కబాలి రివ్యూ

Thursday,June 09,2016 - 11:35 by zdcl

చిత్రం : కబాలి
నటీ నటులు : రజనీకాంత్,రాధికా ఆప్టే, విన్సెంట్ చావో, థన్సిక తదితరులు.
సంగీతం : సంతోష్ నారాయణ్
సినిమాటోగ్రఫీ : జి.మురళి
ఎడిటర్ :కె.ఎల్.ప్రవీణ్
కథ-దర్శకత్వం : పా.రంజిత్
నిర్మాత :కలై పులి థాను
విడుదల :22-07-2016

భారత సినీ చరిత్రలోనే కనివినీ ఎరుగని రీతిలో పబ్లిసిటీ…. దేశవ్యాప్తంగా భారీ అంచనాలు.. ప్రపంచ వ్యాప్తంగా రికార్డు స్థాయిలో విడుదల… ఇలా భారీ హంగామా మధ్య విడుదలైంది రజనీకాంత్ కబాలి సినిమా. విడుదలకు ముందు ఈ సినిమాపై ఎన్నో ఊహాగానాలు..మరెన్నో అంచనాలు. మరి కబాలి సినిమా ఆ అంచనాల్ని అందుకుందా… రజనీకాంత్ పర్ ఫెక్ట్ హిట్ అందుకున్నారా…?

కథ :-
ఒకప్పుడు మలేషియా డాన్ గా సిటీని శాసించిన కబాలి (రజనీకాంత్) ఒక సంఘటన వల్ల అరెస్ట్ అయ్యి 25 ఏళ్లు జైలు జీవితం గడుపుతాడు. ఆ జైలు జీవితం నుండి వృద్ధాప్యంలో విడుదలైన కబాలి… మలేషియాలో భాధపడుతున్న భారతీయుల కోసం మరోసారి పోరాటం మొదలుపెడతాడు. డ్రగ్స్ అమ్ముతూ అమ్మాయిల జీవితాలతో ఆడుకొనే 43 వ గ్యాంగ్ పై మళ్లీ తిరగబడతాడు. అలాగే చని పోయిన తన భార్య గురించి బాధపడుతూ తన కుటుంభం పై దాడి చేసి తను జైలు కు వెళ్ళడానికి కారకులైన 43 వ గ్యాంగ్ స్టార్ టోనీ, వీరేశ శంకర్ (కిషోర్) లను ఎలా హతమార్చాడు ? అలాగే కబాలి కుటుంబం ఏమయ్యింది? చివరికి కబాలి ఏమయ్యాడు? అనేది ఈ సినిమా స్టోరీ.

నటీనటుల పనితీరు :-
నటీనటుల విషయానికొస్తే ముందుగా చెప్పుకోవాల్సింది రజనీకాంత్ గురించే. కబాలిగా మరోసారి తన నట విశ్వరూపం చూపించాడు తలైవ. నెరిసిన గడ్డంతో స్టయిలిష్ గా కనిపించడమే కాకుండా… ఈ వయసులో కూడా కొన్ని యాక్షన్ సన్నివేశాల్లో అదరగొట్టేశారు రజని. ఒక్కముక్కలో చెప్పాలంటే సినిమా అంతా రజనీకాంత్ వన్ మేన్ షో నడిచింది.
కథ అక్కడక్కడ కాస్త స్లోగా నడిచినప్పటికీ… తన స్టయిల్, మేనరిజమ్స్ తో అభిమానుల్ని కట్టిపడేశాడు సూపర్ స్టార్. రజనీ పలికిన డైలాగ్స్, ఆ స్టయిల్ చూసి ఫ్యాన్స్ మరోసారి పండగ చేసుకోవడం గ్యారెంటీ. ఇక కబాలి భార్య గా కుందన వల్లి పాత్ర లో రాధికా ఆప్టే తన నటన తో ఆకట్టుకుంది. సెకండ్ హాఫ్ లో ఓ సన్నివేశం లో నటిగా తన టాలెంట్ ఏంటో మరోసారి చూపించింది. ఇక ఈ సినిమాలో మరో నటి ధన్సిక కొన్ని యాక్షన్ సన్నివేశాల్లో తన నటనతో ఆకట్టుకుంది. గ్లామరస్ గా కనిపిస్తూనే… యాక్టింగ్ లో కూడా తనకంటూ కొంత ఇమేజ్ సంపాదించుకుంది. ఇక మలేషియా విలన్ గా విన్ స్టన్ చావో ఆ పాత్ర కు పూర్తి న్యాయం చేశాడు. రజనీకాంత్ లాంటి స్టార్ హీరో ఎదురుగా విలన్ గా నిలబడాలంటే నటుడికి ఎంతో టాలెంట్, టైమింగ్ అవసరం. ఆ యాంగిల్ లో చావో బాగా మెప్పించాడు. ఈ క్యారెక్టర్ పండడం వల్లనే హీరోయిజం ఇంకాస్త ఎలివేట్ అయింది. అలాగే కిషోర్, హరి కిషన్,అత్త కట్టి దినేష్ తదితరులంతా తమ పాత్రలకు తగ్గట్టు కనిపించారు.

టెక్నీషియన్స్ పని తీరు :-
ముందుగా ఈ సినిమాకు పని చేసిన టెక్నీషియన్స్ గురించి చెప్పుకోవాలంటే ఇద్దరి గురించి ముఖ్యంగా చెప్పుకోవాలి. తన సినిమాటోగ్రఫీ తో సినిమాకు ఓ కల తీసుకొచ్చిన జి.మురళి ను ప్రత్యేకంగా అభినందించాల్సిందే. కొన్ని ఫ్రేముల్లో రజనీకాంత్ ను సినిమాటోగ్రాఫర్ చూపించిన విధానం ఫ్యాన్స్ ను ఈలలు వేసేలా చేసింది. అలాగే తన సంగీతంతో సినిమాకు మరో ప్లస్ గా నిలిచిన సంతోష్ నారాయణ్ ను కూడా మెచ్చుకొని తీరాల్సిందే. ముఖ్యంగా నిప్పు రా, గుండె నిండా పాటలు ఆకట్టుకున్నాయి. కొన్ని సన్నివేశాలకు ఆర్.ఆర్ బాగుంది. ఎడిటింగ్ పరవాలేదు. కొన్ని సందర్భాలలో మాటలు ఆకట్టుకున్నాయి. రజనీకాంత్ సినిమాలకు రెగ్యులర్ గా డబ్బింగ్ చెప్పే మను… ఈ సినిమాలో కూడా తన మార్క్ చూపించాడు. రజనీ ఇమేజ్, క్రేజ్ ను ఎలివేట్ చేసేలా డైలాగ్స్ పలికి… సూపర్ స్టార్ కు తనే కరెక్ట్ అని మరోసారి నిరూపించుకున్నాడు. ఇక దర్శకుడు ఈ క్రైం డ్రామా కథ తో రజనీని ఒప్పించి సగం విజయం అందుకున్నాడు. అనుభవం తక్కువే అయినప్పటికీ… సూపర్ స్టార్ రేంజ్ ను ఏమాత్రం తగ్గించకుండా ప్రజెంట్ చేయగలిగాడు. అయితే కథపై పూర్తి పట్టుకున్న రంజిత్… స్క్రీన్ ప్లే లో మాత్రం ఆ వేగం చూపించలేకపోయాడు.

జీ సినిమాలు సమీక్ష :-
రజనీకాంత్ గత సినిమాల ప్రభావం దర్శకుడు పా రంజిత్ పై బాగానే పడింది. కబాలి చూస్తే ఆ విషయం తెలిసిపోతుంది. ప్రేక్షకులు రజనీని ఎలా చూడాలని అనుకుంటున్నారో అది రంజిత్ కు బాగా తెలిసిపోయింది. అందుకే సినిమా మొత్తాన్ని వన్ మేన్ షో చేసేశాడు. అభిమానులకు కావాల్సింది కూడా అదే. కాకపోతే… సేమ్ టైం సాధారణ ప్రేక్షకుడ్ని కూడా దృష్టిలో పెట్టుకుంటే బాగుండేది.
నిజానికి కబాలి కోసం రంజిత్ ఎంచుకున్న స్టోరీలైన్ చాలా బాగుంది. మలేషియాలో బానిసలుగా బతుకుతున్న తమిళ ప్రజలు (దళితుల) కోసం ఓ సాధారణ వ్యక్తి, కబాలి (డాన్) గా ఎలా మారాడనేదే స్టోరీ. ఇందులో భాషా, అరుణాచలం, ఛాయలు కూడా కనిపిస్తాయి. పైగా కూతురు సెంటిమెంట్ కూడా యాడ్ చేయడంతో ప్రేక్షకులు ఈజీగా కనెక్ట్ అయ్యారు.రజని ఇంట్రడక్షన్ సన్నివేశం బాగా ఆకట్టుకుంది. అయితే ఈ సన్నివేశాన్ని లీక్ వీడియో ద్వారా చూసేసిన వారికి అంత ఆసక్తికరంగా అనిపించకపోవచ్చు. వెండితెరపై ఫస్ట్ టైం చూసిన వాళ్లకు మాత్రం బాగా నచ్చుతుంది. ఇక రజనీ మరోసారి బాషా లాంటి క్రైమ్ డ్రామా తో ఈ సినిమా చేశాడు.
కానీ సినిమా ప్రారంభంలో ఉన్నంత స్పీడు ఆ తరువాత సన్నివేశాల్లో లేకపోవడం,… కొన్ని సన్నివేశాలు బోర్ కొట్టించడం… నెమ్మదిగా సాగే స్క్రీన్ ప్లే ఈ సినిమాకు మైనస్ లు గా చెప్పొచ్చు. కొన్ని యాక్షన్ సన్నివేశాలు బాగా కుదిరాయి.
సూపర్ స్టార్ సినిమా కోసం ప్రేక్షకులు భారీ అంచనాలతో థియేటర్స్ కు రావడం సహజమే. అయితే ఆ అంచనాలతో థియేటర్స్ కు సాధారణ ప్రేక్షకులకు కబాలి మాములుగా అనిపించొచ్చు కానీ తమ దేవుడ్ని చూడ్డానికి థియేటర్లకు వచ్చే అభిమాన లోకానికి మాత్రం కబాలి ఓ పెద్ద పండగనే చెప్పాలి.