'హిట్' మూవీ రివ్యూ

Friday,February 28,2020 - 02:14 by Z_CLU

న‌టీన‌టులు: విశ్వ‌క్‌సేన్‌, రుహానీ శ‌ర్మ , భాను చందర్ , మురళి శర్మ , హరితేజ , బ్రహ్మాజీ తదితరులు

సినిమాటోగ్ర‌ఫీ: మ‌ణికంద‌న్‌

సంగీతం : వివేక్‌సాగ‌ర్‌

నిర్మాణం : వాల్ పోస్టర్ సినిమా

స‌మ‌ర్ప‌ణ‌: నాని

నిర్మాత‌: ప‌్ర‌శాంతి త్రిపిర్‌నేని

ర‌చ‌న‌, ద‌ర్శ‌క‌త్వం: శైలేష్ కొల‌ను

రన్ టైం : 126 నిమిషాలు

సెన్సార్ : U/A

విడుదల తేది : 28 ఫిబ్రవరి 2020

 

‘ఫలక్ నుమా దాస్’ తో యువతను ఎట్రాక్ట్ చేసి హీరోగా సక్సెసయిన విశ్వక్ సేన్ ఓ క్రైం థ్రిల్లర్ సినిమా చేస్తే ఎలా ఉంటుంది..? మూడో సినిమాకే అలాంటి ప్రయత్నం చేసాడు విశ్వక్ . మరి విశ్వక్ ఈ జోనర్ సినిమాతో ‘హిట్‘ కొట్టాడా .. జీ సినిమాలు ఎక్స్ క్లూజీవ్ రివ్యూ


కథ :

HIT ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ గా పనిచేసే విక్రమ్(విశ్వక్ సేన్) తన గతంలో జరిగిన ఓ సంఘటన గుర్తుచేసుకుంటూ అప్పుడప్పుడు డిస్టర్బ్ అవుతుంటాడు. కొన్ని రోజులు ఉద్యోగానికి దూరంగా ఉండాలని డాక్టర్ సూచించినప్పటికీ పట్టించుకోకుండా సిటీలో జరిగే క్రైం కేసులను ఇన్వెస్టిగేట్ చేస్తుంటాడు. అయితే ఓ రోజు హైవేపై ప్రీతి అనే పద్దెనిమిదేళ్ళ అమ్మాయి అనుకోకుండా మిస్ అవుతుంది. ఆ తర్వాత విక్రమ్ లవర్ నేహ (రుహానీ శర్మ) కూడా మిస్ అవుతుంది. ఈ ఇద్దరి మిస్సింగ్ లకు సంబంధించి లింక్ ఉందని గమనించి ప్రీతీ కేసును తనకివ్వమని తన పై అధికారి(భాను చందర్) ను పర్సనల్ గా రిక్వెస్ట్ చేసి ఇన్వెస్టిగేషన్ మొదలుపెడతాడు విక్రమ్.

ఈ క్రమంలో మరో ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ అభిలాష్ నేహ మిస్సింగ్ కేసులో విక్రమ్ ను అనుమానిస్తూ ఫాలో అవుతుంటాడు. ఇక ప్రీతి కేసు టేకప్ చేసిన విక్రమ్ కి ఇన్వెస్టిగేషన్ లో చాలా అనుమానాలు వ్యక్తం అవుతాయి. ఆ సమయంలో ప్రీతీకి సంబంధించిన అందరినీ అనుమానిస్తుంటాడు. అసలు ప్రీతిని కిడ్నాప్ చేసిందెవరు ? ప్రీతి కేసుతో నేహకి సంబంధమేమిటి ? చివరికి విక్రమ్ ఈ రెండు మిస్సింగ్ కేసులను తన ఇన్వెస్టిగేషన్ తో  ఎలా చేధించి, క్రైం వెనకున్న నేరస్తులను పట్టుకున్నాడనేది మిగతా కథ.

నటీ నటుల పనితీరు :

థ్రిల్లర్ జోనర్ లో ఫస్ట్ టైం సినిమా చేసినప్పటికీ  విక్రమ్ క్యారెక్టర్ లో ఒదిగిపోయాడు విశ్వక్. ఎలాంటి క్యారెక్టరకయినా నటుడిగా న్యాయం చేయగలడని నిరూపించుకున్నాడు. కొన్ని ఎమోషనల్ సన్నివేశాల్లో తన నటనతో సినిమాకు హైలైట్ గా నిలిచాడు కూడా. నిడివి తక్కువ ఉన్న పాత్ర కావడంతో రుహానీ శర్మ పరవాలేదనిపించుకుంది.

భాను చందర్ , హరితేజ , మురళి శర్మ , బ్రహ్మాజీ తదితరులు తమ క్యారెక్టర్స్ కి పర్ఫెక్ట్ అనిపించుకున్నారు. ముఖ్యంగా హరితేజకి మంచి క్యారెక్టర్ దక్కడంతో నటిగా మంచి మార్కులు అందుకుంది. రోహిత్ పాత్ర చేసిన నటుడు చైతన్య తన నటనతో ఆకట్టుకున్నాడు. ఈ పాత్రతో అతనికి మరిన్ని అవకాశాలొచ్చే ఛాన్స్ ఉంది.

సాంకేతికవర్గం పనితీరు :

క్రైం థ్రిల్లర్ కి ఆ ఫీల్ తీసుకొచ్చే నేపథ్య సంగీతం, ఛాయాగ్రహణం చాలా కీలకం. ఈ రెండు హిట్ కి ప్లస్ అయ్యాయి. వివేక్ సాగర్ నేపథ్య సంగీతం సన్నివేశాలకు బలం చేకూర్చింది. ఇక మనికందన్ కూడా తన కెమెరా వర్క్ తో విజువల్ గా మంచి సపోర్ట్ అందించాడు. గతంలో థ్రిల్లర్ సినిమాలకు వర్క్ చేసిన అనుభవంతో గ్యారీ బీ సినిమాను పర్ఫెక్ట్ గా ఎడిట్ చేసి గ్రిప్పింగ్ గా తీర్చిదిద్దాడు.

అవినాష్ కొల్ల‌ ఆర్ట్ వర్క్ బాగుంది.  దర్శకుడు శైలేష్ కొలను కి మొదటి సినిమా అయినప్పటికీ అనుభవం ఉన్న దర్శకుడిలా సినిమాను తీర్చిదిద్దిన విధానం ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా కథా-కథనాలతో ఆకట్టుకొని టాలెంట్ ఉన్న దర్శకుడనిపించుకున్నాడు. వాల్ పోస్టర్ సినిమా ప్రొడక్షన్ వాల్యూస్ కథకు తగినట్టుగా ఉన్నాయి.


జీ సినిమాలు సమీక్ష :

ఓ అమ్మాయి మిస్సింగ్ కేస్ , ఆ తర్వాత మర్డర్ , పోలీస్ ఇన్వెస్టిగేషన్ , చివరికి క్రైం వెనకున్న విలన్ ను హీరో పట్టుకోవడం ఇదీ క్రైం థ్రిల్లర్ రెగ్యులర్ ఫార్మేట్. దర్శకుడు శైలేష్ కూడా తన మొదటి సినిమాకు ఇదే ఫార్మేట్ ను ఫాలో అయ్యాడు. ఇప్పటికే ఈ జోనర్ లో మర్డర్ మిస్టరీ కథతో చాలా సినిమాలొచ్చాయి. అయితే అదే కథను తనదైన కథనంతో ఆసక్తిగా తెరకెక్కించి ప్రేక్షకులను థ్రిల్ చేసాడు శైలేష్. ముందుగా ప్రాపర్ ప్రీ ప్రొడక్షన్ వర్క్ చేసుకున్నాడు. అందువల్ల మేకింగ్ లో ఎక్కడా డీటైలింగ్ మిస్ అవ్వలేదు దర్శకుడు.

ఏ క్రైం థ్రిల్లర్ అయినా కొన్ని క్యారెక్టర్స్ చుట్టూ కథను డ్రైవ్ చేస్తూ ఆడియన్స్ లో కిల్లర్ ఎవరనే సస్పెన్స్ క్రియేట్ చేసి వారికి కథను కనెక్ట్ చేయగలిగితే ఈ జోనర్ మంచి సక్సెస్ ఫార్ములానే. ఈ విషయాన్ని మరోసారి రుజువు చేసాడు శైలేష్. సినిమా ప్రారంభం నుండే ప్రేక్షకుడిని కథలోకి తీసుకెళ్ళి థ్రిల్ చేస్తూ క్యూరియాసిటీ కలిగేలా చేసాడు. నిజానికి ఇది కష్టమైన పనే. ప్రేక్షకుడిని సినిమాతో కనెక్ట్ చేసి స్క్రీన్ పై మేజిక్ చేయాలంటే నటీ నటుల నుండి మంచి నటన రాబట్టగలగాలి. అలాగే టెక్నీషియన్స్ నుండి బెస్ట్ అవుట్ తీసుకోవాలి. ఇలా అన్నీ సెట్ అయితేనే ప్రేక్షకుడు తను చూసేది సినిమా కాదని మరిచి కథలో పాత్రలకు కనెక్ట్ అయి ఎగ్జైట్ అవుతాడు. ఆ విషయంలో శైలేష్ ను ప్రత్యేకంగా మెచ్చుకోవాలి. డెబ్యూ డైరెక్టర్ అయినప్పటికీ అనుభవం కలిగిన దర్శకుడిలా కథను డీల్ చేసిన విధానం అందరినీ ఆకట్టుకుంటుంది.

ముఖ్యంగా సినిమాకు బలమైన సన్నివేశాలు రాసుకోవడంలో తన రైటింగ్ స్కిల్స్ చూపించాడు శైలేష్. హీరో ఇన్వెస్టిగేషన్ చేసే సన్నివేశాలను బాగా రాసుకొని ప్రేక్షకుడు థ్రిల్  అయ్యేలా తెరకెక్కించాడు. ఆ సన్నివేశాలన్నీ సినిమాకు హైలైట్ గా నిలిచాయి.కాకపోతే కమర్షియల్ అంశాలు పెద్దగా లేకపోవడం సినిమాకు మైనస్. డాక్టర్ నుండి దర్శకుడిగా మారి మెగా ఫోన్ పట్టిన శైలేష్ సినిమా పట్ల తనకున్న ఇష్టాన్ని స్క్రీన్ పై చూపించాలని గట్టిగా డిసైడ్ అయినట్టున్నాడు. ఆ ప్యాషన్ మేకింగ్ లో కనిపించింది. ఇక కొత్త తరహా కథలను టాలెంట్ ఉన్న దర్శకులను వెతికే క్రమంలో వాల్ పోస్టర్ సినిమా బ్యానర్ ను స్థాపించి ఇలాంటి కొత్త టాలెంట్ ను పరిచయం చేస్తున్న నిర్మాతలు నాని , ప్రశాంతి లను కూడా మెచ్చుకోవాల్సిందే. ఫైనల్ గా ‘హిట్’ సస్పెన్స్ క్రైం థ్రిల్లర్ గా ప్రేక్షకులను మెప్పిస్తుంది.

 

రేటింగ్ : 3/5