'హిప్పీ' మూవీ రివ్యూ

Thursday,June 06,2019 - 02:20 by Z_CLU

నటీ నటులు: కార్తికేయ, దిగాంగన సుర్యవంషి, జే.డి.చక్రవర్తి తదితరులు

కెమెరా: ఆర్‌.డి. రాజ‌శేఖ‌ర్

సంగీతం: నివాస్ కె.ప్ర‌స‌న్న

ఎడిటింగ్‌: ప‌్ర‌వీణ్ కె.ఎల్‌

నిర్మాత : క‌లైపులి.య‌స్‌.థాను

రచన-దర్శకత్వం : టి.ఎన్‌.కృష్ణ

నిడివి : 143 నిమిషాలు

విడుదల తేది : 6 జూన్ 2019

 

‘ఆర్ ఎక్స్ 100’ సినిమాతో హీరోగా పరిచయమైన కార్తికేయ రెండో సినిమా ‘హిప్పీ’ తో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా ఈరోజే థియేటర్స్ లోకి వచ్చింది. మరి కార్తికేయ రెండో సినిమాతో మరో హిట్టు కొట్టాడా..?  జీ సినిమాలు ఎక్స్ క్లూజీవ్ రివ్యూ.

కథ :

కిక్ బాక్సింగ్ లో నైపుణ్యం ఉన్న హిప్పీ దేవదాస్(కార్తికేయ).. స్నేహ అనే అమ్మాయితో ప్రేమాయణం సాగిస్తాడు. ఇద్దరూ కలిసి గోవా ట్రిప్ ప్లాన్ చేసుకుంటారు. ఆ ట్రిప్ జర్నీలో అనుకోకుండా స్నేహ ఫ్రెండ్ ఆ ముక్త మాల్యద(దిగాంగన) ని చూసి ఆమె ప్రేమలో పడతాడు హిప్పీ. ఈ క్రమంలో తనకు ఇష్టం లేని స్నేహకి దూరమై ముక్తకి దగ్గరవ్వాలని చూస్తుంటాడు. చివరికి స్నేహకి బ్రేకప్ చెప్పేసి ముక్తని ప్రేమలో పడేస్తాడు.

అక్కడి నుండి హిప్పీకి కష్టాలు మొదలవుతాయి. ఆమె కోసం కిక్ బాక్సింగ్ కూడా వదిలేస్తాడు. ఇద్దరూ కలిసి లివింగ్ రిలేషన్ షిప్ లో ఉంటారు. ఓ సాఫ్ట్ వేర్ కంపెనీలో జాబ్ చేసే హిప్పీని ఎప్పటికప్పుడు తన బాస్ అరవింద్(జే.డి.చక్రవర్తి) సపోర్ట్ చేస్తూ ప్రోత్సహిస్తుంటాడు. అలా లివింగ్ రిలేషన్ షిప్ లో ఉన్న హిప్పీ, ముక్త మధ్య కొన్ని రోజులకే గొడవ మొదలవుతుంది. ముక్త తన జీవితంలోకి వచ్చాక ఫ్రీడంతో పాటు డబ్బు కూడా పోయిందని బాధ పడుతుంటాడు హిప్పీ. ఆ కారణం చేత ముక్తకి దూరమవ్వాలనుకుంటాడు. అలా తమ రిలేషన్ షిప్ కి బ్రేకప్ చెప్పేసుకొని విడిపోవాలని చూసిన వీరిద్దరూ చివరికి మళ్ళీ ఎలా కలిశారు.. అనేది హిప్పీ కథాంశం.

నటీనటుల పనితీరు :

‘ఆర్ ఎక్స్ 100’ తో హీరోగా అందరినీ మెప్పించి తన పర్ఫార్మెన్స్ తో మెస్మరైజ్ చేసిన కార్తికేయ ఈ సినిమాలో కాస్త కొత్తగా కనిపించాడు. కామిక్ టైమింగ్ తో ఎంటర్టైన్ చేసే ప్రయత్నం చేసాడు. కాకపోతే మొదటి సినిమాలా పర్ఫార్మెన్స్ కి స్కోప్ ఉన్న క్యారెక్టర్ కాకపోవడంతో జస్ట్ పరవాలేదు అనిపించుకున్నాడు. కొన్ని రొమాంటిక్ సన్నివేశాల్లో బాగా నటించాడు. దిగాంగన సెటిల్డ్ పర్ఫార్మెన్స్ తో ఆకట్టుకుంది. ఎమోషనల్ సన్నివేశాల్లో ఆమె నటన బాగుంది. జే.డీ.చక్రవర్తి క్యారెక్టర్ అంతగా ఆకట్టుకోలేదు. కాకపోతే ఆ క్యారెక్టర్ లో యాక్టర్ గా బెస్ట్ అనిపించుకున్నాడు.

జజ్బా సింగ్ గ్లామర్ తో ఎట్రాక్ట్ చేసింది. బ్రహ్మాజీ , వెన్నెల కిషోర్ కామెడీ పేలలేదు. మిగతా నటీనటులంతా వారి క్యారెక్టర్స్ తో పరవాలేదనిపించుకున్నారు.

సాంకేతిక వర్గం పనితీరు :

టెక్నికల్ టీం అందరూ సినిమాకి ఎఫర్ట్ పెట్టి వర్క్ చేసారు. ముఖ్యంగా ఆర్‌.డి. రాజ‌శేఖ‌ర్ సినిమాటోగ్రఫీ బాగుంది. తన కెమెరా వర్క్ తో సినిమాని కలర్ ఫుల్ గా చిత్రీకరించాడు. సంగీతం పరవాలేదు. ‘యవ్వతివే’ మినహా పాటలేవి పెద్దగా ఆకట్టుకోలేదు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాకు తగినట్టుగా ఉంది. ఆర్ట్ వర్క్ బాగుంది. ప్రవీణ్ కేఎల్ ఎడిటింగ్ సినిమాకు మైనస్. రెండో భాగంలో చాలా సన్నివేశాలను ట్రిమ్ చేయొచ్చు.

టీఎన్ కృష్ణ, కాశీ నడింపల్లి అందించిన మాటలు ఆకట్టుకోలేదు.  దిలీప్ సుబ్బరాయన్ కంపోజ్ చేసిన ఫైట్స్ సినిమాకు ప్లస్ అయ్యాయి. వైరల్, మార్ మార్, సాంగ్స్ కి కొరియోగ్రఫీ బాగుంది. టీఎన్ కృష్ణ కథ -కథనం ఆకట్టుకోలేదు. కొన్ని సన్నివేశాలు చూస్తే డైరెక్షన్ కూడా వీక్ అనిపిస్తుంది. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి.

జీ సినిమాలు సమీక్ష :

‘ఆర్ ఎక్స్ 100’ తర్వాత ‘హిప్పి’ పర్ఫెక్ట్ ఫిలిం అని భావించానని ఓ సందర్భంలో చెప్పుకొచ్చాడు కార్తికేయ. అయితే కార్తికేయ అనుకున్నట్లుగా హిప్పీ అతనికి ఏ మాత్రం ప్లస్ అవ్వదు. రెండో సినిమాకి ఓ రొటీన్ స్టోరీనే ఎంచుకొని బోల్తా పడ్డాడు ఈ యంగ్ హీరో. నిజానికి ఓ కుర్రాడు ఓ అమ్మాయితో ప్రేమలో ఉండగానే మరో అమ్మాయిని కి ఇంప్రెస్ అయి మళ్ళీ ప్రేమలో పడటం, ఆ తర్వాత ప్రేమలో ఉన్న అమ్మాయిని వదిలేసి ఆ కొత్తమ్మాయితో సంబంధం పెట్టుకోవడం అనేది పరమ రొటీన్ పాయింట్. ఈ రొటీన్ పాయింట్ కి లివింగ్ రిలేషన్ షిప్ అనే మరో రొటీన్ ఎలిమెంట్ యాడ్ చేసి బోర్ కొట్టించాడు దర్శకుడు.

తమిళ్ లో అప్పుడెప్పుడో సూర్య, భూమికలతో ఓ మంచి ప్రేమకథ తెరకెక్కించి మెప్పించిన టి.ఎన్.కృష్ణ…. ఇప్పుడు రొటీన్ కథని ఎంచుకొని ‘హిప్పీ’ అంటూ పూర్తి స్థాయిలో ఎంటర్టైన్ చేయలేకపోయాడు. కథకి అవసరం లేకపోయినప్పటికీ అనవసరంగా వచ్చే రొమాన్స్ తో విసుగు తెప్పించాడు. ఒక యూత్ ఫుల్ కథతో ఏదో చెప్పాలని చూసి మరేదో తీసి చూపించాడు దర్శకుడు. ఓపెనింగ్ లో హీరో సూసైడ్ చేసుకోవాలనుకోవడం సీన్ నుండి క్లైమాక్స్ వరకూ సినిమాలో హైలైట్ అనిపించే ఎలెమెంట్స్ చాలా అరుదు. ఓ సందర్భంలో అసలీ కథతో దర్శకుడు ఏం చెప్పాలనుకున్నాడు.. ఏం చూపిస్తున్నాడు.. అని ప్రేక్షకుడు మదనపడుతుంటాడు. అంతలా కన్ఫ్యూజ్ అయ్యాడు దర్శకుడు. హీరో…హీరోయిన్ నుండి బెస్ట్ పర్ఫార్మెన్స్ తీసుకొని ఎమోషనల్ గా కథను నడిపిస్తే రిజల్ట్ బెటర్ గా ఉండేది.

లవ్ లో ఎమోషన్స్ ని పర్ఫెక్ట్ గా చూపించలేకపోవడం అనేది సినిమాకు అతిపెద్ద మైనస్. యూత్ ని ఆకట్టుకునే అంశాలపైనే కృష్ణ ఎక్కువ దృష్టి పెట్టాడు. డబుల్ మీనింగ్ డైలాగ్స్, అడల్ట్ సన్నివేశాలతోనే సినిమాను నడిపించాడు కృష్ణ. సినిమాకి కీ-ఎలిమెంట్ అవుతుందని భావించిన కిక్ బాక్సింగ్ ఫైట్ ని జస్ట్ ఒకే ఒక్కసారి వాడుకున్నాడు. నిజానికి కిక్ బాక్సింగ్ ఎపిసోడ్స్ మీద ఫోకస్ పెట్టి కథను నడిపిస్తే బాగుండేది. సెకండ్ హాఫ్ లో సన్నివేశాలు మరీ బోర్ కొడతాయి. ఇక ప్రీ క్లైమాక్స్ , క్లైమాక్స్ ఎపిసోడ్స్ ను మరీ సాగదీసి చిరాకు తెప్పించాడు. ఆ సమయంలో సినిమా ఎప్పుడవుతుందిరా బాబు అనిపిస్తుంటుంది.  యూత్ కి నచ్చే అంశాలు పుష్కలంగా ఉన్నాయి.

రేటింగ్ : 1.5 /5