'హుషారు' మూవీ రివ్యూ

Friday,December 14,2018 - 04:52 by Z_CLU

న‌టీన‌టులు: తేజస్, తేజ్ కుర‌పాటి, దినేష్ , అభినవ్, ద‌క్ష‌, ప్రియా వ‌డ్ల‌మాని, రాహుల్ రామ‌కృష్ణ త‌దిత‌రులు

సంగీతం: రాధ‌న్

ఎడిట‌ర్: విజ‌య్ వ‌ర్ధ‌న్ కావూరి

సినిమాటోగ్ర‌ఫీ: రాజ్ తోట‌

నిర్మాత‌ : బెక్కం వేణుగోపాల్

క‌థ‌, స్క్రీన్ ప్లే, ద‌ర్శ‌కుడు : శ్రీ‌హ‌ర్ష కొనుగంటి

విడుదల తేది : 14 డిసెంబర్

‘హుషారు’.. టీజర్, ట్రైలర్, సాంగ్స్ తో యూత్ ని ఎట్రాక్ట్ చేసిన ఈ సినిమా ఈరోజే రిలీజయింది. శ్రీ హర్ష డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసిందా.. జీ సినిమాలు ఎక్స్ క్లూజీవ్ రివ్యూ.

 

క‌థ‌:

ధృవ్, చైయ్, బంటి, ఆర్య న‌లుగురు చిన్న‌ప్ప‌ట్నుంచీ క్లోజ్ ఫ్రెండ్స్. ఏ పనిచేసినా క‌లిసే చేస్తుంటారు. వయసుతో పాటు ఈ క్రీజీ కుర్రాళ్ళ కోరికలు కూడా పెరుగుతుంటాయి. వీళ్ళ జీవితంలోకి గర్ల్ ఫ్రెండ్స్ వ‌స్తారు. అప్ప‌ట్నుంచి క‌థ మొత్తం మారిపోతుంది. చైయ్ ని ప్రేమించిన అమ్మాయి మోసం చేసి వెళ్లిపోతుంది.. ఆ బాధలో తాగి వెళ్తుండగా ఓ ఆక్సిడెంట్ అవుతుంది. హాస్పిట‌ల్ కు తీసుకెళ్తే కాన్స‌ర్ ఉందని తెలుస్తుంది. అక్క‌డ్నుంచి వీళ్ళ క‌థ యూ టర్న్ తీసుకుంటుంది. అప్ప‌టి వ‌ర‌కు జీవితంలో ఏం సాదించాలి.. ఎలా అభివృద్ధి చెందాలనే ఆలోచన కోడా లేని వీళ్ళు ఫ్రెండ్ ను కాపాడుకోవ‌డ‌మే ల‌క్ష్యంగా పెట్టుకుంటారు. ఈ క్రమంలో వీళ్ల‌కు రాహుల్ ప‌రిచ‌యం అవుతాడు. ఆ తర్వాత వీళ్ళు ఏం చేసారు చివరికి స్నేహితుడిని ఎలా కాపాడుకున్నారు… జీవితం గురించి ఏం చేసుకున్నారు అనేది హుషారు క‌థ‌.

న‌టీన‌టులు పనితీరు:

కొత్త‌వాళ్లే అయినప్పటికీ తేజస్, తేజ్ కుర‌పాటి, అభినవ్, దినేష్ తేజ్ న‌లుగురు బాగా నటించారు. హీరోయిన్ల‌లో ప్రియా వ‌డ్ల‌మాని స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచింది. అందాల‌ఆరబోతతో పాటు లిప్ లాక్స్ సన్నివేశాల్లో రెచ్చిపోయి నటించింది. తన గ్లామర్ తో యూత్ ని బాగా ఎట్రాక్ట్ చేసింది. మరో హీరోయిన్ ద‌క్ష తన పెర్ఫార్మెన్స్ తో పరవాలేదు అనిపించుకుంది. రాహుల్ రామ‌కృష్ణ తన క్యారెక్టర్ తో సినిమాకు ప్లస్ అయ్యాడు. కొన్ని సందర్భాల్లో రాహుల్ రామకృష్ణ కామెడీ అలరించింది. మిగతా నటీ నటులందరూ వారి క్యారెక్టర్స్ కి న్యాయం చేసారు.

 

సాంకేతికవర్గం పనితీరు :

సినిమాకు రాధ‌న్ సంగీతం బాగుంది. రిలీజ్ కి ముందే సాంగ్స్ తో హంగామా చేసిన రాదన్ ఆర్.ఆర్ కూడా సినిమాకు తగ్గట్టుగా అందించాడు. ముఖ్యంగా ‘ఉండిపోరాదే’ పాట విజువ‌ల్ గా కూడా బాగుంది. రాజ్ తోట సినిమాటోగ్రఫీ బాగుంది. త‌న‌ కెమెరా వ‌ర్క్ తో సినిమా హైలైట్ గా నిలిచాడు. విజ‌య్ వ‌ర్ధ‌న్ ఎడిటింగ్ బాగుంది. యూత్ ను దృష్టిలో పెట్టుకుని కథ రాసుకున్న దర్శకుడు శ్రీ హర్ష కొంత వరకూ సక్సెస్ అయ్యాడు. కొన్ని సందర్భాల్లో వచ్చే ఎమోషనల్ డైలాగ్స్ ఆకట్టుకున్నాయి. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి.

 

జీ సినిమాలు సమీక్ష :

యూత్ కి టార్గెట్ చేస్తూ తెలుగులో చాలా సినిమాలొచ్చాయి. వాటిలో ముఖ్యంగా హ్యాపీ డేస్ ఒకటి.. ఆ సినిమా అందుకున్న సక్సెస్ తో తర్వాత చాలా యూత్ ఫుల్ ఎంటర్టైనర్స్ వచ్చాయి. కానీ ఆ రేంజ్ హిట్ మాత్రం అందుకోలేకపోయాయి. అయితే దర్శకుడు శ్రీ హర్ష కూడా అలాంటి కథనే రాసుకొని యూత్ ని ఎంటర్టైన్ చేయాలనుకున్నాడు. కాకపోతే కొంచెం బోల్డ్ మిక్స్ చేసాడు. ఈ ఫార్మేట్ లో కూడా చాలా సినిమాలొచ్చాయి. హుషారు చూస్తున్నంత సేపు కొత్తదనం కనిపించదు కానీ కొంత వరకూ స్క్రీన్ ప్లే మేజిక్ తో పరవాలేదనిపించాడు దర్శకుడు.

ముఖ్యంగా యూత్ ఎంటర్టైన్ అయ్యే విధంగా కాస్త బోల్డ్ గా తెరకెక్కించి ఎంటర్టైన్ చేసాడు. యూత్ చేసే ప్ర‌తీ ప‌ని కూడా క్రేజీగా తెర‌పై ఆవిష్క‌రించాడు. సాధార‌ణంగా 20 ఏళ్ల కుర్రాళ్లు ఏం చేస్తారు.. అని దాన్ని కళ్ళకు కట్టినట్టుగా చూపించాడు. సిగ‌రెట్లు తాగ‌డం.. మందు కొట్ట‌డం.. గర్ల్ ఫ్రెండ్ అంటే క్రేజ్.. ఇలా ప్ర‌తీ ఒక్క‌టి ట‌చ్ చేసాడు. ఇవ‌న్నీ కుర్రాళ్ల‌కు బాగా నచ్చే అంశాలు. క‌థ కూడా వాళ్ల కోస‌మే రాసుకున్నాడు కాబట్టి దర్శకుడిగా శ్రీ హర్ష కొంత వరకూ సక్సెస్ అయ్యాడనుకోవచ్చు.. ఇంట‌ర్వెల్ వ‌ర‌కు కూడా అక్క‌డ‌క్క‌డా కామెడీ.. మ‌ధ్య‌లో స్నేహం.. కాసేపు ఫ్యామిలీ ఇలా అన్ని ఎలెమెంట్స్ చూపించిన ద‌ర్శ‌కుడు ఇంట‌ర్వెల్ లో ఓ ట్విస్ట్ రాసుకున్నాడు.

ల‌వ్ లో ఫెయిల్ అయిన ఫ్రెండ్ కు కాన్స‌ర్ రావ‌డం.. త‌ర్వాత అత‌డి కోసం డ‌బ్బు సంపాదించే ప‌నిలో బీర్ ఫ్యాక్ట‌రీ పెట్ట‌డం.. పోలీసుల‌కు దొర‌క‌డం లాంటి సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. సెకండ్ హాఫ్ లో రాహుల్ రామ‌కృష్ణ సాప్ట్ వేర్ ఫ్ర‌స్టేష‌న్ కామెడీ కూడా బాగానే వ‌ర్క‌వుట్ అయింది. ఎన్ని క‌ష్టాలొచ్చినా కేవ‌లం ఎంజాయ్ చేస్తూ ముందుకుసాగిపోవాలని తన కథ ద్వారా చెప్పాలనుకున్నాడు దర్శకుడు. ఇంటర్వెల్ నుండి క్లైమాక్స్ వ‌ర‌కు సినిమాను వేగంగా నడిపించాడు దర్శకుడు. కాకపోతే రొటీన్ ఫార్మాట్ లో కథని తీసుకెళ్ళడం ఆడియన్స్ కి రౌటిన్ సినిమా అనే ఫీలింగ్ కలిగిస్తుంది. లాజిక్ లు లేని సీన్స్ చాలానే క‌నిపిస్తాయి. ముఖ్యంగా కామెడీ ప‌ర్లేదు అనిపించినా ఎమోష‌న్స్ మాత్రం అనుకున్నంత పండలేదు. ఓవ‌రాల్ గా ‘హుషారు’ పూర్తి స్థాయిలో ఎంటర్టైన్ చేయదు కానీ యూత్ కి కనెక్ట్ అవుతుంది.

రేటింగ్ : 2 / 5