ను చూస్తూ పాత జ్ఞాపలకలన్నీ నెమరు వేసుకుంటాడు. గుర్తొచ్చిన స్కూల్ ఫ్రెండ్స్ అందరికీ ఫోన్ ద్వారా టచ్ లోకి వెళ్తాడు. చాలా ఏళ్ల తర్వాత రామ చంద్ర మళ్ళీ టచ్ లోకి రావడంతో స్కూల్ ఫ్రెండ్స్ అందరూ హ్యాపీగా ఫీలవుతారు.

ఈ క్రమంలో రామ చంద్రతో కలిసి చదివిన 2004 బ్యాచ్ లోని మురళి (వెన్నెల కిషోర్) , సుభ(శరణ్య) లీడ్ తీసుకొని తమ బ్యాచ్ తో కలిసి రీ యూనియన్ ఏర్పాటు చేస్తారు. దానికి అందరూ స్నేహితులు తమ కుటుంబంతో వచ్చి మిత్రులను కలుసుకొని హ్యాపీగా గడుపుతారు. అయితే ఆ కార్యక్రమానికి రామ చంద్ర ఎంతగానో ప్రేమించిన జాను(సమంత) ను కూడా పిలుస్తారు మురళి, సుభ. చాలా ఏళ్ల తర్వాత కలుసుకోవడంతో రామ్, జాను లు మళ్ళీ కనెక్ట్ అవుతారు. అలా కనెక్ట్ అయి వారి ప్రేమకథను గుర్తుచేసుకుంటారు. చివరికి మళ్ళీ ఎవరి దారి వారు చూసుకొని దూరమవుతారు. ఇదే ‘జాను’ కథ.

 

నటీ నటుల పనితీరు :

రీమేక్ సినిమాలు చేసినప్పుడు నటులకి ఎడ్వాంటేజ్ తో పాటు కంపేరిజన్ కూడా ఉంటుంది. ఆల్రెడీ ఆ సీన్ లో ఓ యాక్టర్ నటించి ఉంటాడు కాబట్టి దాన్ని చూసుకుంటూ బెస్ట్ ఇవ్వగలిగితే ఈజీగా పాస్ అయిపోవచ్చు. ఇది ఎడ్వాంటేజ్ అయితే ఆల్రెడీ ఆ సీనులో పండించిన ఎమోషన్ ను పండించలేకపోతే మాత్రం వెంటనే కంపేరిజన్ మొదలు పెట్టేసి హీరో , హీరోయిన్ ని ట్రోల్స్ చేస్తారు. అయితే ఈ విషయంతో నటులుగా శర్వా , సమంత ఇద్దరూ బెస్ట్ ఇవ్వడానికి ట్రై చేసి మంచి మార్కులే అందుకున్నారు. ఒరిజినల్ ఫీల్ ను ఎగ్జాక్ట్ గా తీసుకొచ్చేందుకు బాగానే కష్టపడ్డారు. సమంత తన ఎక్స్ ప్రెషన్స్ తో మేజిక్ చేస్తే శర్వా ఎమోషనల్ సీన్స్ లో తన నటనతో మెస్మరైజ్ చేసాడు.

ఇక ఒరిజినల్ లో చేసిన క్యారెక్టర్స్ కావడంతో గౌరీ(చైల్ ఆర్టిస్ట్), వర్ష బొల్లమ్మ ఇద్దరూ తమ పాత్రలకు పర్ఫెక్ట్ అనిపించుకున్నారు. శర్వా టీనేజ్ పాత్రలో నటించిన సాయి కిరణ్ లుక్ పరంగా ఎట్రాక్ట్ చేసిన పెర్ఫార్మెన్స్ తో మెప్పించలేకపోయాడు. వెన్నెల కిశోర్, తాగుబోతు రమేష్ , శరణ్య ప్రదీప్ తమ రోల్స్ తో ఎంటర్టైన్ చేసారు. ఓ ఇంపార్టెన్స్ ఉన్న రోల్ లో రఘుబాబు పరవాలేదనిపించుకున్నాడు.

 

సాంకేతిక వర్గం పనితీరు :

ఒరిజినల్ సినిమాకు మేజర్ ప్లస్ అయిన గోవింద్ వసంత మ్యూజిక్ ‘జాను’ కి కూడా ప్లస్ అయింది. ముఖ్యంగా ‘ఊహాలే ఊహలే’ పాట అందరినీ ఆకట్టుకుంది. ఆ పాటకు శ్రీమణి సాహిత్యం బాగా కుదిరింది. మిగతా పాటలు కూడా బాగున్నాయి. నేపథ్య సంగీతం మాత్రం బిగ్ ఎస్సెట్. మహీంద్రన్ జయరాజు సినిమాటోగ్రఫీ బాగుంది. ప్రతీ ఫ్రేమ్ లవ్ ఫీల్ కలిగించేలా ఉంది. ఎడిటింగ్ పరవాలేదు. రెండో భాగంలో ఇంకా స్పీడ్ పెంచి ఉంటే బెటర్ గా ఉండేది. కానీ ఆ విషయంలో కూడా ఒరిజినల్ నే ఫాలో అయ్యారు. ఆర్ట్ వర్క్ బాగుంది.

దర్శకుడు ప్రేమ్ కుమార్ తను రాసుకున్న కథను మళ్ళీ తెలుగులో తెరకెక్కించి ఆకట్టుకోవడంలో దర్శకుడిగా సక్సెస్ అయ్యాడు. ఒరిజినల్ వర్షన్ కి ఎలాంటి ఎఫర్ట్ అయితే పెట్టాడో ‘జాను’ కి కూడా అంతే ఎఫర్ట్ పెట్టి మేజిక్ ను రీ క్రియేట్ చేయడానికి ప్రయత్నించాడు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ప్రొడక్షన్ వాల్యూస్ కథకు తగినట్టుగా ఉన్నాయి.

జీ సినిమాలు సమీక్ష :

సాధారణంగా ఒక క్లాసిక్ సినిమాను రీమేక్ చేసే ముందు మేకర్స్ రెండు పద్దతులు ఫాలో అవుతుంటారు. ఉన్నది ఉన్నట్టుగా తెరకెక్కించడం ఒక పద్దతయితే , కొన్ని మార్పులతో తెరకెక్కించడం రెండో పద్దతి. నిర్మాత దిల్ రాజు , దర్శకుడు ప్రేమ్ కుమార్ మొదటి పద్దతినే ఫాలో అయి ‘జాను’ను తెరకెక్కించారు. అక్కడే మేకర్స్ సక్సెస్ అయ్యారు. నిజానికి ఈ కథలో ఎలాంటి మార్పులు చేసినా మునుపటి ఫీల్ మిస్సవుతుంది. అందుకే సేఫ్ గా ఉన్నది ఉన్నట్టు రీ క్రియేట్ చేసారు. దర్శకుడు ప్రేమ్ కుమార్ ఒరిజినల్ ని ఎంత గుడ్డిగా ఫాలో అవుతూ ఈ సినిమాను తీసాడో శర్వా మెడలో తాయిత్తు చూస్తేనే అర్థమైపోతుంది. కథే కాదు, పాత్రల పేర్లు , లోకేషన్స్ , క్యారెక్టర్స్ కి ఇచ్చిన డీటైలింగ్ ఇలా ఏ ఒక్కటి మిస్ అవ్వకుండా జాను తీర్చి దిద్దాడు. ఒరిజినల్ లో తన నటనతో మేజిక్ చేసిన చైల్డ్ ఆర్టిస్ట్ గౌరీను మళ్ళీ అదే పాత్రకు తీసుకొని ఆ పాత్రకు అందం తీసుకొచ్చాడు ప్రేమ్.

ఏమాటకామాటే విజయ్ సేతుపతి, త్రిషలను మర్చిపోయేలా చేయడంలో మాత్రం శర్వా, సమంత ఇద్దరూ పూర్తిగా సక్సెస్ అవ్వలేకపోయారు. కాకపోతే ఉన్నంతలో బెస్ట్ ఇవ్వడానికి ట్రై చేసి ఓన్ యాక్టింగ్ తో మెప్పించి సినిమాకు మేజర్ హైలైట్ అనిపించుకున్నారు.

హీరో క్యారెక్టర్ ను పరిచయం చేయడం , అతని ట్రావెలింగ్ ఫోటోగ్రఫీ, ఆ తర్వాత స్కూల్ లవ్ స్టోరీతో మొదటి భాగాన్ని తెరకెక్కించి మెస్మరైజ్ చేసిన దర్శకుడు రెండో భాగంలో కూడా ఎలాంటి మార్పులు చేయకుండానే సినిమాను తీసాడు. నిజానికి ’96’ రెండో భాగం మరీ నెమ్మదిగా సాగిందనే కామెంట్స్ అందుకుంది. కానీ తమిళ ప్రేక్షకులు దాన్ని పెద్దగా పట్టించుకోలేదు. కానీ ‘జాను’కి వచ్చే సరికి తెలుగు ప్రేక్షకులు స్లో స్క్రీన్ ప్లే ను యాక్సెప్ట్ చేస్తారా లేదా చూడాలి. ఇక సెకండ్ హాఫ్ లో శర్వా , సమంత ఎంత మేజిక్ చేసిన సెకండ్ హాఫ్ లో నత్తనడకన సాగే సనివేశాలు బోర్ కొట్టించాయి. అలా కాకుండా సోల్ మిస్ చేయకుండా స్క్రీన్ ప్లే ను కొంచెం స్పీడ్ చేసేలా ఏవైనా సన్నివేశాలు రాసుకుంటే రిజల్ట్ ఇంకా బెటర్ గా ఉండేది. కానీ సెకండ్ హాఫ్ లో హోటల్ రూమ్ లో సన్నివేశాలు , రామ్ ఇంటికి జాను వెళ్లి అక్కడ వచ్చే సన్నివేశాలు బాగున్నాయి.

సినిమాకు సంబంధించి టెక్నీషియన్స్ ను కూడా ఒరిజినల్ వారినే రిపీట్ చేయడంతో టెక్నికల్ గా కూడా ‘జాను’ లో పెద్దగా మైనస్ లు కనిపించలేదు. ముఖ్యంగా గోవింద్ వసంత్ తన మ్యూజిక్ తో తెలుగు ప్రేక్షకులను కూడా మెస్మరైజ్ చేసాడు. సమంత ఎంట్రీ సీన్ కి మ్యూజిక్ స్టార్ట్ అవ్వగానే ఒక్కసారిగా కేకలు వేసే పరిస్థితిని క్రియేట్ చేసాడు. ఒక బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ వస్తుంటే అంతలా అరవడం ఈ మధ్య మరే సినిమాకు జరగలేదు. ఫైనల్ గా ‘జాను’ హానెస్ట్ రీమేక్ గా ఒరిజినల్ సినిమా చూడని ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అవుతుంది.

రేటింగ్ : 2.75 /5