'హైపర్' మూవీ రివ్యూ

Friday,September 30,2016 - 03:17 by Z_CLU

నటీ నటులు : రామ్, రాశి ఖన్నా, సత్య రాజ్,రావు రమేష్, మురళి శర్మ తదితరులు

సినిమాటోగ్రఫీ :సమీర్‌రెడ్డి

సంగీతం           : జిబ్రాన్‌

మాటలు            : అబ్బూరి రవి

ఎడిటింగ్‌           : గౌతంరాజు

సమర్పణ          : వెంకట్‌ బోయినపల్లి

నిర్మాతలు         : రామ్‌ ఆచంట, గోపీచంద్‌ ఆచంట, అనీల్‌ సుంకర

కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం:  సంతోష్‌ శ్రీన్‌వాస్‌.

నేను శైలజ సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు రామ్. ఇదే ఊపుమీద తనకు గతంలో కందిరీగ లాంటి మరో బంపర్ హిట్ ఇచ్చిన సంతోష్ శ్రీనివాస్ తో సినిమా చేశాడు. అదే హైపర్. టైటిల్ కు తగ్గట్టే సినిమాకు హైపర్ ప్రమోషన్ ఇచ్చారు. ట్రయిలర్స్ కూడా హైపర్ గా క్లిక్కయ్యాయి. మరి ఈరోజు థియేటర్లలోకి వచ్చిన హైపర్… టైటిల్ కు తగ్గట్టే హైపర్ అనిపించుకుందా… రామ్-సంతోష్ శ్రీనివాస్ కాంబోలో వచ్చిన రెండో సినిమా రిజల్ట్ ఏంటి…

 

కథ :

వైజాగ్ లో  ప్రభుత్వ ఆఫీస్ లో ఉద్యోగిగా పనిచేసే నారాయణ మూర్తి(సత్య రాజ్) కొడుకు సూర్య( రామ్) తన నాన్నని అమితంగా ప్రేమిస్తూ కంటికి రెప్పలా చూసుకుంటూ జీవితాన్ని సాగిస్తాడు. ఎంతో నిజాయితీగా ఉద్యోగం చేస్తూ త్వరలో రిటైర్ కాబోయే నారాయణ మూర్తిని టార్గెట్ చేస్తాడు మినిస్టర్ రాజప్ప(రావు రమేష్). అలా నారాయణమూర్తిని టార్గెట్ చేసిన రాజప్ప… గజ(మురళి శర్మ)తో కలిసి చంపాలని చూస్తాడు. ఈ విషయం తెలుసుకున్న సూర్య తన తండ్రిని ఎలా కాపాడుకున్నాడు. మినిస్టర్ రాజప్పను ఎలా సవాలు చేసి ఎదుర్కొన్నాడు? అసలింతకీ మినిస్టర్ రాజప్పకి నారాయణరావుకి గొడవేంటి? వీరిద్దరి మధ్య ఏం జరిగింది? చివరికీ ప్రభుత్వ ఉద్యోగి చేతిలో మినిస్టర్ రాజప్ప పరిస్థితేంటి.. మధ్యలో రాశిఖన్నా ఎలా ఎంటర్ అయింది… మన హీరోను ఏం చేసింది… ఇది హైపర్ ఔటర్ లైన్.

ram_

నటీనటుల పనితీరు :

సూర్య అనే ఎనర్జిటిక్ కుర్రాడిగా రామ్ మరోసారి తన టాలెంట్ మొత్తం చూపించాడు. తన లుక్స్ తో, ఎనర్జిటిక్ పెర్ఫార్మన్స్ తో … అన్నింటికీ మించి అదిరిపోయే డాన్స్ తో సినిమాకు హైలైట్ గా నిలిచాడు. ఇక రాశిఖన్నా తన గ్లామర్, నటన తో మరోసారి పాస్ అయిపోయింది. నిజాయితీ ప్రభుత్వ ఉద్యోగిగా, ఓ కుటుంబ పెద్దగా సత్యరాజ్  తన నటనతో  మరోసారి ఆకట్టుకున్నాడు. బ్రహ్మోత్సవంలో తన క్యారెక్టర్ కు కాస్త దగ్గరగా, హైపర్ లో మేనరిజమ్స్ ఉన్నప్పటికీ… తన అనుభవంతో మెప్పించాడు. మినిస్టర్ రాజప్పగా తనదైన డైలాగ్ డెలివరీ, యాసతో కూడిన కామెడీ డైలాగ్స్ తో రావు రమేష్ మరోసారి తన పాత్రకు ప్రాణం పోశాడు. ప్రభాస్ శ్రీను కామెడీ టైమింగ్ అదిరిపోగా… జయ ప్రకాష్ రెడ్డి , మురళి శర్మ, పోసాని కృష్ణమురళి, సయాజీ షిండే , తులసి, చంద్రమోహన్, హేమ, ప్రియ, జోష్ రవి తదితరులు వాళ్లకిచ్చన స్పేస్ కు తగ్గట్టు సెట్ అయిపోయారు.

టెక్నీషియన్స్ పనితీరు :

సినిమాకు ముఖ్యంగా చెప్పాల్సింది సినిమాటోగ్రఫీ. తన సినిమాటోగ్రఫీ తో హైపర్ కు ఓ కళ తీసుకొచ్చాడు కెమెరామెన్ సమీర్ రెడ్డి. పాటలు దృశ్యరూపంగా ఆకట్టుకున్నాయి. స్క్రీన్ ప్లే బాగుంది. మాటలు అలరించాయి. కొన్ని బలమైన సన్నివేశాలకు మణిశర్మ ఆర్.ఆర్ ఇంకాస్త బలాన్ని చేకూర్చింది. ఎడిటింగ్ బాగుంది. ప్రొడక్షన్ వాల్యూస్ లో 14 రీల్స్ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ మరోసారి తన మార్క్ చూపించింది. ప్రతి ఫ్రేమ్ లో కాస్ట్ కనిపించింది.

hyper-maas-still

జీ సినిమాలు సమీక్ష :

రామ్  ‘కందిరీగ’తో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చి ఆ సినిమాతో సూపర్ హిట్ సొంతం చేసుకున్న సంతోష్ శ్రీనివాస్…     రామ్ తో మరోసారి  అలాంటి ఓ ఎనర్జిటిక్  కథనే ఎంచుకొని… దానికి  తండ్రికొడుకుల అనుబంధాన్ని యాడ్ చేశాడు. మొదటి భాగం తండ్రి కొడుకుల మధ్య అనుబంధంతో ఆకట్టుకున్న దర్శకుడు రెండో భాగం లో రివెంజ్ డ్రామాతో కూడిన కామెడీతో అలరించాడు. మొదటి నుండి చివరి వరకూ కథ ను డిస్టర్బ్ చేయకుండా కామెడీ జోడించి నవ్వించాడు. ఒక్క ముక్కలో చెప్పాలంటే.. తన గతచిత్రం రభసలో ఏది మిస్ అయ్యాడో… హైపర్ లో దాన్ని పక్కాగా చూపించగలిగాడు.  తన సినిమాల్లో హీరో క్యారెక్టర్ ను చాలా ఎనర్జిటిక్ గా చూపించే దర్శకుడు… ఈ సినిమాలో సూర్య పాత్రను కూడా అలాగే ప్రెజెంట్ చేశాడు. ముఖ్యంగా కొందరు నిజాయితీ గల ప్రభుత్వ ఉద్యోగుల గురించి చెప్పే డైలాగ్స్ ఆకట్టుకున్నాయి. ఒక ప్రభుత్వ ఉద్యోగి తన విధిని సక్రమంగా నిర్వర్తిస్తే సమాజానికి ఎంత ఉపయోగమో తెలియజేసే సన్నివేశాలు సినిమాకు బలం చేకూర్చాయి.  ‘రోజు మందు పొసే మీ అన్నంటేనే నీకంతుంటే ప్రాణం పోసిన మా నాన్నంటే నాకెంతుండాలి రా’, ‘బలగం కంటే బలం గొప్పది’, ‘ఒక ప్రభుత్వ ఉద్యోగి తలుచుకుంటే సమాజానికి చాలా మేలు చెయ్యొచ్చు’ వంటి మాటలు అలరించాయి. సెకండ్ హాఫ్ లో రావు రమేష్-రామ్ మధ్య వచ్చే సన్నివేశాలు సినిమాకు బలాన్నిచ్చాయి. మరీ ముఖ్యంగా సెకండాఫ్ లో స్టోరీతో పాటు నడిచే సైమల్టేనియస్ కామెడీ సినిమాకు పెద్ద ప్లస్ పాయింట్ గా మారింది. ఓవరాల్ గా ఓ కమర్షియల్ కథ కు కాస్త మెసేజ్ జతచేసి ఫుల్ లెంగ్త్ ఎంటర్టైనర్ గా వచ్చిన ‘హైపర్’… కచ్చితంగా ప్రేక్షకులను అలరిస్తుంది.