గుణ 369 మూవీ రివ్యూ

Friday,August 02,2019 - 02:49 by Z_CLU

నటీనటులు: కార్తికేయ, మహేష్ ఆచంట, గీత, ఆదిత్య మీనన్, నరేష్, హేమ, శివాజీ రాజా తదితరులు
సంగీతం: చేతన్ భరధ్వాజ్
సినిమాటోగ్రఫీ: రామ్
ఎడిటర్: తమ్మిరాజు
బ్యానర్: ఎస్ జే బ్యానర్
నిర్మాతలు: అనీల్, తిరుమల్ రెడ్డి

కథ-స్క్రీన్ ప్లే-మాటలు-దర్శకత్వం: అర్జున్ జంధ్యాల
సెన్సార్: U/A
రిలీజ్ డేట్: ఆగస్ట్ 2, 2019


కథ

ఒంగోలు లోని గద్దలగుంట అనే ప్రాంతంలో రాధ (ఆదిత్య మీనన్) అనే రౌడీ అంటాడు. ఊరు మొత్తానికి అతడంటే హడల్. అదే ప్రాంతంలో పుట్టి పెరుగుతాడు గుణ (కార్తికేయ). తన ఏరియాకు చెందిన వాడే కావడంతో రాధకు కూడా గుణ గురించి తెలుసు. తన వీధిలో ఎంతో మంచివాడుగా పేరుతెచ్చుకున్న గుణ, అదే ఏరియాలో కొత్తగా సెల్ ఫోన్ షాప్ పెట్టిన గీతను ప్రేమిస్తాడు. గొడవలకు దూరంగా ఉండే గుణ మంచితనం తెలిసి గీత కూడా అతడ్ని ప్రేమిస్తుంది.

ఓ సందర్భంలో గుణ ఫ్రెండ్ ద్వారా పరిచమైన కొంతమంది వ్యక్తులు రాధతో ఘర్షణ పడతారు. రాధకు క్షమాపణలు చెప్పించేందుకు మధ్యవర్తిత్వం వహించిన గుణ అనుకోకుండా పెద్ద ప్రమాదంలో పడతాడు. ఫలితంగా 3 నెలలు జైలుకు కూడా వెళ్లి వస్తాడు. గొడవలకు దూరంగా ఉండే గుణ జైలుకు ఎందుకు వెళ్లాల్సి వచ్చింది? అతడ్ని ఇరికించింది ఎవరు? ప్రేమించిన గీతను గుణ దక్కించుకున్నాడా లేదా? అనేది బ్యాలెన్స్ కథ.

 

నటీనటుల పనితీరు

ఆర్ఎక్స్100 వచ్చిన కొత్తలో చాలామంది కార్తికేయను చూసి ఇతడు మంచి యాక్షన్ హీరో అవుతాడని అనుకున్నారు. అలాంటివాళ్ల అంచనాలన్నింటినీ హిప్పీతో పటాపంచలు చేశాడు కార్తికేయ. కానీ గుణ369తో మళ్లీ ట్రాక్ లోకి వచ్చేశాడు. యాక్షన్ సబ్జెక్ట్స్ కు తను పెర్ ఫెక్ట్ అనిపించుకున్నాడు. ఇప్పటివరకు కార్తికేయ చేసిన 3 సినిమాల్లో అతడి బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇదే.

హీరోయిన్ అనఘ బాగా చేసింది. కానీ ఆమెలో కమర్షియల్ హీరోయిన్ అప్పీల్ లేదు. పాటల్లో చిన్న చిన్న బట్టలు వేయించినప్పటికీ ఆకట్టుకోలేకపోయింది. గీత అనే పాత్ర వరకు ఆమె పూర్తి న్యాయం చేసింది. కార్తికేయ తండ్రిగా నరేష్, తల్లిగా హేమ, విలన్ రాధ పాత్రలో ఆదిత్య మీనన్, పోలీస్ గా శివాజీ రాజా తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. ఇక కార్తికేయ స్నేహితుడి పాత్రలో నటించిన మహేష్ ఆచంట అందరికీ షాక్ ఇవ్వడం గ్యారెంటీ. అదేంటనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. అదే పెద్ద సస్పెన్స్.

 

టెక్నీషియన్స్ పనితీరు

కథ, స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం విభాగాలన్నీ అర్జున్ జంధ్యాల తీసుకున్నాడు. వీటిలో అతడికి కథ, దర్శకత్వ విభాగాల్లో మాత్రం ఫుల్ మార్కులు పడతాయి. మాటలు, స్క్రీన్ ప్లే విభాగాల్లో జంధ్యాల అంతగా మెప్పించలేకపోయాడు. తమ్మిరాజు ఎడిటింగ్, రామ్ సినిమాటోగ్రఫీ చాలా బాగున్నాయి. కానీ ఫస్టాఫ్ లో తమ్మిరాజు టాలెంట్ కనిపించదు. రామ్ మాత్రం ఆర్ఎక్స్100కు ఎంత కష్టపడ్డాడో, ఈ సినిమాకు కూడా అంతే కష్టపడ్డాడు.

సంగీత దర్శకుడు చైతన్య భరధ్వాజ్ అక్కడక్కడ ఆకట్టుకున్నాడు. కొన్ని ఎపిసోడ్స్ కు ఇతడిచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. అలాగే పాటలు కూడా కొన్ని బాగున్నాయి. ఒంగోలు బ్యాక్ డ్రాప్ స్టోరీ కావడంతో.. బడ్జెట్ పరంగా పెద్దగా ఖర్చుపెట్టాల్సిన అవసరం నిర్మాతలకు రాలేదు.

జీ సినిమాలు సమీక్ష

మనం చేసే పనుల వల్ల మనకే నష్టం కలిగితే అది తప్పుకాదు. అదే పని పక్కోడికి కూడా నష్టం కలిగిస్తే అది కచ్చితంగా తప్పు. అంతే కాదు, అది నేరం కూడా.
ఈ లైన్ చుట్టూ అల్లుకున్న కథ గుణ369. దర్శకుడు అర్జున్ జంధ్యాల ఈ సినిమాతో తను బోయపాటి శిష్యుడిననే విషయాన్ని ప్రూవ్ చేసుకున్నాడు. సినిమాలో చాలా చోట్ల బోయపాటి మార్క్ కనిపిస్తుంది. మరీ ముఖ్యంగా క్లైమాక్స్ కు వచ్చేసరికి బోయపాటే డైరక్ట్ చేశాడేమో అనిపిస్తుంది. హై-ఎమోషనల్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా గుణ369 కచ్చితంగా ఆడియన్స్ ను మెప్పిస్తుంది.

అదిరిపోయే యాక్షన్ ఎలిమెంట్స్ మాత్రమే కాదు, బలమైన సందేశం కూడా ఇందులో ఉంది. కాకపోతే ఈ సందేశానికి, యాక్షన్ ను మిక్స్ చేస్తూ అర్జున్ జంధ్యాల రాసుకున్న స్క్రీన్ ప్లే మాత్రం జర్కీగా సాగుతుంది. మరీ ముఖ్యంగా లవ్ ట్రాక్ రాసుకోవడంలో దర్శకుడు పూర్తిగా ఫెయిల్. ఫస్టాఫ్ బోర్ కొట్టడానికి ఇదే ప్రధాన కారణం. అయితే ఇంటర్వెల్ బ్యాంగ్ నుంచి సినిమా పూర్తిగా పట్టాలపైకి వచ్చేస్తుంది. క్లైయిమాక్స్ వరకు పరుగులు పెడుతుంది. ఇక క్లైమాక్స్ అయితే టోటల్ సినిమాకే హైలెట్.

సింపుల్ గా కనిపించే సామాన్యుడు తర్వాత సింహంలా మారతాడు. అతడే హీరోగా ఎలివేట్ అవుతాడు. ఇలాంటి ఎలివేషన్స్ బోయపాటి సినిమాల్లో బాగా పండుతాయి. ఈ విషయంలో గురువుకు తగ్గ శిష్యుడు అనిపించుకున్నాడు జంధ్యాల. పక్కింటి కుర్రాడిగా కార్తికేయను చూపించిన కెమెరాతోనే, సెకండాఫ్ కు వచ్చేసరికి యాక్షన్ హీరోగా ఎస్టాబ్లిష్ చేసిన విధానం ఆకట్టుకుంటుంది.

క్లైమాక్స్ కు వచ్చేసరికి ఒక్కొక్క చిక్కుముడిని విప్పడం, సస్పెన్స్ ను రివీల్ చేయడం లాంటివి బాగున్నాయి. కానీ అన్నీ క్లయిమాక్స్ కోసం దాచుకోవడం వల్ల ఫస్టాఫ్ తేలిపోయింది. ఇంతకుముందే చెప్పుకున్నట్టు రొటీన్ ప్రేమ సన్నివేశాలతో కాలక్షేపం చేయాల్సి వచ్చింది. లవ్ సీన్స్ ను కూడా బాగా రాసుకున్నట్టయితే టోటల్ సినిమా కనెక్ట్ అయ్యేది. అదేంటో.. హీరో కూడా ఫస్టాఫ్ లో మెప్పించలేకపోయాడు. గుణ ప్రేమను పండించడానికి 2 సినిమాల అనుభవం ఉన్న కార్తికేయ పనికిరాలేదు.

లవ్ సన్నివేశాల్లో ఆకట్టుకోలేకపోయిన కార్తికేయ.. ఇంటర్వెల్ బ్యాంగ్ నుంచి తన విశ్వరూపం చూపించాడు. తనకు ఎంతో ఇష్టమైన యాక్షన్ సన్నివేశాల్లో బాగా నటించాడు. యాక్షన్ సీన్స్ కు బాడీ లాంగ్వేజ్ కూడా సెట్ అవ్వడం కార్తికేయకు ప్లస్ అయింది. హిప్పీ లాంటి మిస్టేక్స్ చేయకుండా.. భవిష్యత్తులో తను ఎలాంటి కథలు ఎంచుకోవాలో ఈ
సినిమాతో కార్తికేయకు ఓ క్లారిటీ వస్తుంది. ఇక సినిమాకు సంబంధించి మహేష్ ఆచంట గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. హీరో ఫ్రెండ్ గా నటించిన ఇతడు సినిమాలో అత్యంత కీలకమైన పాత్ర పోషించాడు. సినిమా చూసిన వాళ్లకు ఎవరికైనా కచ్చితంగా మహేష్ ఆచంట పాత్ర షాకింగ్ అనిపిస్తుంది.

ఓవరాల్ గా గుణ 369 సినిమా రివెంట్ డ్రామాతో తెరకెక్కిన ఓ యాక్షన్ సినిమాగా నిలుస్తుంది. ఇలాంటి ప్లాట్ తో ఇప్పటికే పలు తమిళ సినిమాలు వచ్చేశాయి. అవి ఫాలో అయ్యేవాళ్లకు ఇది రొటీన్ అనిపిస్తుంది. తెలుగులో మాత్రం ఇది కొత్త ప్రయత్నమే. ఎలాంటి అంచనాల్లేకుండా సినిమాకు వెళ్తే గుణ డిసప్పాయింట్ చేయడు.

రేటింగ్2.75/5