గురు రివ్యూ

Friday,March 31,2017 - 10:00 by Z_CLU

విడుదల : మార్చి 31, 2017

నటీనటులు : వెంకటేష్ , రితిక సింగ్

ఇతర నటీనటులు : ముంతాజ్ సొరకార్, నాజర్ , తనికెళ్ళ భరణి , జాకిర్ హుస్సేన్ తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : సంతోష్ నారాయణన్

సినిమాటోగ్రఫీ : కె .ఏ .శక్తివేల్

ఎడిటర్ : సతీష్ సిరియా

డైలాగ్స్ : హర్షవర్ధన్

ప్రొడక్షన్ : వైనాట్ స్టూడియోస్

ప్రొడ్యూసర్ : ఎస్ . శశికాంత్

స్క్రీన్ ప్లే – డైరెక్టర్ : సుధా కొంగర

 

టాలీవుడ్లో ప్రయోగాలకు ఎప్పుడూ కేరాఫ్ అడ్రెస్ గా నిలిచే విక్టరీ వెంకటేష్ మరో ప్రయోగాత్మక సినిమా ‘గురు’ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. సుధా కొంగర దర్శకత్వం లో స్పోర్ట్స్ బేస్డ్ స్టోరీ తో తెరకెక్కిన ఈ సినిమా ఈరోజు థియేటర్లలోకి వచ్చింది. మరి ఈ సినిమాతో వెంకటేష్ ప్రేక్షకులను ఎలా ఎంటర్టైన్ చేసాడో చూద్దాం.


కథ :

కొన్ని రాజకీయాల వల్ల ఛాంపియన్ షిప్ మిస్ అయిన బాక్సర్ ఆదిత్య (వెంకటేష్) చివరికి ఆశయాన్ని నెరవేర్చుకోలేని ఓ సీనియర్ కోచ్ గా స్థిరపడతాడు. అలా సీనియర్ కోచ్ గా జీవితాన్ని గడిపే ఆదిత్యను శత్రువుగా భావించే ఇండియన్ బాక్సింగ్ ప్రెసిండెంట్ దేవ్ కత్రి(జాకిర్) ఒకానొక సందర్భంలో ఆదిత్యను వైజాగ్ కి కోచ్ గా పంపిస్తాడు…అలా వైజాగ్ కి కోచ్ గా ట్రాన్స్ ఫర్ అయిన ఆదిత్య… తనలాంటి మొండి పట్టుదల ఉన్న రామేశ్వరి (రితిక సింగ్) అనే అమ్మాయిని చూసి తనకు ట్రైనింగ్ ఇచ్చి బాక్సింగ్ లో ఛాంపియన్ గా తయారుచేయాలని భావిస్తాడు. పేద కుటుంబంలో రోజు కూలీగా జీవితాన్ని కొనసాగించే రామేశ్వరిని ఆదిత్య… బాక్సింగ్ లో లేడీ ఛాంపియన్ గా చేయగలిగాడా? లేదా? అనేది ఈ సినిమా స్టోరీ.

నటీనటుల పనితీరు:

ఇప్పటికే ఎన్నో డిఫరెంట్ క్యారెక్టర్స్ తో తెలుగు ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసిన విక్టరీ వెంకటేష్ మరోసారి సరి కొత్త లుక్ తో బాక్సింగ్ కోచ్ గా మెస్మరైజ్ చేశాడు. ముఖ్యంగా ఆదిత్య అనే సీనియర్ బాక్సింగ్ కోచ్ గా తనదైన ఎమోషనల్ పెర్ఫార్మెన్స్ తో సినిమాకు హైలైట్ గా నిలిచాడు. వెంకటేష్ తరువాత ఈ సినిమాలో మెయిన్ గా చెప్పుకోవాల్సింది హీరోయిన్ రితిక గురించే.. హీరోయిన్ గా మాస్ క్యారెక్టర్ తో ఎంటర్టైన్ చేయడమంటే కాస్త కష్టమనే చెప్పాలి. కానీ రాముడు (రామేశ్వరి) అనే మాస్ క్యారెక్టర్ లో తనదైన ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్ తో పూర్తి స్థాయిలో ఎంటర్టైన్ చేసింది. జూనియర్ కోచ్ పాండురంగారావుగా నాజర్, ఇండియన్ బాక్సింగ్ ప్రెసిడెంట్ గా జాకిర్ తో పాటు తనికెళ్ళ భరణి, ముంతాజ్ సోర్కర్, అనిత, రఘుబాబు తదితరులు తమ క్యారెక్టర్స్ కి న్యాయం చేశారు.

 

టెక్నీషియన్స్ పనితీరు :

తన కెమెరా వర్క్ తో సినిమాకు అందం తీసుకొచ్చాడు శక్తి వేల్. ముఖ్యంగా సాంగ్స్ పిక్చరైజేషన్ లో తన ప్రతిభ చూపించాడు. సంతోష్ నారాయణ్ అందించిన మ్యూజిక్, బ్యాగ్రౌండ్ స్కోర్ ప్లస్ అయ్యాయి. ముఖ్యంగా ఓ ‘సక్కనోడా’, ‘ఉక్కు నరం’ పాటలకు సాహిత్యం కూడా బాగా సెట్ అయింది. రితిక సింగ్ క్యారెక్టర్ కి ఉమా మహేశ్వరీ చెప్పిన డబ్బింగ్ బాగా కుదిరింది.. కొన్ని ఎమోషనల్ సీన్స్ కి హర్ష వర్ధన్ రాసిన డైలాగ్స్ పర్ ఫెక్ట్ గా పండాయి. సుధా కొంగర స్టోరీ, స్క్రీన్ ప్లే ఎంటర్టైన్ చేశాయి. ప్రొడక్షన్ వాల్యూస్ పరవాలేదు.

జీ సినిమాలు సమీక్ష :

నిజానికి టాలీవుడ్ లో స్పోర్ట్స్ స్టోరీ మీద వచ్చిన సినిమాలు వేళ్ళ మీద లెక్కపెట్టొచ్చు. అయితే గతంలో ఈ తరహా సినిమాలకు టాలీవుడ్ లో పెద్దగా క్రేజ్ లేకపోవడం, ప్రేక్షుకులు ఆసక్తి చూపకపోవడం వల్లే ఈ తరహా సినిమాలు తెలుగులో కనుమరుగయ్యాయని చెప్పొచ్చు. ఈ టైం లో వెంకటేష్ ‘గురు’ లాంటి ఓ స్పోర్ట్స్ బేస్డ్ సినిమాతో ఆడియన్స్ ముందుకురావడం ఓ పెద్ద సాహసమే. ఆల్రెడీ హిట్ అయిన రీమేక్ అయినప్పటికీ దర్శకురాలు సుధా కొంగర ఈ సినిమాను ఒక స్ట్రయిట్ సినిమాలాగే తెరకెక్కించారు. ఒరిజినల్ తో పోలిస్తే ఫస్ట్ హాఫ్ లో కొన్ని మార్పులతో పాటు తెలుగు నేటివిటీ కి తగ్గట్టుగా చేసిన ఇంకొన్ని మార్పులు ఆకట్టుకుంటాయి. ముఖ్యంగా తొలి భాగంలో వెంకటేష్ హార్ష్ యాక్టింగ్ తో పాటు, సెకండ్ హాఫ్ లో ఎమోషనల్ యాక్టింగ్ సినిమాకు పెద్ద ఎస్సెట్. స్క్రోలింగ్ టైటిల్స్ లో బాక్సింగ్ గేమ్ లో తెలుగమ్మాయిలు సాధించిన ఎన్నో విజయాలను చూపించడం బాగుంది. ఇక వెంకటేష్ క్యారెక్టర్, రితిక సింగ్ ఎనర్జిటిక్ పర్ఫార్మెన్స్, సాంగ్స్, ట్రైనింగ్ ఎపిసోడ్స్, బాక్సింగ్ ఫైట్స్, ఇన్స్పిరేషన్ డైలాగ్స్, క్లైమాక్స్ సినిమాకు హైలైట్స్. ఓవరాల్ గా స్పోర్ట్స్ బేస్డ్ మూవీస్ ఇష్టపడే ఆడియన్స్ ను గురు బాగానే ఎంటర్టైన్ చేస్తాడు.

 

రేటింగ్ : 3 .25 / 5