'ఇంటెలిజెంట్' రివ్యూ

Friday,February 09,2018 - 04:53 by Z_CLU

నటీ నటులు : సాయిధరమ్‌తేజ్‌, లావణ్య త్రిపాఠి, నాజర్‌, రాహుల్ దేవ్, బ్రహ్మానందం, పోసాని కృష్ణమురళి, తదితరులు

సినిమాటోగ్రఫీ : ఎస్‌.వి. విశ్వేశ్వర్‌

సంగీతం : థమన్

కథ -మాటలు : ఆకుల శివ

సహనిర్మాతలు : సి.వి.రావు, నాగరాజ పత్సా

నిర్మాత : సి.కళ్యాణ్‌

స్క్రీన్‌ప్లే- దర్శకత్వం: వి.వి.వినాయక్‌

రిలీజ్ డేట్ : 09-02-2018

 

సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్- స్టార్ డైరెక్టర్ వి.వి. వినాయక్ కాంబినేషన్ లో తెరకెక్కిన ‘ఇంటెలిజెంట్’ ఈరోజు ప్రేక్షకుల ముందుకొచ్చింది. మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా ఎలా ఎంటర్టైన్ చేసిందో..తెలుసుకుందాం.

కథ :

మనకి సహాయ పడే వ్యక్తి కోసం ఏదైనా చేయాలనే మనస్తత్వం ఉన్న వ్యక్తి ధర్మ తేజ. ఒక స్కూల్ ఫంక్షన్ లో చురుగ్గా కనిపించిన ధర్మతేజను తన ఖర్చుతో చదివించి తన సాఫ్ట్ వేర్ కంపెనీ లో ఉద్యోగం ఇస్తాడు నందకిషోర్(నాజర్). నందకిషోర్ కంపెనీ పై కన్నేస్తాడు విక్కీ భాయ్(రాహుల్ దేవ్). ఈ క్రమంలో నందకిషోర్ అనుకోకుండా హత్యకు గురవుతాడు. చిన్నతనం నుంచి తనకు అండగా నిలిచిన నందకిషోర్ చనిపోవడంతో ధర్మా భాయ్ గా పేరు మార్చుకుని విదేశాల్లో ఉన్న విక్కీభాయ్ ఇండియా వచ్చేలా చేస్తాడు ధర్మతేజ. నందకిషోర్ స్థానంలో తనను ఇష్టపడుతున్న ఆయన కూతురు సంధ్య(లావణ్య త్రిపాఠి)ని కూర్చోబెట్టి విక్కీ అంతం చూసే పనిలో పడతాడు ధర్మాభాయ్. ఈ క్రమంలో తన ఇంటెలిజెన్స్ తో విక్కీ భాయ్ సామ్రాజ్యాన్ని కుప్పకూల్చిన ధర్మాభాయ్, చివరికి విక్కీ ని ఎలా అంతం చేశాడనేది సినిమా కథ.

 

నటీనటుల పనితీరు :

ధర్మా భాయిగా సాయి ధరమ్ తేజ్ బాగా చేశాడు. యాక్షన్ సీన్స్ లో తన ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకున్నాడు. అయితే ఆశించిన రీతిలో డాన్సులతో అదరగొట్టలేకపోయాడు. లావణ్య త్రిపాఠి గ్లామర్ రోల్ తో ఆకట్టుకుంది. విలన్ గా రాహుల్ దేవ్ తేలిపోయాడు. మరోసారి తన క్యారెక్టర్ తో ఆకట్టుకున్నాడు నాజర్. బ్రహ్మానందం కామెడి వర్కౌట్ అవ్వలేదు. పోసాని, పృథ్వి, రాహుల్ రామకృష్ణ, విధ్యుల్లేక తమ కామెడి టైమింగ్ తో కొంత వరకూ ఎంటర్టైన్ చేశారు. ఇక వినీత్ కుమార్, రఘుబాబు, ఆకుల శివ, ఆశిష్ విద్యార్ధి, సాయాజీ షిండే, దువ్వాసి, ఫిష్ వెంకట్, వేణు, భద్రం, వెంకీ, జయప్రకాశ్ రెడ్డి, కాదంబరి కిరణ్, మహేష్ ఆచంట తదితరులు తమ క్యారెక్టర్స్ తో పరవాలేదనిపించుకున్నారు.

 

టెక్నిషియన్స్ పనితీరు :

తమన్ అందించిన పాటల్లో ‘లెట్స్ డూ’, ‘కళామందిర్’ సాంగ్స్ పరవాలేదనిపించాయి. తన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో సినిమాకు హైలైట్ గా నిలిచాడు. విశ్వేశ్వర్ సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్ పరవాలేదు. బ్రహ్మ కడలి ఆర్ట్ వర్క్ బాగుంది. వెంకట్‌ కంపోజ్ చేసిన ఫైట్స్ సినిమాకు హైలైట్ గా నిలిచాయి. ఆకుల శివ అందించిన కథ రొటీన్ గా ఉంది. ఈ రొటీన్ కథకు సరైన స్క్రీన్ ప్లే కూడా సెట్ అవ్వలేదు. కొన్ని సందర్భాల్లో పంచ్ డైలాగ్స్ ఆకట్టుకున్నాయి. ప్రొడక్షన్ వాల్యూస్ ఫరవాలేదు.

జీ సినిమాలు సమీక్ష :

‘ఖైదీ నంబర్150’ సినిమా తర్వాత వినాయక్ మెగా హీరో సాయి ధరమ్ తేజ్ తో ఓ పక్కా మాస్ కమర్షియల్ సినిమా చేస్తున్నాడనగానే ‘ఇంటెలిజెంట్’ సినిమాపై ఓ మోస్తరు అంచనాలు నెలకొన్నాయి.  బాలయ్య టీజర్ లాంచ్ చేయడం, ప్రభాస్ కూడా ఓ సాంగ్  లాంచ్ చేయడం, ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో ఈ సినిమా తేజ్ ని మళ్ళీ ట్రాక్ లో నిలబెడుతుందని అంతా అనుకున్నారు.

సినిమా విషయానికొస్తే … స్క్రిప్ట్ నచ్చితేనే సినిమా స్టార్ట్ చేసే దర్శకుడు వినాయక్, ఆకుల శివ అందించిన రొటీన్ కథను సెలెక్ట్ చేసుకొని ఈ సినిమా తెరకెక్కించడమే పెద్ద మైనస్. నిజానికి కథ బాగుంటే తన స్క్రీన్ ప్లే , యాక్షన్ సీన్స్ తో మెస్మరైజ్ చేసే వినాయక్ రొటీన్ స్టోరీ, వీక్ క్యారెక్టర్స్ తో సినిమాను చుట్టేశాడనే ఫీల్ కలుగుతుంది. గతంలో మాస్ యాక్షన్ ఎంటర్టైనర్స్ తో మాస్ ప్రేక్షకులను ఓ రేంజ్ లో ఎంటర్టైన్ చేసిన వినాయక్ ఈ సినిమా విషయంలో దర్శకుడిగా విఫలమయ్యాడు. ఒక సందర్భంలో అరేయ్ అంటూ ఒకడు పరిగెడుతూ రావడం వాడ్ని హీరో లటుక్కుమని వేసెయ్యడం కామనే కదా అంటూ తేజ్ ఓ డైలాగ్ చెప్పి ఒకడ్ని ఆయుధంతో నరికే సీన్ లాంటివి చూసి అసలు వినాయక్ ఈ రొటీన్ ఫార్మాట్ తో ఏం చెప్పాలనుకున్నాడు అనిపిస్తుంది. మాస్ ప్రేక్షకులు  మెస్మరైజ్ అయ్యే సీన్ ఒక్కటి కూడా లేకపోవడం సినిమాకు పెద్ద మైనస్.

సాయి ధరమ్ తేజ్ పెర్ఫార్మెన్స్, లావణ్య గ్లామర్, కొన్ని కామెడీ సీన్స్, సాంగ్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్, డైలాగ్స్, ఫైట్స్ సినిమాకు హైలైట్స్ గా నిలవగా వినాయక్ మార్క్ మిస్ అవ్వడం, రొటీన్ స్టోరీ-స్క్రీన్ ప్లే, బలమైన పాత్రలు లేకపోవడం, లవ్ ట్రాక్, ప్రీ క్లైమాక్స్ మరీ బోర్ కొట్టించడం, వీక్ అనిపించే క్లైమాక్స్ సినిమాలో మైనస్ పాయింట్స్.

ఫైనల్ గా ఇంటిలిజెంట్ సినిమా అటు మాస్, ఇటు క్లాస్ ప్రేక్షకులు ఎవర్నీ మెప్పించదు.

 

రేటింగ్ : 2 5