Movie Review - గల్లీ రౌడీ

Friday,September 17,2021 - 03:21 by Z_CLU

న‌టీన‌టులు:  సందీప్ కిష‌న్‌, నేహా శెట్టి, రాజేంద్ర ప్ర‌సాద్‌, నాగినీడు, బాబీ సింహ, పోసాని కృష్ణ ముర‌ళి, వెన్నెల కిషోర్‌, వైవా హ‌ర్ష‌, త‌దిత‌రులు

కెమెరామెన్ : సుజాత సిద్దార్థ్

సంగీతం: చౌర‌స్తా రామ్‌, సాయికార్తీక్‌

స్క్రీన్ ప్లే: కోన వెంక‌ట్‌

క‌థ‌: భాను

నిర్మాణం : కోన ఫిల్మ్ కార్పొరేష‌న్‌, ఎం.వి.వి.సినిమా

స‌మ‌ర్ప‌ణ‌: కోన వెంక‌ట్‌

ద‌ర్శ‌క‌త్వం: జి.నాగేశ్వ‌ర్ రెడ్డి

నిర్మాత‌: ఎం.వి.వి.స‌త్య‌నారాయ‌ణ‌

నిడివి : 143 నిమిషాలు

విడుదల తేది : 17 సెప్టెంబర్ 2021

సందీప్ కిషన్ , జి.నాగేశ్వరరెడ్డి కాంబినేషన్ లో తెరకెక్కిన ‘గల్లీ రౌడీ’ ఈరోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ‘తెనాలి రామకృష్ణ BABL’  తో ఆశించిన విజయం అడనుకోలేకపోయిన ఈ కాంబో ఈసారి కచ్చితంగా ఓ హిట్ కొట్టాలని ఈ సినిమాతో వచ్చారు. మరి గల్లీ రౌడీ ఈ కాంబోకి హిట్ అందించిందా? దర్శకుడు నాగేశ్వర్ రెడ్డి యాక్షన్ కామెడీ డ్రామాతో మెప్పించాడా? జీ సినిమాలు ఎక్స్ క్లూజివ్ రివ్యూ.

sundeep kishan gully rowdy 3
కథ :

వైజాగ్ ప్రజలకి అండగా ఉండే సింహాచలం(నాగినీడు) ఓ సందర్భంలో భైరగీ (మైం గోపి) కి ఎదురెల్తాడు. అలా తనకి ఎదురొచ్చాడన్న కోపంతో సింహాచలంని ఘోరంగా ఆవమానిస్తాడు. ఆ అవమానంతో తన మనవడు వాసు(సందీప్ కిషన్) రౌడీగా తీర్చిదిద్ది భైరగీ కి ధీటుగా తయారు చేసి ప్రజలకు మంచి చేయాలనుకుంటాడు.

పెరిగి పెద్దయ్యాక రౌడీ షీటర్ గా మారిన వాసు తను ప్రేమించిన అమ్మాయి పట్టపగలు సాహిత్య (నేహా శెట్టి) కుటుంబం ఓ సమస్యలో ఉన్నారని తెలుసుకొని వారికి అండగా నిలబడతాడు. ఈ క్రమంలో వాసు, సాహిత్య కుటుంబం కలిసి భైరగీని కిడ్నాప్ చేయాలనుకుంటారు. కిడ్నాప్ చేసిన టైంలో సరిగ్గా భైరగీ హత్య చేయబడతాడు.  ఆ హత్య కేసుని CI రవి నాయక్ టేకప్ చేస్తాడు. ఆ కేసులో సరైన ఎవిడెన్స్ కోసం చూస్తుంటాడు రవి నాయక్. ఫైనల్ గా ఆ హత్య కేసులో చిక్కుకున్న సాహిత్య కుటుంబాన్ని రవి నాయక్ నుండి వాసు ఎలా కాపాడి బయటపడేశాడు అనేది మిగతా కథ.

నటీ నటుల పనితీరు :

సందీప్ కిషన్ వాసు పాత్రలో తన పరిధిలో నటించి పరవాలేదనిపించుకున్నాడు. కొన్ని సన్నివేశాల్లో నటుడిగా ఆకట్టుకున్నప్పటికీ క్యారెక్టర్ డిజైనింగ్ సరిగ్గా కుదరకపోవడంతో పూర్తి స్థాయిలో మెప్పించలేకపోయాడు. నేహా శెట్టి తన పాత్రకు ఉన్నంతలో న్యాయం చేసింది. పవర్ ఫుల్ పోలీస్ పాత్రలో బాబీ సిన్హా పర్ఫెక్ట్ అనిపించుకున్నాడు. రాజేంద్ర ప్రసాద్ పట్టపగలు వెంకట్రావు పాత్రలో కామెడీ పండించి నవ్వించాడు. విలన్ గా మైమ్ గోపి మెప్పించాడు. ఇది వరకు చేసిన పాత్రే కావడంతో చాలా ఈజ్ తో చేశాడు. వైవా హర్ష డైలాగ్ కామెడీ కూడా కొంత వర్కౌట్ అయింది.

పోసాని, వెన్నెల కిషోర్ తన టైమింగ్ తో కొన్ని సన్నివేశాల్లో నవ్వించారు. సుబ్బరాజు ఎండింగ్ లో వచ్చే క్యామియోతో సరిపెట్టుకున్నాడు. నాగినీడు , శివన్నారాయన, షకలక శంకర్ మిగతా నటీ నటులు తమ పాత్రలకు న్యాయం చేశారు.

సాంకేతిక వర్గం పనితీరు :

రామ్ మిర్యాల కంపోజ్ చేసిన పుట్టెనే ప్రేమ సాంగ్ ఆకట్టుకుంది. సాయి కార్తీక్ కంపోజ్ చేసిన ఐటమ్ సాంగ్ జస్ట్ పరవాలేదపించింది. అక్కడక్కడా నేపథ్య సంగీతం ఆకట్టుకోగా కొన్ని సన్నివేశాలకు సింక్ అవ్వలేనట్టుగా అనిపించింది. సుజాత సిద్దార్థ్ సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటర్ చోటా కే ప్రసాద్ డైరెక్టర్ విజన్ ని క్యాచ్ చేసేలా పనిచేశాడనిపిస్తుంది. డ్రాగన్ ప్రకాష్, రియల్ సతీష్ కంపోజ్ చేసిన ఫైట్స్ రొటీన్ గానే అనిపించాయి.

భాను అందించిన కథతో పాటు కోన వెంకట్ కథనం కూడా రొటీన్ అనిపిస్తాయి. దర్శకుడు జి.నాగేశ్వర్ రెడ్డి కొన్ని కామెడీ సన్నివేశాలతో తన స్టైల్ లో ఎప్పటిలానే నవ్వించాడు. కానీ పూర్తి స్థాయిలో మెప్పించలేకపోయాడు. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి.

Gully Rowdy sundeep kishan neha shetty
జీ సినిమాలు సమీక్ష :

ఏ సినిమాకయినా స్క్రిప్ట్ స్ట్రక్చర్ ఫాలో అవ్వాల్సి ఉంటుంది. కానీ కొన్ని కమర్షియల్ కామెడీ డ్రామాలకు మాత్రం ఈ సూత్రాన్ని పాటించకుండా సినిమా చేస్తుంటారు మేకర్స్. సరిగ్గా ‘గల్లీ రౌడీ’ విషయంలో అదే జరిగింది. ప్రాపర్ స్ట్రక్చర్ ఫాలో అవ్వకుండా కొన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ యాడ్ చేసి జస్ట్ రొటీన్ కామెడీ డ్రామాగా సినిమాను తెరకెక్కించారు.

భాను రాసిన కథలో దమ్ము లేకపోవడం, పైగా కోన వెంకట్ స్క్రీన్ ప్లే కూడా రొటీన్ ఫార్మేట్ లో ఉండటంతో సినిమా ఆసక్తిగా అనిపించదు. వైజాగ్ సిటీలో దందాలు, కబ్జాలు చేస్తూ చెలామణి అయ్యే ఓ రౌడీ కి ధీటుగా తన మనవడిని రౌడీ చేయాలనుకోవడం, దాంతో ఇష్టమైన చదువుని వదిలి, ఇష్టం లేని రౌడీగా మారడం అనేది ఈ సినిమా మెయిన్ ప్లాట్. కానీ దీని చుట్టూ మరో లేయర్ అల్లి హీరోయిన్ కుటుంబానికి సమస్య ఆ సమస్య కోసం హీరో ఉన్న పలంగా రౌడీగా మారడం అనేది సిల్లీగా అనిపిస్తుంది. పోనీ అక్కడి నుండైన హీరో క్యారెక్టర్ లో ఛేంజ్ కనిపిస్తుందనుకుంటే అలాంటివేం లేకుండానే కథను ముందుకు నడిపించాడు దర్శకుడు.

హీరోయిన్ తండ్రి పాత్రలో ఉన్న ఎమోషన్ ని ప్రొజెక్ట్ చేస్తూనే మరోవైపు ఆ పాత్రతో కామెడీ పండించే ప్రయత్నం చేసాడు. దాంతో ఇటు ఎమోషన్ , అటు కామెడీ రెండూ పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. సినిమాలో అంతో ఇంతో కామెడీ వర్కౌట్ అయింది అంటే అది బామ్మ పాత్ర మాత్రమే. వెన్నెల కిషోర్ కామెడీ కూడా రొటీన్ అనిపిస్తుంది. అస్తమాను కిషోర్ తో అతని తండ్రిని తిట్టడం, దాని ద్వారా కామెడీ పండించాలని చూడటం ఈసారి వర్కౌట్ అవ్వలేదు. లవ్ ట్రాక్ కూడా సినిమాకు మైనస్ అనిపిస్తుంది.

ఇక సినిమాను సీరియస్ మర్డర్ మిస్టరీ గా కాకుండా కామెడీ మిక్స్ చేసి ఎలాంటి లాజిక్స్ లేకుండా కమర్షియల్ యాక్షన్ డ్రామాగా తీర్చిదిద్దారు నాగేశ్వర్ రెడ్డి. కానీ ఈ రొటీన్ కథ, కథనంతో మెస్మరైజ్ చేయలేకపోయాడు. కొన్ని సందర్భాల్లో వచ్చే కామెడీ కూడా మరీ సిల్లీగా అనిపిస్తుంది. చాలా చోట్ల లాజిక్స్ వదిలేసి ఆడియన్స్ కి డౌట్స్ తెప్పించారు. ఇక క్లైమాక్స్ లో ట్విస్ట్ కూడా ఎక్స్ పెక్ట్ చేసేలా ఉంది.  మర్డర్ చేసిన వ్యక్తి ఎవరనేది చెప్పించడానికి సుబ్బరాజును జస్ట్ క్యామియోలా వాడుకున్నారు. ఓవరాల్ గా గల్లీ రౌడీ  సిల్లీ కామెడీతో రొటీన్ అనిపిస్తుంది తప్ప పూర్తి స్థాయిలో మెప్పించలేకపోయింది.

రేటింగ్ : 2.25 /5